
‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య అందించాలని ఆందోళన
మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అమలు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. మంత్రుల క్వార్టర్లలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా 44 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచితవిద్య అమలును టీఆర్‌ఎస్ విస్మరించిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.