RTC Employees Strike
-
ఆర్టీసీ సమ్మె: కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పిటిషన్లో సవరణలు చేసి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్రావు తిరిగి పిటిషన్ దాఖలు చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామన్నా తీసుకోవడం లేదని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపాడు. జీతాల్లేక కుటుంబాలను పోషించలేక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి యాభై రోజులు దాటింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టుదిగకపోవడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తామన్నారు. అయితే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించడంతో కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: వస్తామంటే.. వద్దంటారా?) -
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కార్మికుల నెత్తిన పిడుగులాంటి వార్తే. భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ కార్మికులకు భంగపాటు ఎదురైంది. ఇక హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉండటంతో వారు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: ‘ప్రభుత్వానికి బుద్ధి లేదు’
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నరే అపాయింట్మెంట్ ఇచ్చినపుడు సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి కనీస ధ్యాస లేదన్నారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. మరి కేసీఆర్‌కు ఏమైంది? ఆయన మొండివైఖరే సమ్మెకు కారణం. ఇంత దీర్ఘకాలికంగా సమ్మె ఎప్పుడూ జరగలేదు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు. ముఖ్యమంత్రి కార్మికులను చర్చలకు పిలవాలి. త్వరలో అన్ని సంఘాల నాయకులు సమ్మెబాట పట్టే రోజులు వచ్చాయి. మరోవైపు భూ ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ ధరణి వెబ్‌సైటే పనిచేయడం లేదు. అన్నీ బోగస్ లెక్కలుగా తేలిపోయాయి. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రం రూ.3,12,000 కోట్ల అప్పుల తెలంగాణ అయింది. త్వరలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా’ మని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. -
మంత్రి దయాకర్‌రావు ఇంటి ముట్టడి..
సాక్షి, హన్మకొండ : ఇటు సమస్యలు పరిష్కరించకుండా.. అటు చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా స్పందించి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌చేస్తూ ప్రజాపతినిధుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా... అరెస్టులతో శాంతియుతంగానే ముగిసింది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు కనిపిస్తే అరెస్టు చేయాలన్న ఆదేశాలతో ఎక్కడికక్కడ కార్మికులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విపక్షాలు, ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ ఇళ్లను ముట్టడించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పోలీసులు ఇక్కడే ప్రధానంగా దృష్టి సారించారు. హన్మకొండలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసినా కార్మికులు అటువైపు పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కార్మికుల్లోని ఓ వర్గం కెప్టెన్ ఇంటిని ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ముట్టడించడంతో పాటు డప్పులు మోగించారు. హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి దయాకర్‌రావు ఇంటి ముందుకు వెళ్లకుండా రెండు వైపుల దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీతో పాటు, ఇతర పోలీసు బలగాలతో భారీ భద్రత కల్పించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హన్మకొండ డిపో నుంచి ర్యాలీగా మంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను నెట్టి వేస్తూ ముందుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ మేరకు నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. మాదిగ ఉద్యోగ సమాఖ్య అధ్వర్యంలో ఎంపీ లక్ష్మీకాంతరావు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు చావు డప్పు కొట్టారు. హంటర్ రోడ్డులోని రాజ్ హోటల్ నుంచి ర్యాలీగా కెప్టెన్ ఇంటి వద్దకు చేరుకుని ముట్టడించడంతో పాటు డప్పు కొడుతూ నినాదాలు చేశారు. అప్పటికే ఇక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు సుబేదారి సీఐ అజయ్‌కు సమాచారం ఇవ్వగా వాహనాలు, అదనపు బలగాలతో చేరుకుని కార్మికులు, కళాకారులను అరెస్టు చేసి, పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు దశల వారీగా ముట్టడించారు. ముందుగా సీపీఎం, సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు ఇంటి ముట్టడికి చేరుకోగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు.. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు వేర్వేరుగా రాగా పోలీసులు అంతే వేగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ జేఏసీతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులతోపాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మంత్రి ఇంటి వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం హసన్‌పర్తి: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇళ్లు ముట్టడికి ఆర్టీసీ జేఏసీ నాయకులు యత్నించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరుగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. హసన్‌పర్తి జేఏసీ చైర్మన్ పుట్ట రవిమాదిగ, కోకన్వీనర్ అనుమాండ్ల విద్యాసాగర్‌తో పాటు మారపెల్లి రామచంద్రారెడ్డి, బొక్క కుమార్, గొర్రె కిరణ్, కార్మికులు మేకల యుగేందర్, రాజేందర్, శీలం రమేష్, సురేందర్, అమరేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేందర్ ఇంటి వద్ద.. ఖిలా వరంగల్: కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, ఎంసీపీఐ నాయకుల ఆధ్వర్యాన పెరకవాడలోని ఎమ్మెల్యే నరేందర్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో గేటుకు వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. అప్పటికే బందోబస్తులో ఉన్న మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యాన వారిని ఆరెస్ట్ చేసి మిల్స్‌కాలనీ పోలీస్ స్ట్రేషన్‌కు తరలించారు. -
ఆర్టీసీ సమ్మె: ఏపీలో ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేత దామోదర్ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. వీరికి మద్దతుగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబుకు పోటీగా ఒకశాతం అదనంగా ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కమిటీ వేశారు. మరి ఆ పని మీరెందుకు చేయడం లేదు’ అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కార్మికులు సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక్కడ కార్మికులు పోరాటం ప్రారంభించాక వారికి మద్దతుగా ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే, పోరాటంలో కార్మికులదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఫెడరేషన్ కూడా ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడించారు. త్వరలో అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో కలిసి ‘చలో తెలంగాణ కార్యక్రమం’ చేపడతామని ప్రకటించారు. (చదవండి: 25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు) సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం సంస్థకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. 25 రోజులుగా జరుగుతున్న సమ్మెలో 28 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు, సర్వీసులు కలిసే ఉన్నందున అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినట్టే ఇక్కడా చేయమంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పల్లె వెలుగు నష్టాలు ప్రభుత్వం భరించాలని... నష్టాన్ని భరించలేకపోతే సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. -
ఆర్టీసీని ఖతం చేస్తే ఊరుకోం: మందకృష్ణ
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో ఆర్టీసీనే కాదు.. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుంతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం రాబోయే రోజుల్లో పరిరక్షణ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ఖతం చేస్తే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. నిజాంను తరిమికొట్టిన తెలంగాణ గడ్డ ఇదని.. కేసీఆర్‌కు అదే గతి పడుతుందని పేర్కొన్నారు. ప్రజల హక్కులను హరించే వారిని ఈ గడ్డమీదే భూస్థాపితం చేయాలని కాళోజీ అన్నాడు. ఇప్పుడు ప్రజలు అదే చేయబోతున్నారని తెలిపారు. (చదవండి: ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు: కేసీఆర్) అధికారం ఉందని అహంకారం.. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు డిపోల ముందే ఆందోళనలు చేశారు. కానీ ఇప్పుడు కనీసం డిపోల దగ్గరికి కూడా వెళ్లనివ్వట్లేదు అని మందకృష్ణ మండిపడ్డారు. కార్మికులు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంటే పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్మికులపై పోలీసుల వేధింపులకు నిరసనగా త్వరలోనే అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘చలో మంచిర్యాల’ను నిర్వహిస్తామని వెల్లడించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుపై మందకృష్ణ స్పందిస్తూ.. టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లోనూ గెలుస్తామనుకోవటం పొరపాటు అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మందకృష్ణ విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మె: మంచిర్యాలలో ఉద్రిక్తత
సాక్షి, మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం చర్చలకు రాకపోవడం.. ఇటు కార్మికులు పట్టు విడవకపోవడంతో సమ్మె మరింత ఉదృతంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిపో వద్ద జరిగిన తోపులాటలో ఓ మహిళా కార్మికురాలు స్పృహ తప్పి కిందపడిపోయారు. వివరాలు.. జేఏసీ పిలుపు మేరకు నేడు ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నేతలు అక్కడికి చేరుకుని.. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లకు రేపటి నుంచి విధులకు రావద్దంటూ పూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం శిబిరంలో నిరసన చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించేందుకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ‘ప్రభుత్వం ఎలాగూ స్పందించడం లేదు. మాకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్ట్ చేస్తారా?’ అంటూ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
‘ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..!’
సాక్షి, యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి 11 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మొండి వైఖరితో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని నాయకులతో కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ నెల 11 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మెపై సీఎం కేసీఆర్ ఫైర్ అవ్వడంతో టీఎంయూ గౌరవ అధ్యక్షడు హరీష్‌రావుతో ఆ సంఘం నేతలు శనివారం భేటీ అయ్యారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు. ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, హరీష్ రావ్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని మూసేస్తాననడం సరైంది కాదు
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడని, ఆర్టీసీని మూసేస్తానని సీఎం చెప్పడం సరైనది కాదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. దాదాపు 50 వేలకు పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించడం దారుణమన్నారు. ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ అధికారుల వల్ల ఆర్టీసీ నష్టల్లో లేదని, ప్రభుత్వ విధానాల వల్లే నష్టాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కానీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృసి చేయడం లేదని మండిపడ్డారు. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని హితవు పలికారు. ప్రైవేటు బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు మాట్లాడుతూ..‘ ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్, ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓట్ల కోసం అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు, 5 ఎకరాలు కేటాయిస్తున్నారు. న్యాయంగా రావాల్సిన జీతాలు అడిగితే ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ భయపెడుతున్నారు. రోడ్లపైన కూడా ప్రజలకు అన్యాయంగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను ప్రభుత్వం మానుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పీసీసీ ఆలోచిస్తుంది. ఈ నెల 11న రాహుల్ గాంధీ సమక్షంలో జాతీయ ఓబీసీ కమిటీ మీటింగ్ ఉంది. 2019 ఎన్నికల్లో కలసి ఉంటే కలదు సుఖం అనే నినాదంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద’ని అన్నారు. -
రేపు మధ్యాహ్నం మా నిర్ణయం ప్రకటిస్తాం
-
అనంతపురంలో 8వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె
అనంతపురం: జిల్లాలో 8వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి... ఇద్దరికి గాయాలు
భువనగరి (నల్లగొండ): ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సమయంలో నడుస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో బస్సు అద్దాల పగిలి ఓ ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంత వాసులని సమాచారం. -
'సమ్మె విరమించండి, 43% ఇస్తే ప్రజలపై భారం'
నిజామాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్‌మెంట్‌పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రజలపై భారం పడుతుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా పలుచోట్ల పోలీసుల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి, సబ్ కమిటీ వేస్తాం: మహేందర్ రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్‌మెంట్‌పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జగన్ మద్దతు
కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆయన అన్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందు వల్లే సమ్మె బాట పట్టారని పేర్కొంటూ సమ్మెకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ-సికింద్రాబాద్ మధ్య తత్కాల్ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ (02871/02872) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8,9,10 తేదీలలో సాయంత్రం 4.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 9,11 తేదీలలో రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25 కు విశాఖ చేరుకుంటుంది. కాకినాడ-హైదరాబాద్ (07006) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3.30 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15కు నాంపల్లికి చేరుకుంటుంది. -
5 నుంచి ఆర్టీసీ సమ్మె
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : విజయనగరం జోనల్ పరిధిలోని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 5వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జోనల్ ఈడీ ఏ. రామకృష్ణకు ఆ సంఘం జోనల్ కమిటీ మంగళవారం సమ్మె నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర నాయకుడు దామోదరరావు మాట్లాడుతూ జోనల్ పరిధిలో కార్మిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు విధుల కేటాయింపు, మహిళా కండక్టర్లకు రూట్ చార్ట్ తయారీ వంటి పలు అంశాలలో సీనియార్టీని పాటించకుండా ఎన్ఎంయూ సంఘం నేతలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై విశాఖ అర్బన్ డిప్యూటీ సీటీ ఎం వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. పని భారాన్ని పెంచడం వల్ల విధుల్లో నాణ్యత కొరవడుతోందని, అదే సమయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. డబుల్ డోర్ ఉన్న బస్సులలో విధులను ప్రత్యేకంగా గు ర్తించాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన 23 డిమాండ్లతో కూడిన సమ్మెనోటీసు అందజేసినట్టు తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమ్మెపై అవగాహనకు జోనల్ పరిధిలోని 27 డిపోల ఎదుట ఈనెల 30న నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసరాజు, రీజియన్ కార్యదర్శి పి.భానుమూర్తి, కెవిరమణ, వివిధ డిపో కమిటీల సభ్యులు పాల్గొన్నారు. -
రవాణా సమ్మెకు ప్రత్యామ్నాయం కష్టమే: మంత్రి బొత్స
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెవల్ల సీమాంధ్ర ప్రాంతంలో 11 వేల బస్సులు డిపోల్లోనే ఆగిపోయాయని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఇబ్బందే. అయినా ప్రభుత్వపరంగా మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనపై సీమాంధ్ర ఉద్యోగుల అభ్యంతరాల గురించి మేం ఆంటోనీ కమిటీకి, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి’’ అని బొత్స కోరారు. కాగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తోందన్న వాదనలను బొత్స ఖండించారు. ‘‘సీట్ల కోసమైతే తెలంగాణకు ఎందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణకంటే సీమాంధ్రలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా..?’’ అని ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయాలని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా... సీమాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టులు ఎందుకు రాజీనామాలు చేయలేదని మంత్రి ఎదురు ప్రశ్నించారు.