గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదు.. | TSRTC Strike: High Court Interesting Comments On Employee Suicide | Sakshi
Sakshi News home page

మేమెలా ఆపగలం?

Published Wed, Nov 27 2019 3:08 AM | Last Updated on Wed, Nov 27 2019 11:01 AM

TSRTC Strike: High Court Interesting Comments On Employee Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్దయగా, మొండి వైఖరితో వ్యవహరించడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పడానికి ఆధారాలు కావాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడున్న సంక్షోభం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేందుకు ఆధారాలు చూపాలని కోరింది. అయినా గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదని ప్రశ్నించింది. గుండెపోటుతో మరణించే వాళ్ల ప్రాణాల్ని ప్రభుత్వం మాత్రం ఎలా రక్షించగలదని పేర్కొంది. అక్టోబర్‌ 5 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఆర్టీసీ యూనియన్‌ నిర్ణయించింది. ఈ సంక్షోభాలన్నింటికీ సమ్మే కారణమని నిందించదలిస్తే, అందుకు యూనియన్‌నే బాధ్యులని చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. 

సమ్మెపై నిర్ణయించుకోవడానికి ముందే వీటన్నింటిపై అధ్యయనం చేసుండాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం వల్లే అవన్నీ జరుగుతున్నా యని అంటే ఎలా? అని ప్రశ్నించింది. కోర్టులు కూడా రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తాయని, తమ చేతిలో మంత్రదం డం ఏమీ ఉండదని చెప్పింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభి షేక్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.  

ఒక్క కార్మికుడినైనా డిస్మిస్‌ చేసిందా? 
విశ్వేశ్వరరావు వాదిస్తూ.. ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్లనే ఒత్తిడికి గురై పలువురు గుండెపోటు వచ్చి మరణించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ల సంఖ్య 30 వరకూ ఉంది. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళితే పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇది అమానుషం.  హైకోర్టు స్పందించి విధుల్లోకి చేరే వాళ్లని అడ్డుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

హైకోర్టు స్పందిస్తూ... పీఎఫ్‌ నిధుల్ని తీసుకోవడమో లేదా కాంట్రాక్టు కార్మికులు విధుల్లో చేరడం వల్లో ఆత్మహత్యలు చేసుకున్నారా లేక చేయడానికి పనిలేనందున ఆత్మహత్యలు చేసుకున్నారా.. వీటికి ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. సమ్మె మొదలు పెట్టిన వెంటనే ప్రభుత్వమే ‘సెల్ఫ్‌ డిస్మిసల్‌’అని చెప్పిందని విశ్వేశ్వరరావు సమాధానమిచ్చారు. అయితే కోర్టుకు ఆధారాలే ముఖ్యమని, సూర్యోదయం అవగానే కడుపు నొప్పి వస్తోందని చెప్పి సూర్యుడినో, సూర్యోదయాన్నో కారణమని నిర్ధారించలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఉద్యోగి ఒక్కరినైనా ప్రభుత్వం డిస్మిస్‌ చేసిందా అని ప్రశ్నించింది.  

హైకోర్టుకు కార్మికుడి సూసైడ్‌ నోట్‌ 
ప్రభుత్వ వైఖరి కారణంగానే భవిష్యత్‌ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునేముందు రాసిన లేఖను (సూసైడ్‌ నోట్‌) పరిశీలించాలని దాని ప్రతిని విశ్వేశ్వరరావు నివేదించారు. సమ్మె, ఆ తర్వాత ఆత్మహ త్యలకు తావిచ్చిన కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆత్మహత్యలను, గుండెపోటులను తామెలా ఆపగలమని, సమ్మె కారణంగానే జరిగాయని ఎలా చెప్పగలరని, ఇదే వాదన సబబు అనుకుంటే సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్‌ను నిందించాలని వ్యాఖ్యానించింది.  

కస్టోడియల్‌ డెత్‌లపై స్పందించినట్లుగానే
ప్రభుత్వ తీరు అనైతికంగా ఉందని, హైకోర్టు స్పందించకపోతే జనం ఎక్కడికి వెళ్లాలని విశ్వేశ్వరరావు అన్నారు. కస్టోడియల్‌ డెత్‌లపై గతంలో కోర్టు స్పందించిన తీరులోనే వీటిపైన కూడా హైకోర్టు స్పందించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కార్మికులేమీ నిస్సహాయులు కాదని, అలా అనుకుంటే భ్రమేనని, అది తప్పుడు అభిప్రాయమని, కార్మికులు సరైన వేదిక (సంబంధిత కోర్టుకు)కు వెళ్లాలని, అన్నింటికీ హైకోర్టును ఆశ్రయిస్తే తమ వద్దేమీ మంత్రదండం ఉండదని చెప్పింది. రోగం ఏదో గుర్తించి దానికి వైద్యం చేయించుకోవాలేగానీ గుండె సమస్యకు కిడ్నీ డాక్టర్‌ దగ్గరకు వెళితే లాభం ఏముంటుందని ప్రశ్నించింది.

పారిశ్రామిక వివాదాల చట్టం కింద సంబంధిత కోర్టుల్లో కార్మికుల సమస్యలపై తేల్చుకోవాలని హితవు చెప్పింది. జీతాల చెల్లింపు గురించి ఇప్పటికే సింగిల్‌ జడ్జి వద్ద కేసు వేశారని, మిగతా సమస్యలపై ఆయా కోర్టుల్లో న్యాయ పోరాటం చేసుకోవచ్చునని సూచించింది. రాజ్యాంగ ధర్మాసనాలకు అసాధారణ అధికారాలు ఉంటాయని, సమ్మె విరమించిన కార్మికులు విధు ల్లో చేరేందుకు అడ్డంకులు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, న్యాయస్థానాలూ రాజ్యాంగ నిర్ధేశాలకు లోబడే పనిచేయాలని, అసాధారణ అధికారాల పేరుతో కోరి నవన్నీ చేసేందుకు కోర్టుల్లో మంత్రదండం ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పింది. కనీసం విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లే కార్మికుల్ని అడ్డుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు కోరారు.  

సవరణ పిటిషన్‌ దాఖలు చేయండి 
ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, వారి క్షోభ ఊహకు అందనిదని, దయచేసి మానవీయతతో హైకోర్టు స్పందించాలని విశ్వేశ్వరరావు కోరారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. యూనియన్‌ తో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు తీసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిల్‌లో కోరారని, సమ్మె విరమించినందున ఇప్పుడు విధుల్లో చేరేందుకు అనుమతించాలని కోరుతున్నారని, ఈమేరకు చట్ట నిబంధనల మేరకు పిల్‌లోని అభ్యర్థనను మార్పు చేసి సవరణ పిటిషన్‌ దాఖలు చేయాలని పేర్కొంది. అందుకు అంగీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేయాలని విశ్వేశ్వరరావు కోరినప్పటికీ, దీనిపై ఏమీ స్పష్టం చేయని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement