
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కార్మికులను డిస్మిస్ చేసినట్టు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్ నోట్‌లను పిటిషన్ న్యాయస్థానం ముందు ఉంచారు. పిటిషనర్ వాదనపై స్పందించిన హైకోర్టు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులే దీనికి బాధ్యత వహించాలని తెలిపింది.
యూనియన్‌లు సమ్మెకు పిలుపునిస్తే.. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేమని తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. కార్మికులను డిపోల్లోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై రేపు అఫిడవిట్ ఫైల్ చేస్తామని పిటిషనర్ తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment