ఫోర్టిఫైడ్‌ బియ్యంతో ‘ఆరోగ్యం’  | Health with Fortified Rice | Sakshi
Sakshi News home page

ఫోర్డిఫైడ్‌ బియ్యంతో ‘ఆరోగ్యం’ 

Published Fri, Oct 27 2023 6:11 AM | Last Updated on Fri, Oct 27 2023 9:05 AM

Health with Fortified Rice - Sakshi

సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్‌షాప్‌ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. 

అవసరాలకు తగ్గట్టు  విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం  ఫోర్టిఫైడ్‌ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్‌ పథకాలకు ఫోర్టిఫైడ్‌ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్‌/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు.

పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్‌ రైస్‌ నాణ్యత నిర్వహణ  వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్‌ టెస్టింగ్‌ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్‌హెచ్‌.లలన్‌ ప్రసాద్‌ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతు­న్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రా­రంభించిన ఫోర్టిఫైడ్‌  రైస్‌ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నా­టికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్‌  బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు.

మెక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ సంస్థ (ఎంఎస్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఎంఎస్‌సీ సహవ్యవస్థాపకుడు కుంజ్‌ బిహారీ, ఢిల్లీ ఎ­యి­మ్స్‌ వైద్యుడు తేజస్‌ ఆచారీ, ఆహార భద్రత–ప్ర­మాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్‌ అండ్‌ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్‌ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలం­గాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement