ఆఫ్రికా దేశమైన జాంబియాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న 400కు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి. జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.
నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన 25 నమూనాలలో ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు. ఈ ఫంగస్ అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవులకు, జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి ఎలిజా ముచిమా మాట్లాడుతూ జాంబియాలోని ప్రజలకు మొక్కజొన్న ప్రధాన ఆహారం. అందుకే ఇది ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే విష పదార్థం.
జాంబియా ఆరోగ్య శాఖ తాజాగా కలుషితమైన మొక్కజొన్న పంటను గుర్తించి, దానిని నాశనం చేస్తోంది. దేశ జనాభాలో 60 శాతం మందికి మొక్కజొన్న ప్రధాన ఆహారం. ఇటీవలి కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడి మొక్కజొన్న పంటను దెబ్బతీయగా, ఇప్పుడు ఈ ఫంగస్ మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment