విద్యా హక్కు చట్టం తెస్తే ఉద్యోగాలు పోతాయ్: కేసీఆర్
విద్యా హక్కు చట్టం అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40వేల మంది టీచర్లకు పనిలేకుండా పోతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. అసెంబ్లీలో ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల బాదుడుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యూపీఏ సర్కార్ హయాంలో మోడల్ స్కూల్ ప్రతిపాధన వచ్చిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తెస్తోందని అన్నారు. ప్రైమరీ నుంచి యూనివర్సిటీ విద్యవరకూ విద్యారంగంపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కాగా.. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు విద్యార్థులు సైతం చీటికి మాటికి వీధుల్లోకి రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రిస్తాం : కడియం
అంతకు ముందు ప్రశ్నోత్తరాల సందర్భంగా... రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని 12 ఇంటర్నేషనల్ పాఠశాలలకు నోటీసులు పంపామని తెలిపారు.
త్వరలోనే పేరెంట్స్ కమిటీ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణపై చర్చిస్తామని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. గుర్తింపు లేని పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 400 పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి.. ఒక యాజమాన్యం కింద ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ ఒకే ఫీజు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.