సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారతదేశంలో ఎక్కువ మందిని పీడిస్తున్న రక్తహీనత జబ్బునుంచి బయటపడాలంటే చిరు ధాన్యాలు (మిల్లెట్స్)ను రోజూ ఆహారంగా తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని ఇక్రిశాట్ (అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ) పేర్కొంది. ఇటీవలే ఇక్రిశాట్ వివిధ అధ్యయనాలతో పాటు కొంతమంది నుంచి నమూనాలు సేకరించి పరిశోధన చేసింది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలతో కలిసి సుమారు 22 అధ్యయనాలు జరిపినట్లు ఇక్రిశాట్ నివేదికలో వెల్లడించింది. ఇనుపధాతువు లోపాన్ని అధిగమించడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చని నివేదికలో వెల్లడించింది.
భారీగా పెరిగిన హిమోగ్లోబిన్ స్థాయి
సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు తీసుకున్న వారిలో, వీటిని తీసుకోని వారిలోనూ పరిశోధన నిర్వహించారు. చిరుధాన్యాలు తీసుకోని వారికంటే తీసుకున్న వారిలో 13.2 శాతం హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగినట్టు తమ నివేదికలో ఇక్రిశాట్ ప్రతినిధులు ధ్రువీకరించారు. సీరం ఫెరిటిన్ (ఇనుప ధాతువు) సగటున మిల్లెట్స్ తీసుకున్న వారిలో 54.7 శాతం అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఫెరిటిన్ అంటే రక్తంలో ప్రొటీన్ కలిగిన ఇనుము. దీన్నే ఇనుము లోపానికి క్లినికల్ మార్కర్‌గా పేర్కొంటారు.
వెయ్యి మంది చిన్నారులపై పరిశోధన
వెయ్యిమంది చిన్నారులనే కాకుండా.. కౌమార దశ అంటే 15 ఏళ్లలోపు వారు, 25 ఏళ్లు దాటిన వారి నమూనాలనూ సైతం పరిశీలించారు. ఆరు రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీనుకున్న వారినే పరిశోధనకు తీసుకున్నారు. వీరిని పరిశీలించగా..ఇనుప ధాతువు, రక్తం వృద్ధి చెందినట్లు తేలింది. ఇప్పటివరకూ చిరుధాన్యాల ప్రభావంపై చేసిన అధ్యయనాల్లో ఇదే అతి పెద్దదని ఇక్రిశాట్ పేర్కొంది.
మధుమేహం..హృద్రోగ బాధితులకు మంచిది
దేశంలో మధుమేహ రోగులు, గుండె సంబంధిత రోగుల పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉందని, అత్యధిక మరణాలకు ఈ జబ్బులే కారణమవుతున్నాయని నివేదికలో స్పష్టం చేశారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో (మై ప్లేట్ ఫర్ ది డే) భాగంగా ఉండాలని, ఇలా తీసుకోగలిగితే షుగర్, బీపీ, గుండె జబ్బులను తగ్గించవచ్చునని ఇక్రిశాట్ ప్రతినిధులు చెప్పారు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు పెరిగిందని, అదే మొలకెత్తిన చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు వృద్ధి రెట్టింపు అయ్యిందని ఇక్రిశాట్ పేర్కొంది.
చిరుధాన్యంతో ఆరోగ్యభాగ్యం
Published Fri, Dec 17 2021 5:05 AM | Last Updated on Fri, Dec 17 2021 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment