Health: అనీమియా వద్దు... ‘ఐరన్‌’ లేడీలా ఉందాం! | Precautions And Suggestions To Avoid Anemia Disease | Sakshi
Sakshi News home page

Health: అనీమియా వద్దు... ‘ఐరన్‌’ లేడీలా ఉందాం!

Published Tue, Sep 10 2024 11:58 AM | Last Updated on Tue, Sep 10 2024 11:58 AM

Precautions And Suggestions To Avoid Anemia Disease

రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్‌ స్టడీస్‌ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...

ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్‌ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్‌ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్‌ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.

లక్షణాలు.. 
– అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ / ఎరిథ్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...
– శ్వాస కష్టంగా ఉండటం
– కొద్దిపాటి నడకకే ఆయాసం
– అలసట
– చికాకు / చిరాకు / కోపం
– మగత
– తలనొప్పి
– నిద్రపట్టకపోవడం
– పాదాలలో నీరు చేరడం
– ఆకలి తగ్గడం
– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం
– ఛాతీనొప్పి
– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్‌ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్తలు / చికిత్స..
ఐరన్‌ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్‌ సలహా మీద ఐరన్‌ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని  సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.

కారణాలు..
మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement