
గుండె జబ్బులు వచ్చే అవకాశం 47% ఎక్కువ
యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
16,500 మంది గర్భిణులపై అధ్యయనం
గర్భం దాల్చిన వంద రోజుల్లో తల్లికి రక్తహీనత తలెత్తితే
బిడ్డ గుండె జబ్బుతో పుట్టే అవకాశం
మహిళలను పట్టి పీడించే సమస్యల్లో ప్రధానమైనది రక్తహీనత. ఇది గర్భధారణ సమయంలో తలెత్తితే తల్లి, బిడ్డ ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రం, దేశంలో నమోదవుతున్న మాతా, శిశు మరణాలకు ప్రధాన కారణం ఇదేనని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం ఉంటుందని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. గర్భం దాల్చిన మొదటి 100 రోజుల్లో మహిళ రక్తహీనతతో బాధపడితే.. పుట్టబోయే బిడ్డ గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. - సాక్షి, అమరావతి
16,500 మందిపై అధ్యయనం
అధ్యయనంలో భాగంగా 1998 నుంచి 2020 మధ్య గర్భం దాల్చిన 16,500 మంది మహిళల ఆరోగ్య రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. రక్తహీనత సమస్య ఉన్న 2,700 మందికిపైగా మహిళల సంతానంలో పుట్టుకతో గుండె జబ్బులు ఉన్నట్లు కనుగొన్నారు. రక్తహీనత సమస్య లేని మహిళలు జన్మనిచ్చిన బిడ్డల్లో జబ్బులు లేవు. గర్భం దాల్చిన మొదటి వంద రోజుల్లో మహిళలకు రక్తహీనత ఉందో లేదో కూడా నిర్ధారించారు. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల సంతానంలో హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
జాగ్రత్తలు అవసరం
రక్తహీనత సమస్య గర్భిణితో పాటు పుట్టబోయే బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ముందస్తు ప్రసవం, పిండానికి సరైన పోషకాలు అందకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. గర్భధారణ ప్రారంభ సమయంలో పిండం గుండె, ఇతర అవయవాల అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి సమయంలో రక్తహీనత తలెత్తితే బిడ్డ అవయవాల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.
అలాగే చివరి దశలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లయితే అకాల ప్రసవం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో గర్భధారణకు ప్రణాళికలున్న మహిళలు తొలుత వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత సమస్య నివారణకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. – డాక్టర్ శ్రీనాథ రెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం, తిరుపతి