మంత్రి ఇంటి ముట్టడికి వస్తున్న ఆర్టీసీ కార్మికులు, నాయకులు
సాక్షి, హన్మకొండ : ఇటు సమస్యలు పరిష్కరించకుండా.. అటు చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా స్పందించి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌చేస్తూ ప్రజాపతినిధుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా... అరెస్టులతో శాంతియుతంగానే ముగిసింది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు కనిపిస్తే అరెస్టు చేయాలన్న ఆదేశాలతో ఎక్కడికక్కడ కార్మికులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
విపక్షాలు, ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ ఇళ్లను ముట్టడించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పోలీసులు ఇక్కడే ప్రధానంగా దృష్టి సారించారు. హన్మకొండలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసినా కార్మికులు అటువైపు పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కార్మికుల్లోని ఓ వర్గం కెప్టెన్ ఇంటిని ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ముట్టడించడంతో పాటు డప్పులు మోగించారు.
హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి దయాకర్‌రావు ఇంటి ముందుకు వెళ్లకుండా రెండు వైపుల దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీతో పాటు, ఇతర పోలీసు బలగాలతో భారీ భద్రత కల్పించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హన్మకొండ డిపో నుంచి ర్యాలీగా మంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను నెట్టి వేస్తూ ముందుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ మేరకు నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
మాదిగ ఉద్యోగ సమాఖ్య అధ్వర్యంలో ఎంపీ లక్ష్మీకాంతరావు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు చావు డప్పు కొట్టారు. హంటర్ రోడ్డులోని రాజ్ హోటల్ నుంచి ర్యాలీగా కెప్టెన్ ఇంటి వద్దకు చేరుకుని ముట్టడించడంతో పాటు డప్పు కొడుతూ నినాదాలు చేశారు. అప్పటికే ఇక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు సుబేదారి సీఐ అజయ్‌కు సమాచారం ఇవ్వగా వాహనాలు, అదనపు బలగాలతో చేరుకుని కార్మికులు, కళాకారులను అరెస్టు చేసి, పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు.
హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు దశల వారీగా ముట్టడించారు. ముందుగా సీపీఎం, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఇంటి ముట్టడికి చేరుకోగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు.. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు వేర్వేరుగా రాగా పోలీసులు అంతే వేగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ జేఏసీతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులతోపాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
మంత్రి ఇంటి వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం
హసన్‌పర్తి: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇళ్లు ముట్టడికి ఆర్టీసీ జేఏసీ నాయకులు యత్నించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరుగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. హసన్‌పర్తి జేఏసీ చైర్మన్ పుట్ట రవిమాదిగ, కోకన్వీనర్ అనుమాండ్ల విద్యాసాగర్‌తో పాటు మారపెల్లి రామచంద్రారెడ్డి, బొక్క కుమార్, గొర్రె కిరణ్, కార్మికులు మేకల యుగేందర్, రాజేందర్, శీలం రమేష్, సురేందర్, అమరేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నరేందర్ ఇంటి వద్ద..
ఖిలా వరంగల్: కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, ఎంసీపీఐ నాయకుల ఆధ్వర్యాన పెరకవాడలోని ఎమ్మెల్యే నరేందర్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో గేటుకు వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. అప్పటికే బందోబస్తులో ఉన్న మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యాన వారిని ఆరెస్ట్ చేసి మిల్స్‌కాలనీ పోలీస్ స్ట్రేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment