Hassan Nasrallah: అరబ్బుల హీరో | Hezbollah leader Hassan Nasrallah | Sakshi
Sakshi News home page

Hassan Nasrallah: అరబ్బుల హీరో

Published Sun, Sep 29 2024 5:16 AM | Last Updated on Sun, Sep 29 2024 7:04 AM

Hezbollah leader Hassan Nasrallah

పేద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి చేరుకున్న షేక్‌ హసన్‌ నస్రల్లా  

మత విద్య నుంచి హెజ్‌బొల్లా అధినేతగా ప్రస్థానం  

క్యాన్సర్‌ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని పిలుపునిచి్చన నస్రల్లా  

హెజ్‌బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్‌ హసన్‌ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్‌బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం.

 అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్‌–హ్యాండ్‌ బుక్‌ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్‌–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.  

32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు  
1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్‌ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్‌ అయిన అమల్‌ మూవ్‌మెంట్‌లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(పీఎల్‌ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది.

 ఈ దాడిలో పీఎల్‌ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్‌ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్‌వాదులతో హెజ్‌బొల్లా గ్రూప్‌ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్‌ అబ్బాస్‌ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 

1992లో ఇజ్రాయెల్‌ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్‌బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్‌బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్‌ సైన్యం కంటే హెజ్‌బొల్లా పవర్‌ఫుల్‌ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్‌ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్‌బొల్లాకు ఇరాన్‌ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్‌బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది.  

ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు  
ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ సేనలను తరిమికొట్టారు. అరబ్‌ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్‌బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్‌ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలోనే ఉండేవారు. 

ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్‌ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్‌బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్‌బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్‌బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్‌బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement