Anemia disease
-
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
రక్తహీనతతో బాధపడుతున్నారా? మీ డైట్లో ఇవి చేర్చుకోండి
మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు మోసుకెళ్లి అందించేంది ఇదే. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.మోగ్లోబిన్ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం శరీర అవయవాలకు అందక శరీరం చచ్చుబడిపోయేలా మారుతుంది.మరి రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ►రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. ► బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ► అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ► దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ► నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ► కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. ► రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ► అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ► లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. ► ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. -
Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? ఇవి తింటే సరిపోతుంది
శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో... రక్తహీనతను నివారించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు మందులు వాడాలి. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి. తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. కొన్ని చిత్రమైన లక్షణాలు రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనగా అనుమానించాల్సి ఉంటుంది. ∙తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి, పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. యుక్తవయసులో అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనిచ్చే మహిళల వరకూ అందరికీ ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. ►బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ► బెల్లం, వేరుసెనగ పప్పు కలిపి తిన్నా మంచిది. ∙తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగితే చాలా బలం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోరాదు. ► అరటిపళ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ రక్తహీనత నివారణకు ఉపకరిస్తాయి. ఇక కిస్మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. -
ఫోర్టిఫైడ్ రైస్.. బియ్యానికి బలం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల్లో రక్తహీనత సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు మైదాన ప్రాంతాల్లోని పేదలు, పాఠశాల విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల సంభవించే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకాలతోపాటు దేశంలోని 151 జిల్లాల్లో గతేడాది ఏప్రిల్ నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తోంది. అందులో తెలంగాణలోని ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతోపాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాల్లోనూ పీడీఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌నే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో కలపడం వల్ల వచ్చేవే బలవర్థక బియ్యం. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారు.. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారీ ఇలా... ►98 శాతం బియ్యపు పిండికి 2 శాతం ఖనిజాలను కలిపి హాట్ ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీ ద్వారా 90 డిగ్రీలకన్నా తక్కువ వేడిలో జెలటనైజేషన్ (జెల్గా తయారు) చేసి దాన్ని బియ్యం ఆకారంలోకి మారిస్తే వచ్చేవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. 10 గ్రాముల ఎఫ్ఆర్కే కోసం 28 మిల్లీగ్రాముల నుంచి 48 మిల్లీగ్రాముల ఐర¯Œ 75 మైక్రో గ్రాముల నుంచి 125 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ (బీ–9 విటమిన్), 0.75 మైక్రో గ్రాముల నుంచి 1.25 మైక్రో గ్రాముల బీ–12 విటమిన్ (కొబాలమైన్ )ను కలుపుతారు. ఈ నిష్పత్తిలో కలిపే ఖనిజాలు, విటమిన్లతో కుర్కురే వంటి తినుబండారాలు తయారు చేసే తరహాలో ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం అచ్చుల్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారు చేస్తారు. బలవర్థక బియ్యం కలిపే తీరిదీ... ►సాధారణ బియ్యానికి 1:100 నిష్పత్తిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను మిల్లుల్లో కలుపుతారు. అంటే క్వింటాలు బియ్యానికి కిలో ఎఫ్ఆర్కే కలుపుతారన్నమాట. సాధారణ బియ్యం తరహాలోనే ఉండే ఈ ఎఫ్ఆర్కే బియ్యంలో కలిసిపోతాయి. వండిన అన్నం తరహాలోనే... ►ఎఫ్ఆర్కేతో కూడిన బియ్యాన్ని వండినప్పుడు వాటి పోషకాలు ఆవిరవ్వడం, అన్నం వార్చినప్పుడు గంజితో కలిసి బయటకు పోవడం జరగదని పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ రైస్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న బాలగంగాధర్ తిలక్ చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు పోయినా 10 శాతం లోపేనని, మిగతా 90 శాతం అన్నంతోపాటే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వండాలని కేంద్రం సూచిస్తోందన్నారు. రాష్ట్రంలో 7 యూనిట్లు... ►ఎఫ్ఆర్కే తయారు చేసే యూనిట్లు ఎక్కువగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లలో ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, ములుగు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి. మనకు కొత్తేం కాదు... ►మనం నిత్యం ఆహారంలో వినియోగించే పలు పదార్థాలు ఫోర్టి ఫైడ్ విధానంలో రూపొందినవే. నిత్యం వాడే ప్యాకెట్ పాలతోపాటు అయోడిన్గల ఉప్పు, గోధుమపిండి, వంట నూనె ఫోర్టిఫైడ్ విధానంలో ఖనిజాలు, విటమిన్లను కలిపి తయారు చేస్తారు. ఈ నాలుగింటితోపాటు ఇప్పుడు దేశంలో వినియోగించే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ విధానంలోనే తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 30 దేశాల్లో... ►మన దేశంలో గతేడాది నుంచి ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగంలోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన బియ్యాన్ని వాడుతున్నారు. అమెరికాలో 2019లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. కోస్టారికా, నికరగ్వా, పనామా, పాపువా న్యూగినియా, సోలొమన్ దీవులు, ఫిలిప్పీన్స్లలో బలవర్థక బియ్యం వాడకం తప్పనిసరి. అలాగే మరికొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు కిర్గిస్తాన్, లావోస్, నేపాల్‌లలోనూ ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగిస్తున్నారు. -
చిరుధాన్యంతో ఆరోగ్యభాగ్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారతదేశంలో ఎక్కువ మందిని పీడిస్తున్న రక్తహీనత జబ్బునుంచి బయటపడాలంటే చిరు ధాన్యాలు (మిల్లెట్స్)ను రోజూ ఆహారంగా తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని ఇక్రిశాట్ (అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ) పేర్కొంది. ఇటీవలే ఇక్రిశాట్ వివిధ అధ్యయనాలతో పాటు కొంతమంది నుంచి నమూనాలు సేకరించి పరిశోధన చేసింది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలతో కలిసి సుమారు 22 అధ్యయనాలు జరిపినట్లు ఇక్రిశాట్ నివేదికలో వెల్లడించింది. ఇనుపధాతువు లోపాన్ని అధిగమించడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చని నివేదికలో వెల్లడించింది. భారీగా పెరిగిన హిమోగ్లోబిన్ స్థాయి సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు తీసుకున్న వారిలో, వీటిని తీసుకోని వారిలోనూ పరిశోధన నిర్వహించారు. చిరుధాన్యాలు తీసుకోని వారికంటే తీసుకున్న వారిలో 13.2 శాతం హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగినట్టు తమ నివేదికలో ఇక్రిశాట్ ప్రతినిధులు ధ్రువీకరించారు. సీరం ఫెరిటిన్ (ఇనుప ధాతువు) సగటున మిల్లెట్స్ తీసుకున్న వారిలో 54.7 శాతం అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఫెరిటిన్ అంటే రక్తంలో ప్రొటీన్ కలిగిన ఇనుము. దీన్నే ఇనుము లోపానికి క్లినికల్ మార్కర్‌గా పేర్కొంటారు. వెయ్యి మంది చిన్నారులపై పరిశోధన వెయ్యిమంది చిన్నారులనే కాకుండా.. కౌమార దశ అంటే 15 ఏళ్లలోపు వారు, 25 ఏళ్లు దాటిన వారి నమూనాలనూ సైతం పరిశీలించారు. ఆరు రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీనుకున్న వారినే పరిశోధనకు తీసుకున్నారు. వీరిని పరిశీలించగా..ఇనుప ధాతువు, రక్తం వృద్ధి చెందినట్లు తేలింది. ఇప్పటివరకూ చిరుధాన్యాల ప్రభావంపై చేసిన అధ్యయనాల్లో ఇదే అతి పెద్దదని ఇక్రిశాట్ పేర్కొంది. మధుమేహం..హృద్రోగ బాధితులకు మంచిది దేశంలో మధుమేహ రోగులు, గుండె సంబంధిత రోగుల పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉందని, అత్యధిక మరణాలకు ఈ జబ్బులే కారణమవుతున్నాయని నివేదికలో స్పష్టం చేశారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో (మై ప్లేట్ ఫర్ ది డే) భాగంగా ఉండాలని, ఇలా తీసుకోగలిగితే షుగర్, బీపీ, గుండె జబ్బులను తగ్గించవచ్చునని ఇక్రిశాట్ ప్రతినిధులు చెప్పారు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు పెరిగిందని, అదే మొలకెత్తిన చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు వృద్ధి రెట్టింపు అయ్యిందని ఇక్రిశాట్ పేర్కొంది. -
మహిళలను ఒక పట్టాన వదలని రక్తహీనత...
రక్తహీనత పురుషుల్లో, మహిళల్లో ఇలా అందరిలో కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. అందునా భారతీయ మహిళల్లోని దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉండనే ఉంటుందని అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లోతేలింది. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. మన శరీరంలోని 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. కారణాలు మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. ∙శ్వాస కష్టంగా ఉండటం ∙కొద్దిపాటి నడకకే ఆయాసం ∙అలసట ∙చికాకు / చిరాకు / కోపం ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం ∙కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం ∙పాలిపోయినట్లుగా ఉండటం ∙ఛాతీనొప్పి ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైనవి. జాగ్రత్తలు / చికిత్స ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలైన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కొందరిలో ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇవి వాడే సమయంలో కొందరికి మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకే వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి. డాక్టర్ ఆరతి బళ్లారి హెడ్ ఇంటర్నల్ మెడిసిన్ -
పట్టణ మహిళల్లో అధిక బరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణ మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య గణాంకాల విభాగం రూపొందించిన 2019–20 నివేదికలో పేర్కొంది. 15–49 ఏళ్ల వయసున్న మొత్తం మహిళల్లో 28.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా, పట్టణాల్లోనే 39.5 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. అందులో తక్కువ బరువు ఉన్న మహిళలు 23.1 శాతం ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలను రక్తహీనత వేధిస్తోంది. 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో 56.7 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. వీరిలో గర్భిణీలు 48.2 శాతం మంది ఉండటం గమనార్హం. అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. అధిక బీపీ ఉన్న మహిళలు 19.8 శాతం, పురుషులు 18.2 శాతం ఉన్నారు. డయాబెటిస్తో ఉన్న మహిళలు 6.9 శాతం, పురుషులు 6 శాతం ఉన్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పౌష్టికాహార లోపం కారణంగా బాధపడుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేని వారు 28.1 శాతం కాగా, బక్కచిక్కిన పిల్లలు 18 శాతం, బరువు తక్కువగా ఉన్న వారు 28.5 శాతంగా నమోదయ్యారు. వైద్యం పొందడంలో మూడో స్థానం.. ఆరోగ్య పథకాలు, వివిధ బీమా పథకాల ద్వారా వైద్యం పొందే కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 66.4 శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందుతున్నవారు 40.5 శాతం మంది ఉండగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. ఇవీ ఇతర వివరాలు.. ►ఆరోగ్య కార్యకర్తల ద్వారా జరిగే జననాలు రాష్ట్రంలో 91.4 శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలోని చిన్న పిల్లల్లో పూర్తిస్థాయిలో టీకాలు పొందేవారు 68.1 శాతం. జాతీయ సగటు 62 శాతం. ►15–49 ఏళ్ల వయసు వారిలో వారానికోసారి మద్యం సేవించే మహిళలు 28.5 శాతం ఉంటే, పురుషులు 45.5 శాతం ఉన్నారు. ►15–49 ఏళ్ల వయసు వారిలో పొగాకు తాగేవారు 70.6% పురుషులు, 48.8% మంది మహిళలు ఉన్నారు. ►6 నెలలలోపు తల్లిపాలు తాగే పిల్లలు 67.3 శాతం. ►2011లో దేశ జనాభా 121 కోట్లు ఉం టే, 2016 నాటికి 129 కోట్లకు చేరు కుంది. 2021 నాటికి 136 కోట్లు, 2026 నాటికి 142.30 కోట్లు, 2031 నాటికి 147.50 కోట్లు, 2036 నాటికి 151.83 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. -
ఫైట్ ‘అనిమియా’
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రక్తహీనత సమస్యను అధిగమించడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఫైట్ అనిమియా పేరుతో పిల్లల్లో, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు కార్యక్రమ రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో అనిమియాకు గురై మత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం. చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా వచ్చే అనిమియాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అనిమియాను తరమికొట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు.. జిల్లాలోని 300 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, వసతిగృహాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేసి రక్తహీనత విషయాన్ని నిర్ధారిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 యూపీఎస్, 190 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎయిడెడ్ పాఠశాల 1, బీసీ వసతి గృహాలు 2, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 22, కేజీబీవీలు 17, లోకల్‌బాడి పాఠశాలలు 187, సోషల్ వెల్ఫేర్ 3, మోడల్ స్కూళ్లు 6, ట్రైబల్ వెల్ఫేర్ 53, యూఆర్ఎస్ 1, రెసిడెన్షియల్ పాఠశాలలు 6 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కలిపి 43,991 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈనెల 12 నుంచి మొదలు.. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల్లో అనిమియా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఒక వైద్యాధికారి, ఒక ఫార్మాసిస్ట్ ఉంటారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత హెమోగ్లోబిన్ శాతం 8 గ్రాములు ఉంటే రోజుకు రెండు ఐరన్ మాత్రలు, 8 నుంచి 11 శాతం ఉంటే రోజు ఒక మాత్ర చొప్పున మూడు నెలల పాటు అందిస్తారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారో లెక్కించి వారికి చికిత్స కోసం చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం అనంతరం ఈ మాత్రలు వారికి ఇవ్వనున్నారు. పౌష్టికాహారం లోపమే సమస్య.. పౌష్టికాహార లోపమే అనిమియా రావడానికి ప్రధాన కారణం. ప్రొటీన్లు, విటమిన్లు, ఆకుకూరలు, కూరగాయల భోజనం చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అనిమియాతో విద్యార్థుల్లో అలసట రావడం, తల తిరగడం, ఛాతినొప్పి రావడం, పెరుగుదల లేకపోవడం, ఆకలి ఉండకపోవడం, తదితర వాటితో బాధపడుతుంటారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్ జిల్లా ఉంది. జిల్లాలో దాదాపు 30 శాతం మంది వరకూ విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు ఫైట్ అనిమియా పేరుతో రక్తహీనతతో బాధపడుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి మాత్రలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా 43,991 మంది విద్యార్థులు ఉండగా వారందరికి పరీక్షలు చేస్తాం. అనిమియాతో బాధపడుతున్న వారికి మూడు నెలల పాటు మాత్రలు అందిస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్ -
రక్తహీనతతో జీవచ్ఛవంలా..
సిరికొండ(బోథ్) మంచిర్యాల : మండలంలోని మారుమూల గి రిజన గ్రామమైన ముత్యంపేటలో ఓ గిరిజన మ హిళ రక్తహీనతతో బాధపడుతూ మంచం పట్టింది. కుమ్ర శారదాబాయి(35)కి పదేళ్ల క్రితం ఉట్నూర్ మండలం ఎంద్వ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. రక్తహీనతతోనే ఆ మహి ళ ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టినింటికి వచ్చిన శారదాబాయి మంచంలోనే ప్రాణాలతో పోరాడుతోంది. ఇటీవలే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆ దిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి రక్తం చాలా తక్కువగా ఉందని చె ప్పారు. రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల పలు మాత్రలు ఇచ్చి ఇంటికి పంపించేశారని తెలిపారు. భర్త, తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అధి కారులు స్పందించి వైద్యసహాయం అందించి నిండు ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నా రు. శారదాబాయికి మెరుగైన వైద్య సే వలందించేందుకు సహకరించాలనికోరారు. -
అయ్యో పాపం.. అనూహ్య
⇒ చిన్నారిని వేధిస్తున్న రక్తహీనత ⇒ ఏడాదిన్నరగా మంచానికే పరిమితం ⇒ రూ.25 లక్షలుంటేనే వైద్యం ⇒ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం ⇒ దాతల కోసం ఎదురుచూపు బంజారాహిల్స్: ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారి ఏడాదిన్నర కాలంగా మంచానికే పరిమితమైంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను కలిచివేసింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేక.. కన్నపేగును కాపాడుకునే మార్గం తెలియక తల్లడిల్లిపోతున్నారు. వివరాలిలా.. పి.శ్రీనివాసరావు, భారతి దంపతులు. వీరికి ఒక బాబు, ఓ పాప. శ్రీనివాస్‌రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. బాబు బధిరుడు. కొన్నేళ్లపాటు అవస్థపడి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం చేయించి ఓ కొలిక్కి తీసుకువచ్చారు. పరిస్థితి మెరుగుపడిందనుకున్న దశలో పాప అనూహ్య (8) ఒక్కసారిగా కుప్పకూలింది. చదువుతోపాటు ఆట, పాటల్లో రాణిస్తూ ఎంతో హుషారుగా ఉండేది. వైద్యులకు చూపించగా ఏడాదిన్నర క్రితం భయంకరమైన వాస్తవం బయటపడింది. అప్లాస్టిక్ ఎనీమియా (తీవ్రమైన రక్తహీనత)తో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించారు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడం, ఎముకల్లో ఉండే తెల్లని పదార్థం రక్తకణాలను, ప్లేట్‌లెట్స్‌ను ఉత్పత్తి చేయడం మానేసింది. ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడంతో రక్తానికి ఆక్సీజన్ అందక అనూహ్య నీరసించి పోయింది. ఈ వ్యాధి నయం చేయాలంటే స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.8.50 లక్షలు, నిమ్స్‌లో చికిత్సకు రూ.16.50 లక్షలు మొత్తం రూ.25 లక్షలు ఖర్చుఅవుతుందని చిన్నారి తండ్రి శ్రీనివాస్‌రావు తెలిపాడు. ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. దాతలెవరైనా ముందుకు వచ్చి తన కూతురికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునే వారు 9059705169, 9052301145 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నాడు. బ్యాంకులో డబ్బులు వేయాలకునే వారు ‘పి.కెరెన్ అనూహ్య, అకౌంట్ నం.20202376033, ఎస్బీఐ, శ్రీపురం మలక్‌పేట, హైదరాబాద్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0060339’ శ్రీనివాస్‌రావు తెలిపాడు.