అయ్యో పాపం.. అనూహ్య
⇒ చిన్నారిని వేధిస్తున్న రక్తహీనత
⇒ ఏడాదిన్నరగా మంచానికే పరిమితం
⇒ రూ.25 లక్షలుంటేనే వైద్యం
⇒ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం
⇒ దాతల కోసం ఎదురుచూపు
బంజారాహిల్స్: ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారి ఏడాదిన్నర కాలంగా మంచానికే పరిమితమైంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను కలిచివేసింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేక.. కన్నపేగును కాపాడుకునే మార్గం తెలియక తల్లడిల్లిపోతున్నారు. వివరాలిలా.. పి.శ్రీనివాసరావు, భారతి దంపతులు. వీరికి ఒక బాబు, ఓ పాప. శ్రీనివాస్‌రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. బాబు బధిరుడు. కొన్నేళ్లపాటు అవస్థపడి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం చేయించి ఓ కొలిక్కి తీసుకువచ్చారు. పరిస్థితి మెరుగుపడిందనుకున్న దశలో పాప అనూహ్య (8) ఒక్కసారిగా కుప్పకూలింది. చదువుతోపాటు ఆట, పాటల్లో రాణిస్తూ ఎంతో హుషారుగా ఉండేది. వైద్యులకు చూపించగా ఏడాదిన్నర క్రితం భయంకరమైన వాస్తవం బయటపడింది. అప్లాస్టిక్ ఎనీమియా (తీవ్రమైన రక్తహీనత)తో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించారు.
ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడం, ఎముకల్లో ఉండే తెల్లని పదార్థం రక్తకణాలను, ప్లేట్‌లెట్స్‌ను ఉత్పత్తి చేయడం మానేసింది. ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడంతో రక్తానికి ఆక్సీజన్ అందక అనూహ్య నీరసించి పోయింది. ఈ వ్యాధి నయం చేయాలంటే స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.8.50 లక్షలు, నిమ్స్‌లో చికిత్సకు రూ.16.50 లక్షలు మొత్తం రూ.25 లక్షలు ఖర్చుఅవుతుందని చిన్నారి తండ్రి శ్రీనివాస్‌రావు తెలిపాడు.
ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. దాతలెవరైనా ముందుకు వచ్చి తన కూతురికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునే వారు 9059705169, 9052301145 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నాడు. బ్యాంకులో డబ్బులు వేయాలకునే వారు ‘పి.కెరెన్ అనూహ్య, అకౌంట్ నం.20202376033, ఎస్‌బీఐ, శ్రీపురం మలక్‌పేట, హైదరాబాద్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్0060339’ శ్రీనివాస్‌రావు తెలిపాడు.