Zambia
-
Zambia: 400 కుక్కలు మృతి.. ప్రభుత్వం అప్రమత్తం
ఆఫ్రికా దేశమైన జాంబియాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న 400కు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి. జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన 25 నమూనాలలో ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు. ఈ ఫంగస్ అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవులకు, జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి ఎలిజా ముచిమా మాట్లాడుతూ జాంబియాలోని ప్రజలకు మొక్కజొన్న ప్రధాన ఆహారం. అందుకే ఇది ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే విష పదార్థం.జాంబియా ఆరోగ్య శాఖ తాజాగా కలుషితమైన మొక్కజొన్న పంటను గుర్తించి, దానిని నాశనం చేస్తోంది. దేశ జనాభాలో 60 శాతం మందికి మొక్కజొన్న ప్రధాన ఆహారం. ఇటీవలి కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడి మొక్కజొన్న పంటను దెబ్బతీయగా, ఇప్పుడు ఈ ఫంగస్ మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. -
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీలో ప్రకృతి వ్యవసాయం భేష్
సాక్షి, అమరావతి: రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. ఏపీ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అమలుచేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు 45 దేశాల ప్రతినిధులు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం అమలుతీరు చాలా బాగుందని జాంబియా దేశ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. నిజానికి.. రాష్ట్రంలోని 10 లక్షల 35 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. 4,120 గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ కలిసి పనిచేస్తోంది. దీంతో.. ప్రపంచంలో విస్తృత స్థాయిలో ఆగ్రో ఎకాలజీ కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థగా గుర్తింపు పొందిన రైతుసాధికార సంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని పరిశీలించి తమ దేశంలో అమలుచేసేందుకు జాంబియా దేశ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈనెల 7న రాష్ట్రానికి చేరుకున్న ఆ దేశ అత్యున్నత ప్రతినిధి బృందం 21 వరకు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్) ప్రాజెక్టు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్, రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందడంతో పాటు క్షేత్రస్థాయిలో బృంద సభ్యులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. జాంబియా దేశంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలుచేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఈ బృందంలో జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖతోపాటు మరో రెండు సామాజిక సంస్థలైన కస్సీ వ్యవసాయ శిక్షణా కేంద్రం (కేఏటీసీ), వాల్పో నాస్కా శిక్షణా క్షేత్రం ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు అమలుచేస్తున్న “లెర్నింగ్ బై డూయింగ్’ విధానంలో జాంబియా ప్రతినిధి బృందం రెండువారాల పాటు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలులో భాగస్వాములై అధ్యయనం చేస్తుంది.ప్రపంచానికే ఏపీ ఆదర్శం..ప్రకృతి వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకునే క్రమంలో భాగంగా జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ శనివారం రైతు సాధికార సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా జాంబియా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలో గడిచిన ఐదేళ్లుగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. తమ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున 2023లో ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఏపీలో పర్యటించిందని వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఏపీ రైతు సాధికార సంస్థ జాంబియాతో కలిసి పనిచేసేందుకు తొలి అడుగువేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. జాంబియా బృందం పర్యటన ముగిసిన అనంతరం రైతు సాధికార సంస్థ తరఫున ఓ సీనియర్ సాంకేతిక బృందం జాంబియా దేశంలో పర్యటించి అక్కడ కాలానుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను సూచిస్తుంది. సామాజిక మార్పు కోసం పనిచేసే వంద మందికి పైగా భాగ్యస్వామ్యం కలిగిన ఎన్‌వోడబ్ల్యూ (నౌ) నెట్వర్క్ సహకారంతో ప్రకృతి వ్యవసాయ జ్ఞానాన్ని జాంబియా దేశానికి ఏపీ అందించనుంది. -
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్‌ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. -
జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలల మూసివేత!
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు. -
అత్యంత పురాతన కలప వస్తువు!
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కలప వస్తువును పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రెండు కలప దుంగలను చెక్కి, రెండింటినీ ఒకదానికొకటి అనుసంధానం చేసి తయారు చేసిన ఈ వస్తువు నాగలిలాగానే కనిపిస్తోంది. జాంబియాలోని కలాంబో జలపాతం దిగువన ఇటీవల తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇది బయటపడింది. ఈ వస్తువులోని రెండు కలప దుంగలనూ పదునైన పరికరాలతో చెక్కిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇది దాదాపు 4.76 లక్షల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిబట్టి ఆ కాలంలోనే మనుషులకు కలప వస్తువులను తయారు చేసే నైపుణ్యం ఉందని తెలుస్తోందని చెబుతున్నారు. ఇది రాతియుగం తొలినాళ్లకు చెందినదని, అప్పట్లోనే మనుషులు పనిముట్లను తయారు చేసుకునే వారని చెప్పేందుకు ఇది తిరుగులేని ఆధారమని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన లివర్‌పూల్ వర్సిటీ ప్రొఫెసర్ ల్యారీ బర్హామ్ తెలిపారు. ఈ వస్తువు కాలాన్ని నిర్ధారించిన పద్ధతులను, వాటి వివరాలను ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించారు. (చదవండి: అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు) -
ఈ గాలి.. ఈ నేల... బాల్య స్మృతుల్లో కమలా హ్యారిస్
లుసాకా: అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ జాంబియా వెళ్లి తన బాల్య స్మృతుల్లో మునిగిపోయారు. తన తాత, భారత్‌కు చెందిన పి.వి.గోపాలన్ ఇంట్లో చిన్నప్పుడు వారితో గడిపిన రోజుల్ని గుర్తు చేస్తుకున్నారు. 1960 దశకంలో కమల హ్యారిస్ తాత చెన్నై నుంచి జాంబియా రాజధాని లుసాకా వెళ్లి అక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీసు అధికారిగా సేవలందించారు. అప్పట్లో తాము నివసించిన ఇల్లు ఇప్పుడు లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్లిన కమల అక్కడ మట్టి పరిమళాన్ని ఆస్వాదించారు. ‘‘నా చిన్నతనంలో మా తాతయ్యతో గడిపిన రోజులు నాకెంతో విలువైనవి. ఈ ప్రాంతంలో నా బాల్యం గడిచింది. ఇప్పుడు మళ్లీ అక్కడే ఉన్నానన్న ఊహ ఎంతో మధురంగా ఉంది.బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక ఉద్వేగాన్ని ఇస్తాయి. ఇక్కడ్నుంచి మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికీ హాయ్ చెబుతున్నాను’’ అని అంటూ కమలా హ్యారిస్ ఉద్విగ్నతకు లోనయ్యారు. -
కిలోన్నర బరువైన మరకతం!
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం (ఎమరాల్డ్) ఆఫ్రికాలోని జాంబియా దేశంలో బయటపడింది. జాంబియాలోని కాగెం గనిలో మానస్ బెనర్జీ, రిచర్డ్ కెప్టా నేతృత్వంలోని బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది. దీని బరువు ఏకంగా 7,525 క్యారట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మరకతం పైభాగాన ఉబ్బెత్తుగా ఉండటంతో దీనికి ‘చిపెంబెలె’ (జాంబియాలోని బెంబా ప్రజల భాషలో ఖడ్గమృగం అని అర్థం) అని పేరు పెట్టారు. గతంలోనూ ఇదే గనిలో కొన్ని భారీ మరకతాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. 2010లో 6,225 క్యారట్ల (1.245 కేజీలు) బరువుగల మరకతం (ఇన్సోఫు – అంటే ఏనుగు అని అర్థం) లభ్యమవగా 2018లో 5,655 క్యారట్ల (1.131 కేజీలు) బరువుగల మరో మరకతం (ఇన్కాలమమ్ – అంటే సింహం అని అర్థం) దొరికింది. -
చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ
ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే... వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేదే.. జాంబియాలోని నేషనల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా.. -
Viral: లైవ్‌లో న్యూస్‌రీడర్ గోస
శనివారం సాయంత్రం వార్తలు. కేబీఎన్ ఛానెల్లో న్యూస్ ప్రోగ్రామ్. ఎప్పటిలాగే బులిటెన్ చదివుతున్నాడు యాంకర్ కమ్ న్యూస్‌రీడర్ కబిందా కలిమీనియా. హెడ్‌లైన్స్ పూర్తయ్యాయి. ఇక మెయిన్ వార్తల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆగిపోయాడు. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్.. వార్తల మధ్య నుంచి వైదొలుగుతున్నందుకు మన్నించాలి. మేమూ మనుషులమే. మాకు జీతాలు అందాలి కదా’’ అంటూ నిట్టూర్పు విడిచాడు. ‘‘బాధాకరమైన విషయం ఏంటంటే.. షరోన్, ప్రతీ ఒక్కరూ, నాతోసహా ఇక్కడున్న చాలామందిలో ఎవరికీ జీతాలు ఇవ్వట్లేదు’’ అని మాట్లాడుతుండగానే.. లైవ్‌ను అర్థాంతరంగా కట్ చేశారు. జాంబియాలో ఓ న్యూస్ ఛానెల్ లైవ్‌లో జరిగిన ఈ వ్యవహారం అక్కడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఛానెల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాంకర్ తీరును కేబీఎన్ టీవీ సీఈవో కెన్నెడీ మాంబ్వే తప్పుబట్టాడు. ‘‘ఆ యాంకర్ తప్పతాగి డ్యూటీకి వచ్చాడు, సహించేది లేదు, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’’ అని కేబీఎన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే కలిమీనియా మాత్రం తానేం తాగి లేనని చెబుతున్నాడు. నేను ఒకవేళ తాగి ఉంటే.. అదేరోజు అప్పటికే మూడు షోలను ఎలా నిర్వహించి ఉంటా? అబద్ధాలకైనా ఓ హద్దుండాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు కలిమినియా. చాలా రోజుల నుంచి మాకు జీతాల్లేవ్. మాలో చాలా మంది ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారు. ఆ భయం నాలో చచ్చిపోయింది. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. అందుకే లైవ్‌లోనే నిలదీశా అని చెబుతున్నాడు కలిమీనియా. ప్రస్తుతం ఈ ఫ్రస్టేషన్ జర్నలిస్ట్ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: అందగత్తె తొడలపై జూమ్, ఆపై.. -
ఆఫ్రికా గర్వించదగ్గ దిగ్గజం కౌండా
జూన్ 17 నాడు మరణించిన జాంబియా మాజీ అధ్యక్షుడు కెనెత్ కౌండా ఇరవయ్యో శతాబ్దపు ఆఫ్రికా జాతీయవాద గొప్ప నాయకుల్లో చివరివాడు. మూడు దశాబ్దాల పాటు ఆఫ్రికాలోనూ, ప్రపంచ పటంలోనూ జాంబియాకు విశిష్ట స్థానం సంపా దించిపెట్టిన కౌండా 97 ఏళ్ల వయ సులో మరణించారు. 27 ఏళ్లపాటు జాంబియాను పాలిం చిన కౌండా కీర్తికి రెండు పార్శా్వలున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత శాంతియుతంగా పదవి నుంచి తప్పుకున్న కాండా దేశంలో ఏక పార్టీ విధానానికి ఆద్యుడు. ఆఫ్రికా సామ్యవా దానికి మార్గదర్శిగా నిలిచిన వాడే నిరసనను అణచివేశాడు.అయితే ‘కెకె’గా ప్రసిద్ధుడైన కౌండా దయాళువైన రాజు అనిపించుకున్నారు. సఫారీ సూట్లు ధరించడం, తెల్ల కర్చీఫు లను ఊపడం, బాల్రూమ్ డ్యాన్సులు చేయడం, సైకిల్ తొక్కుతూ తనే రాసిన పాటలు పాడటం, బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి చేష్టలతో ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించారు. కెన్నెత్ డేవిడ్ కౌండా అక్టోబర్ 14, 1924న ఉత్తర జాంబియాలో జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఒకడు. నాన్న మిషనరీ టీచర్. తల్లి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ అర్హత పొందిన మహిళ. తల్లిదండ్రుల బాట లోనే మొదట కాండా కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. టాంజానియాలోనూ కొంతకాలం అదే వృత్తిలో కొన సాగారు. అప్పుడే టాంజానియాకు మున్ముందు అధ్యక్షుడు కానున్న జూలియస్ నైరీరి పట్ల ఆరాధన పెంచుకున్నారు. ఆయన ప్రవచించిన ‘ఉజ్మా’ తరహా సామ్యవాదాన్ని (సహ కార ఆర్థికవ్యవస్థ) అనుసరించడానికి ప్రయత్నించారు. టాంజానియా నుంచి తిరిగివచ్చాక, శ్వేతజాతి సెటి లర్స్‌కు మరింత ప్రాబల్యం పెరిగేలా దక్షిణ రొడీషియా, ఉత్తర రొడీషియా, న్యాసాలాండ్‌తో కలిపి సమాఖ్య ఏర్పాటు తలపెట్టిన బ్రిటిష్‌వారి పథకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే కారణంగా తొమ్మిది నెలలపాటు జైలుకు వెళ్లారు. తిరిగి వచ్చాక పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమై ఉత్తర రొడీషియా ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. అయితే, బ్రిటిష్ వారితో మితవాద వైఖరితో ఉన్న ఆ పార్టీ నాయకుడు హారీ కుంబులాతో విభేదించి, జాంబియన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో చీలిపోయారు. సహ జంగానే ఇది నిషేధానికి గురైంది. కౌండా మరో తొమ్మిది నెలలు జైలుకు వెళ్లారు. ఇది మరింతగా ఆయనకు ప్రజా దరణ పెంచింది. కొత్త ఉద్యమంగా పెల్లుబికిన యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ తమ నాయకుడిగా కౌండాను ఎన్ను కుంది. అనంతరం కౌండా అమెరికా వెళ్లి మార్టిన్ లూథర్ కింగ్‌ను కలిశారు. మహాత్మా గాంధీ, లూథర్ కింగ్ భావాల స్ఫూర్తితో ‘చా–చా–చా’ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. 1964లో స్వాతంత్య్రం పొందిన తర్వాత జాంబియాకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, స్వతంత్ర దేశంలో తొలి సవాల్ విద్యరూపంలో ఎదురొ చ్చింది. దేశంలో ఒక్క విశ్వవిద్యాలయం లేదు, ప్రాథమిక స్థాయి విద్యను పూర్తిచేసినవాళ్లు సగం శాతం లేరు. దాంతో ఉచిత పుస్తకాల పంపిణీ, అత్యల్ప ఫీజు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఆఫ్రికా మానవవాదం పేరుతో తన ఆర్థిక విధానాలను రూపొందించారు. విదేశీయులు యజమానులుగా ఉన్న కంపెనీల్లో 51 శాతం వాటా దేశానికే ఉండేట్టు చేశారు. అయితే ఈ విధానానికి 1973లో గట్టిదెబ్బ తగిలింది. అనూ హ్యంగా పెరిగన చమురు ధర, దేశ ఎగు మతుల్లో 95 శాతం వాటా ఆక్రమించిన రాగి ధరలో తగ్గుదల దేశాన్ని కుదిపే సింది. స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే ప్రపంచంలోనే అత్యధిక అప్పుల ఊబిలో కూరుకు పోయిన రెండో దేశంగా మిగిలింది. అనంతర కాలంలో ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రవేశానికి దారితీసింది. వారి షరతులకు తలొగ్గేట్టు చేసింది. దాంతో ప్రైవేటీకరణ పెరిగింది, ఆహార సబ్సిడీ నిలిచిపోయింది, ధరలు పెరిగాయి. క్రమంగా కౌండా ప్రజాదరణ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అయితే చాలామంది వలసవాద వ్యతిరేక నాయకుల్లాగే కౌండా కూడా బహు పార్టీ విధానాన్ని పాశ్చాత్య భావనగా చూశారు. అదే ఘర్షణలకు, గ్రూపులకు దారితీస్తుందని తలచారు. 1968లో యూఎన్ఐపీ మినహా అన్ని పార్టీలను నిషేధించారు. ఆయన ప్రభుత్వం క్రమంగా నిరంకుశంగా, నిరసన పట్ల అసహనంగా, తన వ్యక్తిత్వమే అన్నింటికీ కేంద్రంగా తయారైంది. అయితే చాలామంది నిరంకుశ, ఏక పార్టీ నేతలతో పోల్చితే అణచివేత, అవినీతి విషయాల్లో కౌండా మెరుగైన నాయకుడు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యా రెండింటిలో దేనితోనూ చేరక అలీన విధా నాన్ని పాటించారు. 1985లో పదవీ విరమణ చేసిన జూలియస్ నైరీరి తన స్నేహితుడిని కూడా రాజకీయాల్లో నుంచి తప్పుకొమ్మని కోరారు. కానీ కౌండా భీష్మించారు. అప్పటికే ధరలు ఆకాశా న్నంటాయి. 1990లో రేగిన తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొన్నాక, ఆహార అల్లర్లు చెలరేగాక బహు పార్టీ ఎన్ని కల విధానానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. భూమ్మీదే స్వర్గాన్ని సృష్టిస్తానన్న మహర్షి మహేశ్ యోగికి దేశంలో దాదాపు పావు వంతు భూభాగాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించిన ఆయన ప్రణాళిక కూడా ప్రజాదరణ పెంచలేక పోయింది. దాంతో 1991లో జరిగిన ఎన్నికల్లో ట్రేడ్ యూని యన్ నాయకుడు ఫ్రెడెరిక్ చిలూబా భారీ విజయం సాధించారు. ఎన్నికల్లో అపజయాన్ని కాండా హుందాగానే స్వీక రించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఆయన పట్ల ఉదారత ఏమీ చూపలేదు. తిరుగుబాటు ఆరోపణ మీద ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. 1996లో ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనను దేశంలేని వాడిగా ప్రకటించింది(వాళ్ల నాన్న మలావీలో పుట్టాడన్న కారణం చూపి). అయితే ఆయన కోర్టుకు వెళ్లి నెగ్గారు. 1997లో జరిగిన హత్యాయత్నంలో బుల్లెట్ తగిలినా క్షేమంగా బయటపడ్డారు కౌండా. వాళ్ల కుమారుడిని మాత్రం 1999లో ఇంటి బయట కాల్చి చంపారు. 1986లో ఎయి డ్స్‌తో మరణించిన మరో కుమారుడి కారణంగా హెచ్ఐవీ సమస్యలకు స్పందించి, దానికి తొలినాళ్లలోనే ప్రచారం చేయడం ఆరంభించిన ఆఫ్రికా నేత అయ్యారు. గొప్ప ఆఫ్రికా జాతీయవాదిగా, విప్లవాలకు ఆశ్రయం ఇచ్చిన విప్లవకారునిగానే కాక అసమ్మతితోనే అయినా జాంబియాకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన నేతగా కౌండా గుర్తుండి పోతారు. వ్యాసకర్త లెక్చరర్ లండన్ విశ్వవిద్యాలయం -
జాంబియా తొలి అధ్యక్షుడు కన్నుమూత
లుసాకా: జాంబియా దేశపు తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా కన్నుమూశారు. తన 97వ ఏట అనారోగ్యం కారణంగా గురువారం మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని దేశ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు తన ఫేస్బుక్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. జాంబియా వ్యాప్తంగా 21 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కౌండా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కౌండా గౌరవించదగ్గ ప్రపంచనాయకుడని, రాజకీయనాయకుడని కొనియాడారు. కౌండా మరణంపై ఆయన కుమారుడు కమరంగే కౌండా ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్నను కోల్పోయామని చెప్పటానికి నేను చింతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు..
ప్రేమ కథలన్నీ పెళ్లి పీటలెక్కవు, కొందరి ప్రేమ మాత్రమే పెళ్లి బంధం వరకు రాగలుగుతుంది. ఓ అమ్మాయి కూడా తన ప్రేమ పెళ్లితో మరింత బలపడాలని కలలు కంది. ఇద్దరి గుర్తుగా ఓ బిడ్డను కూడా కంది. కానీ ఎనిమిదేళ్లవుతున్నా ప్రియుడి నోటి వెంట ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుందాం అన్న మాట రాలేదు. దీంతో ఓపిక నశించిన ఆ యువతి పెళ్లంటే ముఖం చాటేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌పై ఏకంగా కోర్టులో దావా వేసింది. ఈ ఘటన జాంబియా దేశంలో చోటు చేసుకుంది. గెర్టూడ్ నోమా(26), హెర్బర్ట్ సలాలికి(28) ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఈ సందర్భంగా మహిళ తల్లిదండ్రులు అతడికి వరకట్నం ఇచ్చారు. ఎనిమిదేళ్ల అనుబంధంలో అతడు ఒక్కసారి కూడా పెళ్లి ఊసెత్తలేదు. (చదవండి: 2020లో మోత మోగిన పాపులర్ ట్వీట్స్ ఇవే!) దీంతో విసుగు చెందిన యువతి ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని కోర్టుకెక్కింది. "అతడు దేన్నీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో నా వేలికి ఉంగరం తొడుగుతానని మాటిచ్చాడు. కానీ అది ఇంతవరకు జరగలేదు. ఇంతకాలం తన సమయాన్ని వృధా చేశాడు. చూస్తుంటే అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనన్న అనుమానం వస్తోంది. అందుకే నా భవిష్యత్తు ఏంటో తెలుసుకునేందుకు అతడిని కోర్టుకీడ్చాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రియుడు సలాలికి మాట్లాడుతూ ఆవిడే తనను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇద్దరి మాటలు విన్న న్యాయమూర్తి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడివరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. దీన్ని కోర్టు బయటే పరిష్కరించుకొమ్మని సూచించారు. అయితే సదరు ప్రియుడికి కుటుంబాన్ని పోషించే స్థోమత లేనందువల్లే పెళ్లికి వెనకడుగు వేస్తున్నాడట. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’) -
కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం
జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంవత్సరంలో మొదటిరోజు ఎంచుకున్నారు అమీ జాక్సన్. తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పణాయిట్టోతో జనవరి ఫస్ట్ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారీ బ్రిటీష్ బ్యూటీ. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జార్జ్, అమీ 2015 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ... అలాంటిదేం లేదని చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అమీ జాక్సన్. గతేడాది వేలంటేన్స్ డే రోజు జార్జ్‌ను ప్రేమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్స్‌లోనూ, పార్టీల్లోనూ తరచుగా కలుస్తూ, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ క్రిస్మస్ పార్టీని కూడా అరేంజ్ చేశారు. న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా జాంబియా వెళ్లింది ఈ జంట. అక్కడే ఈ ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ‘‘మా జీవితాల్లో సరికొత్త సాహస యాత్రను మొదలుపెట్టాం. ఐ లవ్ యూ జార్జ్. నన్నీ ప్రపంచంలోనే ఆనందమైన అమ్మాయిని చేసినందుకు థ్యాంక్స్’’ అని ఈ ఫొటోను పోస్ట్ చేశారు. త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారట అమీ, జార్జ్. -
అరుదు : మొసలిని చంపి తిన్న చిరుత
లుసాకా : ఆఫ్రికాలోని కీకారణ్యాల గురించి తెలియని వారుండరు. రకరకాల జంతువులకు ఆవాసం ఆఫ్రికా అడవులు. నిత్యం సాగే జీవన పోరాటాల్లో ఒక జీవిని మరో జీవి చంపడం కూడా అక్కడ పరిపాటే. కానీ, తూర్పు ఆఫ్రికాలోని జాంబియా దేశ అడవిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నీటి కోసం మడుగు దగ్గరకు వెళ్లిన ఓ చిరుత ఒడ్డున సేదదీరుతున్న మొసలిని వేటాడింది. ఇలా మొసళ్లను ఓ జంతువు వేటాడటం చాలా అరుదని పదేళ్లుగా జాంబియా అడవుల్లో సంచరిస్తూ జంతువుల కదలికలను నిశితంగా గమనిస్తున్న ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ఏదైనా జంతువు నీటి దగ్గరకు వచ్చినప్పుడు మొసళ్లన్నీ జాగ్రత్త పడతాయని వెల్లడించారు. ఈ మొసలి ఆదమరిచి ఉండి ఉంటుందని చెప్పారు. రెండు అడుగులు పొడవున్న మొసలిని వేటాడిన తర్వాత చిరుత ఫొటోలను ఆయన సోషల్‌మీడయాలో షేర్ చేశారు. -
జాంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం
లుసాక: డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడు నిండు ప్రాణాలు బలైన సంఘటన జాంబియాలోని లుసాకలో సోమవారం చోటుచేసుకుంది. రాజధాని పట్టణం లుసాక నుంచి 65 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు కపిరి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 51 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచాన్ని అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు బోల్తాకొట్టిందని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా బస్సును నడిపి ఏడుగురి మరణానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఖతర్నాక్ కొలను..
ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన సహజసిద్ధ ఈతకొలను. పేరు డెవిల్స్ పూల్. జాంబియాలోని ప్రఖ్యాత విక్టోరియా జలపాతాన్ని అనుకునే ఇది ఉంటుంది. జలపాతం అంచున కొంచెం లోతుగా ఉండటంతో అక్కడ సహజసిద్ధమైన ఈతకొలను ఏర్పడింది. ఈ స్విమ్మింగ్ పూల్‌లో అడుగు పెట్టాలంటే.. ధైర్యం కావాల్సిందే. అన్ని సమయాల్లో ఇందులో దిగుదామంటే కుదరదు.. ఎండాకాలం టైమ్‌లో నీళ్లు తక్కువుంటాయి కాబట్టి దిగొచ్చు. ఆ సమయంలో నీటి ఉధృతి తక్కువగా ఉంటుంది. చుట్టూ స్విమ్మింగ్ పూల్ తరహాలో అంచు ఉండటంతో కొంచెం వరకూ పరవాలేదు. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే.. నీటి ఉధృతికి ఆ అంచు కూడా మనల్ని కాపాడలేదు. కొట్టుకుపోవడమే. నీళ్లు తక్కువున్నప్పుడు మాత్రం అత్యంత అద్భుతమైన అనుభూతిని మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ అంచు వద్దకు వెళ్లిచూస్తే.. 355 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడుతున్న దృశ్యం మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది.