Fortified Rice
-
మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్ రైస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్లో ని లోథాల్లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎంహెచ్సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్ 1ఎ’లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్‌ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్‌పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్‌షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్‌హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
ఎఫ్‌సీఐ ఇలా చేస్తే కష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది. గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్‌సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్‌సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్‌సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అప్పటికప్పుడు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
ఫోర్టిఫైడ్ రైస్.. బియ్యానికి బలం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల్లో రక్తహీనత సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు మైదాన ప్రాంతాల్లోని పేదలు, పాఠశాల విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల సంభవించే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకాలతోపాటు దేశంలోని 151 జిల్లాల్లో గతేడాది ఏప్రిల్ నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తోంది. అందులో తెలంగాణలోని ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతోపాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాల్లోనూ పీడీఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌నే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో కలపడం వల్ల వచ్చేవే బలవర్థక బియ్యం. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారు.. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారీ ఇలా... ►98 శాతం బియ్యపు పిండికి 2 శాతం ఖనిజాలను కలిపి హాట్ ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీ ద్వారా 90 డిగ్రీలకన్నా తక్కువ వేడిలో జెలటనైజేషన్ (జెల్గా తయారు) చేసి దాన్ని బియ్యం ఆకారంలోకి మారిస్తే వచ్చేవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. 10 గ్రాముల ఎఫ్ఆర్కే కోసం 28 మిల్లీగ్రాముల నుంచి 48 మిల్లీగ్రాముల ఐర¯Œ 75 మైక్రో గ్రాముల నుంచి 125 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ (బీ–9 విటమిన్), 0.75 మైక్రో గ్రాముల నుంచి 1.25 మైక్రో గ్రాముల బీ–12 విటమిన్ (కొబాలమైన్ )ను కలుపుతారు. ఈ నిష్పత్తిలో కలిపే ఖనిజాలు, విటమిన్లతో కుర్కురే వంటి తినుబండారాలు తయారు చేసే తరహాలో ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం అచ్చుల్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారు చేస్తారు. బలవర్థక బియ్యం కలిపే తీరిదీ... ►సాధారణ బియ్యానికి 1:100 నిష్పత్తిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను మిల్లుల్లో కలుపుతారు. అంటే క్వింటాలు బియ్యానికి కిలో ఎఫ్ఆర్కే కలుపుతారన్నమాట. సాధారణ బియ్యం తరహాలోనే ఉండే ఈ ఎఫ్ఆర్కే బియ్యంలో కలిసిపోతాయి. వండిన అన్నం తరహాలోనే... ►ఎఫ్ఆర్కేతో కూడిన బియ్యాన్ని వండినప్పుడు వాటి పోషకాలు ఆవిరవ్వడం, అన్నం వార్చినప్పుడు గంజితో కలిసి బయటకు పోవడం జరగదని పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ రైస్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న బాలగంగాధర్ తిలక్ చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు పోయినా 10 శాతం లోపేనని, మిగతా 90 శాతం అన్నంతోపాటే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వండాలని కేంద్రం సూచిస్తోందన్నారు. రాష్ట్రంలో 7 యూనిట్లు... ►ఎఫ్ఆర్కే తయారు చేసే యూనిట్లు ఎక్కువగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లలో ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, ములుగు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి. మనకు కొత్తేం కాదు... ►మనం నిత్యం ఆహారంలో వినియోగించే పలు పదార్థాలు ఫోర్టి ఫైడ్ విధానంలో రూపొందినవే. నిత్యం వాడే ప్యాకెట్ పాలతోపాటు అయోడిన్గల ఉప్పు, గోధుమపిండి, వంట నూనె ఫోర్టిఫైడ్ విధానంలో ఖనిజాలు, విటమిన్లను కలిపి తయారు చేస్తారు. ఈ నాలుగింటితోపాటు ఇప్పుడు దేశంలో వినియోగించే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ విధానంలోనే తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 30 దేశాల్లో... ►మన దేశంలో గతేడాది నుంచి ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగంలోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన బియ్యాన్ని వాడుతున్నారు. అమెరికాలో 2019లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. కోస్టారికా, నికరగ్వా, పనామా, పాపువా న్యూగినియా, సోలొమన్ దీవులు, ఫిలిప్పీన్స్లలో బలవర్థక బియ్యం వాడకం తప్పనిసరి. అలాగే మరికొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు కిర్గిస్తాన్, లావోస్, నేపాల్‌లలోనూ ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగిస్తున్నారు. -
తల్లికి ‘సంపూర్ణ’ పోషణ.. ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం
కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల అందిస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్ జగన్ సర్కార్ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. (చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!) పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు అనుగుణంగా.. ఫోర్టిఫైడ్ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్ ఏ, విటమిన్ బీ 12, ఫొలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల మేరకు జగన్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. (చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు) రక్తహీనతను తగ్గిస్తుంది ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
మరో 8 ఎల్ఎంటీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ (పౌష్టికాహార ఉప్పుడు బియ్యం)ను సెంట్రల్ పూల్‌కు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. కేంద్రం గతంలో సెంట్రల్ పూల్ కింద తీసుకునేందుకు అంగీకరించిన 6.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్‌కు ఇది అదనం. దీంతో పాటు తడిసిన యాసంగి ధాన్యానికి సంబంధించి 3 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు 2 రోజుల కిందట కేంద్రం అంగీకరించింది. అంటే ఈ యాసంగి సీజన్ కు సంబంధించి మొత్తం 17.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించనుందన్న మాట. రాష్ట్ర రైతులు ఇబ్బంది పడకూడదనే సేకరణ తెలంగాణ నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది: మంత్రి గంగుల ‘యాసంగి ధాన్యం మిల్లింగ్ విషయంలో సమస్యను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కేంద్రం స్పందించింది. 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది.’ మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: బండి సంజయ్ ‘రాష్ట్రం నుంచి 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేక రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ప్రధానికి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు.’ -
ఫోర్టిఫైడ్ రైస్‌గా తడిసిన ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రైస్‌మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్ బియ్యంగా ఫోర్టిఫైడ్ రైస్‌నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ రైస్‌గా 5 ఎల్ఎంటీ... రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో గత మూడు సీజన్లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ మూడు సీజన్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోసం.. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫోర్టిఫైడ్ బియ్యంగా సెంట్రల్ పూల్‌కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 34 ఎల్ఎంటీ ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్ మిల్లింగ్ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ రైస్ కోసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది -
అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు
కమలాపురం: ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన ఆహారం అని, అవగాహన రాహిత్యంతోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రెండు వారాలుగా ఫోర్టిఫైడ్ బియ్యంపై జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరదించడం కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి అర్జున్ రావ్ అధ్యక్షతన శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పెండ్లిమర్రి మండలం, రేపల్లెలో గడపగడపకు వెళితే ఒకే ఓ మహిళ ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చిందని, అవి ప్లాస్టిక్ కాదు ఫోర్టిఫైడ్ బియ్యం అని వివరంగా చెప్పగా ఆమె అర్థం చేసుకుందన్నారు. అయితే టీడీపీ నాయకులకు నిరక్షరాస్యులైన మహిళలకు ఉన్నంత అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. అవగాహన రాహిత్యంతోనే వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన అని నిరూపించడం కోసమే ఇంత మంది అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. తర్వాత కూడా ప్లాస్టిక్ బియ్యం అని ఎవరైనా చెబితే వారిపై సివిల్సప్లై అధికారులు కేసులు నమోదు చేస్తారన్నారు. ప్రజల్లో ఉన్న రక్తహీనతను నివారించడానికే ప్రధాన మంత్రి దేశమంతా ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ బియ్యం తయారు చేయాలంటే టన్నుకు రూ.57వేలు ఖర్చు అవుతుందని, అయినా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి అన్ని రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో రెండేళ్లు గడువున్నా ఇప్పుడే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి:సీకేదిన్నె జెడ్పీటీసీ సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రలు చేసే ప్రతి పక్ష నాయకులు ప్రజలను చైతన్య పరచాలే గాని తప్పుదోవ పట్టించరాదన్నారు.ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అని ప్రజల్లో అపోహలు సృష్టించిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి జిల్లాలోని 5.40లక్షల రేషన్ కార్డుదారులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి,అపోహలు తొలగించడానికి వచ్చిన శాస్త్రవేత్తలు,ప్రొఫెసర్లకు కృతజ్ఞతలైనా చెప్పాలన్నారు. వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రెండు వారాలుగా ఫోర్టిఫైడ్ బియ్యంపై నియోజకరవ్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. వాటిని తెరదించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షమీమ్ బస్ట్, వర్థిరెడ్డి రోజా రాణి, సుబ్బారెడి మాట్లాడారు. భోజనం చేసిన ఎమ్మెల్యే: సదస్సు ప్రాంగణంలోనే పోర్టిఫైడ్ బియ్యంతో చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిన్నారు. ఇది బలవర్ధకమైన ఆహారం అని నిరూపించారు. జారుకున్న టీడీపీ నాయకులు ఫోర్టిఫైడ్ బియ్యంపై కమలాపురం టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తదితర నాయకులు రెండువారాలుగా రాద్ధాంతం చేశారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. అ యితే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం అవి ప్లాస్టిక్ బియ్యం కాదని, బలవర్ధకమైన పోషకాహార విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యం అని వివరిస్తూ వచ్చారు. అయినప్పటికీ వినని ప్రతిపక్ష నాయకులు సవాళ్లకు దిగారు. వీరికి దీటుగా అధికారపక్షం నాయకులు ప్రతిసవాళ్లు విసిరా రు.ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగే విధంగా ఎమ్మెల్యే గురువారం అన్ని పక్షాలను ఆహ్వానించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభమైన పది నిమిషాలకే తమ దుష్ప్రచారం ఎదురుతన్నిందని టీడీపీ నాయకులకు అర్థమైంది. అక్కడే చాలాసేపు ఉంటే ప్రజల్లో అపహాస్యం పాలవుతామని గ్రహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తుండటంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. సూక్ష్మ పోషకాలు జోడించిన రైస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ12 లాంటి సూక్ష్మ పోఠషకాలు త క్కువ పరిమాణంలో బి య్యంతో జోడించడాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. అనీమియా(రక్తహీనత) సైలెంట్ కిల్లర్. దీనిని అధిగమించాలంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ12 అవసరం.ప్రభుత్వాలు చాలా పరిశోధనలు చేసి ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేసి అందిస్తున్నారు. – ఎం. అరుణ, ప్రొఫెసర్, పద్మావతి మహిళా వర్సిటీ అవగాహన సదస్సు హర్షణీయం ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం హర్షణీయం. విదేశాల్లో పాలు మొదలుకొని ప్రతి ఆహార పదార్థం పోర్టిఫైడే. చిన్నారులు, గర్భిణులు, బాలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ పోర్టిఫైడ్ రైస్‌ను ఆహారంగా తీసుకోవాలి. –డా. ఎ. మంజుల, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమియా ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమీయా ఉంది. దీనిని నివారించడంలో భాగంగా సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం బియ్యంతో జోడించి పంపిణీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియక వీటిని ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు. అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడం శుభపరిణామం. –డా.జావలి ప్రసూన, మెడికల్ ఆఫీసర్, పెద్దచెప్పలి పీహెచ్సీ ఫోర్టిఫైడ్ ఆలోచన 1994లోనే ఉద్భవించింది ఫోర్టిఫైడ్ ఆలోచన 1994లోనే ఉద్భవించింది. ఆ సమయంలో చేసిన సర్వేల్లో అనీమియా, జింక్ లోపాలు లేకపోవడంతో అది మరుగున పడింది. పదేళ్ల తర్వాత చేసిన సర్వేల్లో రోగాలన్నీ ఉన్నట్లు గుర్తించారు. ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన ఆహారం. –డా. శ్రీనివాసాచారి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్,కడప భారత్‌ను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ప్రతి నలుగురిలో ఒకరికి అనీమియా ఉందని భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. జిల్లాలో చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీనిని తరిమికొట్టాలి. లేకపోతే ప్రాణ నష్టం జరగుతుందని గ్రహించిన భారత్ ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలనే ఆలోచనకు వచ్చింది. –డా. ప్రశాంతి, కేవీకే కడప -
పోషకాహార లోపం నివారణకు ప్రజలకు ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలం
ఏయూక్యాంపస్: ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. బియ్యానికి అదనంగా విటమిన్లు, ఖనిజాలను జోడించడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను అదనంగా బియ్యంలో చేర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కళాశాల ఆచార్యులు, ఏయూ పాలక మండలి సభ్యురాలు ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్ నేతృత్వంలో బి.ఫార్మసీ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా చేసిన అధ్యయనంలో ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఫోర్టిఫైడ్ రైస్ ఎందుకు వాడాలి.. పౌష్టికాహార లోపం బారినపడే మహిళలు, చిన్నారులకు ఫోర్టిఫైడ్ బియ్యం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఐసీడీఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మపోషకాలను అందించడం సాధ్యపడుతుంది. ఫోలిక్ యాసిడ్.. ఫోలిక్ యాసిడ్ బాలింత తల్లుల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసిపిల్లలలో మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా విటమిన్ బి 12 మెదడు, నాడీమండలం పనిచేయడానికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మొత్తంలో ఉంచుతూ రక్తహీనతను అరికట్టడంలో ఐరన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. నిత్యం 400 మైక్రో గ్రామ్స్ అవసరం.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో 400 మైక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉండే విధంగా మనం జాగ్రత్త వహించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకునే 100 గ్రాముల అన్నంలో ఫోలిక్ యాసిడ్ 75 నుంచి 125 మైక్రోగ్రామ్స్ మధ్యలో ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ రైస్‌లో 100 గ్రాముల్లో 98 మెక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంది. ఎఫ్ఎస్సీఐ ప్రమాణాల ప్రకారం 100 గ్రాముల అన్నంలో 28–42 మిల్లీ గ్రాముల ఐరన్ ఉండాలి. ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. ఇతర ప్రైవేటు ఫోర్టిఫైడ్ బియ్యంలో 35 నుంచి 36.5 మిల్లీ గ్రాములు ఐరన్ కనిపించింది. కాగా అధికంగా వినియోగించే బ్రాండెడ్ మసూరి రైస్‌లో కేవలం 0.98 శాతం ఐరన్ ఉన్నట్లు తేలింది. నాలుగు రకాల బియ్యంపై అధ్యయనం.. ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం శాంపిల్‌తో పాటు మార్కెట్లో లభించే మూడు రకాల ఫోర్టిఫైడ్ బియ్యం బ్రాండ్ల శాంపిల్స్‌తోపాటు సాధారణ సోనామసూరి బియ్యం శాంపిల్స్ తీసుకుని అధ్యయనం చేశారు. అధ్యయనం అనంతరం ఫలితాలను విశ్లేషించగా ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్ 98 శాతం ఉండగా, మిగిలిన మూడు ఫోర్టిఫైడ్ రైస్ బ్రాండ్లలో ఫోలిక్ యాసిడ్ శాతాలను పరిశీలించగా 96, 97.24,95, ప్రముఖ బ్రాండ్ సోనా మసూరి రైస్‌లో 93 శాతం ఫోలిక్‌యాసిడ్ ఉండడాన్ని గమనించారు. మరింత లోతైన పరిశోధనలు విద్యార్థుల పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా నిలపాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం కోరితే బి 12 శాతం సైతం గణించి ఇస్తాం. ఈ బియ్యం వినియోగించిన తరువాత శరీరంలో ఐరన్శాతం పెరుగుదలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే పరిశోధన ప్రాజెక్టుగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్, ఫార్మసీ కళాశాల, ఏయూ -
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? అందులో ఉండే విటమిన్లేంటి?
మహబూబ్‌నగర్ రూరల్: కరోనా వైరస్ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది. బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్‌లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి జిల్లాలోని రైస్‌మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఏప్రిల్‌లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు.. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్ రైస్ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. ఉపయోగం ఏంటి? సాధారణ బియ్యంలో ఐరన్ విటమిన్ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్ అంటారు. ఈ కెనరల్స్ పౌడర్‌ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్వింటాకు కిలో చొప్పున.. వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. ఉత్తర్వులు రావాలి.. పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. – జగదీశ్‌కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్‌నగర్ చదవండి👇🏽 కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే..