అంగన్‌వాడీ..అయోమయంలో పడి..! | confused in anganwadi centres | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ..అయోమయంలో పడి..!

Published Tue, Jan 3 2017 2:32 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

అంగన్‌వాడీ..అయోమయంలో పడి..! - Sakshi

అంగన్‌వాడీ..అయోమయంలో పడి..!

పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తూ.. బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉన్నత విద్యార్హతలున్నా ప్రభుత్వ కొలువులు రాక ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో నెట్టుకొస్తూ బతుకీడుస్తున్నారు అంగన్‌వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం మాత్రం కేజీ టూ పీజీ వరకు విద్యనందించే పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తామనే ఆలోచన చేస్తుండటంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇక తమ భవిష్యత్‌ ఏమిటని కార్యకర్తలు, ఆయాలు ప్రశ్నించుకుంటున్నారు.
 

 ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు గురవుతున్నారు. కేజీ టూ పీజీ వరకు నిర్వహించే పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రభుత్వ ఆలోచనను ప్రకటించడంతో.. ఐసీడీఎస్‌ పరిధిలో పనిచేసే అంగన్‌వాడీల్లో దీనిపై చర్చ సాగుతోంది. దీనిపై ఐసీడీఎస్‌కు ఎలాంటి గైడ్‌లైన్స్‌ రానప్పటికీ.. అంగన్‌వాడీలు మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే విషయమై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,605 అంగన్‌వాడీ కేంద్రాలు, 291 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా 43,291 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం బాలింతలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలో 20,194 మంది బాలింతలు, గర్భిణులకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతోపాటు ప్రాజెక్టులో 1,896 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 25,725 మంది పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా ఆటపాటలతో చదువు చెబుతున్నారు. ప్రస్తుతం 840 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 754 అద్దె భవనాలు, 302 అద్దె చెల్లించని భవనాల ద్వారా కేంద్రాలను నడుపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేసే ప్రధాన ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాలను సుమారు 25 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

అన్ని కేంద్రాలను విలీనం చేస్తారా..?
ప్రస్తుతం జిల్లాలో 1,896 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,605 మంది ఆయాలు కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.7వేలు వేతనం, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ఆయాలకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తే ఎక్కువ విద్యార్హతలున్న టీచర్లకు ఫస్ట్‌ క్లాస్‌ బోధించే అవకాశం కల్పిస్తారని, తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఎల్‌కేజీ, యూకేజీ వరకు బోధించే అవకాశం కల్పిస్తారని చర్చ సాగుతోంది. దీంతోపాటు అర్హతలు తక్కువ ఉన్న వారికి ఉద్వాసన చెబుతారనే నేపథ్యంలో అటు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనుల్లో తమ సహకారం అందిస్తున్న అంగన్‌వాడీలు.. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని మనోవేదన చెందుతున్నారు.

అంగన్‌వాడీల లక్ష్యం ఎటు సాగేను..
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. అనారోగ్యానికి గురికాకుండా చూసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. వీటిని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఆ లక్ష్యం ఎటు పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఏయే అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, ఐసీడీఎస్‌ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement