5 నుంచి ఆర్టీసీ సమ్మె
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : విజయనగరం జోనల్ పరిధిలోని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 5వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జోనల్ ఈడీ ఏ. రామకృష్ణకు ఆ సంఘం జోనల్ కమిటీ మంగళవారం సమ్మె నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర నాయకుడు దామోదరరావు మాట్లాడుతూ జోనల్ పరిధిలో కార్మిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు విధుల కేటాయింపు, మహిళా కండక్టర్లకు రూట్ చార్ట్ తయారీ వంటి పలు అంశాలలో సీనియార్టీని పాటించకుండా ఎన్‌ఎంయూ సంఘం నేతలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.
ఈ అంశాలపై విశాఖ అర్బన్ డిప్యూటీ సీటీ ఎం వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. పని భారాన్ని పెంచడం వల్ల విధుల్లో నాణ్యత కొరవడుతోందని, అదే సమయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. డబుల్ డోర్ ఉన్న బస్సులలో విధులను ప్రత్యేకంగా గు ర్తించాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన 23 డిమాండ్‌లతో కూడిన సమ్మెనోటీసు అందజేసినట్టు తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమ్మెపై అవగాహనకు జోనల్ పరిధిలోని 27 డిపోల ఎదుట ఈనెల 30న నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసరాజు, రీజియన్ కార్యదర్శి పి.భానుమూర్తి, కెవిరమణ, వివిధ డిపో కమిటీల సభ్యులు పాల్గొన్నారు.