ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెవల్ల సీమాంధ్ర ప్రాంతంలో 11 వేల బస్సులు డిపోల్లోనే ఆగిపోయాయని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెవల్ల సీమాంధ్ర ప్రాంతంలో 11 వేల బస్సులు డిపోల్లోనే ఆగిపోయాయని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఇబ్బందే. అయినా ప్రభుత్వపరంగా మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనపై సీమాంధ్ర ఉద్యోగుల అభ్యంతరాల గురించి మేం ఆంటోనీ కమిటీకి, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి’’ అని బొత్స కోరారు.
కాగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తోందన్న వాదనలను బొత్స ఖండించారు. ‘‘సీట్ల కోసమైతే తెలంగాణకు ఎందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణకంటే సీమాంధ్రలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా..?’’ అని ప్రశ్నించారు.
సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయాలని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా... సీమాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టులు ఎందుకు రాజీనామాలు చేయలేదని మంత్రి ఎదురు ప్రశ్నించారు.