స్కూళ్ల పరిధిలోకి అంగన్‌వాడీలు
► ఇరు శాఖల అంగీకారం.. కార్యాచరణకు ఆదేశాలు
► ముందుగా పాఠశాలల సమీపంలోని కేంద్రాల విలీనం
► ఏప్రిల్ 15లోగా విధివిధానాలు, చేపట్టాల్సిన బోధన ఖరారు
► జూన్ 12 నుంచి తరగతులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేజీ టు పీజీ’ విద్యా విధానంలో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశా లల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు సూత్రప్రాయంగా అంగీక రించారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథ మిక పాఠశాలలను గుర్తించి, వాటి వద్దకు అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని... 2017–18 విద్యా సంవత్సరం నుంచే వాటిలో బోధించేలా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలు ఇప్పటివరకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మాత్రమే పనిచేశాయని, ఇక నుంచి ‘ప్లేస్కూల్’గా మార్చేందుకు ప్రతిపాద నలు రూపొందించాలని సూచించారు.
సౌకర్యాలూ ఏర్పడతాయి
రాష్ట్రవ్యాప్తంగా చాలా అంగన్ వాడీ కేంద్రాల కు పక్కా భవనాలు, వసతులు లేవు. దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అధి కారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అదే స్కూళ్ల ఆవరణలోకి అంగన్ వాడీ కేంద్రాలను తరలిస్తే పిల్లలకూ అన్ని వసతులు అందు బాటులోకి వస్తాయని.. పర్యవేక్షణ, నిర్వహణ సులభతరమవుతుందని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబం ధించి వచ్చే నెల 15లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 నుంచే అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల ల్లో నడిపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఓ వైపు ఆట, పాటలతో పిల్లలకు చదువు నేర్పిస్తూ, మరోవైపు పౌష్టికా హారం అందిస్తూ అంగన్‌వాడీలు ప్లేస్కూళ్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
6.54 లక్షల మంది విద్యార్థులు
ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో 6.54 లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలు నమోదై ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశా లలు ఉండగా... వాటిలో 9,742,464 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం అదనపు తరగతి గదులున్న వాటిని ముందుగా గుర్తించి.. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వాటిలోకి తరలి స్తారు. ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో తెలుగు మీడియంలో ప్లేస్కూళ్లను నిర్వహిస్తారు. ఇంగ్లిషు మీడియం పాఠాలు కూడా నేర్పిం చేలా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిలబస్‌ను రూపొందించింది. అనుమతి రాగానే పాఠ్య పుస్తకాలు రాయిం చి అమలు చేయనున్నారు. అంగన్‌వాడీ పిల్లల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను పరిశీలించి వీటిని సిద్ధం చేయనున్నారు. ఇక ఈ ప్లేస్కూళ్లలో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఆరు వేలకు పైగా విద్యా వలంటీర్లను నియమించే అవకాశముంది.