ఖతర్నాక్ కొలను..
ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన సహజసిద్ధ ఈతకొలను. పేరు డెవిల్స్ పూల్. జాంబియాలోని ప్రఖ్యాత విక్టోరియా జలపాతాన్ని అనుకునే ఇది ఉంటుంది. జలపాతం అంచున కొంచెం లోతుగా ఉండటంతో అక్కడ సహజసిద్ధమైన ఈతకొలను ఏర్పడింది. ఈ స్విమ్మింగ్ పూల్‌లో అడుగు పెట్టాలంటే.. ధైర్యం కావాల్సిందే. అన్ని సమయాల్లో ఇందులో దిగుదామంటే కుదరదు.. ఎండాకాలం టైమ్‌లో నీళ్లు తక్కువుంటాయి కాబట్టి దిగొచ్చు. ఆ సమయంలో నీటి ఉధృతి తక్కువగా ఉంటుంది. చుట్టూ స్విమ్మింగ్ పూల్ తరహాలో అంచు ఉండటంతో కొంచెం వరకూ పరవాలేదు.
నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే.. నీటి ఉధృతికి ఆ అంచు కూడా మనల్ని కాపాడలేదు. కొట్టుకుపోవడమే. నీళ్లు తక్కువున్నప్పుడు మాత్రం అత్యంత అద్భుతమైన అనుభూతిని మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ అంచు వద్దకు వెళ్లిచూస్తే.. 355 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడుతున్న దృశ్యం మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది.