
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ నెల 11 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మెపై సీఎం కేసీఆర్ ఫైర్ అవ్వడంతో టీఎంయూ గౌరవ అధ్యక్షడు హరీష్‌రావుతో ఆ సంఘం నేతలు శనివారం భేటీ అయ్యారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు.
ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, హరీష్ రావ్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.