KG to PG
-
గురుకులాలకు కొత్త కళ
సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’మిషన్.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు బీజాలు పడ్డాయి. ఒకప్పుడు పరిమిత సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలల సంఖ్య.. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో వచ్చిన మార్పులతో భారీగా పెరిగింది. అన్నివర్గాలకు నాణ్యమైన విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న పోటీ ప్రపంచానికి దీటుగా నాణ్యతాప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫలితాల్లోనూ ఈ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. దీంతో గురుకులాల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచిభోజనంతోపాటు.. నాణ్యమైన విద్యనందిస్తున్న కారణంగా అడ్మిషన్లు ఇవ్వాలంటూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారి సంఖ్య పెరిగింది. దీంతో పలు సొసైటీలు ‘హౌస్‌ఫుల్’బోర్డులు పెడుతున్నాయి. ఇదీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనం. గురుకులాలు మూడింతలు: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గురుకులాల సంఖ్య 292 మాత్రమే. పరిమిత సంఖ్యలో పాఠశాలలుండటంతో వాటిల్లో ప్రవేశాలు సైతం అంత గొప్పగా ఉండేవి కావు. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో విద్యానాణ్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత.. టీఆర్ఎస్ సర్కారు విద్యా వ్యవస్థకు పునరుజ్జీవం అందించే ప్రయత్నంలో భాగంగా గురుకులాల సంఖ్య 881కి పెంచింది. వీటితో పాటు మరో 30 డిగ్రీ కాలేజీలు సైతం ప్రారంభం కావడంతో గురుకుల విద్యా సంస్థల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. కొత్త రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకులాలు, 53 ఎస్టీ గురుకులాలు, 194 మైనార్టీ గురుకులాలు, 119 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హౌస్‌ఫుల్ బోర్డులు గతంలో గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ సాదాసీదాగా జరిగేది. అర్హత పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పించినప్పటికీ మధ్యలోనే మానేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం, అత్తుత్తమ పద్దతిలో భోజనం అందించడంలాంటి కారణాలతో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. అర్హత పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు భర్తీ చేసినప్పటికీ.. సీట్లు రానివారు అడ్మిషన్ కావాలంటూ కార్యాలయాల చుట్టూ చక్కలు కొడుతున్నారు. ఈనేపథ్యంలో పలు సొసైటీలు ఏకంగా అన్ని సీట్లు భర్తీ అయినట్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. ర్యాంకుల పండగ గురుకుల పాఠశాలలు ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల కంటే అత్యుత్తమ ఫలితాలను ఖాతాలో వేసుకుంటున్నాయి. గతేడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 92% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లోనూ గురుకులాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నారు. జూనియర్ కాలేజీలు అధికంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల నుంచి ఏకంగా 37 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు సాధించారు. 6గురు విద్యార్థులు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 28 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. 10 మంది విద్యార్థులు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, 16 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. గతేడాది ఎస్టీ గురుకులాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడంతో ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లు అందించింది. 2.72 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 762 గురుకుల పాఠశాలల్లో విద్యార్థులున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానుండగా... ఇప్పుడున్న వాటిలో 2.72లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కో తరగతిలో 40మంది చొప్పున.. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు కలిపి 80 మంది ఉంటారు. కొత్తగా ప్రారంభమైన పాఠశాలల్లో 5,6,7 తరగతులు ప్రారంభించగా.. ఏటా ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ అవుతోంది. దీంతో 2020 నాటికి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 3 లక్షలు దాటనుంది. సొసైటీల వారీగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్య సొసైటీ పేరు తెలంగాణకు ముందు కొత్త గురుకులాలు మొత్తం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 134 104 238 టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 94 53 147 టీఆర్ఈఐఎస్ 35 0 35 టీఎంఆర్ఈఐఎస్ 10 194 204 ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 19 119 138 (మరో 119 గురుకులాలు 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభం) పక్కా ప్రణాళికతో గతంలో గురుకుల పాఠశాలల నిర్వహణ సొసైటీ నిర్ణయాలకు తగినట్లు ఉండేవి. ప్రస్తుతం సొసైటీ ఆదేశానుసారం నడిచినప్పటికీ.. కీలక నిర్ణయాలన్నీ అన్ని సొసైటీ కార్యదర్శులు చర్చించి ఒకే తరహాలో అమలు చేయడంతో ఫలితాలు సైతం ఒకే తరహాలో వస్తున్నాయి. పాఠ్యాంశ బోధన మొదలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలన్నీ పక్కాగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించడం లేదు. కొత్త గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో నియమిస్తోంది. బీసీ సొసైటీకి కొత్తగా మంజూరు చేసిన గురుకులాల్లోనూ ప్రభుత్వం సిబ్బందిని మంజూరు చేసింది. వచ్చే ఏడాది ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. గురుకులాల్లో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు)బోర్డును ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాలదే అతిపెద్ద సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీసీ గురుకుల సొసైటీలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా 2017–18 విద్యా సంవత్సరంలో వాటిని ఆ సొసైటీ అందుబాటులోకి తెచ్చింది. కానీ బీసీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకుల పాఠశాలలు లేవని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు బీసీ గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు కాయడం.. గందరగోళ వాతావరణం నెలకొంటొంది. ఇందులో భాగంగా మరో 119 కొత్త గురుకులాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. వీటిని 2019–20 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో 257 గురుకుల పాఠశాలలతో అతిపెద్ద గురుకుల సొసైటీగా ‘బీసీ గురుకుల సొసైటీ’అవతరించనుంది. సరికొత్త మెనూతో..! గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్య ప్రమాణాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త మెనూను సిద్ధం చేసింది. ఎదిగే పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించేలా డైట్ చార్ట్‌ను తయారు చేసింది. ఇందుకు ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సహకారాన్ని తీసుకుంది. కొత్తగా రూపొందించిన మెనూ అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. మెస్‌చార్జీలను భారీగా పెంచడంతో విద్యార్థులకు మరింత పోషకాహారాన్ని ప్రణాళికాబద్ధంగా అందిస్తున్నారు. మెస్ చార్జీల రూపంలో ప్రస్తుతం 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.950 చొప్పున, 8నుంచి 10 తరగతికి రూ.1100, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.1050 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. గ్రీన్‌చానల్ ద్వారా నిధుల విడుదల... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఆర్థిక సమస్యలు రావద్దని నిర్ణయించి వీటిని గ్రీన్‌చానెల్ విధానంలోకి మార్చింది. నిధుల సమస్య తలెత్తకుండా అవసరాలకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. పైసా బకాయి ఉండకుండా డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేయడంతో విద్యార్థులకు సకాలంలో సరైన భోజనం అందుతోంది. అదేవిధంగా సమస్యలున్న పాఠశాలల్లో కేవలం ప్రతిపాదనలు అందించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పనులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నప్పటికీ.. సకాలంలో ఆమేరకు నిధులు విడుదల చేస్తోంది. పక్కా భవనాలకు కార్యాచరణ సిద్ధం చేస్తూనే ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. జనరల్ సర్జన్ అవుతా! మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు. ఉన్నత చదువులు చదవాలనేది నాకల. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేకపోవడంతో గురుకుల పాఠశాలలో చేరా. పదోతరగతి వరకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివా. మంచి మార్కులు రావడంతో గౌలిదొడ్డి జూనియర్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడ బైపీసీలో చేరా. నీట్లో 2వేల ర్యాంకు వచ్చింది. మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలో అడ్మిషన్ దొరికింది. జనరల్ సర్జన్ అవ్వాలనేది నా కల. – అమర్త్య, ఎంబీబీఎస్ ఫస్టియర్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల -
స్కూళ్ల పరిధిలోకి అంగన్వాడీలు
► ఇరు శాఖల అంగీకారం.. కార్యాచరణకు ఆదేశాలు ► ముందుగా పాఠశాలల సమీపంలోని కేంద్రాల విలీనం ► ఏప్రిల్ 15లోగా విధివిధానాలు, చేపట్టాల్సిన బోధన ఖరారు ► జూన్ 12 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేజీ టు పీజీ’ విద్యా విధానంలో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశా లల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు సూత్రప్రాయంగా అంగీక రించారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథ మిక పాఠశాలలను గుర్తించి, వాటి వద్దకు అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని... 2017–18 విద్యా సంవత్సరం నుంచే వాటిలో బోధించేలా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలు ఇప్పటివరకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మాత్రమే పనిచేశాయని, ఇక నుంచి ‘ప్లేస్కూల్’గా మార్చేందుకు ప్రతిపాద నలు రూపొందించాలని సూచించారు. సౌకర్యాలూ ఏర్పడతాయి రాష్ట్రవ్యాప్తంగా చాలా అంగన్ వాడీ కేంద్రాల కు పక్కా భవనాలు, వసతులు లేవు. దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అధి కారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అదే స్కూళ్ల ఆవరణలోకి అంగన్ వాడీ కేంద్రాలను తరలిస్తే పిల్లలకూ అన్ని వసతులు అందు బాటులోకి వస్తాయని.. పర్యవేక్షణ, నిర్వహణ సులభతరమవుతుందని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబం ధించి వచ్చే నెల 15లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 నుంచే అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల ల్లో నడిపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఓ వైపు ఆట, పాటలతో పిల్లలకు చదువు నేర్పిస్తూ, మరోవైపు పౌష్టికా హారం అందిస్తూ అంగన్వాడీలు ప్లేస్కూళ్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. 6.54 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో 6.54 లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలు నమోదై ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశా లలు ఉండగా... వాటిలో 9,742,464 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం అదనపు తరగతి గదులున్న వాటిని ముందుగా గుర్తించి.. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను వాటిలోకి తరలి స్తారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో తెలుగు మీడియంలో ప్లేస్కూళ్లను నిర్వహిస్తారు. ఇంగ్లిషు మీడియం పాఠాలు కూడా నేర్పిం చేలా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిలబస్‌ను రూపొందించింది. అనుమతి రాగానే పాఠ్య పుస్తకాలు రాయిం చి అమలు చేయనున్నారు. అంగన్వాడీ పిల్లల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను పరిశీలించి వీటిని సిద్ధం చేయనున్నారు. ఇక ఈ ప్లేస్కూళ్లలో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఆరు వేలకు పైగా విద్యా వలంటీర్లను నియమించే అవకాశముంది. -
అంగన్వాడీ..అయోమయంలో పడి..!
పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తూ.. బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉన్నత విద్యార్హతలున్నా ప్రభుత్వ కొలువులు రాక ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో నెట్టుకొస్తూ బతుకీడుస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం మాత్రం కేజీ టూ పీజీ వరకు విద్యనందించే పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తామనే ఆలోచన చేస్తుండటంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇక తమ భవిష్యత్ ఏమిటని కార్యకర్తలు, ఆయాలు ప్రశ్నించుకుంటున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు గురవుతున్నారు. కేజీ టూ పీజీ వరకు నిర్వహించే పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రభుత్వ ఆలోచనను ప్రకటించడంతో.. ఐసీడీఎస్ పరిధిలో పనిచేసే అంగన్వాడీల్లో దీనిపై చర్చ సాగుతోంది. దీనిపై ఐసీడీఎస్‌కు ఎలాంటి గైడ్‌లైన్స్ రానప్పటికీ.. అంగన్వాడీలు మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే విషయమై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,605 అంగన్వాడీ కేంద్రాలు, 291 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా 43,291 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం బాలింతలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలో 20,194 మంది బాలింతలు, గర్భిణులకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతోపాటు ప్రాజెక్టులో 1,896 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 25,725 మంది పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా ఆటపాటలతో చదువు చెబుతున్నారు. ప్రస్తుతం 840 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 754 అద్దె భవనాలు, 302 అద్దె చెల్లించని భవనాల ద్వారా కేంద్రాలను నడుపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేసే ప్రధాన ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను సుమారు 25 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అన్ని కేంద్రాలను విలీనం చేస్తారా..? ప్రస్తుతం జిల్లాలో 1,896 మంది అంగన్వాడీ టీచర్లు, 1,605 మంది ఆయాలు కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంగన్వాడీ టీచర్లకు రూ.7వేలు వేతనం, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ఆయాలకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తే ఎక్కువ విద్యార్హతలున్న టీచర్లకు ఫస్ట్ క్లాస్ బోధించే అవకాశం కల్పిస్తారని, తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఎల్కేజీ, యూకేజీ వరకు బోధించే అవకాశం కల్పిస్తారని చర్చ సాగుతోంది. దీంతోపాటు అర్హతలు తక్కువ ఉన్న వారికి ఉద్వాసన చెబుతారనే నేపథ్యంలో అటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనుల్లో తమ సహకారం అందిస్తున్న అంగన్వాడీలు.. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని మనోవేదన చెందుతున్నారు. అంగన్వాడీల లక్ష్యం ఎటు సాగేను.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. అనారోగ్యానికి గురికాకుండా చూసేందుకు అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. వీటిని ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఆ లక్ష్యం ఎటు పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఏయే అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. -
కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం
న్యూఢిల్లీ: కేజీ టు పీజీని అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందులో భాగంగానే ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎడ్యూకేషన్ సెస్ ను పెంచాలని, త్వరలో అన్ని పాఠశాలల్లో వంద శాతం బయోమెట్రిక్ విధానం తీసుకోస్తామని కడియం శ్రీహరి తెలిపారు. -
నాణ్యమైన విద్యనందించేందుకే కేజీ టు పీజీ
నకిరేకల్ : పేదవర్గాల వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 350 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నకిరేకల్‌లో రూ.2.25కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జెడ్పీహైస్కూల్లో రూ.52లక్షలతో అదనపు గదుల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. తాజాగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ గురుకులాన్ని కేటాయిస్తూ మొత్తం 119 గురుకుల పాఠశాలలను మంజూరు చే శారన్నారు. జానారెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. 30ఏళ్లుగా ఈ జిల్లా జానారెడ్డి పాలనలో ఉందని.. కనీసం ఆయన నియోజకవర్గానికి రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మంజూరు చేయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీచై ర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మొగిలి సుజాత, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వీర్లపాటి రమేష్, సోమ యాదగిరి, సిలివేరు ప్రభాకర్, మంగినపల్లిరాజు తదితరులు ఉన్నారు. -
విద్యా హక్కు చట్టం తెస్తే ఉద్యోగాలు పోతాయ్: కేసీఆర్
విద్యా హక్కు చట్టం అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40వేల మంది టీచర్లకు పనిలేకుండా పోతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. అసెంబ్లీలో ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల బాదుడుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యూపీఏ సర్కార్ హయాంలో మోడల్ స్కూల్ ప్రతిపాధన వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తెస్తోందని అన్నారు. ప్రైమరీ నుంచి యూనివర్సిటీ విద్యవరకూ విద్యారంగంపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కాగా.. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు విద్యార్థులు సైతం చీటికి మాటికి వీధుల్లోకి రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రిస్తాం : కడియం అంతకు ముందు ప్రశ్నోత్తరాల సందర్భంగా... రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని 12 ఇంటర్నేషనల్ పాఠశాలలకు నోటీసులు పంపామని తెలిపారు. త్వరలోనే పేరెంట్స్ కమిటీ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణపై చర్చిస్తామని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. గుర్తింపు లేని పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 400 పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి.. ఒక యాజమాన్యం కింద ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ ఒకే ఫీజు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేజీ టు పీజీ .. గజిబిజి
* ఏడాదిన్నరగా ప్రకటనలే తప్ప చర్యలు చేపట్టని సర్కారు * నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 స్కూళ్ల ఏర్పాటు లక్ష్యం * 2016 జూన్ నుంచి ప్రారంభిస్తామన్నా.. కనీస కార్యాచరణకూ దిక్కులేదు... మిగిలిన సమయం ఇంకా ఎనిమిది నెలలే * ఇప్పుడున్న గురుకులాలు 668.. మోడల్ స్కూళ్లు మరో 187 * మిగతా వాటికి స్థలాలేవీ, ఎక్కడ నిర్మిస్తారు? * గురుకులాలను ఒకే గొడుగు కిందకు తేవడంపైనా అస్పష్టత * బాలికలకే పరిమితమైన కేజీబీవీల్లో బాలురకూ అవకాశమిస్తారా? * విద్యార్థులకు వసతి గృహాల పరిస్థితి ఏమిటి? * గందరగోళంగా మారిన ‘కేజీ టు పీజీ’ పథకం ‘వచ్చే ఏడాది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తాం. ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలి..’ - 2014 సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్ష ‘గురుకులాలను కేజీ టు పీజీలో భాగం చేస్తాం. నియోజకవర్గానికి 10 చొప్పున స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 662 ఉన్నాయి. మరో 528 ప్రారంభిస్తాం..’ - ఆగస్టు 5న ‘కేజీ టు పీజీ’పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పిన అంశం ‘మూడు దశల్లో కేజీ టు పీజీ.. 12వ తరగతి వరకు స్కూళ్లలో తరగతులు. తదనంతరం గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లను అనుసంధానం చేయడం. కేజీ నుంచి 4వ తరగతి వరకు సాధారణ విద్య. 5వ తరగతి నుంచి నివాస వసతితో కూడిన గురుకుల విద్య అందించడమే లక్ష్యం..’ - గత ఏడాది జూలై 1న సీఎస్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కేజీ టు పీజీ’ విద్య గందరగోళంగా మారింది. ప్రాథమిక పాఠశాలల నుంచి పీజీ దాకా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తామన్న హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఆలోచనలు చేస్తోంది. ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తోంది. కానీ ఇంతవరకూ కనీస కార్యాచరణకు మాత్రం దిక్కులేదు. ‘ప్రతిష్టాత్మక పథకం కనుక ఆలస్యమైనా ఫరవాలేదు.. పకడ్బందీగా ప్రారంభించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష..’’ అని మంత్రులు, సీఎం పలు సందర్భాల్లో చె బుతూ వస్తున్నారు. చివరికి 2016 జూన్‌లో ‘కేజీ టు పీజీ’ని ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి మరో ఎనిమిది నెలలు మాత్రమే గడువున్నా... చర్యలు మాత్రం కానరావడం లేదు. - సాక్షి, హైదరాబాద్ పరిపాలన సౌలభ్యం కోసమంటూ.. ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలను చేర్చాలని భావిస్తోంది. కానీ కేజీ టు పీజీలో భాగంగా వీటిని ఒకే పరిధిలోకి తెస్తున్నారా, పాలనపరమైన సౌలభ్యం కోసమే చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఆయా స్కూళ్ల సమస్యలపైనా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గందరగోళంగా మారింది. వచ్చే విద్యా విద్యాసంవత్సరంలోనైనా ‘కేజీ టు పీజీ’ని ప్రారంభిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ స్పష్టత కరువే ‘కేజీ టు పీజీ’ అమలుపై ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనకు ప్రభుత్వవర్గాలే రాలేకపోతున్నాయి. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించే బృహత్తర లక్ష్యమైన ఈ పథకంపై సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేస్తున్నారే తప్ప ఏదీ ఆచరణకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీని వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్)లో ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇందుకు ఇంకా 8 నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ కనీస కార్యాచరణ ప్రారంభం కాలేదు. చివరకు రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు), మోడల్ స్కూల్లు అన్నింటిని ఈ పథకంలో భాగం చేసినా ప్రభుత్వ లక్ష్యం ప్రకారం మరో 351 స్కూళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 44 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 132 గిరిజన సంక్షేమ గురుకులాలు, 95 ప్రభుత్వ గురుకులాలు కలిపి మొత్తంగా 662 స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వం కేజీ టు పీజీ కింద లక్ష్యంగా పెట్టుకున్న స్కూళ్లు 1,190.. అంటే మరో 528 స్కూళ్లు అవసరం. అయితే కేంద్రం మోడల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసినందున రాష్ట్రంలో ఉన్న 187 మోడల్ స్కూళ్లను కూడా వీటితో కలపాలని భావిస్తున్నారు. వీటిని కలిపినా మొత్తంగా 839 స్కూళ్లు మాత్రమే కేజీ టు పీజీకి అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మరో 351 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ఆ స్కూళ్లకోసం స్థలాల సేకరణ కూడా చేపట్టలేదు. మరి స్థలాలు సేకరించేదెప్పుడు, స్కూళ్ల నిర్మాణం, మౌలిక సౌకర్యాలు కల్పించేదెప్పుడు, తరగతులు ప్రారంభించేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బాలికలకే పరిమితమైన 391 కేజీబీవీల్లో బాలురకు కూడా ప్రవేశాలు కల్పిస్తారా, అలాగే కొనసాగిస్తారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇక 12వ తరగతి వరకు ఉన్న 100 మోడల్ స్కూళ్లకు సంబంధించి వాటి ఆవరణలో బాలికలకు హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. మరి వాటిలో బాలురకు హాస్టల్ సదుపాయం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ
నల్లబెల్లి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టనున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలలను కేజీ నుంచి పీజీకి సరిపోయేలా వసతులు కల్పిస్తూ తీర్చిదిద్దేందుకు అందుకు అవసరమైన మార్గాదర్శకాలు సీఎం కేసీఆర్‌కు అందించినట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజక వర్గంలో 10 గురుకులాలు ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి ఈ సందర్భంగా ప్రకటించారు. -
ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కు
కరీంనగర్: ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ సర్కార్ కేజీ టు పీజీ విద్య విధానం అమలుచేయడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ 2008లోనే వైఎస్ఆర్ ఆంగ్ల మాధ్యమంలో భోదన మొదలు పెట్టారని చెప్పారు. దశలవారీగా అమలుచేసేందుకు సక్సెస్ స్కూల్స్ మొదలు పెట్టారని తెలిపారు. టీచర్ల క్రమబద్ధీకరణ పేరుతో ఆంగ్ల మాధ్య పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 50 సక్సెస్ స్కూల్స్ మూతపడ్డాయని చెప్పారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే విద్యాహక్కు చట్టం అమలుచేయాలని హితవు పలికారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం
-
‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య అందించాలని ఆందోళన
మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అమలు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. మంత్రుల క్వార్టర్లలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 44 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచితవిద్య అమలును టీఆర్ఎస్ విస్మరించిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు. -
'కేజీ టు పీజీ' మిథ్యేనా
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరామర్శయాత్ర పోస్టర్‌ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 'కేజీటు పీజీ' హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. -
నాణ్యమైన విద్యే ప్రభుత్వ ధ్యేయం:కడియం
మారేడ్‌పల్లి(హైదరాబాద్): కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన ‘తెలంగాణ లో ఉన్నత విద్య బలోపేతం- సీబీఎస్ఈ అమలు’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరముందని మంత్రి అన్నారు. విద్యావేత్త హరగోపాల్ మాట్లాడుతూ విద్యకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల వారికి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. -
ఫీజు సరే.. సరైన స్కూల్లోనే చేర్పిస్తున్నారా..!
కేజీ టు పీజీ.. హౌ టు సెలక్ట్ బెస్ట్ స్కూల్? ఇప్పుడు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది తల్లిదండ్రులు, విద్యార్థులకు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతున్న అంశం. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ బోర్డు మొదలు స్టేట్ బోర్డుల వరకు అనుబంధంగా లక్షల సంఖ్యలో స్కూళ్లు. వాటి పేర్లకు టెక్నో, గ్లోబల్, ఒలింపియాడ్ వంటి సఫిక్స్‌లు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. నగరాలు దాటి ఇప్పుడు ప్రయివేటు స్కూళ్లు చిన్నచిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రయివేటు స్కూళ్ల మోజులో , తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే ఆతృతతో.. అప్పులు చేసైనా వేలల్లో ఫీజులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు.. ఆయా పాఠశాలల ప్రమాణాలపై దృష్టిపెట్టడంలేదు. ఈ నేపథ్యంలో.. ఏది మంచి స్కూలో, పిల్లలను ఎలాంటి స్కూల్లో చేర్పిస్తే.. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందో తెలుపుతూ సాక్షి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. ప్రస్తుతం మంచి స్కూల్ ఎంపిక విషయంలో తల్లిదండ్రుల కసరత్తు కేజీ (కిండర్ గార్టెన్) స్థాయి నుంచే మొదలవుతోంది. మెట్రోసిటీలు, ఇతర నగరాల్లో అప్పటికే పేరు గడించిన పాఠశాలల్లో ప్రవేశాల కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో కిండర్‌గార్టెన్‌లో అడ్మిషన్ కోసం 1,473 దరఖాస్తులు వచ్చాయి. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పటికే ప్రమాణాలు, నాణ్యమైన విద్య పరంగా పేరున్న పాఠశాలలను మినహాయిస్తే.. వేల సంఖ్యలో ఉన్న ఇతర పాఠశాలల విషయంలోనే తల్లిదండ్రుల ఆందోళన. ఈ క్రమంలో వారు పాఠశాలను ఎంపిక చేసుకునేముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా సుదీర్ఘ కాలం చదవాల్సిన పాఠశాల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలనేది నిపుణుల సూచన. గుర్తింపు.. అత్యంత ప్రధానం స్కూళ్ల ఎంపికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఆ సంస్థకు ఉన్న గుర్తింపు. సీబీఎస్ఈ/స్టేట్ బోర్డ్.. ఆయా స్కూల్ బోర్డ్‌ల ప్రామాణిక గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. ఇందుకోసం నియంత్రణ సంస్థల వెబ్సైట్ల నుంచి సమాచారం పొందొచ్చు. బోర్డ గుర్తింపులేని స్కూల్లో చేరితే విద్యార్థి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రత్యక్ష పరిశీలన పాఠశాలల గుర్తింపు విషయంలో స్పష్టత వచ్చాక తర్వాత చేయాల్సిన పని ఎంపిక చేసుకున్న స్కూల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించడం. అక్కడి పరిసరాలను గమనించడం. అంతేకాకుండా పాఠశాలలను ఎంపిక చేసుకునే ముందు అప్పటికే ఆయా స్కూల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతోపాటు పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధుల ద్వారా సమాచారం సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. మెథడాలజీ ఏంటి? స్కూల్‌ను ఎంపిక చేసుకుని ఒక నిర్దిష్ట అంచనాకు వచ్చాక.. ఆ పాఠశాలలో అనుసరిస్తున్న టీచింగ్ మెథడాలజీ గురించి అన్వేషించాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉన్న స్కూల్ అయితే మంచిది. వాస్తవానికి 2011 నుంచి సీబీఎస్ఈ స్కూళ్లలో, 2014 నుంచి స్టేట్ బోర్డ్‌ల అనుబంధ స్కూళ్లలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిచ్చేలా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనే విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే దీన్ని అమలు చేయడంలో 70 శాతంపైగా పాఠశాలలు వెనుకంజలో ఉన్నాయి. కాబట్టి సీసీఈ కోణంలో అనుసరిస్తున్న విధానాలు తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఉపాధ్యాయుల అర్హతలు చాలా ప్రయివేటు స్కూళ్లలో అర్హులైన ఉపాధ్యాయులు ఉండటం లేదు. దాంతో విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. కాబట్టి తమ పిల్లలను ఒక పాఠశాలలో చేర్చే ముందు తల్లిదండ్రులు ప్రధానంగా చూడాల్సిన అంశం.. ఆ పాఠశాల ఉపాధ్యాయుల అర్హతలు. కిండర్ గార్టెన్ నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవాలి. స్కూల్స్‌లో డీఈడీ, బీఈడీ వంటి అర్హతలు ఉన్న వారినే టీచర్లుగా నియమించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ వాస్తవానికి అధిక శాతం పాఠశాలలు వీటిని విస్మరిస్తున్నాయి. ప్రధానంగా ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే ఉపాధ్యాయుల తోడ్పాటు పిల్లలకు ఎంతో అవసరం. భవిష్యత్తు నిర్మాణానికి ఈ రెండు స్థాయిలు పునాదులు. వీటిలో సరైన గెడైన్స్ లేకపోతే తర్వాతి దశలో చదువు పరంగా, అభ్యసన నెపుణ్యాల పరంగా విద్యార్థిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. టీచర్లు అప్డేట్ అవుతున్నారా.. డీఈడీ, బీఈడీ, ఇతర టీచర్ ట్రైనింగ్ కోర్సుల అర్హతతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన దేశంలో సీబీఎస్ఈ క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల కోసం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఇలాంటి వర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు స్కూల్ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇస్తున్న అవకాశం గురించి తెలుసుకోవాలి. బోధన పరంగా ఎలా తరగతి గదిలో విభిన్న నేపథ్యాల విద్యార్థులు ఉంటారు. ఇందులో కొందరు టీచర్ చెప్పిన వెంటనే నేర్చుకోగలుగుతారు. మరికొందరు ఒకటికి రెండుసార్లు చెబితే కానీ అర్థం చేసుకోరు. ఈ నేపథ్యంలో బోధన విషయంలో అనుసరించే విధానం గురించి తెలుసుకోవాలి. ప్రత్యేకంగా స్లో లెర్నర్స్‌కు బోధించే విధానాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టాప్ పెర్ఫార్మర్స్ను ప్రత్యేకంగా ఒక గ్రూప్‌గా ఏర్పరచి బోధించడం, గ్రేడ్లు, స్కూల్ పబ్లిసిటీ వంటి కోణాల్లో వారిపైనే ఎక్కువ శ్రద్ధ చూపించడం సాధారణ అంశంగా మారింది. కానీ ఇలాంటి ధోరణి ఇతర విద్యార్థుల్లో ఆత్మన్యూనతకు దారితీస్తుంది. బోధనపరంగా తరగతిలోనే కాకుండా.. తరగతి గది వెలుపల బోధన పరంగా తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించాలి. అంటే.. తరగతిలో బోధించిన ఒక అంశాన్ని ప్రాక్టికల్‌గా వాస్తవ ప్రపంచంతో అన్వయించే నైపుణ్యాలు అందించే విధంగా అవుటాఫ్ ది క్లాస్ రూం మెథడాలజీ గురించి తెలుసుకోవాలి. మీడియం మార్పు ప్రస్తుతం ఇంగ్లిష్ మాధ్యమానికున్న క్రేజ్ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మాతృభాష నుంచి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చేర్పించడం సర్వసాధారణమైంది. దీంతో అప్పటికే ఇంగ్లిష్ మీడియంలో నిలదొక్కుకున్న ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి మీడియం మారిన విద్యార్థుల విషయంలో పాఠశాల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి తెలుసుకోవాలి. సిలబస్‌పై పరిశీలన పాఠశాల బోర్డ్ సిలబస్‌కు అనుగుణంగానే సాగుతోందా.. లేదా సొంత విధానాలేమైనా అమలు చేస్తోందా? అలాంటి వాటి సమర్థ అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా సిలబస్, పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు అదనపు సమాచారాన్ని అందించేందుకు ఉన్న సౌకర్యాలు(లైబ్రరీ, ఇంటర్నెట్, ఐసీటీ) గురించి తెలుసుకోవాలి. ఇది హైస్కూల్ స్థాయిలో పాఠశాలల విషయంలో ఎంతో ఆవశ్యకం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలకు పరిణితి లభించే విషయంలో పాఠశాల స్థాయిలో అకడమిక్ నైపుణ్యాలతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, టాలెంట్ ఎగ్జిబిషన్స్ వంటివి) కూడా కీలక పాత్ర పోసిస్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సదుపాయాల గురించి పరిశీలించాలి. ఫీజులు విషయంలోనూ పాఠశాలల ఎంపిక విషయంలో అన్ని అంశాల్లో స్పష్టత లభించాక.. ఫీజుల విషయంలోనూ దృష్టిసారించాలి. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కిండర్ గార్టెన్కే రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులుంటున్నాయి. హైస్కూల్ స్థాయిలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థ నిర్దేశించిన ఫీజులకు తగ్గ స్థాయిలో బోధన, మౌలికపరమైన సదుపాయాలు ఉన్నాయా? లేదా? గమనించాలి. పాఠశాల పనితీరు పాఠశాల అకడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఆరా తీయాలి. నిబంధనల ప్రకారం- ఒక పాఠశాల గత మూడేళ్ల అకడమిక్ ఉత్తీర్ణతల సగటు ఆయా బోర్డ్‌ల ఉత్తీర్ణతల సగటుతో పోల్చితే ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ పాఠశాల అకడమిక్ పరంగా నైపుణ్యాలు పాటిస్తుందని అర్థం. అదేవిధంగా సదరు పాఠశాలలో పని చేస్తున్న టీచర్ల నియామక విషయాలు తెలుసుకోవాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం- ప్రైవేటు పాఠశాలలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా శాశ్వత ప్రాతిపదికగా ఉపాధ్యాయులను నియమించుకోవాలి. హయ్యర్ సెకండరీ (+2/ఇంటర్మీడియెట్) మన విద్యా విధానంలో హయ్యర్ సెకండరీగా పిలిచే +2 లేదా ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల కళాశాలల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు సంబంధించి లేబొరేటరీలు, బోధనప్పుడు వాటిలో గడిపే సమయాలను పరిశీలించాలి. అదేవిధంగా సీబీఎస్ఈలో ప్రస్తుతం ఎలక్టివ్స్ అనే విధానం అమలవుతోంది. ఒక సీబీఎస్ఈ పాఠశాలలో కనిష్టంగా ఐదుగురు విద్యార్థులు ఒక ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటే.. ఆ ఎలక్టివ్ కోర్సును నిర్వహించేందుకు పాఠశాలకు అనుమతి లభిస్తుంది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సదరు ఎలక్టివ్స్‌లో ఎంతమంది ఉన్నారు? అందుకు తగిన బోధన సదుపాయాలు ఉన్నాయా? లేదా పరిశీలించి సంతృప్తి చెందితేనే ప్రవేశం తీసుకోవాలి. యూజీ, పీజీ కోర్సుల కళాశాలల ఎంపిక విషయంలోనూ ప్రమాణాలకే పెద్దపీట వేయాలి. నిపుణుల మాట టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి తల్లిదండ్రులు కేవలం పాఠశాలలను ఎంపిక చేసుకోవడానికే పరిమితం కాకుండా.. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. సీబీఎస్ఈ ఉపాధ్యాయుల అకడమిక్ డెవలప్మెంట్ కోసం పలు రిఫ్రెష్మెంట్ వర్క్‌షాప్స్, సెమినార్స్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నైపుణ్యాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి వాటికి హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలలో బోధన అంత బాగుంటుంది. - డి.టి.ఎస్.రావు, రీజినల్ ఆఫీసర్, సీబీఎస్ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పాఠశాలను ఎంపిక చేసుకునే విషయంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలి. అప్పుడే పిల్లలు చిన్నప్పటి నుంచే వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. - కె.శరత్ చంద్ర, బటర్ ఫ్లై ఫీల్డ్స్ కో ఫౌండర్ సదుపాయాల మేరకు ఫీజులు ప్రైవేటు పాఠశాలల్లో కేజీ స్థాయిలోనే వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఆ మేరకు అవి సదుపాయాలు కల్పిస్తున్నాయా? లేదా? అనేది తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పరిశీలించాలి. ఉన్నత ప్రమాణాలు, సౌకర్యాలు కల్పిస్తున్న పాఠశాలల ఫీజులతో పోల్చుకుంటూ ఇతర పాఠశాలలు కూడా అదే మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ సదుపాయాలు కల్పించడం లేదు. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. - ఎం.పద్మజ, వైస్ ప్రిన్సిపాల్, చిరెక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మానసిక దృక్పథం ఆధారంగా పాఠశాలల ఎంపిక విషయంలో తల్లిదండ్రులు నిబంధనలు, ప్రమాణాలు, ఉపాధ్యాయుల అర్హతలు వంటి వాటన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది తమ పిల్లల మానసిక దృక్పథం. వారి అభ్యసన స్థాయి, గ్రాహక శక్తులను గుర్తించి ఆ మేరకు పాఠశాలలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇతరులతో సమానంగా రాణించలేక మానసిక ఆందోళన చెందుతారు. - ఎ. సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ తల్లిదండ్రులు ప్రశ్నించొచ్చు పాఠశాలలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను సదరు పాఠశాలలు అమలు చేస్తున్నాయా? లేదా? అని తల్లిదండ్రులు నిరంభ్యంతరంగా ప్రశ్నించొచ్చు. టాయిలెట్స్ నుంచి లేబొరేటరీల వరకు సదరు పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవచ్చు. ఆర్టీఈ ఈ అవకాశం కల్పిస్తోంది. పాఠశాలల యాజమాన్యాలు కూడా వారు అనుసరిస్తున్న బోధన పద్ధతులు, ఏ చాప్టర్‌ను ఎంత సమయంలో పూర్తిచేస్తారు వంటి వివరాల నుంచి ఉపాధ్యాయుల విద్యార్హతలు, వారికి అందిస్తున్న వేతనాలు, వారికోసం నిర్వహించే శిక్షణ తరగతుల వివరాలను నోటీస్‌బోర్డ్‌లో పెట్టాలి. ఇది తప్పనిసరి నిబంధన. అలాంటి సమాచారం ఇవ్వకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. - జి.గోపాల్‌రెడ్డి, డెరైక్టర్, ఎస్సీఈఆర్టీ -
ఒకే చోట.. చక్కటి విద్య !
* ఒకే యాజమాన్యం కిందకు గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు * భవిష్యత్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దే అవకాశం * కేంద్రం మోడల్ స్కూళ్లను రద్దు చేయడంతో విద్యాశాఖ యోచన * మోడల్ స్కూళ్లనే ‘కేజీ టు పీజీ’గా మార్చితే మంచిదంటున్న విద్యావేత్తలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న గురుకులాలు, కొత్తగా ప్రారంభించిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు వంటివాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2016-17 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన ‘కేజీ టు పీజీ’ విద్యాసంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ పాఠశాలలన్నింటికీ పెద్ద భవనాలు, హాస్టళ్లు ఉండడం, ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతుండడం వంటివన్నీ ‘కేజీ టు పీజీ’కి సరిగ్గా సరిపోతాయని.. ఒకే యాజమాన్యం పరిధిలోకి తేస్తే మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సర్కారు అభిప్రాయ పడుతోంది. - సాక్షి, హైదరాబాద్ అన్ని హంగులతో.. మండలానికి ఒకటి కేజీ టు పీజీకి కాన్సెప్ట్ పేపర్ రూపకల్పన కోసం విద్యాశాఖ రెండు దఫాలుగా విద్యావేత్తలు, అధికారులతో సమావేశాలు నిర్వహించింది. నివాస వసతితో కూడిన విద్యా సంస్థలను, కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లను, గురుకులాలను, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను తీసుకువస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సమావేశాల్లో విద్యావేత్తలు వ్యక్తం చేశారు. తద్వారా మండలానికి ఒకటి చొప్పున కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేయడం సులభమవడంతోపాటు వాటి నిర్వహణ పక్కాగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దానికితోడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లుగా ఇంగ్లిష్ మీడియంతో కూడిన నాణ్యమైన విద్యను అందించవచ్చని చెప్పారు. విద్యాశాఖ గతంలో ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను ప్రారంభించినా... వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్యను అందించలేని స్కూళ్లుగా అవి తయారయ్యాయి. ఈ నేపథ్యంలో మోడల్, గురుకుల, కస్తూర్బా విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కేజీ టు పీజీ కేంద్రాలుగా తీర్చిదిద్దితే బాగుంటుందన్న ఆలోచనలు అధికారుల్లో వచ్చాయి. రకరకాల పేర్లతో.. రాష్ట్రంలో ప్రస్తుతం 400 వరకు గురుకుల విద్యాలయాలున్నాయి. అందులో 47 గురుకులాలు, 4 కాలేజీలు విద్యాశాఖకు చెందిన రాష్ట్ర గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లు సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉన్నాయి. మరోవైపు బాలికలకు నివాస వసతితో కూడిన విద్యను అందించే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) కూడా 95 ఉన్నాయి. ఇవి గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతుండగా.. కొన్ని సర్వశిక్షా అభియాన్ పరిధిలో, ఇంకొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇక మరోవైపు 192 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే పక్కాగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేజీ నుంచి 3వ తరగతి వరకు డే స్కూల్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించే విద్యాలయాలుగా మార్చవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అనువుగా ‘మోడల్’ భవనాలు ప్రస్తుతం రాష్ట్రంలో 177 మోడల్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. మరో 15 స్కూళ్ల భవనాలు సిద్ధమయ్యాయి. వచ్చే జూన్‌లో వాటిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటికి తోడు కేంద్రం రెండో దశలో మరో 125 మోడల్ స్కూళ్లను ఇచ్చింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ. 4.85 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. రూ. 100 కోట్ల నిధులూ ఇచ్చింది. కానీ తాజా బడ్జెట్లో కేంద్రం ఈ పథకాన్ని పక్కనపెట్టింది. అయితే గతంలోనే 125 స్కూళ్లను మంజూరు చేసి, కొంతమేర నిధులిచ్చినందున మిగతా నిధులిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మరో రూ. 650 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఎలాగూ కేజీ టు పీజీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో స్థలాలు సిద్ధంగా ఉన్న మోడల్ స్కూళ్లనే కేజీ టు పీజీ కేంద్రాలుగా నిర్మిస్తే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టల్‌కు కేంద్రమే నిధులిచ్చినందున.. బాలుర హాస్టళ్లకు నిధులను వెచ్చిస్తే చాలు. రకరకాల మేనేజ్మెంట్లు అవసరం లేదు ‘‘స్కూళ్లకు రకరకాల మేనేజ్మెంట్లు అవసరం లేదు. పేరు ఏదైనా నిధులను ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నిర్వహించాల్సింది విద్యాశాఖే. అందుకే కేజీ టు పీజీలో ఇలాంటి స్కూళ్లు అన్నీ ఒకే మేనేజ్మెంట్ పరిధిలో ఉండాలి. కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. అన్నింటి పరిధిలో నివాస వసతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది.’’ - చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త ఒకే రకంగా సర్వీసు రూల్స్ ‘‘ప్రస్తుతం గురుకులాలకు మోడల్ స్కూల్ టీచర్లకు ఒకే రకమైన సర్వీసు రూల్స్ ఉన్నాయి. పైగా మోడల్ స్కూళ్లలో బాలికలకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. అదనంగా బాలురకు హాస్టల్ వసతి కల్పించి కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాలు అన్ని ఒకే పరిధిలోకి తేవాలి.’’ - ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ కరిక్యులమ్ మాజీ విభాగాధిపతి -
కేజీ టు పీజీలో మూడంచెల వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం కసరత్తు - ప్రాథమికస్థాయిలో తెలుగు మాధ్యమం - 5-12వ తరగతి వరకు నివాస వసతితో ఆంగ్లమాధ్యమం - మంత్రి సమీక్ష.. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీలో మూడంచెల విద్యా వ్యవస్థ ఉంటే బాగుంటుందన్న అవగాహనకు తెలంగాణ ప్రభుత్వం వస్తోంది. కిండర్ గార్టెన్(కేజీ) నుంచి 4వ తరగతి వరకు, 5 నుంచి 12వ తరగతి వరకు, డిగ్రీ నుంచి పీజీ వరకు మూడు ప్రధాన వ్యవస్థలుగా కొనసాగించాలని ఆలోచి స్తోంది. మంగళవారం ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విద్యావేత్తలు, ఉన్నతాధికారులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని తీసుకొని అవసరమైన మార్పులతో కాన్సెప్ట్ పేపర్‌ను ప్రకటిస్తారు. దీని పై చివరగా విద్యావేత్తలకు, ఉపాధ్యాయ సంఘాలకు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకెళ్లి కేజీ టు పీజీకి తుది రూపును తీసుకురానున్నారు. సెమీ రెసిడెన్షియల్‌తో ప్రాథమిక విద్య: ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియంతోపాటు ఆంగ్లాన్ని కొనసాగించాలంటూ వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. అయితే ప్రాథమిక స్థాయిలో మాతృభాషను కచ్చితంగా కొనసాగించాలన్న అభిప్రాయం మంగళవారం జరిగిన సమావేశంలో వ్యక్తమైంది. మరోవైపు ప్రాథమికస్థాయి విద్యార్థులకు పూర్తి నివాస సదుపాయం సాధ్యంకాదని, దానికి బదులు సెమీ రెసిడెన్షియల్ వ్యవ స్థను కొనసాగించాలని భావిస్తోం ది. ఇందులో భాగంగా ఉదయం 9గంటలకు పాఠశాలకు వచ్చే ప్రాథమిక స్థాయి (కేజీ టు 4వ తరగతి వరకు) విద్యార్థులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, సాయంత్రం టిఫిన్, పాలు వంటి సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. రాత్రి మాత్రమే ఇంట్లో భోజనం చేసేలా దీనికి రూపకల్పన చేయాలని భావిస్తోంది. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు నివాసవసతితో (రెసిడెన్షియల్) కూడిన ఆంగ్ల మాధ్యమం విద్యను అందించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది. డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యావ్యవస్థను యథాతధంగా కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం కొనసాగించాలని భావిస్తోంది. కేజీ టు పీజీ క్యాంపస్‌లలోనూ పీజీ వరకు విద్యా వ్యవస్థ ఉండాలన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. పైగా డిగ్రీ, పీజీలో రెసిడెన్షియల్ వ్యవస్థ ఉండాలా? నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగించాలా? అన్న అంశాలపై చర్చిస్తోంది. వీటిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
దేశానికే ఆదర్శం కేజీ టు పీజీ విద్య
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కేజీ టూ పీజీ విద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అన్ని రాష్ట్రాలు తెలంగాణను చూసి ఇలాంటి పథకాలను అమలు చేస్తారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌తో కలసి కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో రూ.13 కోట్లతో నిర్మించిన పలు భవనాలను కడియం ఆదివారం ప్రారంభించారు. రూ. 20 కోట్లతో నిర్మించతలపెట్టిన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయని, నాణ్యమైన విద్యనందించడంలో విఫలమయ్యాయని అన్నారు. అది పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రూపొందించిందన్నారు. కేజీ టు పీజీ విద్యపై అఖిలపక్షం, మేధావులు, ప్రొఫెసర్లతో విస్తృతస్థారుులో చర్చించి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయూల్లో వైస్ చాన్స్‌లర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం త్వరలోనే సెర్చ్‌కమిటీ నియమించి వాటిని భర్తీ చేస్తుందన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను త్వరగా భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. బడ్జెట్లో ప్రభుత్వం కేవలం ఖర్చులు, రెవెన్యూ మాత్రమే చూపిస్తుందని, విద్యాశాఖకు ఇన్వెస్ట్మెంట్ కింద ఒక కాలాన్ని బడ్జెట్లో చూపించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉపముఖ్యమంత్రి కడియం కోరారు. -
‘కేజీ టు పీజీ’కి రూ.1,000 కోట్లు
- బడ్జెట్‌పై జరిగిన సమావేశంలో విద్యా శాఖ ప్రతిపాదనలు - పాఠశాలల నిర్వహణకూ అధిక నిధులు - మొత్తం రూ. 26,516 కోట్లు కావాలని విజ్ఞప్తి హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీ పథకం కింద ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక అవసరాల కోసం రూ.100 కోట్లు అవసరమని విద్యా శాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ఆర్థిక శాఖ అధికారులే రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తద్వారా జిల్లాకు రెండు మూడు కేజీ టు పీజీ క్యాంపస్‌లకు అవసరమైన భవన నిర్మాణాలు చేపట్టొచ్చని విద్యా శాఖ యోచిస్తోంది. 4 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 3 నుంచి 4 వేల మంది విద్యార్థులకు కొత్త భవనాల్లో స్కూళ్లు నిర్మించి ప్రవేశాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో బడ్జెట్‌పై జరిగిన సమావేశంలో ప్రతిపాదనలు అందజేసింది. విద్యా శాఖకు రూ.26,516 కోట్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు ప్రతిపాదించారు. ఇందులో పాఠశాల విద్యకు రూ.14,114 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.616 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.1,030 కోట్లు, కళాశాల విద్య, యూనివర్సిటీలకు, రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద రూ.756 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇంటర్ విద్య కమిషనర్ శైలజా రామయ్యార్, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల నిర్వహణకు పెద్దపీట విద్యుత్తు బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, చాక్ పీసులు, పాఠశాల నిర్వహణ కోసం వచ్చే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణకు ఏటా రూ. 30 వేలు ఇవ్వాలని కోరింది. వీటితోపాటు కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రహరీగోడల నిర్మాణానికి రూ. 45 కోట్లు, 8,315 టాయిలెట్ల నిర్మాణానికి రూ. 103 కోట్లు కావాలని ప్రస్తావించింది. -
‘కేజీ టు పీజీ’ అందించడమే లక్ష్యం: కడియం
జనగామ: కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా సోమవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. ఆయనకు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ, కాజీపేట, హన్మకొండలోని ఏకశిల పార్కులో జరిగిన సభల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పదవి వరించిందని.. విశ్వాసంతో పనిచేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఏ సీఎం చేయని విధం గా నాలుగు రోజులు వరంగల్ మురికివాడల్లో పర్యటించి అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి రూ.400 కోట్లు విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పొన్నాలవి ప్రగల్భాలు ‘మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో చావుదెబ్బతిని లేవలేని స్థితిలో ఉన్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.’ అని కడియం విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరూ కలసిరావాలని సీఎం కేసీఆర్ కోరుతుండగా పొన్నాల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 2019లో ఎవరేమిటో తేలుతుందని.. ఇప్పుడు మాత్రం అభివృద్ధికి సహకరించాలన్నారు. రాజయ్యపై ప్రేమ, అభిమానం ఉంది.. డాక్టర్ రాజయ్య తనకు సోదరుడి లాంటివాడని, అతడిపై ప్రేమ, అభిమానం ఉందన్నారు. ఊహించని రీతిలో మార్పు జరిగిందని మంత్రి శ్రీహరి అన్నారు. గ్రామాల్లో కడియం, రాజయ్య వర్గం అంటూ అభిప్రాయభేదాలు సృష్టించవద్దని, ఏమైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మనర్సింగరావు, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎమ్మెల్సీలు రాజలింగం, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. -
మండలానికో ‘కేజీ టు పీజీ’
విధివిధానాలపై సమీక్షలో సీఎం 27న విద్యావేత్తలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాలను మండలానికొకటి ఏర్పాటు చేయాలని టీ సర్కార్ యోచిస్తోంది. తొలుత నియోజకవర్గానికొకటి ఏర్పాటుచేయాలనుకున్నా, మండలానికొకటిచొప్పున నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 27న విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని సూచించారు. మండలానికొకటి చొప్పున కేజీ టు పీజీ విద్యాలయాలు 2016-17 విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించినట్లు సమాచారం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ప్రవేశం పొందే వీలు కల్పించేందుకు 3 వేల నుంచి 4 వేల సీట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతి ఉన్న గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామస్థాయిలో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఈ ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తేవాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్తు పేర్లతో ఉన్న స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలనే అంశంపైనా సీఎం ఆలోచించినట్లు సమాచారం. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్‌ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.500 కోట్లు తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్స్కూల్లో అదనంగా 5వ తరగతి విభాగం సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్‌ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు. -
పాఠశాలకు పట్టం
తెలంగాణలో నియోజకవర్గానికో ‘కేజీ టు పీజీ’ విద్యాక్షేత్రం 15 ఎకరాల విశాల ఆవరణలో స్కూలు, రూ. 54.56 కోట్లతో సకల సదుపాయాలు ప్రతి పాఠశాలలో వెయ్యి మందికి ప్రవేశాలు ఐదు వరకు తెలుగులో బోధన, ఆపై ఇంగ్లిష్ మీడియం వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతులు ప్రారంభం తర్వాతి విద్యా సంవత్సరంలో 2, 4, 6, 8, 10 క్లాసులు 2017 నుంచి ఏటా ఒకటో తరగతిలోనే ప్రవేశాలు ప్రభుత్వ పరిశీలనలో ‘కేజీ టు పీజీ’ ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ‘కేజీ టు పీజీ’ నిర్బంధ ఉచిత విద్య పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికింద నియోజకవర్గానికో పాఠశాలను ఏర్పాటు చేసి వెయ్యి మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 15 ఎకరాల విశాల ఆవరణలో హాస్టల్ సదుపాయంతో కూడిన స్కూలును నెలకొల్పేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో, ప్రాథమికోన్నత స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ర్ట సిలబస్‌నే అమలు చేయనున్న ఈ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదు వరకు ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు, 6 నుంచి పది వరకు ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉండాలని, ప్రతి సెక్షన్‌లోనూ 40 మంది విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ర్ట విద్యా శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘కేజీ టు పీజీ’ ప్రణాళికలోని ప్రధానాంశాలు వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతుల్లో, ఆ తర్వాతి సంవత్సరం(2016-17లో) 2, 4, 6, 8, 10 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2017-18 నుంచి ఏటా ఒకటో తరగతిలో మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. ఆ ఏడాది ఆరో తరగతిలో అదనంగా 40 మంది కొత్త వారిని మాత్రం తీసుకుంటారు. కో ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది. బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. వేర్వేరు హాస్టల్ సదుపాయం ఉంటుంది. హాస్టళ్లలో మూడో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. అడ్మిషన్ల విషయంలో డ్రాపవుట్(మధ్యలో బడి మానేసిన) విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారిని గుర్తించి ఈ స్కూళ్లలో చేర్చుతారు. పాఠశాలల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడతారు. సకల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అవసరమైనంత మంది కొత్త టీచర్లను నియమిస్తారు. అర్హత కలిగిన పాత టీచర్లకూ సమగ్ర శిక్షణ ఇస్తారు. నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ’గా గుర్తిస్తారు. నిధుల కొరత లేకుండా చూస్తారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెడతారు. అర్హత కలిగిన వంటగాళ్లను, హెల్పర్లను నియమిస్తారు. ఏపీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసిన వారిని అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుంటారు. నిఫుణుల సూచనల మేరకు 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటుంది. ఇంగ్లిష్‌కు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా ఒకటో తరగతి నుంచే దాన్ని ఒక సబ్జెక్టుగా పెడతారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధనపై ఎక్కువ దృష్టి పెడతారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పాఠశాలలకు అవసరమైన భూసేకరణ జరుగుతుంది. అవసరమైతే ప్రైవేటు స్థలాలను సేకరిస్తారు. ఒక్కో స్కూల్ నిర్మాణం, నిర్వహణ వ్యయం కింద రూ. 54.56 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో స్కూలు భవనానికి రూ. 9.13 కోట్లు, హాస్టల్‌కు రూ. 8 కోట్లు, ఉద్యోగుల క్వార్టర్లకు రూ.6.14 కోట్లు, వేతనాలు, డైట్ చార్జీలు, వసతుల కల్పనకు రూ. 9.28 కోట్లను కేటాయిస్తారు. ప్రతి స్కూలుకు 34 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ప్రాథమిక స్థాయిలో 10 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 12 మంది, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 మంది చొప్పున టీచర్లను నియమిస్తారు. 2016-17లో పదో తరగతి పూర్తి చేసుకునే వారు ఇంటర్మీడియెట్‌కు వెళ్లేలా అనుసంధానం చేస్తారు. అలా డిగ్రీ, పీజీ వరకు బోధన అందించే సమగ్ర క్యాంపస్‌లను అందుబాటులోకి తెస్తారు. -
ఉన్నత ప్రమాణాలతో ‘కేజీ టు పీజీ’
గజ్వేల్: అత్యున్నత ప్రమాణాలతో ఉచిత ‘కేజీ టు పీజీ’ విద్యావిధానాన్ని అమలుచేయడానికి సర్కార్ కసరత్తు చేస్తోందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం గజ్వేల్‌లోని కోలా అభిరామ్ గార్డెన్స్‌లో రోటరీ క్లబ్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 1,500 విద్యార్థులకు షూలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం ప్రాతిని థ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న విద్యాప్రమాణాలను అధ్యయనం చేసి వాటికంటే మెరుగైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గజ్వేల్ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తేనే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వేల్ ప్రజల అదృష్టం గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ఎర్రవల్లి వద్ద ఫాంహౌస్ నిర్మించారో, అప్పుడే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కిందన్నారు. కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారనీ, ప్రత్యేకంగాసాగునీటి వసతి కల్పించి కరువును శాశ్వతంగా తరిమివేయడానికి నిర్ణయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆ దిశగా కృషి జరుగుతోందని వివరించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చేయూతనిచ్చే దిశలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయవన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖ మెజీషియన్ సామల వేణు, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిటపే ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పొన్నాల రఘుపతిరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, గజ్వేల్, ములుగు జెడ్పీటీసీలు జేజాల వెంకటేశ్‌గౌడ్, సింగం సత్తయ్య, రోటరీ క్లబ్ నాయకులు డాక్టర్ పురుషోత్తం, వేణు, చంటి, విద్యాకుమార్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, నాయకులు పండరి రవీందర్రావు, దేవేందర్, మద్దిరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీపురు పట్టిన మంత్రి, ఎంపీ గజ్వేల్‌లో నగర పంచాయతీ అధ్వర్యంలో చేపట్టిన ‘చెత్తపై సమరం’ కార్యక్రమాన్ని మంగళవారం విద్యాశాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని కొద్దిసేపు ఊడ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజలంతా ‘చెత్తపై సమరం’ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నగర పంచాయతీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం నుంచి కోలా అభిరామ్ గార్డెన్స్ వరకు కొనసాగింది. అభివృద్ధే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయం ములుగు: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ములుగు మండల కేంద్రంలో రూ.75 లక్షల నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. -
సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ
-
మూడేళ్లకే బడి
* సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ * ‘కేజీ టు పీజీ’ అమలు దిశగా టీ సర్కార్ చర్యలు * ప్రీ ప్రైమరీలో చేరేందుకు కనీస వయసు మూడేళ్లకు తగ్గింపు * అంగన్వాడీ కేంద్రాలూ విద్యా శాఖ పరిధిలోకే * విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాఠశాలల మదింపు * దసరా సెలవుల్లోగా ఏకీకృత రూల్స్, హేతుబద్ధీకరణ, బదిలీలు * ప్రైవేట్ స్కూళ్ల పనితీరు, ఫీజులపైనా పర్యవేక్షణ * ఉన్నతాధికారులతో సమీక్షలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం విద్యా రంగం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించే ఉద్దేశంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ (ప్రీ ప్రైమరీ)లో ప్రవేశాలకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తోంది. ప్రీ ప్రైమరీకి అనుగుణంగా సర్కారీ స్కూళ్లలో చేరే విద్యార్థుల కనీస వయసును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. అలాగే నర్సరీ తరగతుల కోసం అంగన్వాడీ కేంద్రాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలని, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని కస్తూర్బా బాలికా విద్యాలయాలన్నింటినీ రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ‘కేజీ టు పీజీ’ అమలులో ఈ నిర్ణయాలే తొలి అడుగులు కానున్నాయి. విద్యా రంగంలో సంస్కరణలపై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్, కమిషనర్, గురుకుల విద్యా సంస్థల డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏకీకృత రూల్స్.. ఉపాధ్యాయులకు శిక్షణ రాష్ట్ర విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటుతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీస్ నిబంధనలను అమలు చేయాలని సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీచర్లకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిబంధనలను దసరా లోగా అమలు చేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలను కూడా దసరా సెలవుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు, హెచ్.ఎంలకు దసరా సెలవుల తర్వాత శిక్షణ ఇప్పించాలని, కొత్త పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధకులకు హ్యాండ్‌బుక్‌లు అందించాలని మంత్రి ఆదేశించారు. పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలతో పాటు శిక్షణకు సమగ్ర కేలండర్‌ను రూపొందించాలని ఆదేశించారు. స్కూళ్లలో తనిఖీలు, ప్రమాణాల పెంపు ప్రతి ప్రభుత్వ పాఠశాల పనితీరునూ అంచనా వేయాలని మంత్రి నిర్ణయించారు.స్కూళ్లవారీగా విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు టీచర్ల పనితీరును అంచనా వేసే బాధ్యతను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించనున్నారు.కొత్త పాఠ్యాంశాల అమలు, పరీక్షల సంస్కరణలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రైవేట్ స్కూళ్ల సమాచారం,వాటి పనితీరును,ఫీజుల వసూలును కూడా పరిశీలించాలని మంత్రి నిర్దేశించారు.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలన్నారు.ఇకపై అదనపు సంచాలకులు, సీనియర్ అధికారులతో కూడిన బృందాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నివేదికలను కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని మంత్రి సూచించారు.వారు నెలలో మూడు నాలుగు రోజులపాటు పాఠశాలలను తనిఖీ చేసి... జిల్లా, మండల స్థాయి విద్యాధికారులతో సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ఆటలు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు. -
3వ తరగతి నుంచే హాస్టల్
* త్వరలో కేజీ నుంచి పీజీపై నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘కేజీ టు పీజీ’లో భాగంగా హాస్టల్ సదుపాయంతో కూడిన ఇంగ్లిషు మీడియం ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముసాయిదా నివేదికను విద్యాశాఖ రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించే ఈ స్కూల్‌ను 15 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఈ పథకంపై అధికారులతో చర్చించారు. 3వ తరగతి నుంచి హాస్టల్ సదుపాయం కల్పించడం మంచిదనే భావన ఇందులో వ్యక్తమైంది. -
కేజీ టూ పీజీ నిర్బంధ విద్య
ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం కేసీఆర్ ఆకాంక్ష వచ్చే ఏడాది నుంచి ప్రారంభం ఏకీకృత సర్వీసు రూల్స్‌కోసం చర్యలు 12 ఏళ్ల తర్వాత మెుత్తం ఇంగ్లిష్ మీడియమే వస్తుంది.. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తామని, ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి గిన గురుపూజోత్సవంలో సీఎం ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి ప్రారంభిస్తామన్నారు. దీనిపై అందరి సల హాలు తీసుకుంటామన్నారు. అయితే తెలుగును కాపాడుకుంటూనే ప్రపంచస్థారుులో పోటీకి తట్టుకునే ఆంగ్ల మీడియంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇందులో బోధిం చే టీచర్లకు ఎలాంటి శిక్షణ అవసరం, ఎంతకా లం అవసరమనే అంశాలను నిర్ణయించాల్సి ఉందన్నారు. ఇంగ్లిష్ ఏమీ బ్రహ్మ విద్య కాదని, గట్టిగా అనుకుంటే నేర్చుకోవడానికి ఆరు నెలలు చాలని అన్నారు. టీచర్లు గట్టిగా కృషిచేస్తే పక్కా గా ఇంగ్లిష్ మీడియంలో బోధన అందించవచ్చ న్నారు. చైనా కూడా పట్టుబట్టి ఇంగ్లిష్ నేర్పిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో క్రియాశీలమైందన్నారు. సిలబస్ నష్టపోయినా, ఆ తరువాత సెలవుల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తిచేశారని, అదీ ఉపాధ్యా యుల అంకితభావానికి నిదర్శనమని ప్రశంసిం చారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గురువులు చదువు చెబితే బృహస్పతి అవుతార ని, చెప్పకపోతే శనిగ్రహం అవుతారన్నారు. ఈ కార్యక్రవుంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట జెడ్పీ హైస్కూల్ టీచర్ యాదేశ్వరి బ్రెయిలీ లిపిలో రాసిన ‘కొత్తపల్లి జయశంకర్ చరిత్ర.. ఒడవని ముచ్చట’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించా రు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 87 మందికి నగదు, జ్ఞాపికలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేసి సన్మానించారు. గురువుల విద్యతోనే ఈ స్థారుుకి వచ్చా కార్యక్రవుంలో సీఎం కేసీఆర్ తన గురువులను గుర్తుచేసుకున్నారు. అందరి ముందు తాను ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నానంటే అది తన గురువులు మృత్యుంజయశర్మ, రాఘవరెడ్డి అం దించిన జ్ఞానమేనన్నారు. వారుపెట్టిన అక్షర భిక్ష వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ సం దర్భంగా వుహాభారతంలోని ఉత్తరగోగ్రహణం లో పేర్కొన్న పద్యాన్ని చదివి వినిపించారు. ఎం తో కఠినమైన ఆ పద్యాన్ని ఐదుసార్లు తరగతి గదిలోనే చూసి చదివి, ఆరోసారి చూడ కుండా అప్పగించేశానన్నారు. ఇప్పటికీ ఆ పద్యాన్ని మ రచిపోలేదంటే అది తన గురువులు అందించిన విద్య ఫలితమేనన్నారు. బాల వ్యాకరణం నుంచి మొదలుకొని సాహిత్యం వరకు అన్నీ నేర్పించారన్నారు. 9వ తరగతిలోనే ప్రబంధం, కావ్యం అం టే ఏంటో నేర్పారని, అప్పుడే చందోబద్ధమైన పద్యం రాయగలిగానంటే అది తనకు గురువులు అందించిన జ్ఞానమేనన్నారు. దుబ్బాక జెడ్పీ హైస్కూల్లో చదువుకున్నానని తెలిపారు. సర్వేపల్లికి సీఎం నివాళి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం కేసీఆర్ శుక్రవారం నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైనున్న రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలుండాలి: రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వాల చర్యలుండాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఇందిర భవన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని నేటితరం గురువులంతా వ్యవహరించాలని సూచించారు. -
కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ!
-
ప్రతి ఊరూ బాసరే
* కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ! * తొలిదశలో 100 స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక * వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభం * బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం * ముందుగా గ్రామీణ నియోజకవర్గాల్లో అమలు * తర్వాత ఐదారు గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు * సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పిన ఈ మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనికి శ్రీకారం చుట్టాలని రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తొలిదశలో గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఒక్కొక్కటి చొప్పున సమగ్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, తదుపరి దశల్లో వాటిని విస్తరించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన మంగ ళవారం ఈ కార్యాచరణకు సంబంధించిన తొలి సమావేశం జరిగింది. విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించాలన్నది ఈ కార్యాచరణ లక్ష్యం. దీని ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి రూ. 10 కోట్ల చొప్పున వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, తర్వాతి ఏడాది రెండు స్కూళ్లు, ఆపై నాలుగేళ్ల పాటు ఏటా రెండు స్కూళ్ల చొప్పున ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. క్రమంగా వీటిని మండల కేంద్రాలకు విస్తరించడం, ఆ తర్వాత ఐదారు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలో విద్యా సంస్థలను ప్రారంభించే అంశాలను పరిశీలించారు. గ్రామస్థాయిలో నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలనిఅధికారులు నిర్ణయించారు. దశలవారీగా విద్యాలయాల విస్తరణ... మొదట ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6, 7 తరగతులు, ఆపైన క్రమంగా 10వ, 12వ తరగతుల వరకు విద్యా సంస్థలను విస్తరిస్తూ వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనూ అందించే స్థాయికి వీటిని సమగ్ర విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో వివిధ కోర్సులను అందించేలా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. విద్యావేత్తలు మాత్రం మరో రకంగా సూచిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో పిల్లలను హాస్టల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధపడరని, ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల స్వరూపం * ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియంలో కేజీ నుంచి పీజీ కోర్సులు * స్కూళ్లలో ఆటస్థలం, లైబ్రరీ, హాస్టల్ సదుపాయాలు * గురుకుల విద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని వసతుల కల్పన * ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 34 వేల ఖర్చు. మొత్తం విద్యార్థుల కోసం ఏటా రూ. 2.50 కోట్ల వరకు వ్యయం * 3 లక్షల మంది విద్యార్థులున్న 882 గురుకులాలకు ఇబ్బంది లేకుండా కొత్త విద్యా సంస్థల ఏర్పాటు