సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో ఆర్టీసీనే కాదు.. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుంతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం రాబోయే రోజుల్లో పరిరక్షణ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ఖతం చేస్తే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. నిజాంను తరిమికొట్టిన తెలంగాణ గడ్డ ఇదని.. కేసీఆర్‌కు అదే గతి పడుతుందని పేర్కొన్నారు. ప్రజల హక్కులను హరించే వారిని ఈ గడ్డమీదే భూస్థాపితం చేయాలని కాళోజీ అన్నాడు. ఇప్పుడు ప్రజలు అదే చేయబోతున్నారని తెలిపారు. (చదవండి: ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు: కేసీఆర్)
అధికారం ఉందని అహంకారం..
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు డిపోల ముందే ఆందోళనలు చేశారు. కానీ ఇప్పుడు కనీసం డిపోల దగ్గరికి కూడా వెళ్లనివ్వట్లేదు అని మందకృష్ణ మండిపడ్డారు. కార్మికులు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంటే పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్మికులపై పోలీసుల వేధింపులకు నిరసనగా త్వరలోనే అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘చలో మంచిర్యాల’ను నిర్వహిస్తామని వెల్లడించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపుపై మందకృష్ణ స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ వందల కోట్లు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లోనూ గెలుస్తామనుకోవటం పొరపాటు అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మందకృష్ణ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment