రాష్ట్రంలో జాంబియా దేశ అత్యున్నత ప్రతినిధి బృందం పర్యటన
రాయలసీమలో పర్యటిస్తున్న బృందం సభ్యులు
రైతు సాధికార సంస్థ అధికారులతో సమావేశం
ఏపీ స్ఫూర్తితో జాంబియా దేశంలో అమలుకు సన్నాహాలు
త్వరలో జాంబియాలో పర్యటించనున్న రైతు సాధికార సంస్థ ప్రతినిధి బృందం
ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలపై అక్కడి మహిళా రైతులకు శిక్షణ
అంతర్జాతీయ సంస్థగా రైతు సాధికార సంస్థకి గుర్తింపు
సాక్షి, అమరావతి: రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. ఏపీ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అమలుచేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు 45 దేశాల ప్రతినిధులు పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం అమలుతీరు చాలా బాగుందని జాంబియా దేశ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. నిజానికి.. రాష్ట్రంలోని 10 లక్షల 35 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. 4,120 గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ కలిసి పనిచేస్తోంది. దీంతో.. ప్రపంచంలో విస్తృత స్థాయిలో ఆగ్రో ఎకాలజీ కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థగా గుర్తింపు పొందిన రైతుసాధికార సంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని పరిశీలించి తమ దేశంలో అమలుచేసేందుకు జాంబియా దేశ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈనెల 7న రాష్ట్రానికి చేరుకున్న ఆ దేశ అత్యున్నత ప్రతినిధి బృందం 21 వరకు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఏపీసీఎన్‌ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్) ప్రాజెక్టు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్, రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందడంతో పాటు క్షేత్రస్థాయిలో బృంద సభ్యులు లోతైన అధ్యయనం చేస్తున్నారు.
జాంబియా దేశంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలుచేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఈ బృందంలో జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖతోపాటు మరో రెండు సామాజిక సంస్థలైన కస్సీ వ్యవసాయ శిక్షణా కేంద్రం (కేఏటీసీ), వాల్పో నాస్కా శిక్షణా క్షేత్రం ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ఏపీసీఎన్‌ఎఫ్ ప్రాజెక్టు అమలుచేస్తున్న “లెర్నింగ్ బై డూయింగ్’ విధానంలో జాంబియా ప్రతినిధి బృందం రెండువారాల పాటు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలులో భాగస్వాములై అధ్యయనం చేస్తుంది.
ప్రపంచానికే ఏపీ ఆదర్శం..
ప్రకృతి వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకునే క్రమంలో భాగంగా జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ శనివారం రైతు సాధికార సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా జాంబియా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలో గడిచిన ఐదేళ్లుగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు.
తమ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున 2023లో ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఏపీలో పర్యటించిందని వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఏపీ రైతు సాధికార సంస్థ జాంబియాతో కలిసి పనిచేసేందుకు తొలి అడుగువేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.
జాంబియా బృందం పర్యటన ముగిసిన అనంతరం రైతు సాధికార సంస్థ తరఫున ఓ సీనియర్ సాంకేతిక బృందం జాంబియా దేశంలో పర్యటించి అక్కడ కాలానుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను సూచిస్తుంది. సామాజిక మార్పు కోసం పనిచేసే వంద మందికి పైగా భాగ్యస్వామ్యం కలిగిన ఎన్‌వోడబ్ల్యూ (నౌ) నెట్‌వర్క్ సహకారంతో ప్రకృతి వ్యవసాయ జ్ఞానాన్ని జాంబియా దేశానికి ఏపీ అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment