Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం! | Zambia free education policy raises hope and suspicion | Sakshi
Sakshi News home page

Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!

Published Tue, Jul 16 2024 12:55 AM | Last Updated on Tue, Jul 16 2024 5:52 AM

Zambia free education policy raises hope and suspicion

జాంబియాలో ఉచిత విద్య 

భారీగా పెరిగిన విద్యార్థులు  

మౌలిక సదుపాయాలే సవాలు 

జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది.

 మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!

సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! 

జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! 

మంచి సమస్యే! 
ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్‌ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి!

 అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్‌ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. 

‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 

2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్‌ కూడా ప్రశంసిస్తోంది.  

చదువు అందని ద్రాక్షే 
ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్‌ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్‌ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement