దేశానికే ఆదర్శం కేజీ టు పీజీ విద్య
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కేజీ టూ పీజీ విద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అన్ని రాష్ట్రాలు తెలంగాణను చూసి ఇలాంటి పథకాలను అమలు చేస్తారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌తో కలసి కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో రూ.13 కోట్లతో నిర్మించిన పలు భవనాలను కడియం ఆదివారం ప్రారంభించారు. రూ. 20 కోట్లతో నిర్మించతలపెట్టిన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయని, నాణ్యమైన విద్యనందించడంలో విఫలమయ్యాయని అన్నారు.
అది పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రూపొందించిందన్నారు. కేజీ టు పీజీ విద్యపై అఖిలపక్షం, మేధావులు, ప్రొఫెసర్లతో విస్తృతస్థారుులో చర్చించి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయూల్లో వైస్ చాన్స్‌లర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం త్వరలోనే సెర్చ్‌కమిటీ నియమించి వాటిని భర్తీ చేస్తుందన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను త్వరగా భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. బడ్జెట్‌లో ప్రభుత్వం కేవలం ఖర్చులు, రెవెన్యూ మాత్రమే చూపిస్తుందని, విద్యాశాఖకు ఇన్వెస్ట్‌మెంట్ కింద ఒక కాలాన్ని బడ్జెట్‌లో చూపించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉపముఖ్యమంత్రి కడియం కోరారు.