సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల్లో రక్తహీనత సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు మైదాన ప్రాంతాల్లోని పేదలు, పాఠశాల విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల సంభవించే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ప్రజలకు అందించాలని నిర్ణయించింది.
ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకాలతోపాటు దేశంలోని 151 జిల్లాల్లో గతేడాది ఏప్రిల్ నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తోంది. అందులో తెలంగాణలోని ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతోపాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాల్లోనూ పీడీఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌నే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో కలపడం వల్ల వచ్చేవే బలవర్థక బియ్యం. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారు..
ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారీ ఇలా...
►98 శాతం బియ్యపు పిండికి 2 శాతం ఖనిజాలను కలిపి హాట్ ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీ ద్వారా 90 డిగ్రీలకన్నా తక్కువ వేడిలో జెలటనైజేషన్ (జెల్‌గా తయారు) చేసి దాన్ని బియ్యం ఆకారంలోకి మారిస్తే వచ్చేవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. 10 గ్రాముల ఎఫ్‌ఆర్‌కే కోసం 28 మిల్లీగ్రాముల నుంచి 48 మిల్లీగ్రాముల ఐర¯Œ 75 మైక్రో గ్రాముల నుంచి 125 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ (బీ–9 విటమిన్), 0.75 మైక్రో గ్రాముల నుంచి 1.25 మైక్రో గ్రాముల బీ–12 విటమిన్ (కొబాలమైన్ )ను కలుపుతారు. ఈ నిష్పత్తిలో కలిపే ఖనిజాలు, విటమిన్లతో కుర్‌కురే వంటి తినుబండారాలు తయారు చేసే తరహాలో ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం అచ్చుల్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారు చేస్తారు.
బలవర్థక బియ్యం కలిపే తీరిదీ...
►సాధారణ బియ్యానికి 1:100 నిష్పత్తిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను మిల్లుల్లో కలుపుతారు. అంటే క్వింటాలు బియ్యానికి కిలో ఎఫ్‌ఆర్‌కే కలుపుతారన్నమాట. సాధారణ బియ్యం తరహాలోనే ఉండే ఈ ఎఫ్‌ఆర్‌కే బియ్యంలో కలిసిపోతాయి.
వండిన అన్నం తరహాలోనే...
►ఎఫ్‌ఆర్‌కేతో కూడిన బియ్యాన్ని వండినప్పుడు వాటి పోషకాలు ఆవిరవ్వడం, అన్నం వార్చినప్పుడు గంజితో కలిసి బయటకు పోవడం జరగదని పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ రైస్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న బాలగంగాధర్ తిలక్ చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు పోయినా 10 శాతం లోపేనని, మిగతా 90 శాతం అన్నంతోపాటే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వండాలని కేంద్రం సూచిస్తోందన్నారు.
రాష్ట్రంలో 7 యూనిట్లు...
►ఎఫ్‌ఆర్‌కే తయారు చేసే యూనిట్లు ఎక్కువగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లలో ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, ములుగు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎఫ్‌ఆర్‌కే యూనిట్లు ఉన్నాయి.
మనకు కొత్తేం కాదు...
►మనం నిత్యం ఆహారంలో వినియోగించే పలు పదార్థాలు ఫోర్టి ఫైడ్ విధానంలో రూపొందినవే. నిత్యం వాడే ప్యాకెట్ పాలతోపాటు అయోడిన్‌గల ఉప్పు, గోధుమపిండి, వంట నూనె ఫోర్టిఫైడ్ విధానంలో ఖనిజాలు, విటమిన్లను కలిపి తయారు చేస్తారు. ఈ నాలుగింటితోపాటు ఇప్పుడు దేశంలో వినియోగించే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ విధానంలోనే తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
30 దేశాల్లో...
►మన దేశంలో గతేడాది నుంచి ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగంలోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన బియ్యాన్ని వాడుతున్నారు. అమెరికాలో 2019లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. కోస్టారికా, నికరగ్వా, పనామా, పాపువా న్యూగినియా, సోలొమన్ దీవులు, ఫిలిప్పీన్స్‌లలో బలవర్థక బియ్యం వాడకం తప్పనిసరి. అలాగే మరికొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు కిర్గిస్తాన్, లావోస్, నేపాల్‌లలోనూ ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment