
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది.
రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కార్మికుల నెత్తిన పిడుగులాంటి వార్తే. భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ కార్మికులకు భంగపాటు ఎదురైంది.
ఇక హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉండటంతో వారు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment