- బడ్జెట్‌పై జరిగిన సమావేశంలో విద్యా శాఖ ప్రతిపాదనలు
- పాఠశాలల నిర్వహణకూ అధిక నిధులు
- మొత్తం రూ. 26,516 కోట్లు కావాలని విజ్ఞప్తి
హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీ పథకం కింద ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక అవసరాల కోసం రూ.100 కోట్లు అవసరమని విద్యా శాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ఆర్థిక శాఖ అధికారులే రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తద్వారా జిల్లాకు రెండు మూడు కేజీ టు పీజీ క్యాంపస్‌లకు అవసరమైన భవన నిర్మాణాలు చేపట్టొచ్చని విద్యా శాఖ యోచిస్తోంది.
4 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 3 నుంచి 4 వేల మంది విద్యార్థులకు కొత్త భవనాల్లో స్కూళ్లు నిర్మించి ప్రవేశాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో బడ్జెట్‌పై జరిగిన సమావేశంలో ప్రతిపాదనలు అందజేసింది. విద్యా శాఖకు రూ.26,516 కోట్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు ప్రతిపాదించారు. ఇందులో పాఠశాల విద్యకు రూ.14,114 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.616 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.1,030 కోట్లు, కళాశాల విద్య, యూనివర్సిటీలకు, రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద రూ.756 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇంటర్ విద్య కమిషనర్ శైలజా రామయ్యార్, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల నిర్వహణకు పెద్దపీట
విద్యుత్తు బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, చాక్ పీసులు, పాఠశాల నిర్వహణ కోసం వచ్చే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణకు ఏటా రూ. 30 వేలు ఇవ్వాలని కోరింది. వీటితోపాటు కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రహరీగోడల నిర్మాణానికి రూ. 45 కోట్లు, 8,315 టాయిలెట్ల నిర్మాణానికి రూ. 103 కోట్లు కావాలని ప్రస్తావించింది.
‘కేజీ టు పీజీ’కి రూ.1,000 కోట్లు
Published Thu, Feb 12 2015 2:30 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement