సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేత దామోదర్ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. వీరికి మద్దతుగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబుకు పోటీగా ఒకశాతం అదనంగా ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కమిటీ వేశారు. మరి ఆ పని మీరెందుకు చేయడం లేదు’ అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కార్మికులు సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.
ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక్కడ కార్మికులు పోరాటం ప్రారంభించాక వారికి మద్దతుగా ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే, పోరాటంలో కార్మికులదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఫెడరేషన్ కూడా ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడించారు. త్వరలో అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో కలిసి ‘చలో తెలంగాణ కార్యక్రమం’ చేపడతామని ప్రకటించారు.
(చదవండి: 25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు)
సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం సంస్థకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. 25 రోజులుగా జరుగుతున్న సమ్మెలో 28 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు, సర్వీసులు కలిసే ఉన్నందున అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినట్టే ఇక్కడా చేయమంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పల్లె వెలుగు నష్టాలు ప్రభుత్వం భరించాలని... నష్టాన్ని భరించలేకపోతే సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment