సాక్షి, మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం చర్చలకు రాకపోవడం.. ఇటు కార్మికులు పట్టు విడవకపోవడంతో సమ్మె మరింత ఉదృతంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిపో వద్ద జరిగిన తోపులాటలో ఓ మహిళా కార్మికురాలు స్పృహ తప్పి కిందపడిపోయారు. వివరాలు.. జేఏసీ పిలుపు మేరకు నేడు ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీ నేతలు అక్కడికి చేరుకుని.. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌లకు రేపటి నుంచి విధులకు రావద్దంటూ పూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం శిబిరంలో నిరసన చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించేందుకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ‘ప్రభుత్వం ఎలాగూ స్పందించడం లేదు. మాకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్ట్ చేస్తారా?’ అంటూ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment