* కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ!
* తొలిదశలో 100 స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక
* వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభం
* బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం
* ముందుగా గ్రామీణ నియోజకవర్గాల్లో అమలు
* తర్వాత ఐదారు గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు
* సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పిన ఈ మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనికి శ్రీకారం చుట్టాలని రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
తొలిదశలో గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఒక్కొక్కటి చొప్పున సమగ్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, తదుపరి దశల్లో వాటిని విస్తరించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన మంగ ళవారం ఈ కార్యాచరణకు సంబంధించిన తొలి సమావేశం జరిగింది. విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించాలన్నది ఈ కార్యాచరణ లక్ష్యం.
దీని ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి రూ. 10 కోట్ల చొప్పున వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, తర్వాతి ఏడాది రెండు స్కూళ్లు, ఆపై నాలుగేళ్ల పాటు ఏటా రెండు స్కూళ్ల చొప్పున ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. క్రమంగా వీటిని మండల కేంద్రాలకు విస్తరించడం, ఆ తర్వాత ఐదారు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలో విద్యా సంస్థలను ప్రారంభించే అంశాలను పరిశీలించారు. గ్రామస్థాయిలో నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలనిఅధికారులు నిర్ణయించారు.
దశలవారీగా విద్యాలయాల విస్తరణ...
మొదట ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6, 7 తరగతులు, ఆపైన క్రమంగా 10వ, 12వ తరగతుల వరకు విద్యా సంస్థలను విస్తరిస్తూ వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనూ అందించే స్థాయికి వీటిని సమగ్ర విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
అయితే కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో వివిధ కోర్సులను అందించేలా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. విద్యావేత్తలు మాత్రం మరో రకంగా సూచిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో పిల్లలను హాస్టల్‌లో చేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధపడరని, ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
విద్యా సంస్థల స్వరూపం
* ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియంలో కేజీ నుంచి పీజీ కోర్సులు
* స్కూళ్లలో ఆటస్థలం, లైబ్రరీ, హాస్టల్ సదుపాయాలు
* గురుకుల విద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని వసతుల కల్పన
* ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 34 వేల ఖర్చు. మొత్తం విద్యార్థుల కోసం ఏటా రూ. 2.50 కోట్ల వరకు వ్యయం
* 3 లక్షల మంది విద్యార్థులున్న 882 గురుకులాలకు ఇబ్బంది లేకుండా కొత్త విద్యా సంస్థల ఏర్పాటు
ప్రతి ఊరూ బాసరే
Published Wed, Jul 2 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement