Anemia
-
ఆ టైమ్‌లోనూ ఐరన్ యువతిలా...
భారతదేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కొన్నేళ్ల కిందట దాదాపు 85 శాతం మంది మహిళలు అనిమిక్‌గా ఉండేవారు. క్రమంగా మహిళల్లోనూ చైతన్యం పెరుగుతుండటంతో ఇటీవల అది 57 శాతానికి చేరింది. ఇంతగా చైతన్యం పెరిగాక కూడా దేశంలోని సగానికి పైగా మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ఇక ఇటీవలే పీరియడ్స్ మొదలైన టీనేజీ అమ్మాయిల్లో రక్తహీనతతో బాధపడుతుండేవారు ఇంకా ఎక్కువ.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019–21 ప్రకారం 15 నుంచి 19 ఏళ్ల వయసుండే కౌమార బాలికల్లో అనీమియాతో బాధపడేవారు 59.1 శాతం! రుతుస్రావంలో రక్తం కోల్పోతుండటం, అది భర్తీ అవుతుండగానే నెలసరితో రక్తం కోల్పోతుండటంతో యువతుల్లో రక్తహీనత కనిపిస్తోంది. కొత్తగా పీరియడ్స్ మొదలైన టీనేజ్ అమ్మాయిలు అనీమియాకు లోనుకాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అవేమిటో చూద్దాం. ఆహారంలో ఎక్కువగా తీసుకోవాల్సినవి... శాకాహారులు తమ ఆహారంలో తాజాగా ఉండే ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీడీలు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీలు తీసుకోవడం మేలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారులైతే ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తోపాటు... మటన్, చికెన్ లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోవడం మంచిది. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉంటుంది. అయితే మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ అంటే... తిన్న వెంటనే అది ఒంటికి పట్టే రూపంలో ఉంటుంది. అదే శాకాహార పదార్థాల్లో ఉండే నాన్‌హీమ్ ఐరన్ ఒంటికి పట్టేలా చేయడానికి విటమిన్–సి కావాలి. కాబట్టి శాకాహారులు తమ ఆహారాల్లో ఐరన్ ఉండేవి తినేటప్పుడు వాటితోపాటు విటమిన్–సి ఉండే తాజా పండ్లైన జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి లేదా వంటకాల్లో విటమిన్–సీ ఎక్కువగా ఉండే ఉసిరి వంటివి తీసుకుంటూ ఉండాలి. మాంసాహారులైనా, శాకాహారులైనా కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి. కోడిగుడ్డులో పచ్చసొన తీసుకోకూడదనే అభిపప్రాయాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే పచ్చసొనతో వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, అది తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ. రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం సమృద్ధిగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే. మరికొన్ని సూచనలురుతుస్రావం సమయంలో అమ్మాయిలు రక్తాన్ని ఎక్కువగా కోల్పోతుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వాలంటూ పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది వాస్తవం కాదు. ఈ టీనేజ్లోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుంటూ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలూ తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొదలైన అమ్మాయిలకు కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలో, నువ్వుల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి వాటిని కాస్త పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. నెయ్యికి బదులు వెన్న వాడటం మేలు. ఎందుకంటే వెన్నకాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అయితే వెన్న తీసుకుంటే అందులోని కొవ్వులు... ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్‌ను బాగా ఒంటబట్టేలా చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా రోజుకు 45 నిమిషాల చొప్పున కనీసం వారానికి ఐదు రోజుల పాటైనా వ్యాయామం చేస్తే హార్మోన్లు క్రమబద్ధంగా విడుదల కావడం జరుగుతోంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం పీరియడ్స్ సమయంలో వ్యాయామం కుదరక΄ోవచ్చు. వాళ్లు మినహా మిగతా యువతులంతా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అస్సలు తీసుకోకూడనివి... బేకరీ ఐటమ్స్, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి...ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా తక్కువగా తీసుకోవాలి. డా. పూజితాదేవి సూరనేని, సీనియర్ హైరిస్క్ ఆబ్స్టెట్రీషియన్ –రోబోటిక్ సర్జన్ (చదవండి: ఐవీఎఫ్ జర్నీ.. రోజుకు ఐదు ఇంజక్షన్స్.. అంత ఈజీ కాదు: కొరియోగ్రాఫర్) -
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
రక్తహీనత నివారణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: రక్తహీనత (ఎనీమియా) నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆరు నెలల శిశువు నుంచి చిన్న పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతలు రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపాయి. ఎనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ (ఐఎఫ్ఏ) మాత్రలు, సిరప్ పంపిణీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2023–24 వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య శిశువులు, బాలింతల్లో 89 శాతం మందికి ఐఎఫ్ఏ మాత్రల పంపిణీ చేపట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో, 86.6 శాతంతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో, 84.8 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచాయి. 41.8 శాతంతో కేరళ 21వ స్థానానికి పరిమితమైంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 శాతంతో చండీగఢ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా దేశవ్యాప్తంగా ఐఎఫ్ఏ మాత్రల పంపిణీ 58.8 శాతం మాత్రమే ఉంది. ఐఎఫ్ఏ మాత్రల పంపిణీలో దేశంలోనే ఆంధ్రపదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2021–22లోనూ పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతల్లో 83.6 శాతం మందికి ఐఎఫ్ఏ సిరప్, మాత్రలు పంపిణీ చేసి దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ దేశంలో రక్తహీనతను నిర్మూలించే ఉద్దేశంతో ఎనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ 6 నుంచి 59 నెలల పిల్లలకు 1 ఎంఎల్ ఐఎఫ్ఏ సిరప్ వారానికి ఒకసారి చొప్పున 8 నుంచి 10 డోసులు పంపిణీ చేస్తోంది. అలాగే 5–9 ఏళ్ల పిల్లలకు ఐఎఫ్ఏ మాత్రలు నెలలో నాలుగు నుంచి ఐదు అందిస్తున్నారు. అదేవిధంగా 10–19 ఏళ్ల కౌమార పిల్లలు, యువతకు నెలకు నాలుగు ఐఎఫ్ఏ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 180 మాత్రలు చొప్పున అందిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాల కింద అంగన్వాడీల ద్వారా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం కింద మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. స్కూల్ హెల్త్ యాప్‌ను రూపొందించి వైద్య శాఖ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పిల్లలందరికీ ఐఎఫ్ఏ మాత్రలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. రాష్ట్ర ప్రభుత్వం రక్తహీనత నివారణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 9 లక్షల మంది మహిళలు గర్భం దాలుస్తున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 49 ఏళ్లలోపు వయసు ఉండి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు 53 శాతం ఉండేవారు. కాగా, 2023 నాటికి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 29 శాతానికి తగ్గిపోయింది. 2023–24లో 2.79 లక్షల మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య శాఖ గుర్తించింది. వీరిలో 2.37 లక్షల మందిలో స్వల్పంగా, మధ్యస్థంగా రక్తహీనత ఉంది. మరో 42,463 మందిలో తీవ్ర రక్తహీనత సమస్య ఉందని నిర్ధారించారు. దీంతో సాధారణ రక్తహీనత ఉన్న గర్భిణులందరికీ ఐఎఫ్ఏ మందులను ప్రభుత్వం అందించింది. మధ్యస్థం, తీవ్ర రక్తహీనత సమస్య ఉన్న వారిని ఫ్యామిలీ డాక్టర్‌కు రిఫర్ చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వచ్చిది. ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు 211 మంది గర్భిణులకు రక్తాన్ని ఎక్కించారు. అదేవిధంగా 6,731 మందికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లను చేశారు. -
రక్తహీనతతో బాధపడుతున్నారా? మీ డైట్లో ఇవి చేర్చుకోండి
మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు మోసుకెళ్లి అందించేంది ఇదే. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.మోగ్లోబిన్ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం శరీర అవయవాలకు అందక శరీరం చచ్చుబడిపోయేలా మారుతుంది.మరి రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ►రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. ► బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ► అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ► దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ► నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ► కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. ► రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ► అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ► లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. ► ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. -
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రక్త హీనతను పూర్తి స్థాయిలో అరికట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాల ఆవశ్యకతను వివరిస్తూ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారందరికీ పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపట్టాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఆయా సచివాలయాల పరిధిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో రక్త హీనతను పూర్తిస్థాయిలో నివారించగలుగుతామన్నారు. తగ్గిందో లేదో పర్యవేక్షించాలి పౌష్టికాహారాన్ని తీసుకున్నాక బాధితుల్లో రక్తహీనత తగ్గుతోందా లేదా? అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవాలి. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణిలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అనే అంశాలను కూడా పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. యాప్‌లో వివరాలు నమోదు పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే ఆ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో సచివాలయాల వారీగా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. డ్రై రేషన్‌పై ప్రత్యేక దృష్టి వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. అంగన్వాడీలలో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పని చేస్తోందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇందుకోసం బలమైన ఎస్‌వోపీని రూపొందించాలని సూచించారు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం.జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి.వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? ఇవి తింటే సరిపోతుంది
శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో... రక్తహీనతను నివారించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు మందులు వాడాలి. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి. తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. కొన్ని చిత్రమైన లక్షణాలు రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనగా అనుమానించాల్సి ఉంటుంది. ∙తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి, పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. యుక్తవయసులో అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనిచ్చే మహిళల వరకూ అందరికీ ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. ►బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ► బెల్లం, వేరుసెనగ పప్పు కలిపి తిన్నా మంచిది. ∙తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగితే చాలా బలం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోరాదు. ► అరటిపళ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ రక్తహీనత నివారణకు ఉపకరిస్తాయి. ఇక కిస్మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
పిల్లలు, మహిళలపై రక్తహీనత పంజా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, పిల్లలను రక్తహీనత పట్టి పీడిస్తోంది. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 57.6 శాతం, ఐదేళ్ల లోపు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో పలు వివరాలు పేర్కొంది. పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 11 హెచ్‌బీ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత కలిగినవారిగా వర్గీకరించారు. అంతకుముందు ఐదేళ్లతో పోల్చినప్పుడు మహిళల్లో రక్తహీనత ఒక శాతం పెరిగింది. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు మహిళల రక్తహీనతలో తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా లడక్‌లో 92.8 శాతం మంది, అత్యంత తక్కువగా లక్ష ద్వీప్‌లో 25.8 శాతం మంది రక్తహీనత బాధితులున్నారు. ఇదే వయసు గల గర్భి ణుల్లో 53.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. గర్భిణుల రక్తహీనతలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఐదేళ్లలో గర్భిణుల్లో 48.2 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండగా, ఆ తర్వాత ఐదు శాతం పెరిగింది. ఇక 15–19 ఏళ్ల వయస్సుగల బాలికల్లోనూ రక్తహీనత శాతం 64.7 శాతముంది. అంతకుముందు ఐదేళ్లలో అది 59.7 శాతమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రక్తహీనత 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి. పిల్లల్లో అత్యధికం లడాక్.. అత్యల్పం కేరళ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వయ సు గల 70 శాతం మంది పిల్లలు రక్తహీనత బారినపడ్డారు. 2019–21 మధ్య దేశంలో ఆ వయస్సు పిల్లల్లో అత్యధికంగా లడక్‌లో 92.5 శాతం మంది, గుజరాత్లో 79.7 శాతం మంది రక్తహీనతకు గురయ్యారు. పిల్లల్లో రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కేరళ (39.4 శాతం), అండమాన్– నికోబార్ దీవులు(40 శాతం), నాగాలాండ్ (42.7 శాతం) మణిపూర్ (42.8 శాతం) ఉన్నాయి. రక్తహీనత బారిన పడిన పి ల్లల విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలోపు పిల్లల్లో జాతీయ సగటు 67.1 శాతం కంటే రాష్ట్రంలో ఎక్కువగా రక్తహీనత బాధితులు ఉన్నారని పేర్కొంది. 2015–16 సంవత్సరంతో పోలిస్తే, 2019–21 మధ్య 9.3 శాతం మేర రక్తహీనత బాధితులు తెలంగాణలో పెరిగారని వెల్లడించింది. ఇవీ కారణాలు.. తల్లి విద్యాస్థాయి, వయస్సు, తల్లిపాలు ఇచ్చే వ్యవధి తదితర కారణాలు పిల్లల్లో రక్తహీనతపై ప్రభావం చూపిస్తాయి. ఇనుము లోపం రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. డయేరియా, మలేరియా, ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయి. వివిధ సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక, విశ్వాసాల కారణంగా ఏర్పడే ఆహారపు అలవాట్లు కూడా రక్తహీనతకు కారణమవుతున్నాయి. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజుల్లో తీసుకునే చర్యలు కీలకమైనవని డాక్టర్ కిరణ్ మాదల విశ్లేషించారు. -
AP: లాభాల తీపి పెంచేలా
సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు. ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. బెల్లం పొడి.. మంచి రాబడి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు. చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది. ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్ వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి. న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. బెల్లం పానకం చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు. బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది. అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తా.. నూడిల్స్ బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్లో ట్యాంక్‌లో వేస్తారు. తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు. శిక్షణ ఇస్తున్నాం బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం -
'మీసం లేని రొయ్య' అడవిలో ఉంటుందయ్యా..
దట్టమైన అడవుల్లో ఈత దుబ్బుల మాటున లభ్యమయ్యే అడవి రొయ్యల కోసం ఆదివాసీలు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. వాటి కోసం వాగులు.. వంకలు.. కొండలు.. గుట్టలు దాటుకుని దట్టమైన అరణ్యాల్లోకి వెళ్తారు. ఈత దుబ్బుల్లో కనిపించగానే ఒడిసిపట్టి బుట్టలో వేసుకుంటారు. ఇంటికి తెచ్చి కమ్మగా వండుకుని ఆబగా తింటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే లభించే ఈ జీవులను బొడ్డెంగులు అని పిలుస్తారు. ఆదివాసీలు మాత్రం వీటిని అడవి రొయ్యలుగా ముద్దుగా పిలుచుకుంటారు. బొడ్డెంగులకు రొయ్యల మాదిరిగా మీసాలుండవు కానీ.. సేమ్ టు సేమ్ రొయ్యల్ని పోలి ఉంటాయి. సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మన్యంలో దొరికే బొడ్డెంగులు (అడవి రొయ్యలు) గిరిజనులకు ఎంతో ప్రీతి. వాటిని మన్యం ప్రజలు లొట్టలేసుకుని మరీ తింటారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే ఇవి లభిస్తాయి. గిరిజన గ్రామాలను ఆనుకుని ఉండే అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులున్న చోట ఇవి పెరుగుతాయి. ఈత మొదలును తవ్వితే మట్టిలో రొయ్యల మాదిరిగా ఉండే పురుగులు లభిస్తాయి. వీటి శరీరం పూర్తిగా కొవ్వుతో కూడి ఉంటుంది. వీటిని రొయ్యల వేపుడు, ఇగురు తరహా కూరలతోపాటు ఇతర వంటకాలను తయారు చేస్తుంటారు గిరిజనులు. ఎలా సేకరిస్తారంటే.. ఆదివాసీ యువకులు అటవీ ప్రాంతంలో చాలా శ్రమకోర్చి వీటిని సేకరిస్తుంటారు. సేకరించిన తర్వాత ఒక రాత్రి మాత్రమే ఇవి బతికి ఉంటాయి. ఈత చెట్టు కాపు పూర్తయ్యాక చెట్టు ఎండి అంతరించిపోయే క్రమంలో వాటి అడుగు భాగాన బొడ్డెంగులు పుట్టుకొస్తాయని ఆదివాసీలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీటి సేకరణ గిరిజన యువతకు ఉపాధి వనరుగా మారింది. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో మాత్రమే ఈత చెట్ల పెంపకం ఉంది. మంగళవారం పాడేరు మార్కెట్‌కు బతికి ఉన్న బొడ్డెంగుల్ని గిరిజనులు తీసుకు రాగా.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 30 బొడ్డెంగుల్ని రూ.100 చొప్పున విక్రయించగా, గంటలో ఎగరేసుకుపోయారు. బొడ్డెంగుల్ని విక్రయిస్తున్న గిరిజనులు రక్తహీనతకు తగ్గించే మందులా.. రక్తహీనత ఉన్న వారు బొడ్డెంగులను వేపుడు లేదా కూర వండుకుని తింటే ఆ సమస్య తగ్గుతుందని గిరిజనులు చెబుతుంటారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని వైద్యులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని సహజసిద్ధంగా దొరికే పౌష్టికాహారంగా అభివర్ణిస్తుంటారు. ఇవి దొరికిన రోజున బంధువులను పిలిచి మరీ గిరిజనులు విందులు ఏర్పాటు చేస్తుంటారు. జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజు (స్టఫ్)గా వీటిని ఆస్వాదిస్తారు. మంచి ఆదాయం వీటి కోసం దాదాపు వారం రోజులుగా తిరిగాం. పెదబయలు మండలం మారుమూల కుంతర్ల ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈత దుబ్బుల్లో సేకరించాం. తెచ్చిన గంటలోనే అమ్ముడయిపోయాయి. మంచి ఆదాయం వచ్చింది. వీటి వేపుడు ముందు రొయ్యల వేపుడు దిగదుడుపే. – బోనంగి కుమార్, కుంతర్ల, ఏఎస్సార్ మన్యం జిల్లా -
Blood Count: టాబ్లెట్లు అక్కర్లేదు! రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగితే
కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం... ►సపోటా జ్యూస్ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది. ►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడి రసం తాగితే.. ►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. నెలలోనే రక్తం వృద్ధి! ►కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. లేత కొబ్బరి తింటే కూడా! ►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. ►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ►అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. నోట్: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
రక్తహీనత నివారణకు సమగ్ర ప్రణాళిక: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రక్తహీనత సమస్య నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలను కోరారు. పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని నివారించాలని కోరారు. రక్తహీనత నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు గవర్నర్ సోమవారం ఎన్ఐఎన్ను సందర్శించారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థుల్లో రక్తహీనత సమస్య కొనసాగడం సరికాదని శాస్త్రవేత్తలతో అన్నారు. ఈ ఏడా దిని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన గవర్నర్.. వాటి ద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చన్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. -
వారి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వ అభయం
సాక్షి, అమరావతి : తరచూ రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి జబ్బులతో బాధపడే రోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ వీరి పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు వలంటీర్లు ఠంఛన్‌గా గుమ్మం వద్దకే పింఛన్ చేరవేస్తున్నారు. అంతే కాకుండా వీరికి ఉచితంగా రక్తమార్పిడి సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఆరోగ్యానికి మరింత అండగా నిలిచే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ తరహా జబ్బులతో బాధపడే వారికి వైద్య సేవల కోసం ప్రత్యేక వార్డులను ఆస్పత్రుల్లో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల వీరి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖ కేజీహెచ్, కర్నూల్, కాకినాడ, గుంటూరు జీజీహెచ్‌లలో హిమోగ్లోబినోపతీస్, హీమోఫిలియా సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల వైద్య సేవల కోసం ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను వైద్య శాఖ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40 లక్షల చొప్పున రూ.1.60 కోట్లు వెచ్చిస్తోంది. ప్రతి కేంద్రంలో పది పడకలు, ఒక మెడికల్ ఆఫీసర్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు, రక్త మార్పిడికి సంబంధించిన అధునాతన పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. వీలైనంత త్వరగా పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శ్యాక్స్ పీడీ నవీన్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
Health Tips: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఏం జరుగుతుందంటే!
Vitamin C Deficiency Symptoms: మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి... విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి రక్తం కారడం, అలసటగా అనిపించడం, దద్దుర్లు రావడం, నీరసంగా అనిపించడం వంటివన్నీ స్కర్వీ వ్యాధి లక్షణాలు. మొదట్లో అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లను స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంతో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి. 3. రక్తహీనత శరీరం ఇనుమును శోషించుకోవడానికి విటమిన్ సి సాయపడుతుంది. తగిన స్థాయిలో ఈ విటమిన్ అందకపోతే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, ముఖం పాలిపోయినట్టు అవడం, శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 4. చర్మ సమస్యలు విటమిన్ సిలో యాంటీఆక్సడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు, రక్తస్రావం వంటివి కలుగుతాయి. Vitamin C Rich Foods: ఏం తినాలి? ►విటమిన్ సి లోపం తలెత్తకుండా ఉండాలంటే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ►నారింజలు, నిమ్మ రసాలు తాగుతూ ఉండాలి. ►బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, క్యాప్సికమ్, బొప్పాయి, జామ, కివీలు, పైనాపిల్, టమోటాలు, పచ్చిబఠాణీలను మీ ఆహార మెనూలో చేర్చుకోవాలి. ►విటమిన్ సి టాబ్లెట్లను వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి. చదవండి👉🏾Fruits For Arthritis Pain: కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర తింటున్నారా! అయితే..
These Amazing Foods In Your Diet Help Fight Deficiency Of Anemia: భారతీయ మహిళను వేధిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఎనీమియా. రక్తహీనతను అనారోగ్యంగా పరిగణించకుండా అజాగ్రత్తగా రోజులు గడిపేస్తుంటారు కూడా. నిజానికి ఇది అనేక రకాలుగా ప్రాణాపాయానికి కారణమవుతుందని గమనించాలి. ఎప్పుడూ అలసటగా అనిపించడం, చర్మం నిర్జీవంగా, తెల్లగా పాలిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, నిస్సత్తువ, గుండె వేగం ఉన్నట్లుండి పెరిగిపోవడం, శ్వాస దీర్ఘంగా తీసుకోలేకపోవడం, దేని మీదా ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉండడం... ఇవన్నీ రక్తహీనత కారణంగా కనిపించే ప్రధాన లక్షణాలు. రక్తహీనత ఉన్నప్పుడు దేహంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి తరచుగా అంటువ్యాధులు దాడి చేస్తుంటాయి. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం. ఐరన్‌లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ►‘సి’ విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ►నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ►రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయ పులిహోర వంటి వంటకాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి. ►సీ విటమిన్ తగినంత లేకపోతే ఆహారంలో తీసుకున్న ఐరన్‌ను దేహం గ్రహించలేదు. కాబట్టి ఆకు కూరల్లో నిమ్మరసం కలుపుకుని తినడం మంచిది. ►రక్తహీనతతోపాటు కఫం తో కూడిన దగ్గు కూడా ఉంటే రోజూ ఉదయం సాయంత్రం కప్పు పెరుగును టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపుతో కలిపి తీసుకోవాలి. ►దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ►నువ్వులను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవాలి. ►నువ్వులను రెండు–మూడు గంటల సేపు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో తేనె కలుపుకుని తినవచ్చు. ►నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ►రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు తింటే చాలు. రక్తహీనత నుంచి సులువుగా బయటపడవచ్చు. -
Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే..
Vitamin C Rich Foods In Telugu: మీ శరీరంపై గాయాలు మానడానికి చాలా కాలం పడుతుందా? బ్రష్ చేసేటప్పుడు చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? ..ఇంకా అలసట, నీరసం, చర్మం ముడతలు పడటం... మీ సమాధానం అవునైతే.. మీరు విటమిన్ ‘సి’లోపంతో బాధపడుతున్నారేమో! ఐతే ఇతర వైద్య కారణాల వల్ల కూడా ఇవే సమస్యలు సంభవించవచ్చు. విటమిన్ సి లోపాన్ని సకాలంలో గుర్తించకపోతే.. రక్తహీనత, మైయాల్జియా, ఎడీమా, పెరియోడాంటైటీస్, పెటెచియా వంటి తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అలాగే కొద్దిపాటి ఆహారపు అలవాట్లతో కూడా విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు మీకోసం.. సిట్రస్ ఫ్రూట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ ప్రకారం.. ప్రతిరోజూ మన శరీరానికి 40 గ్రాముల చొప్పున విటమిన్ ‘సి’ అవసరం అవుతుంది. సిట్రస్ పండ్లను తరచూ తీసుకుంటే ఇమ్యునిటీ సిస్టం బలపరచటమేకాకుండా, చర్మం, ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే కొల్లాజెన్ హార్మోన్ ఏర్పడటానికి కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. బొప్పాయి యాంటీఆక్సిడెంట్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. ‘హీలింగ్ ఫుడ్స్’ బుక్ ప్రకారం యాంటీ బ్యాక్టీరియల్ కారకాలు కూడా దీనిలో అధికంగా ఉంటాయని తెలుస్తోంది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! టమాట విటమిన్ ‘ఎ’, ‘సి’లు టమాటాలో నిండుగా ఉంటాయి. మన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ రెండు విటమిన్లు ఎంతో సహాయపడతాయి. అందువల్లనే రోజు వారి వంటకాల్లో టమాటాను వాడకం పరిపాటైంది. స్ట్రాబెర్రీ పండ్లు స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమేకాకుండా విటమిన్ ‘సి’ కూడా అధికంగా ఉంటుంది. నిజానికి ఆరెంజ్ పండ్లలో కన్నా స్ట్రాబెర్రీ పండ్లలోనే విటమిన్ ‘సి’ కంటెంట్ అధికంగా ఉంటుంది. బ్రొకోలి వంద గ్రాముల బ్రొకోలిలో 89 గ్రాముల విటమిన్ ‘సి’ఉంటుంది. యాంటీ ఆక్సిటెంట్లకు, అనేక ఖనిజాలకు బ్రొకోలి స్థావరం వంటిదని బెంగళూరుకు చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్ డా.అంజు సూద్ పేర్కొన్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
మతిమరుపు...మందు
-
రక్తహీనతపై ఐరన్ అస్త్రం..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ప్రపంచానికి అమ్మతనపు కమ్మదనాన్ని పరిచయం చేసే మహిళలు గర్భం దాల్చిన తర్వాత అనారోగ్యం బారిన పడుతున్నారు. రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గర్భిణులందరికీ ఐరన్ మాత్రల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలో 2019–20లో 95.67శాతం, 2020–21లో 104.01శాతం మందికి ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు. అంతేకాకుండా 2020–21లో 98.03శాతం మంది గర్భిణులకు ధనుర్వాతం రాకుండా ముందుగానే టెటనస్ టాక్సిడ్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. సమస్య ఎందుకు వస్తుందంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో తినకపోయినా తిన్నామని చెబుతూ మంచినీళ్లు తాగి కాలం వెళ్లదీస్తుంటారు. ఫలితంగా వారిలో రక్తహీనత పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు అవగాహన లేక పోషకాహారానికి దూరంగా ఉంటున్నారు. వీరు గర్భం దాల్చిన సందర్భంలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పోషకాహారం పంపిణీతో పాటు ఐరన్‌మాత్రలు ఇస్తున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తున్నారు. హైరిస్క్ గర్భిణులతో పాటు మొదటిసారి గర్భం దాల్చిన వారిపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రసవం అయ్యేలోపు నాలుగుసార్లు వైద్యుల వద్ద పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 అర్బన్‌హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోనిలో మాతాశిశు ఆసుపత్రి, కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. రక్తహీనతతో ఇబ్బందులు ఇవీ.. రక్తహీనతతో గర్భంలో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండదు. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. నెలలు నిండకుండానే బిడ్డ జన్మించి చనిపోవచ్చు. తల్లికీ టీబీ వచ్చే అవకాశం ఉంది. తల్లికి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువ. బీపీ ఎక్కువైతే మెదడులో నరాలు చిట్లవచ్చు. కొన్నిసార్లు తల్లి, బిడ్డ మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. సాధారణ మహిళతో పాటు గర్భిణులకు హిమోగ్లోబిన్ ఎప్పుడూ 10 శాతం పైగానే ఉండేటట్లు చూసుకోవాలి. ఐరన్ ఫోలిక్ మాత్రల ప్రయోజనం ఇదీ.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 8 నుంచి 10 గ్రాములు ఉంటే కొంచెంగా, 6 నుంచి 8 గ్రాములుంటే మధ్యస్తంగా, 6 కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన రక్తహీనతగా వైద్యులు చెబుతారు. 8 నుంచి 10 శాతం ఉన్న వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, 6 నుంచి 8 గ్రాములు ఉన్న వారికి ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూజన్ ఇంజెక్షన్లు ఇస్తారు. 6 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం రక్తం ఎక్కిస్తారు. గర్భిణులు మూడో నెల నుంచే ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వారు తీవ్ర రక్తహీనతకు చేరి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
రక్తహీనత నివారణకు బలవర్థక బియ్యం
సాక్షి, అమరావతి: రక్తహీనత లోపాన్ని నివారించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో బలవర్థకమైన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 3 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను సేకరించేందుకు వీలుగా పౌరసరఫరాలసంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన ఫోర్టిఫికేషన్ రిసోర్స్ సెంటర్ (ఎఫ్ఎఫ్ఆర్సీ) ప్రకారం బియ్యానికి బీ–12తో పాటు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను మిశ్రమం చేసే సొంత మిల్లు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని పౌరసరఫరాలసంస్థ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు 750 మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాకు 600, పశ్చిమ గోదావరి జిల్లాకు 850, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు 500, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు 300 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను కేటాయించారు. టెండరు దక్కించుకున్నవారు ఆయా జిల్లాల్లో సూచించిన గోదాములకు బియ్యాన్ని సరఫరా చేయాలి. కొందరు పేదలు తీసుకుంటున్న ఆహారంలో ఇనుము, అయోడిన్, జింక్, విటమిన్ ఏ, డీ, బీ–12 లోపించినట్లు గుర్తించా రు. వీటిలోపం వల్ల వస్తున్న జబ్బుల నుంచి వారిని దూరం చేసేందుకు బలవర్థకమైన ఆహా రం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మహిళలను ఒక పట్టాన వదలని రక్తహీనత...
రక్తహీనత పురుషుల్లో, మహిళల్లో ఇలా అందరిలో కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. అందునా భారతీయ మహిళల్లోని దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉండనే ఉంటుందని అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లోతేలింది. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. మన శరీరంలోని 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. కారణాలు మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. ∙శ్వాస కష్టంగా ఉండటం ∙కొద్దిపాటి నడకకే ఆయాసం ∙అలసట ∙చికాకు / చిరాకు / కోపం ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం ∙కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం ∙పాలిపోయినట్లుగా ఉండటం ∙ఛాతీనొప్పి ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైనవి. జాగ్రత్తలు / చికిత్స ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలైన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కొందరిలో ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇవి వాడే సమయంలో కొందరికి మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకే వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి. డాక్టర్ ఆరతి బళ్లారి హెడ్ ఇంటర్నల్ మెడిసిన్ -
రక్తహీనతను రానివ్వకండి...
ఒంట్లో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గితే నీరసం ఆవహిస్తుంది. నిస్త్రాణగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ. రక్తహీనత రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్నా, సింపుల్ టిప్స్ పాటిస్తే సరి! ► జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి. ► రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్ చేసుకుని తాగాలి. ► బీట్రూట్, క్యారట్, ఉసిరి కలిపి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్ పుష్కలంగా వస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. ► రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి. ► గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది. ► మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. -
ఎండిన పండ్లతో... మెండైన ఆరోగ్యం
డ్రైఫ్రూట్స్‌ను మనందరం చాలా ఇష్టంగా తింటుంటాం. ఈ ఎండిన పండ్లలో మనకు బాగా తెలిసినవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర వంటివి కొన్నే. కానీ... ఇటీవల అలాంటి డ్రైఫ్రూట్ ఎన్నెన్నో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా అవి ఎన్నెన్నో వ్యాధుల నివారణకూ తోడ్పడుతున్నందువల్ల వాటిపై ఆసక్తి కూడా బాగా పెరిగింది. ఇటీవల వాటి లభ్యత కూడా బాగానే పెరిగింది. కొన్ని ఎండు పండ్లు... ఎన్నో వ్యాధుల నివారణతో బాగా మన ఆరోగ్య పరిరక్షణలో, వాటితో ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కలిగించుకునేందుకు తోడ్పడేదే ఈ కథనం. సాధారణంగా ఆరోగ్యాన్ని కలిగించేవి కాస్తంత చేదుగానో, ఘాటుగానో, వగరుగానో ఉంటాయి. వాటిని తినడానికి మనం ఒకింత ఇబ్బంది పడుతుంటాం కూడా. కానీ ఎండిన పండ్లు మంచి రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగానే మనం వీటిని తింటుంటాం. అలా ఇష్టంతో, మంచి రుచితో కొన్ని జబ్బులను నివారించుకునే మార్గాలను చూద్దాం. రక్తహీనత తగ్గించే ఎండు ఖర్జూర: సాధారణంగా మహిళలందరిలోనూ రక్తహీనత కనిపిస్తుంటుంది. ప్రతినెలా అయ్యే రుతుస్రావం వల్ల ఈ కండిషన్ ఉంటుంది. రక్తహీనతను నివారించే మంచి మార్గాల్లో ఎండు ఖర్జూరం ఒకటి. బాగా నీరసంగా ఉండేవారికి సైతం ఎండు ఖర్జూర మంచి ఉపయోగకారి. చాలాసేపు ఏమీ తినకుండా ఉండి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గి, నీరసంగా ఉన్నవారిలో ఆ నిస్సత్తువను తక్షణం తగ్గించేందుకు ఎండు ఖర్జూరాలు తోడ్పడతాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల కేవలం ఒకటి రెండు ఎండు ఖర్జూరాలతోనే అన్నం తిన్నంత ఫలితం ఉంటుంది. అలాగే ఎండిన అత్తిపండ్లు (డ్రై– ఫిగ్స్) తినడం వల్ల దీనిలోని ఐరన్, విటమిన్–సి వల్ల రక్తహీనత తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రక్తహీనత నివారణకు మాంసాహారం... ముఖ్యంగా మాంసాహారాల్లోనూ కాలేయం బాగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే కఠినంగా శాకాహార నియమాలు పాటించేవారికి ఇది ఒకింత ఇబ్బంది కలిగించే పరిష్కారం. అలాంటివారందరూ ఎండిన ఫిగ్స్‌పై ఆధారపడవచ్చు. రక్తహీనతతో బాధపడేవారిలో మాంసాహారంలోని కాలేయం వంటివి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఒనగూరుతాయో... ఎండిన ఫిగ్స్తోనూ అవే ప్రయోజనాలు చేకూరతాయి. అధిక రక్తపోటు నివారణకు ఎండు ఆప్రికాట్: సాధారణంగా హైబీపీతో బాధపడేవారికి అరటిపండ్లు తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. అరటిపండులో పుష్కలంగా ఉండే పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది/నియంత్రిస్తుంది. అందుకే ఆ సూచన చేస్తుంటారు. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఏప్రికాట్లో మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియమ్ ఉంటుంది. దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది. అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. (దీనికి భిన్నంగా సోడియమ్ అన్నది రక్తపోటును పెంచుతుందన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉన్నందున ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దంటూ డాక్టర్లు సూచిస్తుంటారు కూడా). అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఏప్రికాట్ మంచి రుచికరమైన మార్గం. ఆస్టియోపోరోసిస్‌ను నివారించే రెయిసిన్స్ : ఇటీవల రకరకాల రెయిసిన్స్ (కిస్మిస్ లాంటివే అయినా బాగా ఎండిన మరో రకం ద్రాక్ష) మెనోపాజ్‌కు చెరుకున్న మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. వాళ్ల ఎముకలను పటిష్టం చేస్తాయి. సాధారణంగా మహిళలందరిలోనూ ఒక వయసు దాటాక ఎముకల సాంద్రత తగ్గుతుంది. (ఈ పరిణామం అందరిలోనూ కనిపించినా... మెనోపాజ్ దాటాక మహిళల్లో మరింత ఎక్కువ. అందుకే ఎముకలను పెళుసుబార్చి తేలిగ్గా విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ వాళ్లలోనే ఎక్కువ). సాధారణంగా పాలు, పాల ఉత్పాదనల్లో కాల్షియమ్ ఎక్కువ. అందుకే పెరుగులో కొన్ని రెయిసిన్స్ ముక్కలతో పాటు మన దగ్గర ఇటీవలే లభ్యత పెరిగిన ‘పెకాన్స్’ వంటి ఎండుఫలాలను కలిపి తీసుకుంటే మరింత మంచి ప్రయోజనం కనిపిస్తుంది. మలబద్దకాన్ని నివారించే ప్రూన్స్: ఈ ప్రూన్స్ కూడా కిస్మిస్, రెయిజిన్స్ లాంటి మరో రకం ఎండు ద్రాక్ష. కాకపోతే అవి నల్లటి రంగులో కిస్మిస్, రెయిజిన్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. మనలో చాలామంది మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడం కోసం అనేక మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే రుచుకరమైనదీ, తేలికైన మార్గం ప్రూన్స్ తినడం. రోజూ అరడజను ప్రూన్స్ తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుందని అనేక పరిశీలనల్లో తేలింది. ప్రూన్స్లో ఉండే సార్బిటాల్ అనే పోషక పదార్థం మలాన్ని మృదువుగా చేసి అది తేలిగ్గా విసర్జితమయ్యేలా తోడ్పడతుంది. కాబట్టి మలబద్దకం ఉన్నవారు ఈ రుచికరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రయోజనం పొందవచ్చు. గౌట్‌ను నివారించే ఎండు చెర్రీలు: ఎండు చెర్రీలలో యాంథోసయనిన్ అనే పోషకం ఉంటుంది. ఇది ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ను సమర్థంగా తగ్గిస్తుంది. అందుకే ఎముకల్లో తీవ్రమైన నొప్పి కలిగించే గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చెర్రీలను తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిరోజుల కిందట యూఎస్ లోని మిషిగన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు తినేవారిలో ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ సగానికి సగం తగ్గుతాయని తేలింది. యూరినరీ ఇన్ఫెక్షన్స నివారణకు ఎండిన క్రాన్బెర్రీ పండ్లు : మహిళల్లో మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఇలా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల (యూరినరీ ఇన్ఫెక్షన్స్)తో బాధపడేవారు ఎండిన క్రాన్బెర్రీ పండ్లను తింటే మంచి ఉపశమనం కలుగుతుందని తేలింది. కొన్ని అమెరికన్ అధ్యయనాల్లో ఇది నిరూపితమైన సత్యం. అంతేకాదు క్యాన్‌బెర్రీ పండ్ల వల్ల జీర్ణసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచీ ఉపశమనం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ–కోలై బ్యాక్టీరియా నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని తేలింది. ఎండిన క్యాన్‌బెర్రీలలో ఉండే ప్రో–యాంథోసయనిన్ అనే పోషక పదార్థం వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని స్పష్టమైంది. జీనత్ ఫాతిమా డైటీషియన్ -
పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం
సాక్షి, అమరావతి : పిల్లల్లో పౌష్టికాహార లోపం దేశంలో పెద్ద సవాలుగా తయారైందని పోషన్ అభియాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాది నుంచి నాలుగో ఏడాది వరకు పిల్లలు అత్యధికంగా రక్తహీనతతో బాధ పడుతున్నారని పోషన్ అభియాన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెల్లడించిన మూడవ నివేదికలో స్పష్టం చేసింది. 5-9 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు 10-19 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనతతో పాటు విటమిన్ ఏ, విటమిన్-డి, బి-12, జింక్ లోపాలు అత్యధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల పిల్లల్లో ఎక్కువ బరువు, ఊబకాయం పెరుగుతోందని.. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అదనపు పోషకాహారం అందించాలని సూచించింది. సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసెస్-సంయుక్త అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను, గర్భిణులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లిమెంటరీ పోషకాలను అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పౌష్టికాహార లోపం గల పిల్లలు ఉంటున్నారని, రక్తహీనత కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉందని, ఆ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలు రక్తహీనత 1-4 ఏళ్లలోపు పిల్లలు 41 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం విటమిన్-డి లోపం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం 5-9 ఏళ్లలోపు ప్లిలలు 18 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం విటమిన్ బి-12 లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 31 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం పోలిక్ యాసిడ్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 37 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 23 శాతం జింక్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 32 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 19 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం -
కావ్యను కాపాడటానికి 63 మంది సిద్ధం
తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఓ బాలికను రక్షించేందుకు యువత కదిలింది. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా బాలిక ప్రాణం కాపాడేందుకు ముందుకు వచ్చారు. బాలిక కోసం ఏకంగా 63 మంది రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మదురై విల్లాపురం పుదునగర్ వాసులు తమలోని ఐక్యత, సామరస్యాన్ని చాటుకున్నారు. సాక్షి, చెన్నై : తిరువారూర్‌కు చెందిన రవి కుమార్తె కావ్య(17) కొంత కాలంగా రక్తహీనత సమస్యతో బాధపడుతోంది. గత వారం మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమెకు అత్యధిక యూనిట్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి వర్గాల సూచన మేరకు బయట నుంచి రక్తాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రవికి ఏర్పడింది. అంత స్తోమత లేని దృష్ట్యా ఆస్పత్రి వర్గాలను సంప్రదించాడు. ఎవరైనా రక్తం ఇస్తే ప్రత్యామ్నాయంగా తమ వద్ద ఉన్న రక్తం ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు సలహా ఇచ్చారు. చదవండి: శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే.. లాక్డౌన్ సమయంలో రక్తం దొరకడం గగనమేనని, దాతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని..నెలగా వెలుగు చేసిన ఘటలను అతనికి వివరించారు. దీంతో ఆందోళన చెందిన రవి తన కుమార్తెను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు మదురై జిల్లా తిరుప్పరగుండ్రం సమీపంలోని విల్లాపురం పుదునగర్‌లో ఉన్న తమ సమీప బంధువుకు గోడు చెప్పుకున్నాడు. పుదునగర్ వాసుల సంక్షేమ సంఘం పేరిట తరచూ ఇక్కడి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం రవికి కలిసి వచ్చింది. దీంతో ఆ సంఘం నిర్వాహకులు ఇబ్రాహీం, సుల్తాన్, షేట్లను కలిశారు. చదవండి: 'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు' ఆగమేఘాలపై శిబిరం రవి కుమార్తె కావ్యను రక్షించేందుకు ఆ సంక్షేమ సంఘంలోని యువత ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రత్యేక వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. మతాలకు అతీతంగా అందరూ కదిలారు. ఏకంగా 63 మంది యువకులు రక్తదానం చేశారు. ఇక బాలికను రక్షించాల్సిన బాధ్యత మీదే అంటూ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి యువకుల ఐక్యత, సామరస్యం చూసిన ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వర్గాలు నివ్వెరపోయాయి. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా పదుల సంఖ్యలో మైనారిటీ యువకులు రక్తదానం చేయడం విశేషం. ఇక్కడి యువత మతాలకు అతీతంగా అన్నదమ్ముళ్లుగా మెలుగుతున్నారని, ఎవరికి చిన్న కష్టం వచ్చినా చలించిపోతారంటూ ఆ సంక్షేమ సంఘం వర్గాలు ప్రశంసించాయి. బాలికకు అవసరం అయ్యే మేరకు తమ వద్ద ఉన్న ఆమె గ్రూపు రక్తాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని వైద్యులు తెలిపారు. -
బిడ్డకు రక్తం పంచబోతున్నారా?
మన దేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని ఒక అంచనా. ఓ మోస్తరు రక్తహీనత దీర్ఘకాలం కొనసాగినా రకరకాల అనర్థాలు వస్తాయి. అయితే గర్భవతుల్లో రక్తహీనత వల్ల ఇటు కాబోయే తల్లికీ, అటు పుట్టబోయే బిడ్డకూ ప్రమాదమే.కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనీమియా కేసులు ఎక్కువే... మరీ ముఖ్యంగా గర్భవతుల్లో. కాబట్టి ఈ రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని అధిగమించడానికి మార్గాలను తెలుసుకుందాం. రక్తంలోని ఎర్రరక్తకణాలుగాని, దానిలో ఉండే పిగ్మెంట్ అయిన హీమోగ్లోబిన్గాని లేదా రెండూగాని తక్కువ అయితే వచ్చే సమస్యను రక్తహీనత (అనీమియా) అంటారు. కారణాలను బట్టి రక్తహీనతల్లో చాలా రకాలున్నాయి. గర్భిణుల్లో 90 శాతం రక్తహీనత ఐరన్ లోపం వల్ల, 5 శాతం ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం రక్తంలో 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా పరిగణించాలి. గర్భిణుల్లో రక్తహీనత ఎందుకు ఏర్పడుతుందంటే? గర్భిణుల్లో మామూలు మహిళల కంటే 40 శాతం (అంటే 1 నుంచి 2 లీటర్లు) ఎక్కువగా రక్తం వృద్ధి అవుతుంటుంది. గర్భంలో ఎదిగే బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సమృద్ధిగా అందడానికి వీలుగా ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది. గర్భం ధరించిన నాలుగో నెల నుంచి మహిళల్లో రక్తం వృద్ధి చెందడం మొదలువుతుంది. ఎనిమిదో నెల నిండేసరికి ముందున్న దానికంటే రక్తం 40–50 శాతం పెరుగుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్న స్త్రీకైనా గర్భం వచ్చిన 5–6 నెలలకి రక్తంలోని ప్లాస్మా పెరగడం వల్ల హీమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. రక్తం పట్టడానికి తగిన ఆహారం, ఐరన్ మాత్రలు వాడేవారిలో మళ్లీ కొద్దివారాల్లోనే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలా తీసుకోని వారిలో హీమోగ్లోబిన్ శాతం మరింత తగ్గుతుంది. రుతుస్రావం కూడా మరో కారణం... రుతు సమయంలో సాధారణంగా ఐదు రోజుల పాటు రక్తస్రావం అయ్యే మహిళల్లో నెలకు 45 సి.సి. రక్తం కోల్పోతేæ15 మి.గ్రా. ఐరన్‌ను కోల్పోయినట్లే. అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవారిలో ఇంకా ఎక్కువగా ఐరన్ తగ్గిపోతుంది. వీరు సరిగా ఆహారం తీసుకోకపోతే రక్తహీనత కలగవచ్చు. ఇక అప్పటికే రక్తహీనతతో ఉన్న మహిళ గర్భం ధరిస్తే... అనీమియా తీవ్రత మరింత పెరగవచ్చు. రక్తహీనత నివారణ / చికిత్స... ►21 ఏళ్లకంటే ముందర గర్భం రాకుండా చూసుకోవాలి. ►గర్భం దాల్చిన తర్వాత నాల్గవ నెల నుంచి పౌష్టికాహారంతో పాటు రోజూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్న మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి ►నులిపురుగులు, మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి ►కాన్పుకి, కాన్పుకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండేట్లు జాగ్రత్త పడటం వల్ల ఐరన్ నిలువలు పెరిగి మరో కాన్పుకు రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు. సవరించడానికి... ►రక్తహీనతకు గల కారణాలను గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాలి. ►డాక్టర్ సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడాలి. బలంగా ఎదిగే పిల్లలతో ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం గర్భవతుల్లో రక్తహీనత సమస్యను తప్పనిసరిగా అధిగమించాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళల్లో రక్తహీనతతోపాటు మరీ ముఖ్యంగా గర్భవతుల్లో అనీమియా సమస్యను నివారించడానికి సమాజం మొత్తం ఈ విషయంపై అవగాహన పెంచుకోవడం అవసరం. గర్భవతుల్లో రక్తహీనత లక్షణాలు ►తీవ్రతను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. సాధారణంగా కనిపించేవి... ►అలసట; ►గుండెదడ; ►కళ్లుతిరగడం; ►తలనొప్పి; ►తలబరువుగా ఉన్నట్లు అనిపించడం; ►ఆయాసం; ►కొంచెం పనికే ఊపిరి అందకపోవడం; ►నిద్రపట్టకపోవడం; ►ఆకలిలేకపోవడం; ►కాళ్లూ, చేతులు మంటలు, నొప్పులు; ►నోరు, నాలుకలో నొప్పి, పుండ్లు; ►నీరసం; ►బియ్యం, మట్టి తినాలనిపించడం; ►చర్మం మ్యూకస్‌పొరలు పాలిపోయి ఉండటం; ►కాళ్లవాపు; ►గుండె వేగంగా కొట్టుకోవడం; ►గోళ్లు పలచగా తయారవ్వడం, జుట్టు రాలిపోవడం. రక్తహీనతలో రకాలు స్వల్పరక్తహీనత (మైల్డ్) ... 8.7 గ్రా. నుంచి 10 గ్రా. ఉంటే ఒకమోస్తరు రక్తహీనత (మోడరేట్) ... 6.6 గ్రా. నుంచి 8.6 గ్రా. ఉంటే తీవ్రమైన రక్తహీనత (సివియర్) ... 6.5 గ్రా. కంటే తక్కువ రక్తహీనతకు కారణాలు ►గర్భం వచ్చాక రక్తంలో జరిగే మార్పుల వల్ల హీమోగ్లోబిన్ పరిమాణం తగ్గడం. ►ఆర్థిక, సామాజిక కారణాల వల్ల పౌష్టికాహార లోపం కారణంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం. ►జంక్‌ఫుడ్ తీసుకోవడం. ►జీర్ణవ్యవస్థలో నులిపురుగులు ఉంటే అవి రక్తాన్ని పీల్చుకోవడం ►జీర్ణకోశంలోని కొన్ని సమస్యల వల్ల ఆహారం నుంచి ఐరన్ సక్రమంగా రక్తంలోకి చేరకపోవడం (కడుపులో అల్సర్లవంటి కారణాల వల్ల కూడా) ►రక్తవిరేచనాలు, మొలలు ►గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవసమయంలో రక్తస్రావం. ►దీర్ఘకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతున్నవారిలో ఎర్రరక్తకణాలు విరిగిపోవడం. ►దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, లక్షణాలేమీ బయటకు కనపడకుండా మూత్రవ్యవస్థలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం. ►యువతులు 21 ఏళ్ల లోపు గర్భం ధరిస్తే ఐరన్, ప్రోటీన్స్ వంటివి బాలిక శరీరానికీ, గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదలకూ... ఇలా ఇద్దరికీ అవసరం ఉంటుంది. కాబట్టి అవి సరైన పాళ్లలో అందక రక్తహీనత రావచ్చు. ►పుట్టుకతో వచ్చే థలసీమియా, సికిల్‌సెల్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►అరుదుగా వచ్చే ఎప్లాస్టిక్ అనీమియా, రక్తసంబంధిత వ్యాధుల వల్ల ►కాన్పుకి, కాన్పుకి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడం వల్ల ►క్షయ, కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఇదేనా మాతాశిశు సంక్షేమం!
సాక్షి, ఆదిలాబాద్ : ఒకవైపు పోషణ మాసోత్సవం నిర్వహిస్తున్నా మరోపక్క జిల్లాలో మాతాశిశు మరణాల పరంపర కొన సాగుతోంది. ఏదో ఒక చోట పోషకాహార లోపం..రక్తహీనతతో పచ్చి బాలింతలు, శిశువులు తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిలో పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానంగా భావిభారత దేశం పోషకాహార లోపంతో నిస్సహాయ స్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. చిన్నారుల్లో పౌష్టికాహారం లేమితో ఎదుగుదల లోపించకుండా, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతతో బాధపడకుండా, ప్రసవంలో శిశువు తక్కువ బరువుతో జన్మిస్తే బరువు పెంచేందుకు చర్యలు తీసుకోవడమే ఈ అభియాన్ ముఖ్య లక్ష్యం. తద్వారా దేశ వ్యాప్తంగా 38 శాతం ఉన్న పౌష్టికాహార లోపాన్ని, 54 శాతం ఉన్న రక్తహీనత శాతాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి వెయ్యి రోజుల వరకు పూర్తిస్థాయిలో మాతాశిశు సంరక్షణపై దృష్టి సారించాలి. తల్లితోపాటు బిడ్డ ఆరోగ్య సంరక్షణకు పౌష్టికాహారం అందించాలి. నేషనల్ న్యూట్రీషియన్ మిషన్ (ఎన్ఎన్ఎం) ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ అప్పట్లో ప్రారంభించారు. 2022 వరకు ఈ కార్యక్రమం అమలులో ఉండనుంది. ఇప్పటికే 18 నెలలు పూర్తయినా జిల్లాలో దీని ఫలితాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. నీరుగారుతున్న లక్ష్యం.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, జిల్లాలో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఒకపూట సంపూర్ణ భోజనంతోపాటు పాలు, ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. అలాగే చిన్నారులకు బాలామృతం, రోజుకో గుడ్డు, ఇతరత్ర పోషకాహారం అందజేయాలి. అయితే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపం ఉండడంతో లబ్ధిదారులకు ఆ ప్రయోజనం దక్కడం లేదు. జిల్లాలో మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కవ్వడంతోనే అంగన్వాడీ కేంద్రాలకు ఇలాంటి సరుకుల పంపిణీ జరుగుతుందన్న ఆగ్రహం లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల నార్నూర్ మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం కోడిగుడ్లను స్థానిక యువకులు పట్టుకున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన సర్పంచులు ఓ సూపర్వైజర్ను నాసిరకం సరుకుల విషయంలో నిలదీశారు కూడా. ఇలాంటి సంఘటనలతో పథకం అమలు లక్ష్యం నీరుగారిపోతోంది. మాసోత్సవ నిర్వహణలోనూ కక్కుర్తి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించిన తర్వాత గత సంవత్సరం మధ్యలో వారోత్సవం, పక్షోత్సవాలు నిర్వహించారు. తద్వారా అభియాన్ ఉద్దేశాలను ప్రజల వరకు చేర్చడంలో కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆశయం. రెండో ఏడాది ఈనెలలో మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా సంక్షేమ అధికారికి రూ.30వేలు, క్షేత్రస్థాయిలో ఒక్కో ప్రాజెక్టు అధికారికి రూ.25వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మాసోత్సవ నిర్వహణకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులతో వివిధ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సి ఉండగా, జిల్లాలో అధికారులు తూతూమంత్రంగా చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇటీవల జిల్లా కేంద్రంలోని డీడబ్ల్యూవో కార్యాలయంలో గర్భిణులకు సీమంతం కార్యక్రమాలకు సంబంధించి అంగన్వాడీలపైనే భారం నెట్టారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులను కేంద్రాల నిర్వాహకులే ఆటోల ద్వారా తీసుకురావడమే కాకుండా చీర, గాజులు, పండ్లు, పువ్వుల ఖర్చులు కూడా వారే భరించాల్సి రావడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మాసోత్సవ నిర్వహణకు సంబంధించి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారులు కేంద్రాలకు పంపిణీ చేయకపోవడంతో గతేడాది సంబంధించిన ఫ్లెక్సీలనే ప్రదర్శించారన్న అపవాదు ఉంది. ఈ మాసోత్సవానికి సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉండగా, జిల్లా, ప్రాజెక్టుల స్థాయిలో నామమాత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అధికారులు నిధుల విషయంలో కక్కుర్తి పడ్డారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులు అభియాన్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ మిషన్ కాలవ్యవధి సగం ముగిసిపోగా, మిగిలిన సగంలోనైనా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణకు పూర్తిస్థాయిలో దోహదపడాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మాసోత్సవ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో జిల్లా కోఆర్డినేటర్, జిల్లా సహాయక అధికారి, ఒక్కో ప్రాజెక్టు స్థాయిలో బ్లాక్ కోఆర్డినేటర్, బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లను నియమించినా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బాయి...ప్రమాదమా?
నా వయసు 65 ఏళ్లు. నేను ఆల్కహాలిక్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. నాకు ఎండోస్కోపీ చేసి ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయని చెప్పారు. వాటివల్ల ఏదైనా ప్రమాదమా? మీకు సిర్రోసిస్ అనే జబ్బు వల్ల ఆహారవాహికలో ‘ఈసోఫేజియల్ వారిసెస్’ అనేవి అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాన్ని బట్టి మీకు మున్ముందు రక్తపువాంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ వారిసెస్ అనేవి ఏ పరిమాణంలో ఉన్నాయన్న విషయం మీరు రాయలేదు. మాములుగా వారిసెస్ పరిమాణం గ్రేడ్3 లేదా గ్రేడ్ 4 ఉన్నట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రక్తపువాంతుల విషయాన్ని మీ లేఖలో ప్రస్తావించలేదు కాబట్టి మీకు ఇంతకు ముందు ఆ రక్తపు వాంతులు అయినట్లు లేదు. కాబట్టి మీరు ప్రొప్రనాల్ 20 ఎంజీ, రోజుకు రెండుసార్లు వాడితే సరిపోతుంది. మీ సైమస్యకు ఎండోస్కోపీ ద్వారా ‘బ్యాండింగ్’ అనే చికిత్స చేసి, ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేటట్లు చేయవచ్చు. దానివల్ల రక్తపువాంతులు అయ్యే అవకాశం తగ్గుతుంది. మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. పిత్తాశయాన్ని తొలగించిన చోట తరచూ నొప్పి... ఎందుకిలా? నా వయసు 50 ఏళ్లు. మూడేళ్ల కిందట లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా నా పిత్తాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం రెండు నెలల నుంచి అదే ప్రాంతంలో తరచూ నొప్పి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. సాధారణంగా లివర్‌లో ఉద్భవించే పైత్యరసం చిన్న చిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో చేరుతుంది. పిత్తాశయం లోని సీబీడీ అనే నాళం ద్వారా చిన్న పేగుల్లోకి చేరుతుంది. మీకు పిత్తాశయం తొలగించిన తర్వాత నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముందుగా అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి సీబీడీ అనే నాళంలో ఏమైనా రాళ్లు ఉన్నాయేమో చూపించుకోగలరు. ఒకవేళ అల్ట్రాసౌండ్ నార్మల్‌గా ఉన్నట్లయితే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని ‘అల్సర్స్’కు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయేమో నిర్ధారణ చేసుకోవాలి. పైన తెలిపిన కారణాలు ఏమీ లేనట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. పాపకు మలంలో రక్తం పడుతోంది... సలహా ఇవ్వండి మా పాప వయసు ఎనిమిదేళ్లు. అప్పుడప్పుడూ మలంలో రక్తం పడుతోంది. మామూలుగా మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. మా పాప విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ పాప వయసు రీత్యా, ఆమెకు పెద్దపేగుల్లో కణుతులు (పాలిప్స్) ఉండే అవకాశం ఉంది. వాటివల్ల అప్పుడప్పుడూ మలంలో రక్తం పడే అవకాశం ఉంటుంది. ఇలా తరచూ రక్తం పోవడం వల్ల రక్తహీనత (అనీమియా)కు దారితీసే ప్రమాదం ఉంది. మీరు ఒకసారి మీ పాపకు ‘సిగ్మాయిడోస్కోపీ’ అనే పరీక్ష చేయించండి. ఒకవేళ పాలిప్స్ ఏవైనా ఉన్నట్లయితే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని పూర్తిగా తొలగించవచుచ. దానివల్ల పాపకు పూర్తిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా జ్వరం, కామెర్లు! నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది కిందటి నుంచి కడుపులో నొప్పి, కామెర్లు, దురద వస్తే వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీపీ అనే పరీక్ష చేసి స్టెంట్ వేశారు. మళ్లీ నెల రోజుల నుంచి జ్వరం రావడం, కళ్లు పచ్చగా మారడం జరుగుతోంది. నాకు సరైన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మీకు కడుపులో వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు తక్షణం మళ్లీ ఈఆర్సీపీ చేయించుకోండి. ఇది అత్యవసరంగా జరగాల్సిన చికిత్స, ఈఆర్సీపీ వల్ల సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. దాంతోపాటు మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్సీపీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. మీరు చెప్పిన లక్షణాల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈఆర్సీపీ ప్రక్రియనూ, లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ సర్జరీని చేయించుకోండి. డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి, హెచ్ఓడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ డిపార్ట్మెంట్, కేర్ హాస్పిటల్స్ హైటెక్‌సిటీ, హైదరాబాద్ -
ఇదో రక్తం రుగ్మత!
మన దేశంలోని జననాల్లో దాదాపు 10 శాతం మంది పిల్లలు జన్యులోపం కారణంగా థలసీమియా అనే జబ్బుతో పుడుతున్నారు. మనదేశంలో బీటా–థలసీమియా రకానికి చెందిన రక్తసంబంధమైన రుగ్మత చాలా సాధారణం. 2011 నాటి లెక్కల ప్రకారం మన దేశంలో 3.5 కోట్ల నుంచి 4.5 కోట్ల మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. చాలా దగ్గరి రక్త సంబంధీకుల్లో పెళ్లిళ్ల్ల వల్లనే ఈ సమస్య చాలా వరకు వస్తోంది. ఈ సమస్య ఉన్న 54% మందికి చెందిన తల్లిదండ్రులు మేనరికపు పెళ్లిళ్లు చేసుకొని ఉండటాన్ని వైద్యనిపుణులు గమనించారు. ఇక కొన్ని రకాల సమూహాల్లో ఉదాహరణకు కొన్ని పంజాబీ, గుజరాతీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెగలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. థలసీమియా అంటే ఏమిటి? రక్తంలో ఎర్రరక్తకణాలు ఉంటాయి కదా. వాటి ఎరుపుదనానికి కారణం హీమోగ్లోబిన్ అనే పదార్థం అన్నది తెలిసిందే. మన దేహంలో ఉన్న అన్ని కణాలకూ ఆక్సిజన్ అందించేది ఈ హిమోగ్లోబిన్ అన్న విషయమూ అందరికీ తెలుసు. ఈ హీమోగ్లోబిన్‌లో రెండు రకాల ప్రోటీన్ గొలుసుల నిర్మాణాలు ఉంటాయి. అందులో ఒకటి ఆల్ఫా, మరొకటి బీటా గొలుసులు. ఈ రెండు గొలుసుల నిర్మాణాల్లో సమన్వయలోపం లేదా అవి రెండు ఉండాల్సిన రీతిలో ఉండకపోవడం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. దాంతో ఎర్రరక్తకణాలు దెబ్బతిని అవి ఎక్కువగా నశిస్తుంటాయి. దాంతో ఒంట్లోని కణాలకు ఆక్సిజన్‌ను అందజేసే సామర్థ్యం తగ్గుతుంది. అలా ఎర్రరక్తకణాలు శిథిలమయ్యే సమస్యే ఈ థలసీమియా. రక్తానికి వచ్చే రుగ్మతల్లో ముఖ్యమైనది థలసీమియా. థలసీమియాలో రకాలు... హీమోగ్లోబిన్ గొలుసుల (చెయిన్ల) నిర్మాణాలను బట్టి రెండు రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. అలాగే వాటి వాటి లోపాలను బట్టి థలసీమియాలో రెండు రకాలు ఉంటాయి. అవి... 1. అల్ఫా థలసీమియా 2. బీటా థలసీమియా మన దేశంలో సాధారణంగా బీటా థలసీమియా సమస్య చాలా సాధారణం. ఇందులోనూ థలసీమియా సమస్య తీవ్రతను బట్టి మూడు రకాలుగా దీన్ని వర్గీకరించవచ్చు. అవి... మైల్డ్ (చాలా స్వల్పమైన సమస్య); మాడరేట్ (ఓ మోస్తరు సమస్య); సివియర్ (తీవ్రమైన సమస్య) థలసీమియా ఎలా వస్తుంది? ఇది తల్లిదండ్రుల జన్యువుల కారణంగా పిల్లలకు వస్తుంది. ప్రతి శిశువూ తాలూకు పిండ దశలో ఆ బిడ్డలోని ప్రతి అంశానికి చెందిన జన్యువుల్లో... అటు తల్లి నుంచి ఒకటి, ఇటు తండ్రి నుంచి మరొకటి బిడ్డకు సంక్రమిస్తుంటాయి. రక్తానికి సంబంధించిన అంశాల్లోనూ ఇలాగే తల్లి నుంచి ఒకటీ, తండ్రి నుంచి మరొకటి జన్యువుల వస్తాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రుల్లో ఎవరిదాంట్లోనే ఒక జన్యువులో గనక లోపం ఉండి, మరొకటి ఆరోగ్యంగా ఉంటే... అప్పుడు థలసీమియా మైనర్ అనే కండిషన్ ఏర్పడుతుంది. ఈ కండిషన్లో రక్తానికి సంబంధించిన లోపం చాలా స్వల్పంగా ఉండి రక్తహీనత (అనీమియా) ఏర్పడదు. అదే... ఇలా తల్లిదండ్రులిద్దరి జన్యువులూ లోప భూయిష్టమైనవే అయినప్పుడు ఏర్పడే కండిషన్‌ను థలసీమియా మేజర్ అంటారు. థలసీమియా మేజర్‌లో పిల్లల ఎర్రరక్తకణాలు శిథిలమైపోయి, అది చాలా తీవ్రమైన రక్తహీనతకు దారితీస్తుంది. ఇది చాలా సమస్యాత్మకమైన రుగ్మత. కాబట్టి ఇది ప్రాణాంతకం కూడా పరిణమించవచ్చు. లక్షణాలు... థలసీమియా సమస్యతో పుట్టిన పిల్లలు సాధారణమైన పిల్లల్లాగే చిన్నప్పుడు నార్మల్‌గానే ఉంటారు. కానీ వారికి మూడు నెలల నుంచి 18 నెలల వయసప్పుడు తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుంది. అది క్రమంగా పెరుగుతూ పోతుంది. రక్తహీనతను తగ్గించడానికి ఇచ్చే ఈ చికిత్స కూడా వారికి పనిచేయదు ∙దాంతో ఆ చిన్నారి క్రమంగా బలహీనంగా, నిస్సత్తువతో నీరసంగా ఉంటాడు. ఆకలి ఉండదు. ఎత్తు పెరగడం, బరువు పెరగడం పెద్దగా కనిపించదు. దాంతో పిల్లల్లో ఎదుగుదల కూడా లోపిస్తుంది. ఫలితంగా ఏ వయసుకు కనిపించాల్సిన ఎదుగుదల ఆ వయసులో ఉండదు. సాధారణంగా మన దేహంలో పుట్టే లోపభుయిష్టమైన ఎర్రరక్తకణాలను అటు కాలేయం, ఇటు ప్లీహం (స్పీ›న్) ఈ రెండూ నాశనం చేస్తుంటాయి. మరి థలసీమియాతో ఉన్న పిల్లల్లో ఎర్రరక్తకణాల్లో లోపాలు ఉంటాయి కాబట్టి ఆ లోపభూయిష్టమైన ఎర్రరక్తకణాలను కాలేయం, స్పీ›్లన్ నిరంతరం నాశనం చేస్తూ ఉండాల్సి వస్తుంది. దాంతో స్పీ›్లన్ చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉండటంతో స్పీ›్లన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. థలసీమియా సమస్య మైల్డ్‌గా (చాలా స్వల్పంగా) ఉన్న పిల్లల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. రక్తహీనత (అనీమియా) సమస్య కూడా అంత పెద్దగా ఉండదు. దాంతో లక్షణాలూ అంతగా కనిపించవు. అయితే థలసీమియా సమస్య ఓ మోస్తరుగా (మాడరేట్‌గా) ఉన్న పిల్లల్లో ఎదుగుదల అంత చురుగ్గా లేకపోవడం, త్వరగా యుక్తవయసుకు రాకపోవడం (డిలేయ్డ్ ప్యూబర్టీ), ఎముకలకు సంబంధించిన లోపాలు, స్పీ›్లన్ పెరిగిపోయి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక సమస్య తీవ్రంగా ఉన్నవారిలో రక్తహీనత చాలాతీవ్రంగా ఉండటం, ఆకలి మందగించడం, రోగి పాలిపోయి కనిపించడం, మూత్రం చాలా చిక్కగా ఉండటం, కొందరిలో కామెర్లతో చర్మం పచ్చగా మారడం, కాలేయం, గుండె పెరగడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. సేవలందించే వైద్యవిభాగాలు ►జెనెటిక్స్ విభాగం ; ►గైనకాలజీ విభాగం; ►పిల్లల వైద్యవిభాగం (పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్); ►రక్తమార్పిడి చేయాల్సిన విభాగం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ విభాగం) జన్యువిభాగం (జెనెటిక్స్ డిపార్ట్మెంట్) ఉపయోగాలిలా... థలసీమియా రుగ్మత ఒక జన్యుపరమైన సమస్య అన్నది తెలిసిందే. అంటే ఇది కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే సమస్య. తల్లిదండ్రులిద్దరిలోనూ ఒకరికి జన్యువులో లోపం ఉన్నా... మరొకరిది ఆరోగ్యకరమైన జన్యువు అయినప్పుడు ఈ రెండు కలిసి పిల్లలకు సంక్రమించినప్పుడు పిల్లాడికి థలసీమియా మైనర్ అనే సమస్య రావచ్చు. తల్లిదండ్రులిద్దరిలోనూ జన్యులోపం ఉన్నట్లయితే అప్పుడు ఆ చిన్నారికి సమస్య వచ్చే అవకాశాలు 25% ఉంటాయి. అయితే అతడి నుంచి ఆ తర్వాతి తరాలకు అది సంక్రమించే అవకాశాలు 50% ఉంటాయి. ఆ చిన్నారి పూర్తిగా నార్మల్‌గా ఉండే అవకాశాలు 25% ఉంటాయి. ఇక జన్యువిభాగాలకు చెందిన వారు ఈ సమస్యను తెలుసుకునేందుకు హెచ్పీఎల్ఎస్ లేదా హెచ్‌పీ ఎలక్రోఫోరోసిస్ అనే పరీక్షను నిర్వహిస్తారు. దీంతో ఆ చిన్నారికి థలసీమియా మైనర్ సమస్య ఉందా లేక అతడు తర్వాతి తరాలకు రుగ్మతను సంక్రమింపజేసే అవకాశాలున్నాయా, లేదా అతడికి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత వారు హీమోగ్లోబిన్ మ్యూటేషన్ పరీక్షలూ నిర్వహించి... భవిష్యత్తులో వారికి సంబంధించిన తర్వాతి తరాల్లో సమస్య వచ్చే అవకాశాలున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. గైనకాలజిస్టుల భూమిక... పిల్లలు పుట్టే ముందే కూడా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కాబోయే తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించి, పిల్లలకు ఆ సమస్య వచ్చే అవకాశాలు గైనకాలజిస్టులూ తెలుసుకుంటారు. ఇక కాబోయే తల్లి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆమెకు రక్తహీనత (అనీమియా) లేకుండా చూడటం అన్నది చాలా అవసరం. కాబోయే తల్లిలో రక్తహీనత లేకుండా చూడటం వల్ల అది థలసీమియా మైనర్‌ను చాలావరకు నివారిస్తుంది. యుక్తవయసుకు వచ్చిన మహిళలు తమ రుతుస్రావం వల్ల ప్రతినెలా చాలా రక్తాన్ని కోల్పోతూ, దాదాపు దేశంలో చాలా మంది మహిళల్లో రక్తహీనత ఉండటం చాలా సాధారణం. అందుకే దీన్ని నివారిస్తే చాలా సమస్యలను చాలావరకు నివారించడం సాధ్యమవుతుంది. చేయించాల్సిన వైద్యపరీక్షలు ►పిల్లల్లోని ఐరన్ పాళ్లు తెలుసుకోవడం కోసం తరచూ సీరమ్ ఫెరిటిన్ లెవెల్స్, లివర్ ఫంక్షన్ పరీక్షలు, ఒంట్లో కామెర్లు వచ్చాయా అని తెలుసుకోవడం కోసం హెపటైటిస్ బి, సి పరీక్షలు చేయిస్తూ ఉండాలి ►మూత్రపిండాల పనితీరు తెలుసుకోవడం కోసం రీనల్ ఫంక్షన్ పరీక్షలు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్ పాళ్లు అవసరం ∙ఒంట్లో ఐరన్ పాళ్లు పెరగడం గుండె పనితీరును దెబ్బతీయవచ్చు. అందుకే ఈ రోగులకు తరచూ గుండె పనితీరు తెలుసుకునే పరీక్షలు అవసరం. చికిత్స థలసీమియా సమస్య ఉన్న పిల్లల్లో రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి, వారి జీవక్రియలను సాధారణంగా ఉంచడం కోసం ఆ పిల్లలకు తరచూ అంటే ప్రతి 15 రోజుల నుంచి 30 రోజులకొకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. తద్వారా ఆ పిల్లల్లోని హీమోగ్లోబిన్ మోతాదు 10గ్రాములు/డెసీలీటర్ నిర్వహితమయ్యేలా చేస్తుంటారు ∙ఇలా తరచూ రక్తం ఎక్కిస్తుండటంతోపాటు, దెబ్బతిన్న ఎర్రరక్తకణాల్లోని హీమోగ్లోబిన్ అంతా కాలేయం, స్పీ›్లన్లలో నిల్వ ఉంటుంది. దాంతో ఒంట్లో అనవసరమైన ఐరన్ పాళ్లు పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోయిన ఐరన్ ఓవర్‌లోడ్‌ను తొలగించే ‘ఐరన్ కీలేషన్ థెరపీ’ చేయాల్సి ఉంటుంది. అలాగే చిన్నారులకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇవ్వడం అవసరం ∙ఎర్రరక్తకణాలు పుట్టేది ఎముక మజ్జలో అన్న విషయం తెలిసిందే. లోపభుయిష్టమైన ఎర్రరక్తకణాలకు తావిచ్చే ఎముకమజ్జకు బదులు ఆరోగ్యకరమైన మజ్జను మార్పిడి చేసే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స ద్వారా 30% మంది పిల్లలకు స్వస్థత చేకూరుతుంది. అయితే ఏ మేరకు మజ్జ సరిపోతుందో తెలుసుకోడానికి హెచ్ఎల్ఏ టైపింగ్ అనే పరీక్ష అవసరమవుతుంది. పుట్టుకతోనే బొడ్డు తాడు నుంచి సేకరించే స్టెమ్‌సెల్స్‌తో చికిత్స చేసే ప్రక్రియ ఇప్పుడు చాలా వరకు విజయవంతమవుతోంది. కాబట్టి పుట్టిన పిల్లల బొడ్డు తాడునుంచి స్టెమ్‌సెల్స్ సేకరించి వాటిద్వారా చికిత్స చేయడం అన్నది ఈ పిల్లల పాలిట ఒక ఆశారేఖగా కనిపిస్తోంది ∙చికిత్స కంటే నివారణ చాలా తేలిక. కాబట్టి యుక్తవయస్కులైన ఆడపిల్లల్లో రక్తహీనత రాకుండా చూసుకోవడంతో పాటు, మేనరికాలూ... చాలా దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండటం థలసీమియా సమస్యతో పాటు చాలా రకాల జన్యు సమస్యలు రాకుండా కాపాడుతుంది. డాక్టర్ వసుంధర కామినేని సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
‘నచ్చకపోతే నిరభ్యంతరంగా వెళ్లి పోవచ్చు’
బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఏ విషయం గురించైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు ట్వింకిల్ ఖన్నా. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ న్యూట్రిషియనిస్ట్కు గట్టి కౌంటరే ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. ఇంతకు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దానిలో ‘నా ఇన్‌బాక్స్‌లో ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ లేవల్స్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి జనాలు నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. వారికోసం ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాను. ఒకటి ప్రతిరోజు నీటితో కలిపిన ఓట్స్ లేదా బాదంపాలు.. రెండు క్వినోవా.. మూడు తరిగిన గింజలు.. నాలుగు గుమ్మడి గింజలు. వీటిని ఓ మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత మీరే చూడండి’ అంటూ ట్వింకిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఓ న్యూట్రిషియనిస్ట్ ట్వింకిల్‌ని ట్రోల్ చేశారు. ‘ప్రతి ఒక్కరు ఆహారం గురించి సలహాలిచ్చేవారే’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on May 2, 2019 at 9:38am PDT అయితే సదరు న్యూట్రిషియనిస్ట్ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు ట్వింకిల్. ‘మీరు పోషాకాహార నిపుణులు.. కానీ జనాలకు పనికివచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెప్పరు. నా జీవితమంతా ఎనిమియా(రక్తహీనత)తో బాధపడ్డాను. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా చాలా మార్పు చూశాను. చాలా తక్కువ సమయంలోనే నేను రక్తహీనత నుంచి బయటపడ్డాను. మరి జనాలకు మేలు చేసే ఇలాంటి అంశాల గురించి చెప్తే తప్పేంటి. నేను చెప్పిన విషయం మీకు నచ్చకపోతే వదిలేయండి.. తప్పైతే నిరూపించడం. అంతేకానీ ద్వేషాన్ని మాత్రం పెంచకండి. ఒకవేళ అలాంటిది చేయాలనుకుంటే నా పేజ్ నుంచి వెళ్లిపొండి’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. -
పౌష్టికాహారం పక్కదారి
సాక్షి, అనంతపురం : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దారి మళ్లిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించడంలేదు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పేదలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్నిపక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నారు. జిల్లాలో 5126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 3.35 లక్షల మందికి రోజూ పౌష్టికాహారం అందజేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. దీంతో పాటు బాలామృతం స్థానంలో బాల సంజీవని ప్యాకెట్లు అందజేస్తున్నారు. పేద ప్రజల్లో రక్తహీనత తగ్గించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఏళ్ల తరబడి రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని అంగన్వాడీ కేంద్రాలు అందుకోలేకపోతున్నాయి. ఇందుకు కారణం ఐసీడీఎస్‌లో వేళ్లూనుకుపోయిన అవినీతే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అందినకాటికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత బాధితులు : రక్తహీనతతో బాధపడుతున్న వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నా సంజీవని ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఇందులో రాగిపిండి, గోధుమపిండి, కర్జూరం, బర్ఫీలతో కూడిని కిట్స్‌ను అందజేస్తున్నారు. అయితే కదిరి డివిజన్లో మాత్రం కిట్స్‌ను మాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో దారి మళ్లిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. కేవలం కదిరిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల్లో కోత వేసి పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్ : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కొన్ని నెలలుగా కోడిగుడ్లు సరఫరా నిలిచిపోయింది. గత సరఫరా దారుల టెండరు గడువు ముగియడంతో కొత్తగా టెండర్లకు ఆహ్వానించారు. రెండురోజుల క్రితం ధర్మవరం డివిజన్ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్లు సరఫరా టెండర్లను ఆమోదించారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు రెండునెలలుగా కోడిగుడ్ల సరఫరా ఆగిపోయింది. ప్రస్తుత కాంట్రాక్టర్లు సరఫరా చేయడానికి ఇంకా సమయం పడుతుంది. అంటే దాదాపు మూడు నెలలుగా కోడిగుడ్లు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ధర్మవరం డివిజన్లో కోడిగుడ్లు సరఫరా చేయాలంటే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. అక్కడి అధికారపార్టీ నేతలకు, ఇతరులకు మామూళ్లు ఇచ్చుకోలేక టెండర్లలో దరఖాస్తులే రానట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరికీ పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు పౌష్టికాహారంతో పాటు పాలు, కోడిగుడ్లు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. దీన్ని మరింత బలోపేతం చేస్తాం. అలాగే ఇటీవల ధర్మవరం డివిజన్ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్ల కాంట్రాక్టర్లు ఖరారు చేశాం. త్వరలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా మొదలవుతుంది. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
ప్రాణాలు తోడేస్తున్న రక్తహీనత
మన్యం వాసులు పోష కాహారానికి దూరమవుతున్నారు. సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గిరిజన తెగలకు చెందిన పిల్లలు, బాలింతలు, గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి వారికి ప్రాణసంకటంగా మారింది. నీరసించి నిస్సత్తువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదనేవిమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నం, పాడేరు : పాడేరు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పీటీజీ గిరిజన తెగలకు చెందిన వారు తీవ్ర పోషకాహార సమస్యతో సతమతమవుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గిరిజన కుటుంబాల్లోని పసి ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్నాయి. ఏటా మరణాలు నమోదవుతున్నా ప్రత్యేక పోషకాహార సరఫరా, వైద్య సేవల కల్పనపై ఎటువంటి చర్యలు కానరావడం లేదు. చాలా గ్రామాలకు అంగన్వాడీ వ్యవస్థ కూడా విస్తరించడం లేదు. అంగన్వాడీలే ఆధారం ఏజెన్సీలో అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారమే చిన్నారులకు, బాలింతలకు ఆధారం. అయితే వీటిద్వారా అరకొరగానే పోషకాహారం సరఫరా జరుగుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో పంపిణీ అస్తవ్యస్తంగా ఉంటోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు పంపిణీ సవ్యంగా జరగడం లేదు. నెల రోజులుగా పూర్తిగా పోషకాహారం అందడం లేదు. దీంతో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు కూడా గిరిజనులకు పాడి పశువులు లేకుండా పోయాయి. మన్యంలో ఆహార పంటలు బాగా తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం గిరిజనులకు రాగి అంబలి, కోటా బియ్యమే ప్రధాన ఆహారంగా ఉన్నాయి. ♦ పప్పు దినుసులు, ఇతర పోషకాహారం అందుబాటులో లేని కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి గిరిజనుల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. ఏటా ఏజెన్సీలో సంభవిస్తున్న మరణాలకు కారణం పోషకాహార లోపమేనని వైద్యులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సరుకులు అందని పరిస్థితి. ♦ అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆశ్రమాల్లో విద్యార్థులకు పెడుతున్న మెనూలో కూడా సరైన పోషకాహారాన్ని అందించలేకపోతున్నారు. ఏజెన్సీలోని కొన్ని మండలాల్లో గతంలో ఐటీడీఏ పోషకాహార కేంద్రాలను నిర్వహించినప్పటికీఇది కొన్నాళ్లకే పరిమితమైంది. గిరిజనుల ఆహార భద్రతపై నిర్ధిష్టమైన కార్యాచరణ ఐటీడీఏ చేపట్టలేదు. దిగజారిన జీవన ప్రమాణాలు మన్యంలో సుమారు 1.80 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 3,574 గిరిజన గ్రామాల్లో గిరిజన జనాభా 6 లక్షలు దాటి ఉంది. సగానికి పైగా గ్రామాల్లో గిరిజన కుటుంబాలు ఆర్థిక సమస్యల కారణంగా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒకపూట అంబలి, ఒక పూట గంజి అన్నం తిని జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిత్యవసర ధరలు అధికం కావడంతో పేద గిరిజన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. గుడ్లు, పాలు సరఫరా లేదు సంపంగి గరువు గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇక్కడకు ప్రతి నెలా సరుకులు రావడం లేదు. ముఖ్యంగా గుడ్లు, పాలు సరఫరా సరిగ్గా లేదు. జనవరి నెలలో 8 రోజులే గుడ్లు ఇచ్చారు. ఈ నెలలో ఒక్క రోజు కూడా గుడ్డు అందివ్వలేదు. బాలింతలకు ఏడు నెలల వరకు పోషకాహారం ఇస్తున్నారు. కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పు దినుసులకు కొరతగా ఉంది. ఎప్పుడైనా సంతకు వెళ్లినపుడే తెచ్చుకుంటాం.–మజ్జి ప్రమీల, సంపంగి గరువు గ్రామం -
‘భవిష్యత్’ బలహీనం!
సాక్షి, హైదరాబాద్: శరీరానికి సరిపడా పోషకాహారాన్ని తీసుకోకపోవడంతో భావిపౌరులు సత్తువ కోల్పోతున్నారు. వసతిగృహాల్లో పౌష్టికాహారాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడి విద్యార్థుల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయో... లేక సరైన ఆహారమే అందడం లేదో కాని అత్యధికుల్లో రక్తహీనత లోపం కనిపిస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,245 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో 2.85 లక్షల మంది విద్యా ర్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతమున్న వసతి గృహాల్లో 1,722 వసతి గృహాలు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కాగా.. మిగతా 523 వసతి గృహాలు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు. తాజాగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్య స్థితిపై ఓ సంస్థ అధ్యయనం చేసింది. అనీమియా కారణంగా దాదాపు 65.3 శాతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యధికంగా బాలికలే ఉండడం గమనార్హం. బాలికల్లో అత్యధికం.. రక్తహీనత బాలుర కంటే బాలికల్లోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా పిల్లల రక్తంలో ప్రతీ డెస్సీలీటర్‌కు కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య ఉన్నట్లే. కానీ చాలామంది చిన్నారుల్లో 10 గ్రాములు/డీఎల్ కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. ప్రతి 100 మంది బాలికల్లో 55 మందిలో రక్తహీనత తీవ్రంగా ఉంది. అదే బాలుర కేటగిరీలో 50 మంది పిల్లల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమైంది. ప్రతి 100 మందిలో 13 మంది పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్తహీనతతోపాటు పోషక లోపాలతో ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. నూరు మందిలో కేవలం 35 మంది పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. అనర్థాలకు దారితీసేలా.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపించిన చిన్నారుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో రక్తహీనత సమస్య పలు అనర్థాలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకి దీర్ఘకా లిక వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కోల్పోయి పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఏకాగ్రతను క్రమంగా కోల్పోయి అనారోగ్యానికి గురవుతారు. ఏఎన్ఎమ్లు వసతిగృహాలకు క్రమం తప్పకుండా వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. అయితే అదేమీ లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు సంక్షేమ శాఖలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నివారణ చర్యలను చేపట్టడం లేదు. -
ఎంత ఘోరం!
కొయ్యూరు (పాడేరు): రక్తహీనత ఆఖరికి వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళనూ బలిగొంది. ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు రాజేంద్రపాలెం పీహెచ్సీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది. గర్భవతి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రామం కొమ్మిక వచ్చింది. ఆదివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తహీనత, హైబీపీ రూపంలో కొన్ని గంటలకే మృతి చెందింది. రాజేంద్రపాలెం పీహెచ్సీలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న నేతల సీతాదేవి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రా మం కొమ్మిక వెళ్లింది. ప్రసవ తేదీ (ఈడీడీ) దగ్గర కావడంతో అక్కడే ఉంది. ఆదివారం ఉదయం కొమ్మికకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కంఠారం ఆరోగ్యకేంద్రంలో ప్రసవం జరిగి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొద్దిసేపటికి ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడ కొద్దిసేపు వైద్యం చేసిన తరువాత వైద్యులు ఇక్కడ సాధ్యం కాదని వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు అప్పటికే ఆమెకు రక్తహీనతకు తోడుగా హైబీపీ వెంటాడుతుంది. నర్సీపట్నంలో ప్రముఖ గైనకాలజిస్టు సుధాశారదను కూడా సంప్రదించారు. తానేమి చేయలేనని కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. వెంటనే ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. ఆమెను ఆపరేషన్ «థియేటర్‌కు తీసుకెళ్తుండగానే ఊపిరి ఆగిపోయింది. ఈమె మృతితో కొమ్మక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
గిరిజన పిల్లల్లో రక్తహీనత!
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజన విద్యార్థులను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చాలా మందిని సికిల్‌సెల్ ఎనీమియా పీడిస్తోంది. ఇప్పటివరకు ఆంత్రాక్స్, టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో నానా అవస్థలు పడిన గిరిజనులు ఇప్పుడు తమ పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకే కాకుండా పెద్దలను కూడా సికిల్‌సెల్ ఎనీమియా చుట్టుముట్టింది. తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి, లేదా వంశపారంపర్యంగా ఉంటే తప్పకుండా ఇది పిల్లలకు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో పిల్లలు చిక్కిపోతుండడంతో 11 మండలాల్లోని 40,300 గిరిజన విద్యార్థులకు సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 14,073 మంది దీనిబారిన పడినట్లు అనుమానించిన అధికారులు హెచ్‌బీ–ఎస్ ఎలక్ట్రోపోలోసిస్ పరీక్ష చేయడంతో 576 మందికి సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నట్లు నిర్థారించారు. వీరిలో 315 మంది బాలురు, 261 మంది బాలికలు ఉన్నారు. ప్రాణాంతకమైన సికిల్‌సెల్ ఎనీమియా, సికిల్ తలసీమియా వ్యాధులకు శాశ్వత నివారణ లేకపోవడంతో రోగుల్లో అవగాహన పెంచడం ద్వారానే వ్యాధి తీవ్రతను తగ్గించగలమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా అదనపు పోషకాహారం, శరీరంలో ఐరన్ శక్తి తగ్గకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి, సి మాత్రలతో పాటు విటమిన్లు ఉండే ఆహారం రోగులకు అందించాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో మందుల్లేవు ఏజెన్సీ ఏరియాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ (ఐఎఫ్ఏ) టానిక్, ఐరన్ మాత్రలు, బీ కాంప్లెక్స్‌తో పాటు విటమిన్–సీ, కాల్షియం మాత్రలు ఆస్పత్రుల్లో లేకపోవడంతో పిల్లలకు ఇవ్వడంలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పాడేరు ప్రాంతంలో ఉన్న అనేక గిరిజన గూడేలు ఆస్పత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో పేద గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష అవుతోంది. పోషక విలువల ఆహారం ముఖ్యం సాధారణంగా రక్త కణాలు చంద్రాకారంలో ఉండాలి. కానీ సికిల్‌సెల్ ఎనీమియా ఉన్న వారికి అవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. రక్తకణం పూర్తిస్థాయిలో ఉండదు కాబట్టి రక్త ప్రసారంలో కణం అడ్డుపడే అవకాశం ఉందని, రక్తం చేరాల్సిన ప్రదేశాలకు చేరకపోతే మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని అలక్ష్యం చేయకూడదని, నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం తినాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడు శాఖలతో సమన్వయం చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై గిరిజన సంక్షేమ శాఖ.. విద్యా, వైద్య–ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో ప్రతినెలా మొదటి గురువారం నాడు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని ఫోకసింగ్ రిసోర్స్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్ (ఎఫ్ఆర్ఈఎస్హెచ్) కార్యక్రమంగా పిలుస్తారు. మొత్తం తొమ్మిది కార్యక్రమాల ద్వారా ఆదివాసీ పిల్లల ఆరోగ్యంపై నాలుగు శాఖల అధికారులు దృష్టి పెడతారు. ఇందుకు సంబంధించి స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ ఏప్రిల్ 26న అన్ని స్కూళ్లకు సర్క్యులర్ పంపించింది. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు మందులు, ప్రత్యేక ఆహారం ఇస్తున్నారా? లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కాగా, మందుల కొనుగోలుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకున్న తరువాతే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండటంతో వారు సహకరించడంలేదని గిరిజన సంక్షేమ శాఖ ఆరోపిస్తోంది. -
చెదురుతున్న ‘ఏకాగ్రత’!
ఈ బాలిక పేరు లావణ్య.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. రోజూ స్కూల్‌కు వెళుతుంది.. టీచర్లు చెప్పే పాఠాలు వింటుంది.. కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల ఆ పాఠాలు ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. లావణ్య రక్తహీనతతో బాధపడుతుండటమే దీనికి కారణం. ఈ అమ్మాయి పేరు కవిత.. మన్సూరాబాద్ జడ్పీహెచ్ఎస్లో చదువతున్న ఈమెదీ లావణ్య పరిస్థితే. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. సరైన పోషకాహారం లేకపోవడంతో కవిత రక్తహీనత బారినపడింది. చదువుకుందామన్న ఆసక్తి ఉన్నా ఏకాగ్రత లోపించి ఇబ్బంది పడుతోంది. అశ్వినీ.. ఆదిలాబాద్ జిల్లా మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఎక్కువ దూరం నడవలేదు.. పాఠాలు ఏకాగ్రతతో వినలేదు. ఇటీవల స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే రక్తహీనత అని తేలింది. ..లావణ్య, కవిత, అశ్వినీ మాత్రమే కాదు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో దాదాపుగా 78% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రోజూ స్కూల్‌కు వెళ్లినా పాఠాలను శ్రద్ధగా వినలేకపోతున్నారు. టీచర్ చెప్పేటప్పుడు పాఠాలు వింటున్నట్లు అనిపించినా.. ఆ తర్వాత వారికి ఏం గుర్తుండటం లేదు. దీనికి రక్తహీనతే ప్రధాన కారణం. ఆహారంలో సరైన పోషకాలు అందకపోవడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. చాదర్‌ఘాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికల్లో 92 శాతం మందికి హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువగా ఉంది. 8 శాతం మందికి 11 శాతం అంతకంటే ఎక్కువగా ఉంది. రాజ్‌భవన్‌కు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ 60 శాతానికి పైగా బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ‘బాలుర కంటే బాలికల హాజరు శాతం ఎక్కువ. పాఠాలు కూడా శ్రద్ధగా విన్నట్లు కనిపిస్తారు. మధ్యలో ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం రాదు. రక్తహీనత వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం వారికి పోషకాహారం అందించాలే తప్ప సాధారణ(మధ్యాహ్న) భోజనం వల్ల ఫలితం లేదు’అని నగరంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని చెప్పారు. ఆమె పని చేస్తున్న పాఠశాలలోనూ 85 శాతం మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని జీహెచ్ఎంసీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. మొక్కుబడిగా ‘మధ్యాహ్నం’ ప్రభుత్వ స్కూళ్లలో బాలబాలికలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కేంద్రం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం మొక్కుబడిగా మారిపోయిం ది. నెలలో ఎక్కువ రోజులు అన్నం, పప్పు, పచ్చిపులుసు లేదా పప్పుచారుతో కానిచ్చేస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా భోజనం ఇంచుమించుగా ఇలాగే ఉంటోంది. మేం స్కూల్లో తినే భోజనం వల్ల పౌష్టికాహారం ఎలా వస్తుంది? ఎప్పుడో నెలలో రెండుసార్లు సగం గుడ్డు ఇస్తున్నారు’అని నల్లగొండ జిల్లా గడిపల్లి జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న సునీత వాపోయింది. మధ్యాహ్న భోజనంపై తనిఖీలకు వచ్చిన బృందానికి ఈ పథకం ఎంత నిరుపయోగమో ఈమె వివరించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక లోనూ ఈ అభి ప్రాయాన్ని పేర్కొ న్నారు. ఇది జరిగి నాలుగేళ్లయినా పథకంలో ఏ మార్పూ లేదు. గ్రామాల్లో మరీ దారుణం గ్రామీణ తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే.. రాజధాని కంటే ఎక్కువ శాతంలోనే బాలికలు రక్తహీనతతో బాధపడు తున్నారని తేలింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంది. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదు. రోజూ అన్నం, పప్పు, చారుతోనే సరిపెడుతున్నారు. దీంతో పిల్లలు ఆ భోజనం తినడానికి ఆసక్తి చూపడం లేదు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గుగులోతు లలిత మాటల్లో ‘ఇంటి దగ్గర అన్నం తిని వస్తాం. మళ్లీ మధ్యాహ్నం అదే అన్నం, చారు. ఎప్పుడో ఒకసారి గుడ్డు ఇస్తారు. జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరకు వెడితే రక్తం తక్కువగా ఉంది. పండ్లు బాగా తినాలని చెప్పారు. మాకు ఏం పండ్లు దొరుకుతాయి. కొనే శక్తి లేదు కదా..’అని ఆవేదన చెందింది. రక్తహీనత వల్ల సరిగ్గా పాఠాలు వినలేకపోతున్నానని, ఏకాగ్రత లోపించిందని అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వేల్పుల రోజారాణి పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా బొమ్మనపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వర్ష, అనూషలదీ అదే పరిస్థితి. రక్తహీనతతో బాధపడుతున్న తమకు పోషకాహారం లభించడం కష్టంగా ఉందని వారిద్దరూ ఆవేదన చెందారు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఉన్నత పాఠశాలల్లో 12 చోట్ల 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే 80 శాతం మందికి సాధారణం కంటే తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉన్నట్లు తెలింది. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లోనూ రక్తహీనత కారణంగా బాలికల్లో ఎదుగుదల లోపించింది. పరీక్షలు చేసి.. మందులు ఇచ్చినా.. జాతీయ ఆరోగ్య పథకం కింద ఆరోగ్య అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, కొమరంభీమ్, మహబూబాబాద్, జనగామ వంటి జిల్లాల్లో జనవరి, ఫిబ్రవరిలో వేలాది మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. జూన్–జూలైలో కొన్ని స్కూళ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అని పరిశీలించారు. ‘మేము తర చూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు మాకు సహకరిస్తున్నాయి. ఈ పరీక్షల్లో వెల్లడవుతున్న దేమిటంటే 12–15 ఏళ్ల మధ్య బాలికల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటమే. దీనికి తగిన ఔషధాలు ఇస్తున్నాం. నాలుగైదు మాసాల తర్వాత జరిపిన పరీక్షల ఫలితాలు ఇంకా మా చేతికి రాలేదు’అని కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పండ్లు, మాంసాహారం ఎలా తినాలి.. నేను అన్నం తప్ప మరొకటి తినను. స్కూల్‌కు వచ్చిన తర్వాత కూడా అన్నం, ఒక కూర పెట్టి చారు పోస్తారు. ఇంట్లో తిన్నదానికి, స్కూల్లో మధ్యాహ్న భోజనా నికీ తేడా ఉండదు. ఇక పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుంది. రక్తహీనత పోవడానికి మాంసాహారం, పండ్లు తినాలంటున్నారు. నోటు పుస్తకాలు కొనడానికే డబ్బు ల్లేవు. పండ్లు, మాంసాహారం ఎక్కడి నుంచి వస్తుంది. – సుజాత, పదో తరగతి విద్యార్థిని, చాదర్‌ఘాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళ్లు తిరుగుతాయి.. శ్వాస ఆడదు.. రక్తం తక్కువగా ఉండటం వల్ల నీరసంగా ఉంటోంది. చదువుపై ఏకాగ్రత చూపలేకపోతున్నాను. ఎక్కువగా నడిస్తే కళ్లు తిరుగుతున్నాయి. శ్వాస సరిగా ఆడదు. పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కానీ ప్రయోజనం లేదు. – అఖిల, ఆరో తరగతి విద్యార్థిని,ఆదిలాబాద్ జిల్లా మరికల్ ఉన్నత పాఠశాల అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా వారంలో ఆరు రోజులు ఆకుకూరలు ఉండాలి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి. వారంలో ఒక రోజు చికెన్, ఒక రోజు మాంసం పెట్టాలి. ఇలా చేయగలిగినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరు తుంది. లేదంటే కాంట్రాక్టు ఏజెన్సీలు డబ్బులు సంపాదించుకునేదిగా మారుతుంది. – డాక్టర్ దశరథరామారెడ్డి, ఆర్థోపెడిక్ వైద్యుడు -
వారం రోజులుగా గిరిజన మహిళ ప్రసవ వేదన
అశ్వారావుపేట: ‘అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నాం. కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవిస్తే నగదు ప్రోత్సాహమిస్తున్నాం.’అని ప్రభుత్వం డాంబికాలు పలుకుతోంది. కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇందుకు నిదర్శనమే ఈ గిరిజన మహిళ ప్రసవ వేదన.. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోయం బేబీరాణి తొలిసూరు కాన్పు కోసం వారం క్రితం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అక్కడ వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. భద్రాచలంలో కూడా ఇదే దుస్థితి ఎదురైంది. అక్కడి నుంచి కొత్తగూడెం, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రులకు తిరిగారు. కానీ ఎక్కడా వైద్యం అందలేదు. వరంగల్ లేదా హైదరాబాద్ వెళ్లాలని ఖమ్మం వైద్యులు సూచించారు. తీవ్ర రక్తహీనత, గుండె సంబంధ వ్యాధి ఉందని, తాము వైద్యం చేయలేమని ఎక్కడికక్కడే తేల్చేశారు. కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేద గిరిజన కుటుంబం కావడంతో దేవుడిపై భారం వేసి స్వగ్రామమైన ఊట్లపల్లికి తిరిగి వచ్చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు చందాలు పోగుచేసి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రులను ఆశ్రయించారు. అక్కడా చేర్చుకోలేమని తేల్చేయడంతో ఆదివారం అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా అదే పరిస్థితి. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం రాత్రి 2 గంట ల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లాలని అక్కడి వైద్యులు బయటకు పంపేశారు. చేతిలో రూ.500కు మించి లేవు. ఇంటికి రాలేరు.. వరంగల్ ఆస్పత్రిలో వైద్యం చేయబోమన్నారు. హైదరాబాదు ఎలా వెళ్లాలో.. తెలియని గిరిజనులు దారి ఖర్చులకు డబ్బులు లేక ఊరు కాని ఊర్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిచిపోయారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేటకు చెందిన జ్ఞానదృష్టి ప్రసాద్ తన సోదరుడు, వరంగల్ జిల్లాలో సీఐగా పనిచేస్తున్న రామకృష్ణకు చెప్పగా.. ఆయన ఖమ్మంలో ఉన్నప్పటికీ తనకు తెలిసిన వారి ద్వారా రూ.1000 ఇప్పించడంతో ఇంటికి తిరిగి వచ్చారు. మళ్లీ బుధవారం గ్రామస్తుల వద్ద కొంత ఆర్థిక సహాయాన్ని పొంది గర్భిణిని తీసుకుని హైదరాబాదుకు పయనం అయ్యారు. పేరుకే గిరిజన నియోజకవర్గ కేంద్రంలో సీమాంక్ సెంటర్, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, భద్రాచలంలో పెద్దాసుపత్రి.. ఓ గిరిజన మహిళకు సురక్షితంగా పురుడు పోయలేని ఈ వ్యవస్థ ఎవరి కోసం..? నెలలు నిండే వరకు గర్భిణికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేయని ఏఎన్ఎం, పీహెచ్సీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఆదివాసీ గిరిజనుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రంలో గిరిజనులకు వైద్యం అందట్లేదంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వంటకే కాదు.. ఒంటికీ మంచిది
మనం రోజూ ఒక ముద్ద ఇంత రుచిగా తినగలుగుతున్నామంటే కారణం... కరివేపాకు. తన సువాసనతో మీ నాసికాపుటాలతో పాటు మీ కడుపులో స్థలాన్నీ విప్పారేలా చేసి... మరో ముద్దను అదనంగా తినేలా చూస్తుందది. ఒక్కరోజు కరివేపాకు లేకుండా మీ వంటలను తినండి. దాని గొప్పదనం మీకు తెలిసివస్తుంది. ఒక అదనపు ముద్దతో పాటు... మరెన్నో అదనాలను సమకూర్చే ఆ కరివేప ఇచ్చే ప్రయోజనాల్లో కొన్ని ఇవి... ఐరన్ పాళ్లు పుష్కలం కావడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది కరివేప. అనీమియాతో బాధపడేవారు తమ వంటల్లో కరివేపాకు ఎక్కువగా తింటే చాలు ఒంటికి మంచి రక్తం పడుతుంది. రక్తహీనతకు స్వాభావికమైన చికిత్స ప్రక్రియ కరివేపాకు. కరివేపలో విటమిన్–ఏ చాలా ఎక్కువ. ఇది చూపును చాలాకాలం పదిలంగా కాపాడటంతో పాటు అకాలదృష్టిదోషాలను నివారిస్తుంది. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ కరివేపలో చాలా ఎక్కువ. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. మెగ్నీషియమ్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదం చేయడంతో పాటు మేని నిగారింపునకు దోహదం చేస్తుంది.కరివేపలో పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం... మనదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరివేపను తాలింపునకు వాడే ప్రాంతాల్లో పెద్దపేగు, మలద్వార (కోలో–రెక్టల్) క్యాన్సర్లు చాలా తక్కువ. అంతేకాదు... జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీకి చెందిన నిపుణుల అధ్యయనంలో కరివేపాకులో క్యాన్సర్‌ను అరికట్టే గుణం ఉందని స్పష్టంగా తేలింది. లుకేమియా, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్లను కరివేప సమర్థంగా నివారిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌కు కరివేప మంచి విరుగుడు. ఒంట్లోని విషాలను కరివేప సమర్థంగా విరిచేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుతుంది. -
చిన్నారుల్లో రక్తహీనత, కంటి సమస్యలెక్కువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల్లో రక్తహీనత, కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పేదరికం, పోషకాహారలోపం, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. సమస్యను ప్రాథమిక స్థాయిలోనే నివారించేందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నామని బుధవారం శాసనమండలిలో వెల్లడించారు. ‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య పథకం’లో భాగంగా 300 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఓ ఏఎన్ఎం, ఫార్మసిస్టు ఉంటారని.. వీరు అన్ని గ్రామాల్లో 18 ఏళ్ల లోపు వయసు వారిని పరీక్షించి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మందిని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 36 లక్షల మందిని పరీక్షించామని వెల్లడించారు. వీరిలో 1.83 లక్షల మందికి ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించగా.. ఎక్కువ మంది రక్తహీనత, నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిం దన్నారు. ఇప్పటికే 28 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో జికా లేదు : జికా, ఎబోలా లాంటి ప్రమాదకర వైరస్లు రాష్ట్రంలో లేవని మంత్రి వెల్లడించారు. సభ్యుడు సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. వైరస్ల ప్రభావం రాష్ట్రంలో లేకున్నా ముందు జాగ్రత్తగా విమానాశ్రయంలో పరీక్ష కేంద్రం, గాంధీ ఆస్పత్రిలో మరో కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
కానుక ఏదీ?
కస్తూర్బా విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు జనవరి 1నుంచి ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు ఏం వడ్డించాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాలలో కొత్త మెనూ అమలు కావడంలేదు. దన్వాడ (నారాయణ్ పేట్) : కస్తూర్బా పాఠశాలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. గురుకుల విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వారంలో నాలుగు రోజులు మాంసాహారం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటి మూటలుగానే మిగిలింది. అధికారులు గుడ్డుతోనే సరిపుచ్చుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఎలా అమలు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు జాప్యం చేస్తున్నారు. పౌష్టికంగా ఉండేందుకే.. ప్రభుత్వ వసతిగృహంలో ఎక్కువశాతం, పేద మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు. వీరికి సరైన ఆహారం అందించడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రతి ఆదివారం కోడి కూర, వారంలో ఐదు రోజులు కోడి గుడ్లు వండి వడ్డిస్తున్నారు. అదనంగా రోజూ నెయ్యి, నెలలో రెండు రోజులు మాంసాహారం పెట్టేందుకు నిర్ణయించారు. పాలు, చపాతి, పల్లిపట్టి, ఇడ్లీ, పూరి వంటి అల్పాహారం అందిస్తున్నారు. కొత్త మెనూతో బాలికల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తల్లితండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చుపిస్తారని ప్రభుత్వం కొత్త మెనుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2నుంచే అమలు చేయాల్సి ఉన్నా.. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ఈనెల 2 నుంచి కొత్త ఆహార పట్టిక అమలు చేయాల్సి ఉంది. కాని అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లేక అమలులో లోపంతో మెనూ ప్రకటనకే సరిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త మెనూను ప్రవేశ పెట్టలని కోరుతున్నారు. కొత్తమెనూపై స్పష్టతలేదు కొత్త మెనూకు సంబంధించిన బోర్డును పాఠశాలలో ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికీ ఎంత వడ్డించాలి, కొత్త టెండర్ వేయాలా వద్దా అనే స్పష్టతలేదు. పాత టెండర్దారులకే అప్పగిస్తారా అనే అంశం కూడా తెలియడంలేదు. రెండురోజుల్లో పూర్తి సమాచారం రాగానే ప్రారంభిస్తాం. – సంగీత, మండల విద్యాశాఖ అధికారి -
ఆమెకు అనారోగ్యం...
రక్తం పంచిచ్చే అమ్మ.. రక్తం పంచుకుని పుట్టే చెల్లెమ్మ.. అదే రక్తం కరువై అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే ఆడపిల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. చిన్నారులనూ రక్తహీనత ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదీ మన దేశ సగటు మహిళ పరిస్థితి. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇలాంటి చేదు నిజాలెన్నో బయటపడ్డాయి. సాక్షి, హైదరాబాద్: పురుషులతో పోల్చితే మహిళలే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. చిన్నప్పటి నుంచే మహిళల్లో ఈ సమస్య ఉంటోందని వెల్లడించింది. ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత సమస్య ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను తేల్చింది. మన రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువ మంది రక్తహీనత బాధితులున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి 100 మంది మహిళల్లో 58 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్న వారు 55 శాతం మంది ఉన్నారు. సంప్రదాయ పద్ధతులే కారణం..! మన దేశంలోని సంప్రదాయ పద్ధతులే మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రక్తహీనత సమస్య మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. వయసుకు తగ్గ పొడవు, బరువు పెరగట్లేదు. దీంతో వయసుకు తగ్గట్లు శరీరంలో మార్పులు రావట్లేదు. రక్తహీనత సమస్య ఓసారి వచ్చాక అధిగమించడం కష్టంగా పరిణమిస్తోంది. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారానికి, చేసే పనికి చాలా తేడా ఉంటోంది. సరిపడా ఆహారం తీసుకోకపోవడంతో పాటు విరామం లేకుండా పని చేయడం వల్లే ఎక్కువ మంది మహిళలను రక్తహీనత వెంటాడుతోంది. చర్యలు అంతంత మాత్రమే.. మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య అంశాల్లో రక్తహీనత అతిపెద్ద సమస్య. దీని పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతున్నాయి. రక్తహీనత సమస్య నివారణకు మన రాష్ట్రంలో ఏటా రూ.20 కోట్ల విలువైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇవి ఎటూ సరిపోవట్లేదనే అభిప్రాయం ఉంది. గర్భిణులకు మాత్రమే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మాత్రలను పంపిణీ చేస్తోంది. గర్భం దాల్చిన 6 నెలల వరకు, ప్రసవం తర్వాత 6 నెలల వరకు కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ మందులు అందట్లేదు. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఏడాది పాటు ఈ మందులు తీసుకునే మహిళలు 30 శాతానికి మించట్లేదు. దీంతో రక్తహీనత సమస్య బాధితులు ఎక్కువగా ఉంటోంది. బాలికల్లోనూ.. భవిష్యత్ తరం ఆరోగ్య పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో అయితే రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉంది. ప్రతి 100 మంది చిన్నారుల్లో 60 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చని మహిళలతో పోల్చితే ప్రసవం జరిగిన మహిళల్లో రక్తహీనత కాస్త ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. -
అదే ప్రధాన కారణమా?
మహిళల్లో రక్తహీనత సమస్య ఎందుకు ఏర్పడుతుంది? జన్యుపరమైన కారణాలే ప్రధాన కారణమా? రక్తహీనతను అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? – వి. హిత, కొత్తూరు రక్తహీనత (అనీమియా) అంటే రక్తంలోని రక్తకణాలలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్ వాయువును అన్ని అవయవాలకు చేరవేస్తుంది. ఆడవారిలో హిమోగ్లోబిన్ సాధారణంగా 11గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. కనీసం 10 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే మంచిది. దీనికంటే తక్కువ ఉండటాన్ని అనీమియా అంటారు. రక్తహీనత వల్ల శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేక, శక్తి తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవటం, ఆయాసం, నీరసం, కళ్లు తిరగడం, కాళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడుతుంటాయి. హిమోగ్లోబిన్ శాతాన్నిబట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఐరన్ (ఇనుము) ఖనిజం ఉన్న ఆహారం తక్కువ తీసుకోవటం, తిన్న ఆహారం అరగటంలో సమస్య, పేగులలో సమస్య, పేగులలో నులిపురుగులు ఉండటం, నొప్పి ఉపశమనానికి మందులు ఎక్కువగా తీసుకోవడం, పేగులలో బ్లీడింగ్ అవ్వటం వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైన చెప్పిన సమస్యలతో పాటు, ఆడవారిలో అదనంగా నెలనెలా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం వల్ల, కాన్పుల వల్ల, కాన్పు సమయంలో రక్తస్రావం వల్ల రక్తహీనత ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కొందరిలో ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్ వంటి పోషకాల లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పోషకాలు ఎక్కువ ఉన్న పచ్చని ఆకుకూరలు, పప్పులు, బీన్స్, క్యారెట్, బీట్రూట్, పల్లీలు, ఖర్జూరం, అంజీర, బెల్లం, దానిమ్మ, కివి, ఆరెంజ్, అలాగే మాంసాహారులు అయితే గుడ్లు, మటన్, లివర్, బోన్‌సూప్, చికెన్, చేపలు వంటివి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన పౌష్టికాహారంతో పాటు ఐరన్, విటమిన్ మాత్రలు అవసరమైతే ఐరన్ ఇంజెక్షన్లు కూడా డాక్టర్ సలహామేరకు తీసుకోవలసి ఉంటుంది. విటమిన్ సి.. ఆహారంలోని ఐరన్‌ను రక్తంలోకి ఇనుమడింప చేస్తుంది. కాబట్టి విటమిన్ సి కలిగిన ఆరెంజ్, బత్తాయి, ఉసిరికాయ వంటివి తీసుకోవాలి. కాఫీ, టీలలో ఉండే టానిన్, కెఫిన్ పదార్థాలు ఐరన్‌ను రక్తంలోకి ఇనుమడింపలేవు. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఈ జాగ్రత్తలతో పాటు రక్తహీనతకు గల కారణాన్ని తెలుసుకోవటానికి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చెయ్యించుకుని, కారణాన్ని బట్టి, దానికి తగ్గ చికిత్స తీసుకోవటం తప్పనిసరి. ప్రెగ్నెన్సీ సమయంలో విమాన ప్రయాణాల వల్ల మిస్క్యారేజ్ జరిగే ప్రమాదం ఉందనే మాట విన్నాను. ఇది ఎంతవరకు నిజం? గర్భిణీ స్త్రీలు తప్పనిసరి పరిస్థితులలో విమాన ప్రమాదం చేయాల్సివచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శ్రీ, హైదరాబాద్ ప్రెగ్నెన్సీ సమయంలో విమాన ప్రయాణాల వల్ల, అందరికీ కాదు కానీ కొందరిలో శరీరతత్వాన్ని బట్టి మొదటి మూడు నెలల్లో మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కొన్ని విమానాల్లో పైకి ఎగిరేటప్పుడు జరిగే ప్రెజర్ చేంజెస్ వల్ల ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి కారణాల వల్ల కొందరిలో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరిలో ఈ సమయాల్లో వికారం, వాంతులు ఉండటం వల్ల అవి విమాన ప్రయాణంలో ఇంకా ఎక్కువై ఇబ్బంది పెట్టడం, ఊపిరి ఆడనట్టు ఉండటం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ప్రయాణం చెయ్యాల్సి వచ్చినప్పుడు, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. విమాన ప్రయాణాలు మొదటి మూడు నెలలు, చివరి ఎనిమిది, తొమ్మిది నెలల్లో చెయ్యకపోవడం మంచిది. తప్పని సరి అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చెయ్యవచ్చు( ఎనిమిదో నెలలో చేసేటప్పుడు డాక్టర్ ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది). వికారం, వాంతులు లేకుండా మాత్రలు తీసుకోవచ్చు. విమానం ఎక్కే ముందు గ్యాస్ వచ్చే కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. మీ మెడికల్ ఫైల్‌ను మీతో పాటు తీసుకొని వెళ్లాలి. విమానంలో కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో లేచి అటూఇటూ తిరగాలి. కాళ్లు, పాదాలు కదుపుతూ ఉండాలి. కాళ్లకి కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం మంచిది. కాళ్లు చాపుకోవడానికి వీలుగా ఉండే ముందు సీట్లను ఎంచుకోవడం మంచిది. చక్కెర వ్యాధితో బాధపడే గర్భిణీలకు ‘ప్రెగ్నెన్సీ లాస్’ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఇటీవల చదివాను. ఇది నిజమేనా? ‘ప్రెగ్సెన్సీ లాస్’ జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? – ఎన్. లత, నిజామాబాద్ చక్కెర వ్యాధి గర్భం దాల్చక ముందు నుంచే ఉందా? లేక గర్భం దాల్చిన తర్వాత వచ్చిందా? అనే దాన్నిబట్టి ప్రెగ్నెన్సీ లాస్ ముప్పు అంచనా వేయడం జరుగుతుంది. గర్భం రాకముందు నుంచే చక్కెర వ్యాధి ఉండి, అది సరిగా నియంత్రణలో లేకపోతే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శిశువులో అవయవ లోపాలు, కడుపులో చనిపోవడం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ అధికంగా బరువు పెరగడం, కాన్పు సమయంలో ఇబ్బందులు వంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత చక్కెర వ్యాధి వచ్చేవారిలో పైన చెప్పిన సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది కానీ, కొద్దిగా తక్కువగా ఉంటుంది. చక్కెర వ్యాధికి డాక్టర్ పర్యవేక్షణలో చెప్పిన సమయానికి రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకుంటూ దానికి తగ్గ మందులు తీసుకుంటూ ఆహార నియమాలను పాటించడం, రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ లాస్ వంటి ఇతర కాంప్లికేషన్ల ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. పెగ్నెన్సీ సమయంలో బరువు ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుని, కూరలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సపోటా, స్వీట్లు వంటివి ఆహారంలో ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ కొద్దిసేపు డాక్టర్ సలహా మేరకు నడక, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్ హైదరాబాద్ -
దీర్ఘకాలిక యౌవనాన్ని ఇచ్చే చిలగడదుంప!
చిలగడదుంపను కొన్ని ప్రాంతాల్లో మోరం గడ్డ అనీ, మరికొన్ని చోట్ల గణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చేసే గుణం చిలగడదుంపలో ఉంది. సాధారణంగా చాలా రకాల దుంపలను డయాబెటిస్ రోగులు తీసుకోకూడదని అంటారు. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చిలగడదుంపలను డయాబెటిస్ ఉన్నవారూ పరిమితంగా తీసుకోవచ్చని న్యూట్రిషన్ నిపుణుల మాట. దీంతో ఒనగూనే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... ►చిలగడదుంప చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. దీనిలోనూ విటమిన్–సి పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. ►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం కూడా ఉంది. ఒత్తిడితో పాటు అనేక కారణాలతో ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప సమర్థంగా తొలగిస్తుంది. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. ►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది. అంతేకాదు... ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ►చిలగడదుంపలోని మెగ్నీషియమ్... ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. -
రుచికే కాదు... ఆరోగ్యానికి కూడా!
తీపి వంటకాల్లో యాలకులను వేయడం వల్ల వాటికి మంచి రుచి, వాసన వస్తాయి. దీంతో ఆయా వంటకాలను తినాలనిపిస్తుంది. అయితే యాలకులు కేవలం వంటలకు రుచినివ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు చేకూరుస్తాయి. అవేమిటో చూద్దాం... ►భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ►ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగుసార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ►యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ►రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది. ►శరీరంలో ఉన్న విష, వ్యర్థపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. ►రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేసి, గ్లాస్ వేడినీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. ►సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. -
ఐడిఎ తగ్గాలంటే...
గుడ్ ఫుడ్ ఐడిఎ అంటే ఐరన్ డెఫిషియెన్సీ ఎనీమియా. భారతీయ మహిళల్లో ఇది ఎక్కువ. రక్తహీనతకు దారి తీసే కారణాలలో ఐడిఎది ప్రధాన పాత్ర. బికాంప్లెక్స్ విటమిన్...బి12 విటమిన్ ఎనీమియా రాకుండా నివారిస్తుంది. ప్రోటీన్లు, కాపర్, అయోడిన్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్... తగినంత మోతాదులో తీసుకోవాలి.మెంతిఆకు... టీనేజ్ అమ్మాయిలు, మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తరచుగా మెంతిఆకు లేదా మెంతులు తీసుకుంటే రక్తహీనత రాదు. పాలకూర... రక్తహీనతను, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది. నువ్వులు... రోజుకు టీ స్పూన్నువ్వులు తీసుకుంటే ఐరన్‌లోపం కారణంగా వచ్చిన రక్తహీనత తగ్గుతుంది. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తినవచ్చు. నువ్వులు వేడి చేస్తాయనేది అపోహ మాత్రమే. తేనె... ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. తక్షణశక్తినిస్తుంది, ఎప్పుడు నీరసంగా అనిపించినా గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగవచ్చు. డయాబెటిస్ పేషంట్లు తేనె తీసుకోకూడదు. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.వీటితోపాటు సాధారణంగా ఆహారంలో అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్మిస ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, టొమాటోలు బాగా తీసుకోవాలి. -
శ్వాస కష్టంగా ఉంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఈ మధ్య మాట్లాడుతున్నా, నడుస్తున్నా ఆయాసంగా ఉంటోంది. మగతగా ఉండటం, త్వరగా అలసిపోవడం, శ్వాస కష్టంగా జరుగుతోంది. చర్మం పాలిపోయినట్లు ఉంది. డాక్టర్ రక్తం తక్కువగా ఉందని అన్నారు. నా సమస్యకు పరిష్కారం ఉందా? – సంధ్యారాణి, నిర్మల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. హీమోగ్లోబిన్ ఇంతకంటే తక్కువ ఉంటే రక్తహీనతగా పరిగణించవచ్చు. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో వాళ్లలో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత అన్నది ప్రధానంగా మహిళల్లో, పిల్లల్లో ఎక్కువ. పౌష్ఠికాహార లోపం దీనికి ఒక ప్రధాన కారణం. లక్షణాలు: ∙శ్వాస కష్టంగా ఉండటం ∙అలసట ∙చికాకు ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం మొదలైనవి. చికిత్స : వ్యాధికి కారణమయ్యే అంశాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా వ్యాధిని తగ్గించవచ్చు. హోమియో విధానంలో ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగకారణాన్ని కనుగొని, దాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఇలా ఈ మందులు సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. రక్తహీనత సమస్యకు హోమియోలో నేట్రమ్మూర్, ఫెర్రమ్‌ఫాస్, కాల్కేరియా ఫాస్, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తెల్లమచ్చలు వస్తున్నాయి! హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అన్నారు. ఇది హోమియో మందులతో తగ్గుతుందా? – సంపత్‌కుమార్, విజయనగరం చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు తెల్ల మచ్చలు వస్తాయి. దీనిని బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. కారణాలు: – దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి – కొన్నిసార్లు కాలిన గాయాలు – పోషకాహారలోపం – జన్యుపరమైన కారణాలు – దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు – మందులు, రసాయనాలు – కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు – వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటివి బొల్లి వ్యాధికి కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అదే పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలను తగ్గించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ మెడనొప్పి తగ్గుతుందా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె.ఆర్.ఆర్., నెల్లూరు స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చుజాయింట్స్లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసలు దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
శ్రద్ధహీనత
ఐరనీ ఈ వార్త వింటే మన ముఖాలు పాలిపోతాయి. నిజమే... సమాజంలో స్త్రీ ఇంకా సెకండరీ సిటిజన్‌గానే ఉందా అని రక్తం ఇంకిపోయిన ముఖాలతో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది! మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరికీ అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతాయనేది వాస్తవం. ఒక్కరోజు ఆమె నిస్సత్తువగా మంచం మీద పడుకుంటే ఇక ఆ రోజుకి ఆ ఇంట్లో ఎవరికీ ఏదీ సమయానికి అందదు. కడుపు నిండా అన్నం ఉండదు. అలాంటి స్థితిలో కూడా మహిళ ఆరోగ్యం ఎవరికీ పట్టదా?! ఇంకా ముఖ్యంగా బిడ్డలను కనాల్సిన మహిళ మరింత ఆరోగ్యంగా ఉండాలి. ఎంతగా అంటే... తన దేహం తగినంత పోషకవిలువలతో ఉంటూ మరో ప్రాణికి జీవం పోయగలిగినంత ఆరోగ్యంగా ఉండాలి. సరిగ్గా ఇక్కడే కుటుంబాలలో విపరీతమైన అలసత్వం కరడుగట్టుకుని ఉంది. ఇక్కడే ముఖం పాలిపోయేటంతటి రక్తహీనత గూడుగట్టుకుని ఉంది. మనదేశంలో దాదాపుగా యాభై శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అది కూడా పిల్లల్ని కనాల్సిన వయసులో ఉన్న వారే. ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు మహిళ రక్తహీనతతో బాధపడుతుందంటే దేశం ఆరోగ్యంగా ఉందని ఎలా చెప్పగలం? ఇటీవలి ఓ అధ్యయనంలో భారతీయ మహిళల రక్తహీనత బయటపడింది. ముఖ్యంగా పిల్లల్ని కనే వయసులో ఉన్న మహిళలలో దాదాపుగా యాభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. నిజానికి ఇది రక్తహీనత కాదు. మన శ్రద్ధ హీనత. రోజుకో పండైనా తినమని ఆమెకు చెప్పడానికి ఇంట్లో ఒకరు ఉండాలి. ‘ఇల్లు... ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి’... ఈ నినాదాన్ని ఒంటబట్టించుకుంటే మహిళ ఒంటికి కొంచెం రక్తం పడుతుందేమో! -
రక్తహీనత మహిళలకు పోషకాహారం
⇒ ఇక్రిశాట్‌తో ఒప్పందానికి వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం ⇒ పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లా ఎంపిక ⇒ జొన్న, ఇతర తృణధాన్యాల మిశ్రమ పొట్లాల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రక్తహీనతతో బాధపడే గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు పోషకాహారం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్రిశాట్ అధికారులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చర్చించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఏరియాలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళలకు పోషకాహారంతో కూడిన ఆహారా న్ని రోజువారీగా సరఫరా చేయ నున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. 60 శాతం మందికిపైగా రక్తహీనత బాధితులే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 60 శాతానికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. రక్తహీనత కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతు న్నాయి. వాకాటి కరుణ ఆధ్వర్యంలో జిల్లాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎక్కడ చూసినా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. దీంతో పోషకాహార సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్రిశాట్ ఇప్పటికే పోషకాహార మిశ్రమాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచింది. జొన్నలు, శనగలు, రాగులు, ఇతరత్రా సమపాళ్లలో కలిపిన ఆహారపదార్థాలను కలిపి ఉంచిన పొట్లాలను సిద్ధం చేసింది. అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాహార బిస్కెట్లను కూడా ఇక్రిశాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని రక్తహీనతతో బాధపడుతున్న మహిళలతోపాటు ఇతర మహిళలకు కూడా సరఫరా చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఉద్దేశం. దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను ఉపయోగించుకోనుంది. ఉట్నూరులోని మహిళల సంఖ్య, వారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారెందరు వంటి వివరాలను సేకరించి త్వరలో అక్కడ పోషకాహారాన్ని సరఫరా చేయనుంది. -
ఏ తిండిలో ఏముంది?
ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి ♦ పోషకాల వారీగా సమస్త వివరాలతో నివేదిక ♦ 526 ఆహార పదార్థాలను విశ్లేషించి రూపొందించిన ఎన్ఐఎన్ ♦ త్వరలో సరికొత్త యాప్ ♦ తిన్నది చెబితే చాలు.. అందులోని క్యాలరీలు, పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ప్రత్యక్షం మధుమేహం వచ్చిందా..? ‘‘అన్నం మానేయ్. రోజూ రాగి సంకటి తిను.. ఫలానా చెట్టు తీగ భలే పనిచేస్తుందట..’’ ఇలాంటి సలహాలు బోలెడు వినిపిస్తాయి! ఎవరి మాట వినాలో.. ఎవరిది వినవద్దో తెలియక తలపట్టుకునే సందర్భాలూ బోలెడుంటాయి. ఇకపై ఈ సమస్య ఉండదు. ఒక్క మధుమేహం మాత్రమే కాదు.. అన్ని రకాల పోషకాలతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలంటే ఏం తినాలి? ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలున్నాయి? విటమిన్లు, ఖనిజాల మోతాదులు ఎంత? తదితర అంశాలన్నింటితో జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసింది. ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్స్ (ఐఎఫ్‌సీటీ) పేరుతో ఈ నెల 18న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా చేతుల మీదుగా ఈ నివేదిక విడుదల చేశారు. ఎన్ఐఎన్ ఇన్చార్జి డైరెక్టర్ టి.లోంగ్వా, సీనియర్ శాస్త్రవేత్తలు అందించిన ఆ వివరాలు స్థూలంగా.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఈ నివేదిక ఓ దిక్సూచి.. దేశంలో ఆహార పదార్థాల్లోని పోషకాంశాల మోతాదును అంచనా కట్టి దాదాపు 45 ఏళ్లు గడచిపోయాయి. 1971నాటి నివేదికకు 1989లో కొన్ని అంశాలను చేర్చారు. అయితే ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రాక నేపథ్యంలో ఎన్ఐఎన్ మరో సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకు దేశం మొత్తాన్ని నైసర్గిక, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఈ ప్రాంతాల నుంచి 526 రకాల ఆహార పదార్థాలు (బియ్యం, గోధుమ మొదలుకొని రకరకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చేపలు, మాంసం తదితరాలు) సేకరించి విశ్లేషించింది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు పదార్థాలు వంటి 12 స్థూలాంశాల్లో, విటమిన్ డి, పాలిఫినాల్స్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లెవిన్ వంటి వందకుపైగా సూక్ష్మాంశాల మోతాదును నిశితంగా పరిశీలించింది. వీటన్నింటితో ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్‌ను రూపొందించింది. మధుమేహం, రక్తపోటుతోపాటు అనేక రకాల వ్యాధుల నియంత్రణ, కొన్నింటి చికిత్సలోనూ ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. డైటీషియన్లు మొదలుకొని, ఆహార రంగంలో ఉన్నవారికి, పిల్లలు, మహిళలు ఇతరులకు పోషకాహారంఅందించే ప్రభుత్వ సంస్థలకు, పరిశోధకులకు ఈ నివేదిక ఓ దిక్సూచిలా ఉండనుంది. దంపుడా.. పాలిష్డా..? మల్లెపూల మాదిరిగా తెల్లగా ఉన్న అన్నం తినడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి దీంతో పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈ రెండింటిలో ఏది తినడం మేలన్న ప్రశ్నను టి.లోంగ్వా ముందు ఉంచింది. దానికి ఆయన సమాధానమిస్తూ ‘‘చాలామంది దంపుడు బియ్యం మేలని అంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. పైపొరలో అనేక సూక్ష్మ పోషకాలు, బీ విటమిన్లు ఉంటాయి. పాలిష్ చేసే క్రమంలో ఇవన్నీ పోతాయి. అయితే ఇందులో ఓ చిక్కుంది. ఇదే పై పొరలో ఫేటేట్లు అనే రసాయనాలు కూడా ఉంటాయి. శరీరం ఇనుము, కాల్షియం వంటి వాటిని శోషించుకోకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ కారణంగానే మేం ఇటీవల బియ్యం పాలిషింగ్‌పై విస్తృత అధ్యయనం చేశాం. ప్రస్తుతం చేస్తున్న పది శాతం మిల్లింగ్ స్థానంలో 8 శాతం చేస్తే చాలా వరకూ సమస్యలను అధిగమించవచ్చని మా అధ్యయనంలో తేలింది’’ అని అన్నారు. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లో సమస్తం అన్ని విధాలుగా పుష్టినిచ్చే ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి ఎంత మేలు/కీడు జరుగుతోందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎన్ఐఎన్ సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడేలా ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనుంది. మీ వయసు, బరువు, ఎత్తు వంటి వివరాలతోపాటు తినే ఆహారం తాలూకూ వివరాలు ఈ అప్లికేషన్లో నమోదు చేస్తే చాలు.. మీకు ఎన్ని కేలరీల శక్తి అందింది..? అందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాంశాల మోతాదు ఎంత? అన్న వివరాలు తెలిసిపోతాయి. ‘‘మరో మూడు నాలుగు నెలల్లో ఈ అప్లికేషన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కూడా పనిచేసేలా రూపొందిస్తున్నాం’’ అని ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. నివేదికలో ఎన్నో ప్రత్యేకతలు ఎన్ఐఎన్ సిద్ధం చేసిన ఈ నివేదిక ఎన్నో విధాలుగా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే తొలిసారి ఈ నివేదికలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డి లభించే ఆహార పదార్థాల విస్తృత వివరాలు అందించారు. సూర్యరశ్మి ద్వారా మాత్రమే శరీరం ఈ విటమిన్‌ను తయారు చేసుకోగలదని, కొన్ని రకాల మాంసాహారాల్లోనూ లభిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ విటమిన్ ఏ ఏ కాయగూరలు, ఆకు కూరలు, తిండిగింజల్లో ఎంత మోతాదులో ఉంటుందో ఎన్ఐఎన్ విశ్లేషించింది. అంతేకాకుండా దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ నివేదికలో విశ్లేషించిన 526 ఆహార పదార్థాల పేర్లను 15 జాతీయ భాషల్లో తర్జుమా చేసి అందించింది. ప్రస్తుతం ఆంగ్లంలో ఉన్న ఈ నివేదికను ఇతర భాషల్లోకి అనువదించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్ఐఎన్ మీడియా కో– ఆర్డినేటర్ డాక్టర్ ఎం.మహేశ్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తహీనత ఐఎఫ్‌సీటీ టేబుళ్ల తయారీ కోసం చేసిన సర్వే ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా జనాభా రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో పాటు ప్రజల్లో 20 శాతం మంది రక్తపోటు సమస్య కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ తాజాగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలను సేకరించామని, వీరిలో ఉన్న లోటు పాట్లు, సమస్యలపై త్వరలోనే ఓ నివేదికను సిద్ధం చేస్తామని ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. -
తాటి బెల్లంతో ఆరోగ్యం.. ఆదాయం!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి వద్దనే సులువుగా తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని (ఆడ, మగ) తాటి చెట్ల నుంచి నీరాను సేకరించవచ్చు. రోజుకు ఒక చెట్టు నుంచి 6 లీటర్ల వరకు నీరాను తీయవచ్చు. దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం పొందవచ్చు. తాటి బెల్లం పొడికి మరింత ధర వస్తుంది. గీత కార్మికులు తాటి చెట్ల ద్వారా ఏడాది పొడవునా ఆదాయం పొందే మార్గాలున్నాయని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వెంగయ్య చెబుతున్నారు. ఆయన అందించిన ప్రత్యేక సమాచారం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. గ్రామీణ భారతంలో తాటి చెట్టు అత్యంత ప్రాధాన్యత గల చెట్టు. ఈ చెట్టులో పనికిరాని భాగమంటూ లేదు. మన దేశంలో తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్లో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. భారతదేశంలో సుమారు 12 కోట్ల తాటి చెట్లు ఉన్నట్టు అంచనా. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. తాటి, ఖర్జురా, కొబ్బరి చెట్ల నుంచి కాయలను ఉపయోగించుకోవడం మనకు తెలుసు. కానీ, ఈ చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా బెల్లాన్ని, బెల్లం పొడిని కూడా తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఈ చెట్ల నుంచి తీసే నీరా ద్వారా బెల్లం, బెల్లం పొడి తయారు చేయవచ్చు. తాటి నీరాలో ఎక్కువ చక్కెర ఉంటుంది. తాటి చెట్లు రసాయనాలతో ప్రమేయం లేకుండా సహ జ సిద్ధంగా పెరగడం, విరివిగా లభించటం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. తాటి నుంచి లభ్యమయ్యే విలువైన పదార్థాలలో నీరా అతి ముఖ్యమైనది. తాటి గెలల నుంచి ఊరే రసాన్ని తాజాగా ఉన్నప్పుడు నీరా అంటారు. తాజా నీరా మంచి వాసన, స్పష్టమైన రంగుతో తియ్యగా ఉంటుంది. పులిసిన నీరాను కల్లు అంటారు. ఇది మత్తును క లుగ జే స్తుంది. ఆడ, మగ చెట్ల నుంచి కూడా నీరా లభిస్తుంది. నవంబర్ నుంచే మగ తాటి చెట్ల నీరా! తాటి నీరాలో సుమారు 12-15 వరకు చక్కెర శాతం ఉంటుంది. ఆడ చె ట్ల నుంచి లభించే నీరాలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. ఆడ చెట్లలో జనవరి నుంచి మే వరకు లభిస్తుంది. మగ చెట్లలో ముందుగా అంటే నవంబర్ నుంచి వస్తుంది. ముదిరిన కాయల నుంచి అక్టోబరు వరకు నీరా వస్తుంది. గీత కార్మికులు నీరాతో తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి స్థాయిలోనే తయారు చేయవచ్చు. బెల్లం, చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు లేదా అమ్ముకొని ఉపాధి పొందవచ్చు. రసాయనాలు లేని ఆరోగ్యదాయకమైనవి కాబట్టి తాటి బెల్లం, తాటి బెల్లం పొడికి పట్టణ, నగర మార్కెట్లలో మంచి ధర కూడా లభిస్తున్నది. ఒక గీతకార్మికుడు రోజుకు సుమారు 12-15 చెట్లు గీయగలడు. ఒక చెట్టుకు సుమారు 1 లీటరు నుంచి 6 లీటర్ల వరకు నీరా వస్తుంది. ఒక చెట్టు నుంచి సాలీనా ఏడాదికి 150 లీటర్ల నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా గీత కార్మికులకు సంవత్సరం మొత్తం పని లభించడమే కాకుండా.. అధిక ఆదాయం కూడా లభిస్తుంది. తాటి బెల్లంలో పోషకాలు ఘనం.. పులియని తాజా నీరా నుంచి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం. తాటి బెల్లంతో రక్తహీనతకు చెక్ తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం ‘వస్తుగుణ దీపిక’లో రాసి ఉంది. తాటి బెల్లాన్ని క్రమం తప్పకుండా 20 గ్రా. తీసుకోవటం వల్ల అనేక రకాలయిన వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలలో, చిన్న పిల్లల్లో రక్తహీనతను త గ్గిస్తుంది. అంతే కాకుండా తాటి బెల్లాన్ని వాడటం వల్ల వీర్య పుష్టి, దేహ పుష్టి కలుగుతుంది. శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం కలిగి ఉండటం వల్ల రక్తపోటు, గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. తాటి బెల్లం ధర సుమారు కిలో రూ. 200 వరకు ఉంది. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం లభిస్తుంది. జనవరి నుంచి మే వరకు బెల్లం తయారీ ద్వారా ఉపాధి పొందవచ్చు. ఔషధ విలువలు కలిగిన ఈ బెల్లాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతున్నారు. పటిక బెల్లం, చాక్లెట్లు సహా వివిధ తీపి ఆహార పదార్థాల తయారీలోనూ తాటి బెల్లాన్ని వాడొచ్చు. తాటి బెల్లం పొడి తయారీ సులువే! నీరా నుంచి బెల్లంతో పాటు బెల్లం పొడిని తయారు చేయవచ్చు. బాణలి లేదా పాన్‌లో కాచిన పాకాన్ని అచ్చుల్లో పోస్తే బెల్లం తయారవుతుంది. మంట ఆర్పేసి అలాగే తిప్పుతూ ఉంటే సులువుగానే బెల్లం పొడి సిద్ధమవుతుంది. వినియోగదారులు పంచదారకు బదులుగా వాడుకోవడానికి బెల్లం పొడి అనువుగా ఉంటుంది. తాటి బెల్లానికన్నా బెల్లం పొడికి మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. - సేకరణ : సాగుబడి డెస్క్ (తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (డా. వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం) సీనియర్ ఆహార -సాంకేతిక విజ్ఞాన శాస్త్ర విభాగం సీనియర్ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు) తాటి బెల్లం తయారీ విధానం.. తాటి నీరాను మరగబెట్టడం ద్వారా బెల్లాన్ని తయారు చేస్తారు. సేకరించే సమయంలో నీరా ఉదజని సూచిక (పీహెచ్) 7.5 ఉండాలి. నీరా తీసే విధానం: 1. పులియకుండా తాజా నీరాను సేకరించేందుకు సున్నం (1 శాతం) వాడాలి. దీని కోసం సేకరించే పాత్రలో సున్నాన్ని పూతగా పూయాలి. ఇది పులియడాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్ గల జిఇ షీట్‌తో చేసిన బాణలిలో పోసి, వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, చల్లార్చి, వడపోయాలి. ఈ దశలో పీహెచ్‌ను చూడాలి. కొంచెం సూపర్‌ను కలపడం ద్వారా పిహెచ్ 7.5 ఉండే విధంగా చూసి వేడి చేయాలి. నీరా మరుగుతున్నప్పుడు వచ్చే తెట్టును తీసి వేయాలి. ఇలా చే స్తే సున్నం విరుగుతుంది. ఈ విధంగా దాదాపు 2 నుంచి 3 గంటలు మరగబెడితే.. నీరా బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టును చల్లని నీటిలో వేసి బెల్లం ఏర్పడే దశను గుర్తించవచ్చు. నీటిలో ఇది పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేములో పోస్తే.. మనకు కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. 2. పందిరిమామిడి పరిశోధనా స్థానంలో పరీక్షించబడిన కూలింగ్ బాక్స్ ఉపయోగించి సులువుగా తాజా నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్గల జిఇషీట్తో చేసిన బాణలి లేదా పాన్‌లో పోసి వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేసి, చల్లార్చాలి. ఈ విధంగా దాదాపు 2-3 గంటలు మరగబెడితే.. బెల్లం పాకం బాగా చిక్కబడుతుంది. ఇది నీటిలో పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపాలి. తర్వాత చల్లార్చి ఫ్రేములో పోయడం ద్వారా కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. తాటి బ్లెలం తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు : నీరాను మరగబెడుతున్నప్పుడు బాగా కలపడం ద్వారా అడుగు అంటకుండా చూడాలి. నీరాను సేకరించినప్పుడు పీహెచ్ 7.5 లేదా 8 ఉండాలి పెనానికి కొంచెం నూనె పూయటం ద్వారా బెల్లం వృథా కాకుండా చూడవచ్చు. చెక్కతో చేసిన ఫ్రేమును నీటిలో నానబెట్టి వాడితే బెల్లం అచ్చులు సులువుగా వస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన తాటి బెల్లం పొందవచ్చు. -
రక్తహీనతతో చిన్నారి మృతి
కెరమెరి(ఆదిలాబాద్) రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం దువుడుపల్లి గ్రామానికి చెందిన రంజిత్, వాణి దంపతుల కుమార్తె సహస్ర(ఏడాది) రక్త హీనతతో బాధపడుతోంది. ఆమెను తల్లి దండ్రులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె 12 రోజులుగా చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో సహస్ర గురువారం ఉదయం చనిపోయింది. చిన్నారి సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. -
అయ్యో అమ్మా..!
బిడ్డ మృతి.. 20 నిమిషాల్లోనే తల్లి కూడా.. కబళించిన రక్తహీనత, జ్వరం రెండ్రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థత విషమ పరిస్థితుల్లోనే ప్రసవం.. మరణం ఆమె గర్భిణిగా నమోదు కాకపోవడం శోచనీయం! గిరి గూడెంలో పురిట్లో విషాదం కెరమెరి(ఆదిలాబాద్) : టేకం భీంబాయి. ఓ గిరిజన వివాహితురాలు. భర్తతో కలిసి కూలీ పని చేసుకునేది. వారిదో మారుమూల గిరిజన గ్రామం శివగూడ. వీరికి బయటి ప్రపంచం తెలియదు. భీంబాయి గర్భిణి అయింది. నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. నెలల నిండిన భీంబాయి రక్తహీనతతో.. జ్వరంతో.. వాంతులతో.. విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే స్థోమత, అవగాహన వారికి లేదు. ఇలాంటి వారిని పట్టించుకునే తీరిక అధికార యంత్రాంగానికి అసలే లేదు. దీంతో భీంబాయి తీవ్ర ప్రసవ వేదనతో.. అదే సమయంలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి చివరికి మృత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 20 నిమిషాల వ్యవధిలోనే తానూ తనువు చాలించింది. అమ్మతనాన్ని, అయినవారిని అన్నీ వదిలి వెళ్లిపోయింది. 20 నిమిషాల్లోనే తల్లీబిడ్డ మృతి మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన టేకం భీంబాయి(25) ఆదివారం రాత్రి జ్వరం, వాంతులు విరేచనాలతో బాధపడుతూనే ప్రసవించి బిడ్డతో పాటు తానూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. భీంబాయి శనివారం ఉదయం కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకుంది. రక్తహీనత, జ్వరం ఉండడంతో వైద్యులు చికిత్స చేశారు. పగలంతా పీహెచ్‌సీలోనే ఉండి సాయంత్రం శివగూడకు వెళ్లారు. అయితే శనివారం నుంచి ఆహారం సరిగా తినలేదు. ఆదివారం జ్వర తీవ్రత పెరిగింది. దీంతో పాటు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. అనేక సార్లు వాంతులు చేయడం, ఇంటికి దూరంలో బహిర్భూమికి వెళ్లడంతో కడుపులో నొప్పి అధికమైంది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు అధికమై ఇదూ సమయంలో ఓ ఆడ శిశువును జన్మనిచ్చింది. అయితే ఆ పాప మృత శిశువు. 20 నిమిషాల వ్యవధిలోనే అదే రాత్రి వేళ అపస్మారక స్థితికి చేరిన తల్లి భీంబాయి కూడా మృతిచెందింది. ఓవైపు తల్లి, మరోవైపు బిడ్డ మరణించి ఉన్న దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రక్తహీనత, గర్భిణి మహిళలకు అందాల్సిన పౌష్టికాహారం లభించకపోవడంతో పాటు, రెండు రోజులుగా కేవలం బిస్కెట్లపై బతికిన ఆ తల్లీబిడ్డలకు ఆహారం లభించకనే బిడ్డ కడుపులో మృతిచెంది ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మృతురాలికి భర్త టేకం భీంరావు ఉన్నాడు. రికార్డులో కనిపించని పేరు వాస్తవానికి గర్భం దాల్చిన నెల ప్రారంభం అయిందంటేనే అంగన్వాడీ, ఏఎన్ఎం రిజిస్టర్లో పేరు నమోదై ఉంటుంది. అప్పటి నుంచి ప్రతీ నెల పీహెచ్‌సీకి రావడం, వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. కానీ నవ మాసాలు నిండినా కూడా భీంబాయి పేరు వారి రిజిస్టరులో నమోదు చేయకపోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ కుటుంబం ఇతర ప్రాంతానికి వలస వెళ్లి ఏడు మాసాల క్రితమే శివగూడకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా ఐసీడీఎస్ కానీ, వైద్య సిబ్బంది కానీ ఎందుకు అలక్ష్యం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్యం, పౌష్టికాహారం అంది ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవని అంటున్నారు. -
మీ సాయం..నిలుపుతుంది ప్రాణం
ఆదోని అర్బన్ : ఈ చిత్రంలో ఉన్న చిన్నారి పేరు యశ్వంత్. ఆదోని పట్టణం మరాఠిగేరికి చెందిన పరశురామ్, రూప దంపతుల కుమారుడు ఇతను. ఎనిదేళ్ల ప్రాయంలో అనీమియా అనే వ్యాధి సోకింది. తల్లిదండ్రులు వివిధ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నెల రోజులు కర్ణాటకలోని బళ్లారిలో చికిత్స చేయించి ప్రస్తుతం రెండునెలలుగా బెంగళూరులో చికిత్స చేయిస్తున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం రూ.12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు బంధువులు, తెలిసిన వారితో సాయం పొంది, వారివద్ద ఉన్న బంగారం అమ్ముకొని రూ.6లక్షలు పోగుచేసుకున్నారు. చికిత్సకు ఇంకా రూ.6లక్షలు అవసరం ఉందని.. ఇందుకోసం దాతలు సహకరించాలని కోరారు. సాయం అందించేవారు సెల్నం: 09945297378, 09740100678, 09951893602లను సంప్రదించాల్సి ఉంది. -
కామెర్లకు పసరు మందు వాడకండి!
కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఇటీవల అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవు అని డాక్టర్ చెప్పారు. వారం క్రితం నిద్రలో ఉన్నప్పుడు తనకు ఆయాసం వచ్చిందని నాన్న చెబుతున్నారు. ఇదేమైనా గుండెపోటుకు దారితీస్తుందా? - వజీర్ అహ్మద్, గుంటూరు సాధారణంగా స్థూలకాయుల్లోనూ, శారీరక శ్రమ లేనివారిలోనూ, ఆస్తమా ఉన్నా, రక్తహీనత ఉన్నా ఆయాసం వస్తుంది. మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ నాన్నగారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆయాసం కనిపిస్తుంది తప్ప అది గుండెజబ్బుకు సూచన కాకపోవచ్చు. ఇక గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా కొందరికి ఆయాసం వస్తుంది. శ్వాస సమస్యలన్నింటినీ గుండెజబ్బుగా అనుమానించకూడదు. ఆయాసంతో పాటు గుండె బరువుగా ఉండటం, చెమటలు పట్టడం, ఛాతీలో మంట, నడవలేకపోవడం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, పనిచేయడం ఆపగానే నొప్పి తీవ్రత తగ్గడం, ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులు, దవడలకు లేదా వెన్ను భాగానికి పాకడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలిదశలోనే గుర్తిస్తే కొద్దిపాటి మందులు, జాగ్రత్తలతోనే గుండెజబ్బును అరికట్టవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు కనిపించగానే సత్వరం చేయాల్సినవి... తొలిగంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఈజీటీ, టూ డి ఎకో వంటి పరీక్షలు చేయించాల్సి, తర్వాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్సలు చేయించాల్సిన అసవరం ఉంది. ఒకవేళ జబ్బు తీవ్రత తక్కువగా ఉంటే (అంటే గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో 50 శాతం కంటే తక్కువ బ్లాక్స్ ఉంటే) అవసరాన్ని బట్టి స్టాటిన్స్ వంటి మందుల ద్వారా సమస్య జటిలం కాకుండా నివారించవచ్చు. ఈ అడ్డంకులు (బ్లాక్స్) 50 నుంచి 70 శాతం మాత్రమే ఉంటే బార్డర్‌లైన్ ఉన్నాయని అర్థం. ఒకవేళ 90 శాతం కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటే తప్పనిసరిగా స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటూ వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, పొగతాగడం వంటి దురలవాట్లు మానేస్తే మంచిది. దీంతో పాటు హైబీపీ, షుగర్ వ్యాధులు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్ నేను తరచు జ్వరంతో బాధపడుతున్నాను. కడుపుపై భాగంలో కొద్దిపాటి నొప్పి కూడా ఉంటోంది. ఇటీవల కామెర్లు వస్తే పసరు మందు తీసుకున్నాను. అయినా తరచు కడుపునొప్పితో పాటు జ్వరం వస్తూనే ఉంది. మా డాక్టర్ గారిని అడిగితే తగ్గే వరకూ పసరు తీసుకొమ్మని అంటున్నారు. - యాదగిరి రెడ్డి, నల్లగొండ మీ లక్షణాలను బట్టి మీరు హెపటైటిస్-సి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పసరుమందు వాడకండి. మీ ఇన్ఫెక్షన్ పసరుతో తగ్గదు. హెపటైటిస్-సి వైరస్ కారణంగా ఈ కాలేయ వ్యాధి వస్తుంటుంది. వైరస్ సోకిన రక్తమార్పిడి లేదా ఇంజెక్షన్ సూదుల వల్ల, వ్యాధి సోకిన గర్భవతుల్లో తల్లి నుంచి బిడ్డకు, దంపతుల్లో ఒకరికి ఉంటే మరొకరికి ఇది సోకడం మామూలే. నిర్ధారణ: ఈ వ్యాధి నిర్ధారణ కోసం మొదట హెపటైటిస్-సి యాంటీబాడీ టెస్ట్ అనే రక్తపరీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత (వైరల్ లోడ్) తెలుసుకునేందుకు హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ పరీక్ష చేస్తారు. వీటితో పాటు జీనోటైప్ పరీక్షల వల్ల రోగికి చికిత్స అందించాల్సిన వ్యవధి, దానికి రోగి ప్రతిస్పందించే తీరుతెన్నులు తెలుస్తాయి. ఇందులోనే కొన్ని ‘జీనోటైప్స్’కు చెందిన వ్యాధుల్లో కాలేయం నుంచి ముక్క తీసి పరీక్షించాల్సి ఉంటుంది. వ్యాధి మరింత ముదరకుండా ఉన్నవారికి చికిత్స బాగానే పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధి బాగా ముదిరితే కనిపించే దుష్ర్పభావాలు... అంటే రక్తస్రావం, పొట్టలో నీరు చేరడం (అసైటిస్), వ్యాధి మెదడుకు చేరడం వంటివి కనిపిస్తే మాత్రం అది కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు ఎంత త్వరగా పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణం చికిత్స చేయించుకుంటే అంత మంచిది. డాక్టర్ పి.బాలచంద్ర మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. నాకు రుతుక్రమం సరిగా రావట్లేదని డాక్టర్ని సంప్రదిస్తే, వారు స్కాన్ తీయించి, పీసీఓడీగా నిర్ధారించారు. వివాహమై ఐదేళ్లు గడిచినా ఈ సమస్య వల్ల సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - డి. బాలమణి, రాజమండ్రి మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అందులో ఒకటైన పీసీఓడీ సమస్య ఒకటి. ఇది వివాహిత మహిళలలో సంతానలేమికి దారితీస్తుంది. ఇమెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటి బుడగల వలె ఉండటాన్ని పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యలో రెండు అండాశయాలలో ఒక అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ పీసీఓడీ సమస్య ఉన్న మహిళలలో అండం విడుదల కాకుండా అపరిపక్వత చెంది అండాశయపు గోడలపై నీటిబుడగల వలె ఉండిపోతాయి. ఇలా రెండు ఆండాశయాలపై కనిపిస్తే దీనిని ైబె లేటరల్ పీసీఓడీ అంటారు. కారణాలు: ఎఫ్.ఎస్.హెచ్, ఈస్ట్రోజన్, టెసోస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారపు నియమాలు పాటించకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యత వంటి అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: నెలసరి రాకపోవడం, నెలసరి సరిగా వచ్చినా, అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువరోజుల పాటు కొనసాగడం, నెలసరి ఆగి ఆడి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం, కొంతమందిలో బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా గమనించవచ్చు. జుట్టు రాలడం, ముఖం, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖంపైన, ఛాతీపైన మగవారి మాదిరిగా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. దుష్ఫలితాలు: ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సంతానలేమికి అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక మరియు శారీరక తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంతానలేమి, ఇతర కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. మీరు వెంటనే హోమియోవైద్యనిపుణులను సంప్రదించగలరు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయి.. ఏం చేయాలి?
హోమియో కౌన్సెలింగ్ ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నాకు కారణాలు చెప్పి, హోమియోలో చికిత్స సూచించండి. - ధనలక్ష్మి, కందుకూరు మన శరీరంలోని కదలికూ కీళ్లే ప్రధాన కారణం. అవి వేళ్ల జాయింట్లు కావచ్చు. మణికట్టు కీళ్లు కావచ్చు. భుజం జాయింట్లు కావచ్చు. పాదాల, వేళ్ల కీళ్లు కావచ్చు ఈ కీళ్ల కదలికలో వచ్చే సమస్యలను ఆర్థ్రరైటిస్ అంటారు ఇది కీళ్లలో సాధారణంగా వచ్చే. అతి పెద్ద సమస్య. లక్షణాలు : కీలు లోపల వాచిపోవడం కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధ కీలు కడుపుతున్నప్పుడు శబ్దం రావడం జాయింట్లు ఎర్రగా మారడం జాయింట్ల వద్ద తాకినప్పుడు వేడిగా ఉండడం ఆకలి సరిగా లేకపోవడం రక్తహీనత నిద్ర లేకపోవడం. కారణాలు : శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం జాయింట్ దగ్గర దెబ్బలు తగలడం వంశపారంపర్య కారణాలు జాయింట్లు అరిగిపోవడం శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌లో వచ్చే అసాధరణ లోపాలు సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం మానసిక ఒత్తిడి. ఆర్థరైటిస్లోని రకాలు: ఎ. ఆస్టియో ఆర్థ్రరైటిస్: కీలు అరిగిపోవడం వల్ల కీలు లోపలంతా వాచిపోయి కదపాలంటే నొప్పి, బాధ తీవ్రంగా ఉంటుంది ఇది ఎక్కువగా వయస్సు మళ్లిన వారిలో కనిపిస్తుంది జాయింట్‌కు ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, శరీర బరువు అధికంగా ఉండటం వల్ల కానీ వస్తుంది. బి. రుమాటాయిడ్ ఆర్థ్రరైటిస్: స్పష్టమైన కారణమేది తెలియకుండానే ఆరంభమయ్యే అతిపెద్ద సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కీళ్లు ఎర్రగా వాచిపోయి, ఉదయం లేస్తూనే జాయింట్లు కదపడానికి సహకరించవు. తీవ్రమైన నొప్పి ఉంటుంది సాధారణంగా ఇది ఎక్కువగా చిన్న జాయింట్లకు వస్తుంది అంతేకాకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. సి. ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్: శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీళ్ల దగ్గరకు చేరడం వల్ల నొప్పులు వస్తాయి. దీనిని ఇన్ఫెక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. డి. సోరియాటిక్ ఆర్థ్రరైటిస్: సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో పాటు, ఒక్కోసారి కీళ్లల్లో నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. ఇ. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల తరువాత వచ్చే కీళ్ల వాపును. రియాక్టివ్ ఆర్థ్రరైటిస్ అంటారు. ఎఫ్. వైరల్ ఆర్థ్రరైటిస్: చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు. ఆర్థ్రరైటిస్ నివారణ: ప్రతిరోజూ వ్యాయామం చేయాలి పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి పండ్లు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 46 ఏళ్లు. నేను చాలా రోజుల నుండి అసిడిటి సమస్యతో బాధపడుతనన్నాను. గడచిన 6 నెలల నుండి నేను పాంటాసిడ్-హెచ్‌పి మందులు ఒక వారం వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్దకం మరియు తలనొప్పి సమస్య ఉంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. -రవికుమార్, నంద్యాల మందులు వాడినా మీకు ఫలితం లేదని చెబుతున్నారు. అయితే మీరు ఎండోస్కోపి చేయించారా లేదా అనే విషయం రాయలేదు. ఒకసారి మీరు ఎండోస్కోపి చేయించుకొని దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. రెండవది మలబద్దకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్దకం కడుపులో నొప్పి ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే అవకాశముంది. కాబట్టి మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి. మా బాబు వయస్సు 9 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయి. ఒక నెల రోజుల తరువాత వాటంతట అవే తగ్గిపోయాయి. అయితే రెండు రోజుల నుండి మళ్లీ కళ్లు పచ్చగా అనిపిస్తున్నాయి. మళ్లీ కామెర్లు వచ్చాయని సందేహంగా ఉంది. దయచేసి ఏమి చేయాలో సలహా ఇవ్వండి. -నిరంజన్, ఆదిలాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణగా చిన్న వయస్సులో వచ్చే పచ్చకామెర్లు హైపటైటిస్-ఎ మరియు ఇ అనే వైరస్లు కారణమవుతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి కామెర్లు వచ్చాయి అని తెలిపారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వ్యాధి నిరోధక వక్తి డెవలప్ అయ్యే అవకాశము ఉంది. కాబట్టి మీ బాబుకి కామెర్లు రావడానికి విల్సన్ డిసీజ్ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకి దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయో రాయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాను. ఇటీవల నాకు కాళ్లల్లో వస్తుంది. దాంతో పాటు రాత్రిళ్లు పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తోంది. సాధారణ సమస్యనే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. దాంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. డ్యూటీకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. నాకేమైందో అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడూ నాకు ఇలాంటి సమస్య రాలేదు. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - లింగరాజు, వైజాగ్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు వెరికోస్ వేయిన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం నిల్చుని ఉండేవారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేయించుకోండి. వెరికోస్ వేయిన్స్లో నాలుగు దశలు ఉంటాయి. వ్యాధి దశను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు వెరికోస వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వెయిన్స్ ఉందని నిర్థారణ అయినా మీరు మానసికంగా కృంగిపోకండి. ప్రస్తుతం వెరికోస్ వేయిన్స్కు మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశ, రెండవ దశ, రెండవ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే చాలావరకు వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటాయి. వ్యాధి మొదటి దశ, రెండవ దశలో ఉంటే మందులు వాడుతూ వైద్యులు సూచించిన విధంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. దాంతో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ దశలో వైద్యుల సూచన మేరకు సాగే సాక్సులు, పట్టీలు ధరించవలసి ఉంటుంది. వ్యాధి మూడవ దశ, నాలుగవ దశలో ఉంటే మాత్రం లేజర్ చికిత్స, శస్త్రచికిత్స అవసరమవుతాయి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రాంబిస్తే సులువుగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధిని నిర్థారించుకోండి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
గిరిజన గర్భిణుల్లో రక్తహీనత
గిరిజన గర్భవతుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారిణి దేవకీ వెంకట లక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు పరీశీలించారు. సింబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
ప్రశవ వేదన
మన్యంలో ఆగని మాతా, శిశు మరణాలు 108లో మృతశిశువు జననం రక్తహీనతతో ఆస్పత్రిలో కన్నుమూసిన తల్లి పాడేరురూరల్/జి.మాడుగుల : ఏజెన్సీలో మాతా,శిశు మరణాలు ఆగడంలేదు. మన్యంలోని కొన్ని ఆస్పత్రుల్లో బర్త్‌వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేసి గర్భిణులను కాన్పుల కోసం ముందుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ఇందుకు మరణాలే సాక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి వెయ్యిమందిలో 40 మందికి పైగా పిల్లలు పుట్టిన తరువాత, ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 137 మందిప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. మాత్రా,శిశు మరణాల్లో 50 మంది రక్తహీనతతోనే చనిపోతున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. మన్యంలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. గురువారం మరో గర్భిణి ప్రసవ వేదనతో కన్నుమూసింది. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ కంఠవరానికి చెందిన కొండపల్లి నాగరాత్నం(28)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తహీనతకు గురైందని, పరిస్థితి విషమంగా ఉన్నందున పాడేరు లేదా విశాఖపట్నం తరలించాలని సూచించారు. కానీ పీహెచ్‌సీలోనే ప్రసవానికి సేవలు అందించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. వైద్యులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. చివరకు వైద్యులు కుటుంబసభ్యులను ఒప్పించి108లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా పాడేరు-జి.మాడుగుల రహదారిలోని లాడాపుట్టు సమీపంలో అంబులెన్స్‌లోనే మృతశిశువును ప్రసవించింది. తీవ్ర రక్తస్రావానికి గురైంది. పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా చనిపోయింది. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి, బిడ్డ మృతి చెందారు. నాగరత్నంకు ఇది ఐదో కాన్పు. కాగా గత నెల 24న స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒక బాలింత రక్తహీనతతో చనిపోయింది. అంతకు ముందు ఏప్రిల్ 21న హుకుంపేట మండలం జరకొండ పంచాయతీ బురదగుమ్మిలో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మృత్యువాత పడింది. రక్తహీనతతో కాన్పు కష్టమై గిరిజన మహిళలు చనిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. గర్భిణుల ఆరోగ్య సేవలపై పర్యవేక్షణ కుంటుపడుతున్నాయనడానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణుల వివరాలు నమోదు చేస్తున్నారు. వారికి పౌష్టికాహారం, వైద్యసేవలు మొక్కుబడిగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో మాతా, శిశు సంరక్షణ పథకాలు సవ్యంగా అమలు కావడం లేదు. -
ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!
ఆరోగ్యమే మహాభాగ్యం ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా చూస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరి చేరవు. రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్... చర్మవ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాసియం, మెగ్నీసియం యాసిడోసిస్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి. ఎండు ద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదు. -
బ్లడ్ బ్యాంకులకు రక్తహీనత జబ్బు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలను ‘రక్తహీనత’ జబ్బుపట్టి పీడిస్తోంది. కనీసం లెసైన్స్ లేకపోవడంతో పాటు రక్త సేకరణ, గ్రూపింగ్ నిర్వహణ, ప్రాసెస్, నిల్వ, పంపిణీ వ్యవస్థ, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నేడవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సిన ఆస్పత్రి యాజ మాన్యాలు పట్టించుకోక పోవడంతో ఆపద లో వచ్చిన రోగులకు కనీస సేవలు అందించలేక విమర్శలపాలవుతున్నాయి. నగరంలో 61 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, వీటిలో 21 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా ఇప్పటి వరకు కాంపొనెంట్ ప్రిపరేషన్ మిషన్(ప్లేట్లెట్స్ , ప్లాస్మాలను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానం) లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతూ రక్తంలో ప్లేట్స్ పడిపోయి ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించిన రోగులకు తీరా అక్కడ చేదు అనుభవమే ఎదురవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు రక్త నిధి కేంద్రాలను ఆశ్రయిస్తే.. ఒక్కో బాటిల్‌కు రూ. 25 నుంచి రూ. 30 వేలకుపైగా ఛార్జీ చేస్తున్నారు. తలసీమియా బాధితులకు తప్పని తిప్పలు.. డ్రగ్‌కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి వీటిలో తనిఖీలు నిర్వహించి పనితీరుపై నివేదిక ఇవ్వాలి. సిబ్బంది కొరత పేరుతో ఆరు మాసాలకోసారి కూడా అటు వైపు చూడటం లేదు. దీంతో నిర్వహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్నిఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా... ఒ క్కో బాటిల్‌పై రూ. 1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక అరుదుగా లభించే, ఒ, ఎ, బి, నెగిటివ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటి వాటికి మరింత డిమాండ్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది కావాలంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లెసైన్సు లేని ఆస్పత్రులకు నోటీసుల జారీ .. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇటీవల ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతో పాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో కనీస వసతులు లేవని పేర్కొంటూ ఇటీవల వాటికి నోటీసులు జారీ చేశారు. ఇకపై ఇక్కడ రక్తం సేకరించి, నిల్వ చేయడం రోగులకు ఏమాత్రం క్షేమం కాదని స్పష్టం చేశారు. అప్పటికే అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. ఇలా ఒక్క నిలోఫర్‌లోనే 45 బాటిళ్లను సీజ్ చేయడం విశేషం. -
పెరుగుతున్న రక్తహీనత
రాయచూరు : జిల్లాలోని మహిళలు, చిన్నారుల్లో రోజురోజుకూ రక్తహీనత పెరుగుతోంది. ముఖ్యంగా 6 నుంచి 59 నెలల పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తహీనతను నివారించేందుకు పంపిణీ అవుతున్న ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రల కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2013-14కుగాను జరిపిన సర్వేలో జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సర్వే వివరాల మేరకు 6 నుంచి 50 నెలల వయసు పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది, అలాగే నగర ప్రాంతాల్లో 73.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 6 నుంచి 9 ఏళ్ల గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో 64.1 మంది, అలాగే నగరాల్లో 58.5 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మంది, నగరాల్లో 57.7 శాతం మంది ఆడపిల్లలు రక్తహీనత బారిన పడ్డారు. వయస్సుకురాని వారిని కూడా రక్తహీనత వెంటాడుతోంది. 15 నుంచి 19 ఏళ్లలోపు వారిలో 53.6 శాతం మంది, అలాగే నగరాల్లో 48.3 యువతు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణుల్లో 67 శాతం మంది, నగరాల్లో 60.6 శాతం మంది గర్భిణులు దీంతో సతమతమవుతున్నారు. తద్వారా తల్లీబిడ్డలు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల ఆహారశైలి మారడంతో పౌష్టికాహారం అందడం లేదు. ముఖ్యంగా ఇనుము ధాతువు ఎక్కువగా ఉన్న కాయగూరలు, ఆహారాలు తినడం లేదు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నారాాయణ మాట్లాడుతూ రక్తహీనత పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. శాఖ ఆధ్వర్యంలో తగినంత శ్రద్ధ తీసుకుని రక్తహీనత నివారణకు కృషిచేస్తామన్నారు. స్థానిక నిధుల ద్వారా 3 లక్షల ఐరన్ మాత్రలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని తెలిపారు. -
‘బంగారు’ భూమిలోనూ విషాదమేనా!
ప్రభుత్వం కేవలం కోటి రూపాయలు మంజూరు చేస్తే 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యల పాలైన అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. బంగారు తెలంగాణలో మనసున్న మారాజులు ఇకనైనా స్పందిస్తారా? మంచం పట్టిన గోండు గూడెం... రక్తహీనతతో గర్భిణుల మృతి, పోషకాహార లోపంతో బాలికల మృతి, ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ, వణికిస్తున్న విష జ్వరాలు, ఆగని మరణాలు, ఇంటింటా జ్వరపీడితులు, వంద మంది మరణించినా పత్తాలేని అధికారులు, ఏజెన్సీ ఒక మృ త్యుశకటం, ఈ ఆదివాసీ మరణాలు బంగా రు తెలంగాణలో భాగమౌతాయా? ఇవి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పత్రికల్లో నిత్యం ప్రచురితమయ్యే వార్తలు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో, టైఫా యిడ్ పాజిటివ్ లేని తాండాలు, గూడేలు లేనే లేవు. జిల్లా వ్యాప్తంగా 200 మంది ఉన్న ప్రతి గూడెంలో 150 మంది టైఫా యిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నారు. ఆది వాసులు మరణించడానికి మహాయుద్ధమే అవసరంలేదు. వ్యాధులు ప్రబలితే, వారిని అలా వదిలివేస్తే చాలు. 2008-09 మధ్యకాలంలో మూడువేల మంది ఆదివా సీలు పోషకాహార లోపంతో, తీవ్ర అనారోగ్యంతో మరణిం చారు. నాటి నుంచి ప్రతి ఏటా 200, 150 మంది చనిపోతూనే ఉన్నారు. ఈ వర్షాకాలం తర్వాత వార్తాపత్రికల ప్రకారమే 100 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. వీరి ప్రతి ప్రా ణాన్ని నిలబెట్టడం నుండే బంగారు తెలంగాణ పునర్ నిర్మాణం ప్రారంభం కావాలి. ఏటేటా జరుగుతున్న ఆదివాసీల చావు లకు స్పందించేవారు కరువై, మరణాలు సహజమైపోయాయి. ఆదివాసీ జీవితాలలో మరణాలకు బదులు ప్రాణాలను నిల బెట్టే వెలుగులను ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఎందుకు నింపలేకపోతున్నారు? ఆదివాసీ గూడేలూ, దళితుల కాలనీ ల్లో, నేడు ఏ ఉత్సవాలూ లేవు. రోగాలతో మంచాలు పట్టిన ప్రజలు, మరణాల బారిన పడ్డ అనారోగ్యపు దుంఖఃసాగరాలు తప్ప. జిల్లాలో డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో 100 మంది మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడటానికి వీస మంత ప్రయత్నమైనా వివక్ష లేకుండా ఎందుకు జరగలేదు? స్వాతంత్య్రం సిద్ధించిన 68 ఏళ్ల తర్వాత నేటికీ ఆదివాసీ లకు రహదారులు లేవు. ఎక్కడైతే రోడ్డు, 108, 104 సౌకర్యం ఉండాలో అక్కడే వాటిని కల్పించలేదు. ఆదివాసీలకు అత్య వసర సమయాల్లో చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా అంబు లెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి కానీ, ఎన్నికలయ్యాక ఆ అంబులెన్స్ జాడ లేదు. హెలికాప్టర్ అంబులెన్స్ ఎటుపోయిం దోగానీ గూడేల్లో ఎడ్లబండ్లు నడవకపోతే అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే నేటికీ పాడె అవుతోంది. అన్నదాతల ఆత్మహత్యల సరికొత్త కేంద్రం ఆదిలాబాద్ జిల్లా. ఇది అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదలున్న జిల్లా. ఒక రాష్ట్రంగా కాదు, దేశంగా మనగలిగే సకల వనరు లున్న జిల్లా. చిరపుంజి తదితర ప్రాంతాల సరసన వర్షం అధి కంగా పడే దేశంలోని 10 జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి. 2013 సంవత్సరంలో కేవలం మూడు నెలల్లోపే 1500 టీఎంసీలకు పైగా నీరు జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదుల నుంచి సముద్రంలో కలిసింది. కట్టిన పదుల ప్రాజెక్టులు, వందల చెరువులన్నీ పెద్దల పంపకాల పరమయ్యాయి. ఇక్కడ అతివృష్టి అయినా, అనావృష్టి అయినా, పెట్టుబడులు ఎక్కు వైనా, గిట్టుబాటు ధరలు లభించకున్నా అన్నదాతల ఆత్మహ త్యలు తప్పవు. గతేడాది 130 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనూ అన్నదాతలకు మేమున్నాం అనే భరోసా కల్పించకపోవడం వల్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి కోటి రూపా యలతో 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యలు చేసుకుని దిక్కు లేక జీవిస్తున్న వందలాది మంది అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆదివాసీల ప్రాణాలు నిలవాలంటే పక్కా రోడ్లు వేయాలి. జిల్లాలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించాలి. అంతవరకు ప్రత్యామ్నాయ అంబులెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉచిత వైద్యం అందించాలి. కనీస కొనుగోలు శక్తిలేని ఆదివాసీలకు పౌష్టికాహార దినుసులన్నీ ఉచితంగా అందిం చాలి. ఆదివాసీల మరణాలు, అన్నదాతల ఆత్మహత్యలు ఆప డానికి మనసున్న మానవతా మూర్తులు ఇకనైనా కదలి స్పందించాలి. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు) -
ఇదో ‘రక్త చరిత్ర’
పెచ్చరిల్లుతున్న బ్లడ్ డోపింగ్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న స్టార్లు డోపింగ్‌కు బానిసలవుతున్న అథ్లెట్లు మనిషి బ్రతకడానికి రక్తం ఎంత అవసరమో... పోటీల్లో విజయం సాధించడానికీ దాన్ని అంతకంటే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు కొంత మంది అథ్లెట్లు. క్రీడా జగత్తును పట్టి పీడిస్తున్న డోపింగ్ మహమ్మారికి ఇదో అనువైన ‘మూలకంగా’ మారిపోయింది. అధునాతన పద్ధతులకు, కఠినమైన పరీక్షలకు కూడా దొరకకుండా... స్టార్లుగా వెలుగొందుతున్న అథ్లెట్లు దీనికి బానిసలుగా మారుతున్నారు. అసలు ఈ బ్లడ్ డోపింగ్ ఎలా చేస్తారు. దాని వల్ల జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం! డోపింగ్... ఒకప్పుడు దీని పేరు వింటేనే వణికిపోయే క్రీడాకారులు ఇప్పుడు ఈ పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల కిందట స్వశక్తితో, పట్టుదలతో పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అథ్లెట్లు కొందరైతే.. ఆధునిక యుగంలో డ్రగ్స్ జాడ్యంతో మరికొంత మంది అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. ఒక్కో క్రీడల్లో ఒక్కో రకంగా డోపింగ్ చేస్తూ అటు అభిమానులను, ఇటు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇదంతా దేనికంటే కేవలం ఒకే ఒక్క ‘విజయం’ కోసం. సింగిల్ నైట్‌లో స్టార్‌గా మారిపోవడానికి డోపింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండు అత్యంత అధునాతన డోపింగ్ పద్ధతుల ద్వారా అథ్లెట్లు క్రీడా ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తున్నారు. బ్లడ్ డోపింగ్ క్రీడల్లో బ్లడ్ డోపింగ్ ఓ సంచలనం. అథ్లెట్ల ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. పోటీల సందర్భంగా మామూలు అథ్లెట్లు స్వీకరించిన ఆక్సిజన్ శాతం కంటే ఈ డోపింగ్‌కు పాల్పడిన క్రీడాకారులు స్వీకరించే శాతం అధిక మొత్తంలో ఉంటుంది. దీని కోసం రక్త ప్రవాహంలో ఎర్ర రక్త కణాలను భారీ సంఖ్యలో పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. దీని వల్ల చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్... ఊపిరితిత్తుల నుంచి అస్థిపంజర కండరాలకు చేరుతుంది.. ఫలితంగా అథ్లెట్‌కు అలసట అనేదే తెలియదు. అయితే ఆక్సిజన్ లభ్యత, హిమోగ్లోబిన్ మాస్, గుండె పంపింగ్ సామర్థ్యంపై ఈ డోపింగ్ ఆధారపడి ఉంటుంది. సాధారణ అథ్లెట్ గుండె 80 శాతం వరకు అవుట్‌పుట్‌ను ఇస్తే... అదనపు ఆక్సిజన్‌ను తీసుకునే హృదయం 90 నుంచి 95 శాతం వరకు అవుట్‌పుట్‌ను ఇస్తుంది. హిమోగ్లోబిన్ మాస్‌ను పెంచడం ద్వారా ధమనుల్లో ఆక్సిజన్ శాతం గణనీయంగా మెరుగుపడుతుంది. బ్లడ్ డోపింగ్ ముఖ్యంగా మూడు రకాలుగా చేస్తారు. ఎరిత్రోప్రొటీన్ (ఈపీఓ) ఎరిత్రోప్రొటీన్ అనేది గ్లైకో ప్రొటీన్ హార్మోన్. దీన్ని మధ్యస్త ఫైబ్రోబ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి. ఎముక మజ్జలో ఎరిత్రోపాయిసిస్ (రక్త కణాల ఉత్పత్తి) జరుగుతుందనడానికి ఇది సంకేతంగా పని చేస్తుంది. అయితే హీమోసైటోబ్లాస్ట్ (ఆర్బీసీ మూల కణాలు) కణాల పని తీరును పెంచడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ తీసుకొని వెళ్లే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. క్యాన్సర్ పేషంట్లలో కీమోథెరపీ, రేడియోషన్ వల్ల కలిగే దుష్ర్పభావాల నుంచి తట్టుకోవడానికి వీలుగా ఈపీఓను మొట్టమొదట అభివృద్ధి చేశారు. ఇది గాయాలు తొందరగా మానేందుకు కూడా దోహదం చేస్తుంది. అయితే సైక్లిస్ట్‌లు, అమెచ్యూర్ అథ్లెట్లు శక్తివంతమైన డ్రగ్‌ను తీసుకోవడం ద్వారా ఈపీఓను పెంచుకుంటారు. హైపోక్సియా ఇండ్యూసబుల్ ఫ్యాక్టర్ (హెచ్ఐఎఫ్-స్టాబిలైజర్) దీన్ని హెచ్ఐఎఫ్ స్టాబిలైజర్ అని కూడా అంటారు. శరీరంలోని ఈపీఓను ఇది యాక్టివేట్ చేస్తుంది. రక్తహీనత, ప్రేరిత హైపోక్సియా, జీవక్రియ ఒత్తిడి, వ్యాసోగ్లుకోజెన్సిస్ ప్రభావాల నుంచి బాగా కాపాడుతుంది. చాలా మంది సైక్లిస్ట్‌లు కోబాల్ట్ క్లోరైడ్ / డిస్ఫెరాక్సిమైన్తో కలిపి హెచ్ఐఎఫ్ స్టాబిలైజర్ను తీసుకుంటారు. శరీరంలో సాధారణంగా ఉండే ఈపీఓ హార్మోన్‌ను ఇది ఉత్తేజపర్చడంతో పాటు నియంత్రణలోకి తీసుకుంటుంది. రక్తంలో ఆక్సిజన్ పరిమాణం 40 ఎమ్ఎమ్హెచ్జీ వరకు ఉంటే మూత్ర పిండాల నుంచి ఈపీఓ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా హిమోగ్లోబిన్ రవాణా పెరుగుతుంది. రకరకాల డ్రగ్స్ సమ్మేళనాలను తీసుకోవడం ద్వారా నిరంతరంగా ఈపీఓ ఉత్పత్తి జరుగుతుంది. రక్త మార్పిడి ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు అథ్లెట్లు చేస్తున్న అత్యాధునిక డోపింగ్ ప్రక్రియ ఇది. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని తిరిగి అదే వ్యక్తిలోకి ప్రవేశపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. పోటీలకు ముందు జరిగే శిక్షణ శిబిరాలు, ప్రాక్టీస్ క్యాంప్‌ల్లో అథ్లెట్లు దీనికి సంబంధించిన డ్రగ్స్‌ను స్వీకరిస్తారు. తర్వాత అథ్లెట్ల శరీరంలోంచి 1 నుంచి 4 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తారు. దాన్ని పరీక్ష నాళికలో తీసుకుని హైస్పీడ్ మెషిన్లో సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఫలితంగా ఎర్రరక్త కణాలు పూర్తిగా అడుగు భాగంలోకి చేరుకుంటాయి. పై భాగంలో సీరమ్ మాత్రమే మిగులుతుంది. ఈ సీరాన్ని తిరిగి అథ్లెట్ల రక్తంలోకి ప్రవేశపెడతారు. ఆర్బీసీని మాత్రం అవసరమైనన్ని రోజులు 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిలువ చేస్తారు. పోటీలకు వారం రోజుల ముందు ఈ ఆర్బీసీని తిరిగి అథ్లెట్ల శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్‌బీసీల సంఖ్య రెట్టింపవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ మోసుకెళ్లే శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీంతో అథ్లెట్ల కండరాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడంతో శ్రమ, అలసట అనేది తెలియదు. అయితే కొన్నిసార్లు ఒకే వ్యక్తిలోని రక్తాన్ని సేకరిస్తారు. మరికొన్ని సార్లు ఇతర వ్యక్తుల్లోని బ్లడ్‌ను తీసుకుంటారు. ఒక్కోసారి డోప్ టెస్టుకు ఒకటి, రెండు రోజుల ముందు రక్తాన్ని బయటకు తీసి పరీక్ష తర్వాత శరీరంలోకి ఎక్కించుకుంటారు. జీన్ డోపింగ్ రెపోఆక్సిజన్ పద్ధతి ద్వారా జీన్ డోపింగ్‌కు పాల్పడటం ఇప్పుడొస్తున్న అత్యాధునిక ప్రక్రియల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. డోపింగ్ పరీక్షలకు ఏమాత్రం దొరకని ఈ పద్ధతిలో అథ్లెట్ల ప్రదర్శన కృత్రిమంగా మెరుగుపరుస్తారు. అయితే దీనివల్ల శరీరంలో శాశ్వత దుష్ర్పభావాలు కలుగుతాయి. ఇలా పని చేస్తుంది... తీవ్రమైన రక్తహీనత ఉన్న వారిలో జీన్ థెరపీ చికిత్స ద్వారా రెపోఆక్సిజన్ను పెంపొందిస్తారు. శరీరానికి హాని చేయని ఓ వైరస్‌ను తీసుకొని దానిలో ఎరిత్రోప్రోటీన్‌ను క్రోడీకరించిన జన్యువును ప్రవేశపెడతారు. ఫలితంగా ఆ ప్రదేశంలో గణనీయంగా ఆర్బీసీ ఉత్పాదన జరుగుతుంది. శరీరంలోకి ప్రవేశపెట్టిన ఆతిధేయి కణాలు లోపల ఉండే జన్యువును యాక్టివ్ ప్రోటీన్స్గా మారుస్తుంది. దీంతో ఫారిన్ జీన్ సొంతంగా కణాలను ఏర్పర్చుకుంటుంది. డీఎన్ఏ ప్యాకేజి కలిగిన వైరస్‌ను అథ్లెట్ శరీరంలో అనుకున్న ప్రదేశంలో ప్రవేశపెడతారు. ఫలితంగా అథ్లెట్ రక్త ప్రవాహంలో నుంచి కండరాల్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు వైరస్లు కేవలం ప్రదర్శనను మెరుగుపర్చే జన్యువులను మాత్రమే ప్రవేశపెట్టవు. అలాంటప్పుడు కొవ్వు కణాలతో కూడిన నేక్డ్ డీఎన్ఏను నేరుగా కండరాల్లో ప్రవేశపెడతారు. తర్వాత వైరస్‌ల్లోని ఫారిన్ డీఎన్ఏ కండరాల్లోకి చేరడంతో పాటు కణంలోని క్రోమోజోమ్‌లతో రూపాంతరం చెందుతుంది. తర్వాత ఏర్పడే కొత్త జన్యువు ఎరిత్రోప్రోటీన్ ఉత్పత్తిని ఉద్దీపనం చేస్తుంది. కొన్నిసార్లు ఫారిన్ డీఎన్ఏను ప్రవేశపెట్టినప్పుడు కండరాలు తన సొంత జన్యువుల ప్రభావాన్ని కోల్పోతాయి. ఫలితంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. రూపాంతరం చెందిన జన్యువు ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రవాహం ద్వారా ఇది ఎముక మజ్జను చేరి ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అథ్లెట్ల శరీరంలో ఉండాల్సిన పరిమాణంలో కంటే ఎక్కువ సంఖ్యల్లో ఆర్బీసీ ఉన్నట్లయితే ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం గణనీయంగా పెరిగిపోతుంది. ఓవరాల్‌గా మనిషి తీసుకొనే ఆక్సిజన్‌కు రెట్టింపు స్థాయిలో లభించినప్పుడు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా అథ్లెట్స్‌కు శ్రమ, అలసట అనేది తెలియదు. ఆర్మ్‌స్ట్రాంగ్... అతి పెద్ద దోషి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్... సైక్లింగ్‌లో ఎదురులేని అమెరికా ఆటగాడు. ఏడుసార్లు టూర్ డి ఫ్రాన్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న అథ్లెట్. వృషణాల క్యాన్సర్‌ను జయించిన తర్వాత తిరిగి సైక్లింగ్ రేసులో పాల్గొనడంతో ఒక్కసారిగా క్రీడాలోకంలో హీరోగా మారిపోయాడు. కానీ ఇంత గొప్ప కెరీర్ వెనుక చీకటి అగాధం ఉందంటే తొలినాళ్లలో ఎవరూ నమ్మలేకపోయారు. 1999 టూర్ డి ఫ్రాన్స్ రేసు సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్ డోపింగ్‌కు పాల్పడినట్లు... గతంలో అతని ప్రత్యర్థులుగా ఉండి తర్వాత జర్నలిస్ట్లుగా మారిన పాల్ కిమేగ్, క్రిస్టోఫర్ బ్యాసన్లు బహిర్గతం చేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడం, ఏ పరీక్షలోనూ విఫలం కాకపోవడంతో అధికారులు కూడా మిన్నకుండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక డోపింగ్ పరీక్షలు ఎదుర్కొన్నాన్నంటూ 2009లో ఆర్మ్‌స్ట్రాంగ్ ఏకంగా 24 పరీక్షల ఫలితాలను మీడియా ముందుపెట్టాడు. 2010లో తనతో పాటు ఆర్మ్‌స్ట్రాంగ్ మరికొంత మంది సహచరులు డోపింగ్‌కు పాల్పడినట్లు ఫ్లయిడ్ లెండిస్ అంగీకరించడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. యూఎస్ పోస్టల్ జట్టుపై ఫెడరల్ డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించింది. 2009, 10 మధ్యకాలంలో సైక్లిస్ట్‌కు చేసిన రక్త పరీక్షలపై మళ్లీ పరిశోధనలు, సహచరుల వాంగ్మూలాలతో ఆర్మ్‌స్ట్రాంగ్ బ్లడ్ డోపింగ్‌కు పాల్పడినట్లు యూఎస్‌ఏడీఏ తిరుగులేని ఆధారాలు సంపాదించింది. కొన్ని నెలల విచారణ తర్వాత జనవరి 2013లో ఆర్మ్‌స్ట్రాంగ్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతను గెలిచిన అన్ని టైటిళ్లను వెనక్కి తీసుకున్నారు. -
‘అమ్మ’కు బలహీనత
సాక్షి, ఒంగోలు: గ్రామీణ పేదమహిళలు, బాలికలతో పాటు పట్టణాల్లోని వారు రక్తహీనతతో బాధపడుతున్నారు. గృహిణులు, ఉద్యోగులు, పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల్లో ఈసమస్య అధికంగా ఉంది. ఒంగోలులోని ‘రిమ్స్’ ఆస్పత్రికి వివిధ రోగాలతో వచ్చి చికిత్స చేయించుకునే మహిళల్లో 70 నుంచి 85 శాతం మందిలో రక్తహీనత ఉందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ ఇవే నివేదికలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది తరచూ తమ ఆస్పత్రి పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ రక్తపరీక్షలు చేస్తున్నప్పటికీ, మహిళల్లో పెరుగుతోన్న రక్తహీనత సమస్యపై నివేదికలను జిల్లాకేంద్రానికి పంపడం లేదనే ఫిర్యాదులున్నాయి. అంటే, గ్రామీణ మహిళలంతా ఆరోగ్యకరంగా ఉన్నారని.. ఎక్కడా ఎనీమియా బాధితుల్లేరని అధికారికంగా చెప్పడానికి ప్రభుత్వ అధికారులు వెనుకంజవేయడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం ఎక్కించాలన్నా జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే రోజుకు 50 యూనిట్లు రక్తం అవసరం కాగా, ప్రస్తుతం 20 యూనిట్లు రక్తం అందించడం కనాకష్టమౌతోంది. రక్తహీనత దుష్ఫలితాలివీ.. జిల్లాలో మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కృషిచేస్తూనే ఉన్నా ఏటా మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గకపోవడానికి కారణాల్ని అన్వేషించే నాథుడు కరువయ్యాడు. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత ఉంటే కాళ్లుచేతులకు నీరు పట్టడం, మొఖం ఉబ్బడం, శరీరం పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాల్ని గమనించవచ్చు. ఇలాంటి బాధితులు బిడ్డల్ని ప్రసవించలేక..పురిటినొప్పులు భరించేంత బలం, శక్తి లేకపోవడంతో అధికశాతం తల్లులు మృత్యువు పాలవతున్నారు. సాధారణ మహిళల్లో నెలవారీ రుతుక్రమంతో పాటు గర్భిణుల్లో ప్రసవ సమయాల్లో జరిగే రక్తస్రావం ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముంది. అధిక రక్తస్రావం సమస్యతో మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, ఒంగోలు రిమ్స్‌ను వచ్చే రోగులు ఎక్కువగా ఉన్నారని గైనిక్ వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఆపరేషన్లే అధికం.. అధికశాతం మంది గర్భిణులు నొప్పులు తట్టుకోలేక.. ప్రసవం కష్టం కావడంతో సిజేరియన్లకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 10,263 ప్రసవాలు జరగ్గా.. వాటిల్లో 3,800 సిజేరియన్ ప్రసవాలు ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 656 సిజేరియన్ ప్రసవాలు జరగ్గా.. 82 మంది మాత్రం ఇంట్లోనే పురుడు పోసుకున్నారు. మిగతావన్నీ సాధారణ ప్రసవాలున్నాయి. ఏదిఏమైనా గర్భిణులు, బాలింతలకు ఆపరేషన్ల అవసరం ఏర్పడినా.. వారితో పాటు శిశువులు మృత్యువాత పడటాన్ని రక్తహీనతతో ముడిపెట్టి చూడాల్సిందేనంటున్నారు ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు. గతంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు జవహర్ బాల సంరక్షణ సిబ్బంది వెళ్లి రక్తపరీక్షలు చేసేవారు. అలాంటిది, వారు తూతూమంత్రం నివేదికలతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సామాజిక, స్వచ్ఛంద సంఘాలు మేల్కొని జిల్లాలో రక్తం నిల్వలు అందుబాటులో ఉంచేందుకు సహకరించాలి. పోషకాహార లోపంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. -
నెత్తురు లేదు..సత్తువ రాదు..
మాటలే మిగులుతున్నాయి.. మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన్యంలో జవసత్వాలు లేని బతుకులు పాలకుల నిర్లక్ష్యాన్ని, సిబ్బంది అక్రమాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. మారుమూల గూడేల్లో పౌష్టికాహారలోపం, రక్తహీనత కారణంగా మాతాశిశు మరణాలు ఆగక సాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల కోసం ఉద్దేశించిన పోషకాహారం, మందులు, టీకాలు చాలా చోట్ల పక్కదారి పడుతున్నాయి. పాడేరు: రక్తహీనత, పౌష్టికాహార లోపంతో మన్యం విలవిలలాడుతోంది. గర్భిణులు, బాలింత లు, శిశువులను ఆహార సంబంధ సమ్యులు పట్టి పీడిస్తున్నాయి. వీరందరికీ ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ గిరిజనులను రక్తహీనత సమస్య పీడిస్తూనే ఉంది. మన్యంలో శిశు మరణాలు వెయ్యికి 215 ఉంటున్నాయి. అధికారులు వీటిని తగ్గించి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉందని బాకా ఊదేస్తున్నారు. కానీ వాస్తవాలు కలవరపరుస్తున్నాయి. వర్షాలతో జలకాలుష్యం పుణ్యమా అని విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కలుషిత జలాలకు తోడు ఆహారపు అలవాట్లు అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. పౌష్టికాహారలోపం, రక్తహీనత తోడై ఏటికేడాది మాయదారి రోగాలు ఏజెన్సీ వాసులను కర్కశంగా తోడేస్తున్నాయి. ఏజెన్సీలోని 11 మండలాల్లో 1122 అంగన్వాడీ, 1144 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 17,829 మంది గర్భిణులు, బాలింతలు, 38,321 మంది 3 ఏళ్ళలోపు చిన్నారులు, 30,322 మంది 6 ఏళ్ళలోపు చిన్నారులు, 29,748 మంది కిశోర బాలికలు మన్యంలో ఉన్నట్టు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. వీరి మంచిచెడ్డలు చూడాల్సిన అంగన్వాడీ కేంద్రాల పై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. పౌష్టికాహారం పంపిణీలో లోపాలు చోటుచేసుకుంటున్నాయి. కిశోర బాలికల్లో కూడా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటోంది. రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీవ్యాప్తంగా 557 శిశువులు, 264 మంది తల్లులు మృతి చెందారు. హుకుంపేట, ఉప్ప, మినుములూరు, ఈదులపాలెం, జి.మాడుగుల, గన్నెల, పెదబయలు, కేడీపేట, గెమ్మెలి, డుంబ్రిగుడ, మాడగడ, గోమంగి, కిలగాడ ఆరోగ్య కేంద్రాల్లో అధికంగా మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో 38 మంది శిశువులు, ఏడుగురు తల్లులు చనిపోయారు. గురువారం రాత్రి మరో శిశువు పాడేరు ఆస్పత్రిలో మృతి చెందింది. ముంచంగిపుట్టు మండలం పెద్దాపుట్టుకు చెందిన వంతాల సువర్ణ ప్రసవ వేదనతో గురువారం పాడేరు ఆస్పత్రిలో చేరగా అతికష్టం మీద కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ వెంటనే మరణించింది. తల్లికి వైద్యసేవలు అందిస్తున్నారు. అస్తవ్యస్తంగా పౌష్టికాహారం పంపిణీ గూడెంకొత్తవీధి: పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. మండలంలో 83 అంగన్వాడీ, 120 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలకు మినహా మారుమూల గ్రామాల లో ఒక రోజుకు కేటాయించిన పౌష్టికాహారాన్ని వారం, పది రోజులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం చింతపల్లి: అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్వాడీలలో పిల్లలకు పౌష్టికాహారం నామమాత్రంగానే అందుతోంది. మారుమూల గూడేల్లో అదీ ఉండదు. పుచ్చిపోయిన పప్పులు, చిన్న పరిమాణంలో ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. చాలా కేంద్రాల్లో సక్రమంగా గుడ్లు పంపిణీ చేయడం లేదు. మినీ అంగన్వాడీ కేంద్రాలల్లో పిల్లలకు వండి పెట్టకుండా తల్లితండ్రులకు బియ్యం, పప్పు, నూనె వంటివి పంపిణీ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. చిలకలమామిడిలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రం తెరవలేదు. సమావేశమంటూ పిల్లలకు భోజనమే పెట్టలేదు. చౌడుపల్లిలో పుచ్చిపోయిన పప్పు తినేందుకు పిల్లలు అయిష్టత చూపారు. అంగన్వాడీ కేంద్రాలు- 2,266 గర్భిణులు, బాలింతలు- 17,829 మూడేళ్ళలోపు చిన్నారులు- 38,321 ఆరేళ్ళలోపు చిన్నారులు- 30,322 కిశోర బాలికలు- 29,748 గతేడాది చనిపోయిన శిశువులు- 557 మృతి చెందిన తల్లులు- 264 -
పులిపిర్లను సర్జరీతో తొలగించవచ్చా!
డాక్టర్ సలహా నా వయసు 27. నాకు గత నాలుగేళ్ల నుంచి చేతులు, ముఖం మీద పులిపిర్లు వస్తున్నాయి. మొదట్లో రక్తహీనతతో ఇలా వస్తుందని, మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందనుకున్నాను. కొందరేమో ఇదొక చర్మవ్యాధి అని చెబుతున్నారు. స్నేహితులు పూత మందులు వాడాలని, కడుపులోకి మందులు తీసుకోవాలని చెబుతున్నారు. నాకు పులిపిర్ల సంఖ్య, సైజు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. బ్యూటీపార్లర్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయంగా ఉంది. అధునాతన కాస్మటిక్ సర్జరీలో సుశిక్షితులైన డాక్టర్లు పులిపిర్లను తొలగించడానికి సర్జరీ చేస్తారని తెలిసింది. నేను ఆ చికిత్స చేయించుకోవచ్చా? నా సమస్యకు పరిష్కారం తెలియ చేయగలరు. - పి. ఉషారాణి, హైదరాబాద్ పులిపిర్లలో ప్రధానంగా వైరల్ వార్ట్స్, స్కిన్ గ్రోత్ వార్ట్స్ అని రెండురకాలు ఉంటాయి. వైరల్ వార్ట్స్కు మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ వార్ట్స్‌ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించడం కుదరదు. చర్మవ్యాధి నిపుణులు (డెర్మటాలజిస్ట్) పరీక్షించి తగిన మందులు ఇస్తారు. స్కిన్ గ్రోత్ వార్ట్స్‌ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. ముందు మీకు వచ్చినవి ఏ రకమైన పులిపిర్లు అనేది స్వయంగా పరీక్షించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న చర్మవ్యాధి నిపుణులను లేదా కాస్మటిక్ సర్జన్ (ప్లాస్టిక్ సర్జరీ)ను సంప్రదించండి. మీకు ఏ రకమైన చికిత్స అవసరమో వారు సూచించగలుగుతారు. మీకు వచ్చినవి స్కిన్ గ్రోత్ వార్ట్స్ అయితే వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు. సాధారణంగా ఇవి చర్మం మీద సిస్ట్ ఏర్పడడం, కొవ్వు చేరడం, పుట్టుమచ్చ పెరిగి బుడిపెలా మారడం... ఇలా రకరకాల కారణాలతో వస్తాయి. వీటి చికిత్స కోసం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఒక రోజులోనే చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. బ్లడ్ షుగర్, సిబిపి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) వంటి సాధారణ పరీక్షలు చేసిన తర్వాత లోకల్ అనస్థీషియా ఇచ్చి వీటిని తొలగిస్తారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజే కాలేజీలు, ఆఫీసులకు వెళ్లవచ్చు. దుమ్ముధూళిలో తిరిగినా, ఎండలో వెళ్లినా ఇబ్బంది ఉండదు. అయితే డాక్టర్ సూచించిన ఆయింట్మెంట్ రాసుకుని వెళ్లాలి. సర్జరీ తర్వాత వారం రోజులకు ఒకసారి, ఆ తర్వాత నెలరోజులకోసారి తదనంతర పరిణామాలు, సలహాల కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. ఆహార మార్పుల వంటి ప్రత్యేక జాగ్రత్తలేవీ అక్కరలేదు. - డాక్టర్ మురళీమనోహర్, ప్లాస్టిక్ సర్జన్ -
పడతులూ తెలుసుకోండి ఈ పధ్నాలుగు వ్యాధులను...
పురుషుడితో పోలిస్తే మహిళల్లో జరిగే అనేకానేక జీవక్రియలు అత్యంత సంక్లిష్టాలు. యుక్తవయసుకు వచ్చిన నాటి నుంచి యువకుల్లో ఒకటి రెండు హార్మోన్లు మాత్రం పనిచేస్తే చాలు. అదే యువతుల్లో అయితే వారి జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు అవసరం. మళ్లీ ఈ హార్మోన్లన్నింటి మధ్యా సమన్వయం కావాలి. అందుకే మహిళ తాలూకు ఆరోగ్య నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఈ కింద పేర్కొన్న అంశాల్లో కొన్ని మహిళలకు మాత్రమే వచ్చే అనారోగ్యాలతో పాటు... అందరిలోనూ కనిపించే ‘రక్తహీనత’,‘థైరాయిడ్ వ్యాధులు’ వంటివీ ఉన్నాయి. అయితే అవి పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికం. ఈ నెల 8వ తేదీ ‘మహిళా దినోత్సవ’సందర్భంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే 14 ప్రధాన ఆరోగ్య సమస్యలు, వాటి నివారణలు, చికిత్సలు సంక్షిప్తంగా... 1- పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఏమిటీ సమస్య: మహిళలకు ఓవరీలో నీటితిత్తులు ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో అత్యధికంగా వచ్చే ఈ సమస్యను ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్య మహిళల్లో అనేక అవరోధాలను కల్పిస్తుంది. రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భధారణలో ఆటంకాలు హార్మోన్ల అసమతౌల్యత గుండె, రక్తనాళాల సమస్యలు. ఎందుకు వస్తుంది: పురుష హార్మోన్ అయిన ఆండ్రోజన్ పాళ్లు మహిళల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని భావిస్తున్నారు. దుష్పరిణామాలు: ముఖంపై అత్యధికంగా మొటిమలు రావడం చుండ్రు అవాంఛిత రోమాలు కొందరిలో పురుషుల్లో లాగా బట్టతల స్థూలకాయం అండం విడుదలలో సమస్యలు నెలసరి సరైన సమయంలో రాకపోవడం ఎదుర్కొనేది ఎలా: జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు... అంటే వేళకు తినడం, నిద్రపోవడం, ఆహారంలో కృత్రిమ ప్రాసెస్డ్ ఫుడ్ - చక్కెరపాళ్లను తగ్గించుకోవడం, పొట్టుతో ఉండే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం వంటివి. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి చికిత్స చేయించుకోవాలి. కొందరిలో అవసరాన్ని బట్టి అండం విడుదల కావడానికి, చక్కెర తగ్గడానికి మందులు వాడాల్సి రావచ్చు. మామూలుగా తగ్గకపోతే ‘ఒవేరియన్ డ్రిల్లింగ్’ అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించాల్సి రావచ్చు. 2- మొటిమలుబ (ఆక్నే) ఏమిటీ సమస్య: ఈ సమస్య యువతీ యువకులు ఇద్దరిలోనూ కనిపించినా యువతుల్లోనే ఎక్కువ. అలాగే మరిన్ని కారణాలు (హార్మోన్ల అసమతౌల్యత వంటివి) కూడా మహిళల్లో ఈ సమస్యకు దోహదం చేస్తాయి. పైగా అందంగా కనిపించే అంశంలోనూ ఇవి మహిళలను ఒకింత ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తాయి. ఎందుకు వస్తుంది: హార్మోన్ల అసమతౌల్యత మహిళల్లో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ పాళ్లు పెరగడం పీసీఓఎస్ దుష్పరిణామాలు: ముఖంపై గుంటలు పడడం గొంతు భారీగా (మగ గొంతుకలా) మారడం కండరాలు మృదుత్వాన్ని కోల్పోయి మగవారిలా దృఢంగా/గరుకుగా మారడం, రొమ్ముల పరిమాణం తగ్గడం. ఎదుర్కొనేది ఎలా: ముఖాన్ని గాఢత తక్కువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. రోజుకు రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. ముఖం కప్పేలా కాకుండా, కాస్త నుదురు కనపడేలా జుట్టును దువ్వుకోవాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్-కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. అప్పటికీ తగ్గకపోతే మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు, పైపొరను దెబ్బతీయవచ్చు. ముఖం ఎర్రబారవచ్చు. మొటిమలు వచ్చేవారు ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకుంటే ఆ చిన్న జాగ్రత్తే చాలావరకు అవి రాకుండా నివారిస్తుంది. 3- రక్తహీనత (అనీమియా) ఏమిటీ సమస్య: ఇది అందరిలో కనిపించే సమస్యే అయినా భారతీయ మహిళల్లో మరీ ఎక్కువ. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ) లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఈ ఎర్రరక్తకణాలే మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళుతుంటాయి. వాటి సంఖ్య తగ్గడం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. ఎందుకు వస్తుంది: మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తం పోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు: వేగంగా అలసట కొద్దిపాటి నడకకే ఆయాసం తలనొప్పి కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం పాలిపోయినట్లుగా ఉండడం ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం చిరాకు/కోపం స్కూలుకెళ్లే వయసు వారు అక్కడ తగిన సామర్థ్యం చూపలేకపోవడం. ఎదుర్కొనేది ఎలా: ఐరన్ పుష్కలంగా లభించే ఆహారమైన ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, కొబ్బరి, పప్పుచెక్కలు (చిక్కీ)తో పాటు మాంసాహారులైతే గుడ్లు, కాలేయం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే కాఫీ, టీ తాగితే, అవి జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి ఇంకకుండా చేస్తాయి. కాబట్టి, తినగానే వాటిని తీసుకోవద్దు. డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. 4- రొమ్ము క్యాన్సర్ ఏమిటీ సమస్య: మహిళల్లో అత్యధికంగా కనిపించే మరో రుగ్మత రొమ్ము క్యాన్సర్. రొమ్ము కణజాలాల్లో క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఒక గడ్డ (ట్యూమర్)లా కనిపించవచ్చు. అవి దగ్గర్లోని ఇతర కణజాలాలకు పాకి, పక్కనే ఉన్న లింఫ్నోడ్స్కు వ్యాపించి శరీరమంతా విస్తరించనూ వచ్చు. రొమ్ము క్యాన్సర్‌లో ప్రధానంగా ఈ కింది రకాలు ఉంటాయి. అవి... డక్టల్ కార్సినోమా: రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సమస్య ఈ తరహాకు చెందినదే. లోబ్యులార్ కార్సినోమా: ప్రతి పదిమందిలో కేవలం ఒకరికే ఈ తరహా క్యాన్సర్ కనిపిస్తుంది. లక్షణాలు: లక్షణాలు కనిపించకముందే ఆమెలో క్యాన్సర్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే... రొమ్ములో లేదా బాహుమూలాల కింద గట్టిగా ఉన్న కండ... గడ్డలా చేతికి తగులుతుండటం రొమ్ము ఆకృతిలో, పరిమాణంలో మార్పురావడం చనుమొన నుంచి స్రావాలు రావడం (ఇవి పాలు కావు) చనుమొన ఆకృతిలో మార్పురావడం... అంటే అది లోపలికి కుంచించుకుపోయినట్లుగా మారడం రొమ్ము చర్మంలో మార్పులు... అంటే చనుమొన, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, రొమ్ము మీద దురద రావడం, ఎర్రబారినట్లుగా కనిపించడం, పొలుసులు ఊడినట్లుగా అవుతుండటం, సొట్టపడినట్లుగా ఉండటం. ఎదుర్కొనేది ఎలా: రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలను అనుసరించాల్సి రావచ్చు. ఎన్ని, ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలి అన్న అంశం... క్యాన్సర్ ఏ దశలో ఉందన్న విషయంతో పాటు... ట్యూమర్ పరిమాణం ఎంత, అది ఏ రకమైన క్యాన్సర్, అది వచ్చిన మహిళ మెనోపాజ్ దశకు చేరిందా లేదా, ఆమె సాధారణ ఆరోగ్యపరిస్థితి... వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, నిర్ణీతంగా క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించే టార్గెట్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స చేస్తారు. 5- ఎండో మెట్రియాసిస్ ఏమిటీ సమస్య: ఎండోమెట్రియాసిస్ అనే ఈ జబ్బు కేవలం మహిళలు, యువతుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా వారిలో రుతుస్రావం మొదలై... అది కొనసాగుతున్న సమయంలోనూ వస్తుంది. ఇందులో గర్భసంచీలో ఉండే లోపలిపొర (ఎండోమెట్రియమ్) కేవలం లోపలికే పరిమితం కాకుండా అన్ని అంతర్గత అవయవాల్లోకి పెరుగుతుంది. ఫలితంగా అది అండాలను, ఫెలోపియన్ ట్యూబ్స్‌ను, పొత్తికడుపులో ఉండే ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు: కొందరిలో ఎండోమెట్రియమ్ పొర బయటకు తక్కువగా పెరిగినా పొత్తికడుపు కింది భాగంలో లేదా నడుములో నొప్పి ఉండవచ్చు. కొందరిలో అది ఎంతగా బయటకు పెరిగినా వారిలో ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటంటే... రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి నడుము, పొత్తికడుపులో నొప్పి సెక్స్‌లో విపరీతమైన బాధ మలవిసర్జన / మూత్రవిసర్జన బాధాకరంగా ఉండటం రుతుస్రావం సమయంలోనే గాక... ఇతర సమయాల్లోనూ చుక్కలు చుక్కలుగా రక్తస్రావం తీవ్రమైన అలసట గర్భధారణ జరగకపోవడం (ఇన్ఫెర్టిలిటీ) నీళ్లవిరేచనాలు / మలబద్ధకం / కింది నుంచి గ్యాస్ పోవడం / వికారం (రుతుస్రావ వేళ ఈ వికారం ఎక్కువ). ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స దశల వారీగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక దశ చికిత్సకు సరైన స్పందన లభించకపోతే ఆ తర్వాతి దశకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో: నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులతో రెండో దశలో: కనీసం మూడు నెలల పాటు గర్భనిరోధక మాత్రలతో మూడో దశలో: ఎండోమెట్రియమ్ పొర పెరుగుదలను అరికట్టే జీఎన్ఆర్హెచ్-అగొనిస్ట్ అనే మందుతో నాలుగో దశలో: ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా పొత్తి కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి, ఎండోమెట్రియమ్ పొరను చూస్తూ... కనిపించిన మేరకు తొలగిస్తారు. 6- మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏమిటీ సమస్య: మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అన్నవి పురుషుల్లోనూ కనిపించినా... మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రంలో ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించకపోతే అది మూత్రాశయానికీ, మూత్రపిండాలకూ హాని కలిగించవచ్చు. ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకి అన్ని అవయవాలకూ వ్యాపించి, ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. ఎందుకు వస్తుంది: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ (బ్లాడర్ ఇన్ఫెక్షన్) పైలోనెఫ్రైటిస్ (కిడ్నీ ఇన్ఫెక్షన్) యురెథ్రైటిస్ (మూత్రాశయం నుంచి మూత్రద్వారం వరకు ఉండే మూత్రనాళంలో మంట, ఇన్ఫెక్షన్). లక్షణాలు: మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట పొత్తికడుపులో, నడుములో, నడుము పక్కభాగాల్లో నొప్పి చలి, వణుకు జ్వరం చెమటలు పట్టడం వికారం / వాంతులు మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం మూత్రంపై నియంత్రణ కోల్పోయి ఒక్కోసారి చుక్కలు చుక్కలుగా పడటం మూత్రం నుంచి ఘాటైన వాసన విసర్జించే మూత్రం పరిమాణంలో మార్పులు (ఎక్కువ లేదా తక్కువ) మూత్రంలో రక్తం, చీము పడటం సెక్స్‌లో మంట, నొప్పి ఎదుర్కొనేది ఎలా: వ్యాధి నిర్ధారణ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగిన మందులు వాడతారు. ఒకవేళ మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంటే మూత్రపిండాలను, గర్భసంచి (యుటెరస్)ను, మూత్రాశయాన్ని ఎక్స్-రే తీసి పరీక్షించే ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవీపీ) అనే ప్రత్యేకమైన పరీక్షలనూ, అవసరాన్ని బట్టి పూర్తి మూత్ర విసర్జక వ్యవస్థను పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్‌ను, ఒక టెలిస్కోప్ వంటి సాధనంతో బ్లాడర్ లోపల పరీక్ష చేయాల్సి వచ్చే ‘సిస్టోస్కోపీ’ వంటి పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇది సాధారణ యాంటీ బయాటిక్స్తోనే ఇది తగ్గుతుంది. పరిస్థితి ముదిరితేనే కనిపించే లక్షణాలను బట్టి ఇతర చికిత్సలు అవసరమవుతాయి. 7- థైరాయిడ్ సమస్య ఏమిటీ సమస్య: మానవ దేహంలో సరిగ్గా మెడ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది ప్రథానంగా థైరాక్సిన్ (టీ4) అనీ, ట్రై అయడో థైరమిన్ (టీ3) అనే హార్మోన్లను స్రవిస్తుంటుంది. ఈ రెండూ శరీరంలోని అనేక జీవక్రియలను నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్లను స్రవించే ఈ గ్రంథి అతిగా పనిచేసినా, లేదా పనిచేయకపోయినా సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యలను ప్రధానంగా ఇలా విభజించవచ్చు. హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అతిగా పనిచేయడం) హైపో థైరాయిడిజం (థైరాయిడ్ పనిచేయకపోవడం) హైపర్ థైరాయిడిజం: హైపర్ థైరాయిడిజం కండిషన్లో థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసి థైరాక్సిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంటుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు: ఎంత తిన్నా సన్నగానే ఉండటం, బరువు పెరగకపోగా... తగ్గడం. గాయిటర్ (మెడ దగ్గర ఉండే థైరాయిడ్ ఉబ్బినట్లుగా ఉండటం. దాంతో మెడ దగ్గర ఉబ్బి కనిపిస్తుంటుంది). కళ్లు ఉబ్బినట్లుగా ఉంటాయి. దురదలు పెట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉద్వేగంగా ఉండటం, త్వరగా కోపం రావడం నిద్రపోవడంలో ఇబ్బందులు, ఎప్పుడూ అలసటగా ఉండటం గుండె వేగం పెరగడం, గుండె స్పందనల్లో క్రమబద్ధత లేకపోవడం, వేళ్లు వణుకుతూ ఉండటం చెమటలను ఎక్కువగా పట్టడం, కొద్దిపాటి వేడిమిని కూడా భరించలేకపోవడం కండరాలు బలహీనంగా మారడం త్వరగా మలవిసర్జన ఫీలింగ్స్ కలగడం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉన్నప్పుడు విధిగా పరీక్షలు చేయిచుకుని, ఆ రుగ్మత ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి. లేకపోతే అది ఒక్కోసారి గుండె పనిచేయకపోవడానికి (హార్ట్‌ఫెయిల్యూర్)కు దారితీయవచ్చు. లేదా ఎముకలు పెళుసుగా మారిపోవడం (ఆస్టియోపోరోసిస్) జరగవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయకరమైన థైరాయిడ్ స్టార్మ్ కండిషన్కూ దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్ష : రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల మోతాదులను పరీక్షించడం ద్వారా హైపర్ థైరాయిడ్ కండిషన్‌ను నిర్ధారణ చేస్తారు. థైరాక్సిన్ హార్మోన్ (ప్రధానంగా టీ4 హార్మోన్) మోతాదులు పెరిగి ఉండటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఎదుర్కొనేది ఎలా: యాంటీ థైరాయిడ్ మందులు ఇవ్వడం రేడియో యాక్టివ్ అయొడిన్ ద్వారా చికిత్స శస్త్రచికిత్స బీటా బ్లాకర్స్ ఉపయోగించడం హైపో థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం, లేదంటే చాలా తక్కువగా పనిచేయడాన్ని ‘హైపో థైరాయిడిజం’ అంటారు. లక్షణాలు: తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం మానసిక వ్యాకులత (మెంటల్ డిప్రెషన్) చల్లగా అనిపించడం బరువు పెరగడం (రెండు నుంచి నాలుగు కిలోల వరకు) చర్మం పొడిగా మారడం, మలబద్ధకం మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భిణుల్లో మరింత జాగ్రత్త: గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. నిర్ధారణ పరీక్షలు : రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంథి స్రవించే టీ4 హార్మోన్ పాళ్లు సాధారణంగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. టీఎస్‌హెచ్ పాళ్లలోనూ మార్పులు రావచ్చు. ఎదుర్కొనేది ఎలా: లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స అందిస్తారు. 8- ఆస్టియో పోరోసిస్ ఏమిటీ సమస్య: భారతీయుల్లో చాలా ఎక్కువ. అందులోనూ మహిళల్లో! మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది: మన అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు పెరుగుతుంటాయి. బాల్యం, కౌమారంలో ఉండే ఈ ఎముకల పెరుగుదల యౌవనం తర్వాత ఆగిపోయాక కూడా దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు బలంగా, గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. మహిళల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్- ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. (ఎముకలను బలంగా ఉంచడానికి ఈస్ట్రోజెన్ దోహదపడుతుంది). రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ పరిణామం మహిళల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. లక్షణాలు: ఇది వస్తుంది అని తెలుసుకోడానికి అవసరమైన లక్షణాలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. కారణం... ఎముకలు శరీరంలో లోపల ఉంటాయి కాబట్టి అవి పలచబడడం, పెళుసుగా మారడాన్ని గమనించడం సాధ్యం కాదు. అందుకే ఇది నిశ్శబ్దంగా వచ్చే పరిణామం. ఇలా ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయాలకే ఎముకలు విరగడం కనిపిస్తుంది. అంటే... ఏదైనా చిన్నపాటి ప్రమాదానికే ఎముక పుటుక్కున విరిగిపోతుంటే దాన్ని ‘ఆస్టియో పోరోసిస్’గా గుర్తించవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని లక్షణాలు ఏమిటంటే... ఒళ్లు నొప్పులు ఎముకలు, కీళ్ల నొప్పులు అలసట చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం ఆస్టియోపోరోసిస్ - నిర్ధారణ: రక్తపరీక్ష, ఎక్స్-రే, బీఎమ్‌డీ (బోన్ మాస్ డెన్సిటీ - అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధరించవచ్చు.) ఎదుర్కొనేది ఎలా: ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు... క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇవ్వడం - డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్-డిని రోజూ 10 నుంచి 15 మిల్లీ గ్రాములు ఇస్తారు. డిస్ఫాస్ఫోనేట్స్ - ఇవి ఒక రకం మందులు. వీటినే డిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) - రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారిపోవడం, పార్శ్వపు తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్‌ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా, కాదా అన్నది డాక్టర్లే నిర్ధరిస్తారు. క్యాల్సిటోనిన్ - ఈ మందులను డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్ - ఇది ఆస్టియో పోరోసిస్ చికిత్స ప్రక్రియలో సరికొత్త మందు. 9- ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో రుతుస్రావం ముందర కనిపించే ఆరోగ్యసమస్య. ఎందుకు వస్తుంది: ఈ సమస్యకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే అనేక అంశాలు దీరికి దోహదపడతాయి. ఉదాహరణకు ప్రతి నెలా రుతుస్రావం వచ్చేందుకు ఉపయోగపడే అనేక హార్మోన్లలో మార్పులు మిగతావారి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ‘పీఎమ్ఎస్’ కనిపించవచ్చు. కొందరిలో మెదడు రసాయనాల్లోని మార్పులూ ఇందుకు దోహదం చేస్తాయి. ఒత్తిడి, ఉద్వేగ భరితమైన సమస్యలూ (డిప్రెషన్) పీఎమ్ఎస్కు కారణాలే. లక్షణాలు: మొటిమలు రావడం రొమ్ము వాపు లేదా ముట్టుకుంటే మంటగా మారడం (టెండర్నెస్) అలసట నిద్రపోవడంలో ఇబ్బంది కడుపులో ఇబ్బంది / కింది నుంచి గ్యాస్పోవడం / మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు తలనొప్పి వెన్నునొప్పి కీళ్లనొప్పులు కండరాల నొప్పులు టెన్షన్ / త్వరగా కోపం రావడం / వేగంగా భావోద్వేగాలకు గురికావడం / మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం / తరచూ వెక్కివెక్కి ఏడ్వటం యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స మూడు మార్గాల్లో జరుగుతుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే... ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం తాజాపండ్లు తినడం ఉప్పు, తీపి, కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం (ప్రధానంగా పీఎమ్ఎస్ ఉన్నప్పుడు) ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి చేయడం. రెండోది మందులు తీసుకోవడం: ఇలాంటి సమయాల్లో నొప్పులు తగ్గడానికి వీలుగా ఇబూప్రొఫెన్, కీటోప్రొఫెన్, న్యాప్రోగ్రెన్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం. మూడోది అల్టర్నేటివ్ థెరపీ: పీఎమ్ఎస్ ఉన్నవారు అదనంగా కొన్ని విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలి. 10- యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఏమిటీ సమస్య: మూత్రం వస్తున్నప్పుడు దానిని ఏ మాత్రం నియంత్రించలేక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చే పరిస్థితిని ‘యూరినరీ /అర్జ్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. టాయ్‌లెట్‌కు చేరేలోపే మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది. పరిస్థితి మరింత దిగజారేదెప్పుడు: ఈ సమస్య ఉన్న మహిళలు కెఫిన్ ఎక్కువగా తీసుకున్నా (కాఫీలు ఎక్కువసార్లు తాగినా), టీలు, కోలా డ్రింకులు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కొందరు మహిళల్లో రుతుస్రావం ఆగిపోయాక (మెనోపాజ్ తర్వాత) అది ఇంకా పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడంతో యోని లోపలి పొరలు కుంచించుకుపోవడం (వెజైనల్ అట్రోఫీ) వల్ల ఈ స్థితి వస్తుందని భావన. ఎదుర్కొనేది ఎలా: అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌ను అధిగమించడానికి కొన్ని సాధారణ జీవనశైలి మార్గాలు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అవి... త్వరగా టాయిలెట్‌కు వెళ్లడం కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం తగినంతగా ద్రవాహారం తీసుకోవడం ఒకవేళ స్థూలకాయులైతే బరువు తగ్గించుకోవడం. మూత్రవిసర్జనపై నియంత్రణకు శిక్షణ: దీన్నే బ్లాడర్ ట్రైనింగ్ లేదా బ్లాడర్ డ్రిల్ అంటారు. అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉన్నప్పుడు టాయిలెట్లోకి వెళ్లాక అక్కడ మూత్రవిసర్జన ఫీలింగ్‌ను నియంత్రించుకుంటూ క్రమంగా ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఫలితంగా చుక్కలు చుక్కలుగా రాలడం అన్నది క్రమంగా తగ్గుతుంది. ఇలా క్రమంగా బ్లాడర్‌పై నియంత్రణ సాధించవచ్చు. మందులు: ఒకవేళ బ్లాడర్ ట్రైనింగ్/బ్లాడర్ డ్రిల్‌తో ఫలితం లేకపోతే అప్పుడు యాంటీ మస్కారినిక్స్ / యాంటీకొలినెర్జిక్ అనే మందులను ఇస్తారు. ఇక బ్లాడర్, యుటెరస్, మలద్వారం కండరాలు బలం పుంజుకునేలా చేసే కొన్ని రకాల వ్యాయామాలు (పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లు)తోనూ మంచి ఫలితం ఉంటుంది. ఇవీ విఫలమైతే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 11- ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు ఏమిటీ సమస్య: గర్భసంచీలో పెరిగే హానికరం కాని గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారవు. వీటినే యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్ లేదా లియోమయోమాస్ అంటారు. ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా క్రమంగా తగ్గిపోతాయి. గర్భసంచీలో అవి వచ్చే ప్రాంతాన్ని బట్టి వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. ఎందుకు వస్తుంది: ఇవి పెరగడానికి నిర్దిష్ట కారణం తెలియకపోయినా... అదనపు కండ పెరగడం వల్ల ఇవి వస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ పాళ్లు పెరిగినప్పుడు ఆ హార్మోన్ వల్ల వీటి పెరుగుదలకూ ప్రేరణ లభిస్తుంది. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే ఇవి కూడా కుంచించుకుపోతాయి. లక్షణాలు: ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వీటి వల్ల కనిపించే లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఇవి ఉన్నప్పటికీ వాటి ఉనికే తెలియదు. అందుకే వేరే సమస్య కోసం పరీక్షలు చేస్తుంటే కొందరిలో ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు... రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి సెక్స్ సమయంలో నొప్పి గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం గర్భవతిగా ఉన్న సమయంలో సమస్యలు. పరీక్షలు: యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్‌కు ఈ ఫైబ్రాయిడ్స్ చేతికి తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఇవి ఉన్నట్లు తెలియవచ్చు. ఎదుర్కొనేది ఎలా: ట్రానెగ్జామిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భనిరోధక మాత్రలు, లెవో నార్జెస్ట్రల్ ఇంట్రాయుటెరైన్ విధానలతో దీనికి చికిత్స చేయవచ్చు. ఇక చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్‌కు రక్తసరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి దానికి రక్తసరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. 12- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది చాలా ఇబ్బంది కలిగించే సమస్య. తినగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చే ఈ సమస్యతో సామాజికంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో చాలా లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలకు కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలూ ఉన్నట్లు తేలదు. ఫలితాలన్నీ మామూలుగా ఉంటాయి. లక్షణాలు: పొట్ట నొప్పి, పొట్ట పట్టేసినట్లుగా ఉండటం మలబద్ధకం మలవిసర్జన తర్వాత కూడా ఇంకా కడుపు పూర్తిగా ఖాళీ కానట్లుగా ఉండటం నీళ్ల విరేచనాలు విరేచనాలు, మలబద్ధకం లాంటి విరుద్ధ లక్షణాలు ఒకదాని తర్వాత మరోటి కనిపించడం మలంలో బంక (మ్యూకస్) పడటం కడుపు ఉబ్బరంగా ఉండటం కడుపులో గ్యాస్ నిండటం / కింది నుంచి గ్యాస్ పోవడం పొట్టపై భాగంలో ఉబ్బరంగా/ఇబ్బందిగా అనిపించడం కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉండి వికారం / వాంతి భ్రాంతి కలగడం ఎదుర్కొనేది ఎలా: దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కాకపోతే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలులను అనుసరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. అవి... ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవడం తగిన వేళల్లో తినడం ఆహారంలో తగినంత పీచు ఉండటం కోసం పొట్టుతో కూడిన ఆహారధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లుతాగడం తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే కొన్నిసార్లు ఫైబర్‌ను మందుల రూపంలో తీసుకోవాల్సి రావచ్చు. లక్షణాలను బట్టి యాంటీ-డయేరియల్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్, కడుపు పట్టేసిన ఫీలింగ్‌ను తొలగించేందుకు యాంటీ స్పాస్మోడిక్ మందులు అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి మానసిక చికిత్సలో భాగంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ), డైనమిక్ సైకోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 13- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పుల రూపంలో కనిపించే సమస్య. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కనిపించే ఆటో-ఇమ్యూన్ సమస్య ఇది. దీనివల్ల కీళ్లనొప్పులు, కీళ్ల కదలికలు తగ్గడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. లక్షణాలు: బాగా అలసటగా ఉండటం కీళ్లలో విపరీతమైన నొప్పులు కీళ్ల కదలికలు మందగించడం నిత్యం జ్వరం ఉన్నట్లుగా అనిపించడం (మలేయిస్) ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతుంది కండరాల నొప్పులు ఎదుర్కొనేది ఎలా: మన రోగనిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య కావడంతో దీనికి పూర్తిగా చికిత్సగాని, నిర్దిష్టమైన మందులుగాని అంతగా అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూసేందుకు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించే మందులు, కీళ్లలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చేసే చికిత్స ఉద్దేశం పరిస్థితిని అదుపు చేస్తూ, అది మరింత దిగజారకుండా చూడటమే. ఇందులో భాగంగా రక్తపరీక్షలు, ఇతరత్రా ప్రాథమిక పరీక్షలు కొన్ని క్రమం తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా మందులనూ, మోతాదులనూ ఎప్పటికప్పుడు మార్చాల్సి రావచ్చు. 14- డిప్రెషన్ మానసిక వ్యాకులత ఏమిటీ సమస్య: డిప్రెషన్ (వ్యాకులత) అన్నది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే మానసిక సమస్య. నిజానికి ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి బయటకు తెలిసేలాంటి లక్షణాలతో (క్లినికల్ లక్షణాలతో) డిప్రెషన్ కనిపిస్తుంది. ప్రతి నలుగురు మహిళల్లోనూ ఒకరు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. లక్షణాలు: మానసికంగా కుంగిపోయినట్లుగా ఉండటం ఎప్పుడూ విచారంగా కనిపించడం జీవితంపై ఆసక్తి కోల్పోయినట్లుగా ఉంటూ, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరిక తగ్గడం అస్థిమితంగా మారడం త్వరగా కోపం తెచ్చుకోవడం చాలాసేపు అదేపనిగా ఏడ్వటం ఎప్పుడూ అపరాధ భావనతో ఉండటం నిరాశాపూరితంగా ఆలోచించడం ఆకలి తగ్గడం, ఫలితంగా బరువు తగ్గడం అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమితో బాధపడటం నిద్రపట్టినా వేకువనే మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం ఆత్మహత్య దిశగా ఆలోచనలు రావడం దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, దృష్టికేంద్రీకరణ శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం ఎప్పుడూ తలనొప్పి, జీర్ణసమస్యలు, దీర్ఘకాలికంగా ఒంటినొప్పుల వంటి భౌతిక సమస్యలు ఉండటం. ఎదుర్కొనేది ఎలా: జీవితాన్ని ప్రయత్నపూర్వకంగా రసభరితంగానూ, ఆనందదాయకంగానూ మలచుకోవడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. దీనికి కావాల్సిందల్లా కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంపొందించుకోవడమే. విచారం నుంచి బయట పడటానికి ఎవరికి వారుగా చేసుకోదగ్గ పనులు... ప్రతిరోజూ బిజీగా గడపడానికి వీలుగా ఏదో వ్యాపకాన్ని ఎంచుకుని దానిలో ఆసక్తికరంగా నిమగ్నం కావడం. ఏదైనా సాధించడానికి అనుగుణంగా మంచి లక్ష్యాన్ని ఎంచుకోవడం. దానికోసం కృషి చేయడం. ఇందులో భాగంగా మొదట చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని తేలిగ్గా అధిగమిస్తూ పోతూ క్రమంగా పెద్ద లక్ష్యాలను ఛేదించుకుంటూ పోవడం. నిత్యం వ్యాయామంతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. అవి మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు. ఇక చికిత్సలో భాగంగా డాక్టర్ చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. -
చిక్కిశల్యం!
అనంతపురం టౌన్/అర్బన్/ సిటీ, న్యూస్‌లైన్ : మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉందనడానికి పై రెండు ఉదంతాలే నిదర్శనం. పేదలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), వైద్య, ఆరోగ్య శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదంతా కాగితాలకే పరిమితం. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో నిధులు, పౌష్టికాహారం పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ఏటా వందల సంఖ్యలో మాతా, శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత బారినపడి ఎక్కువ శాతం మహిళలు ప్రసవం సమయంలో చనిపోతున్నారు. గర్భస్థ శిశువుల్లో ఎదుగుదల కూడా ఉండడం లేదు. దీంతో వారూ మృత్యువాత పడుతున్నారు. నిద్రమత్తులో వైద్య, ఆరోగ్య శాఖ రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ మేల్కోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులోనూ పేదలే అధిక శాతం ఉండడం గమనార్హం. ఈ సమస్యతో ప్రతి రోజూ పలువురు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. గ్రామీణ , గిరిజన ప్రాంతాల నుంచే అధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఒకటి నుంచి 50 దాకా రక్తహీనత కేసులు నమోదవుతున్నాయి. వీరిలో అధిక శాతం గర్భిణులుండగా.. చిన్నారులు 20 శాతం వరకు ఉన్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది చిన్నారుల్లో 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరి బరువు, ఎత్తును బట్టి ఈ శాతాన్ని గుర్తించారు. అదే రక్తపరీక్ష ద్వారా అయితే మరింత మంది బయటపడే అవకాశం ఉంది. అలాగే 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గ ర్భం దాల్చిన మూడో నెల నుంచే ఐరన్ మాత్రలు అందించాలి. అయితే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పురుష ఆరోగ్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్లు సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే వారిని ముందస్తుగా గుర్తిస్తే వారికి మెరుగైన వైద్యం అందించి ప్రసవం సులువుగా జరిగేలా చూడవచ్చు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు. గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, టీకాలు వేయించుకోకపోవడం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలైపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది కాలంలో రక్తహీనత, బీపీ, శ్వాస సంబంధ వ్యాధులతో 307 మంది గర్భిణులు మరణించారు. ఇందులో 40 శాతం మరణాలు రక్తహీనతతో సంభవించాయని తెలుస్తోంది. చిన్నారుల్లో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరికి ప్రభుత్వం ఫై సల్ఫేట్ ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు, లక్ష మంది బడిబయట ఉన్నచిన్నారులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం మాత్రలు అందిస్తున్నారు. ఇవి ఒక్కోసారి వికటిస్తుండడంతో మింగడానికి భయపడుతున్నారు. పక్కదారి పడుతున్న పౌష్టికాహారం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న వారిలో రక్తహీనత నివారణ కోసం పౌష్టికాహారం అందించే బాధ్యతను స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) తీసుకున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 39,526 గర్భిణులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరందరికీ రోజూ పౌష్టికాహారంతో పాటు వారంలో రెండురోజులు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. ఇటీవల కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక గ్లాసు పాలు, కోడిగుడ్లు కూడా ఇవ్వాలి. అయితే.. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహార లోపం నివారణ కోసం పాతికేళ్లకు పైగా ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నా ఫలితాలు కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే ఐసీడీఎస్ కేంద్రాల తరహాలోనే మూడేళ్ల నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 24 మండలాల్లో పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల ద్వారా రోజూ రూ.5 చొప్పున వసూలు చేసి... రెండు పూటల భోజనం అందించడమే ఈ కేంద్రాల ముఖ్యోద్దేశం. ప్రస్తుతం 24 మండలాల్లో 185 కేంద్రాల ద్వారా దాదాపు 500 మంది గర్భిణులు, 500 మంది బాలింతలు, 600 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పూటల భోజనంతో పాటు పాలు, పండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే... ఈ కేంద్రాలు కూడా సమర్థవంతంగా నడవడం లేదు. లబ్ధిదారుల ద్వారా డబ్బు వసూలు చేస్తుండడం(గతంలో రూ.10 ఉండేది)తో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. ఇప్పటికే 20 కేంద్రాలకు పైగా మూతపడినట్లు సమాచారం. -
మడమ నొప్పి తగ్గాలంటే...?
నా వయసు 63. గత నాలుగు నెలలుగా ఎడమకాలు మడమ దగ్గర బాగా నొప్పిగా ఉంది. పడుకుని లేచేటప్పుడు పాదం నేల మీద మోపాలంటే భయం. విపరీతమైన నొప్పిగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. దీనికి సరైన పరిష్కారం చెప్పగలరు. - హనుమాయమ్మ, కర్నూలు ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘పార్ష్ణిశూల’గా వివరించారు. ఇది వాతరోగాలలో ఒకటి. నాడీమండలానికి సంబంధించి, శరీరంలోని చివరి భాగాలకు చేరే నరాల అంతిమ శాఖల బలహీనత వల్ల ఈ నొప్పి వస్తుంది. అక్కడి నరాలు కొంచెం వాచడం కూడా సంభవించవచ్చు. దీనికి తోడు మీకు రక్తహీనత కూడా ఉంటే ముందు రక్తవృద్ధికి బలకరమైన ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, బొప్పాయి, దానిమ్మ వంటి తాజాఫలాలు, ఖర్జూరం బాగా తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మధమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గాని ఉంటే వాటిని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కింద వివరించిన సూచనలు పాటిస్తే ఒక నెలలో మీ ‘మడమ శూల’ నయమవుతుంది. ఆహారం: తాజాఫలాలు, శుష్కఫలాలు, ఆకుకూరలు మంచి ఆహారం. ముడిబియ్యంతో వండిన అన్నం చాలా ప్రయోజనకరం. రెండుపూటలా మూడేసి చెంచాల ‘నువ్వుల పప్పు’ నమిలి తినండి. అదేవిధంగా మినపపప్పుతో చేసిన ఇడ్లీ వంటి అల్పాహారాలు కూడా నరాల శక్తికి బాగా ఉపకరిస్తాయి. వంటకాలలో కేవలం నువ్వుల నూనెనే వాడండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. బయటి ఆహారాల జోలికిపోవద్దు. మాంసరసం, కోడిగుడ్లు కూడా మంచిది. విహారం: నొప్పి తగ్గేంతవరకూ ఆ మడమకు ఎంతో కొంత విశ్రాంతి అవసరం. మోటగించి నడవటం, వ్యాయామాలు చేయడం మంచిది కాదు. రెండుపూటలా ప్రాణాయామం చేయండి. మందులు: బృహత్వాత చింతామణిరస (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (ఒక పదిరోజులు మాత్రమే). మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 అశ్వగాంధారిష్ట (ద్రావకం): మూడుపూటలా - నాలుగేసి చెంచాలు - నీటితో స్థానిక బాహ్యచికిత్స: మహానారాయణ తైలం, పిండతైలాలను రెండేసి చెంచాలు ఒక పాత్రలో కలుపుకొని, స్వల్పంగా వేడి చేసి మడమచుట్టూ మృదువుగా మర్దన చేయాలి. అనంతరం వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. దీనికోసం మరిగిస్తున్న నీళ్లలో ‘వావిలి ఆకులు’ వేస్తే, ఫలితం ఇంకా శీఘ్రతరమవుతుంది. ఇది రోజూ రెండుపూటలా చేస్తే మంచిది. నా వయసు 44. గత రెండు నెలల నుంచి పాదాల వేళ్ల మధ్య దురద, నీరు కారడం, మంట, నొప్పి ఉంటున్నాయి. ఇవి తగ్గడానికి మంచి మందులు చెప్పండి. - శ్రీదేవి, వరంగల్ వీలున్నంత వరకు పాదాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచవద్దు. అనివార్యమైతే ఎప్పటికప్పుడు పొడిగా, శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. కల్తీ లేని పసుపుపొడిని వేళ్ల మధ్య అద్దుతుండాలి. మహామరిచాదితైలం: రాత్రిపూట వేళ్ల మధ్యభాగాల్ని పొడిగా శుభ్రం చేసి, ఈ తైలాన్ని పూయాలి. (ఇది పైపూతకు మాత్రమే). గంధక రసాయన (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 పరగడుపున పాలతో సేవించాలి. ఇలా ఒక నెల వాడితే బాధ నయమవుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
ఈ సమయంలో ఎందుకింత నీరసం...?
నేను ఇప్పుడు ఐదోనెల గర్భిణిని. గత కొంతకాలంగా ఏ చిన్న పనిచేసినా తొందరగా అలసిపోతున్నాను. ఎప్పుడూ నీరసంగా ఉంటోంది. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. గర్భవతిని కాకముందు పీరియడ్స్ సమ యంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యేది. ఇలా ఎందుకు ఉంటోంది? ఈ అలసట తగ్గడానికి ఏం చేయాలి? - జయలక్ష్మి, తాడిపత్రి మీరు చెప్పిన లక్షణాలతో పాటు మీరు గర్భవతి కాక మునుపు రుతుసమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరిగేదన్న హిస్టరీ ఆధారంగా మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్ల మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత అనే కండిషన్లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. ఈ హిమోగ్లోబిన్ అన్నది రెండు ఆల్ఫా, రెండు బీటా చెయిన్లు గల నిర్మాణంతో ఉంటుంది. ఇది ఐరన్‌ను కలిగి ఉండి, దాని సహాయంతో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ చేరవేస్తుంది. నిజానికి మహిళల్లో ప్రతి డెసీలీటర్‌కు 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సులను బట్టి ఒకవేళ ఈ కొలత 10 నుంచి 10.9 వరకు ఉంటే దాన్ని చాలా మైల్డ్ అనీమియా అనీ, 7 నుంచి 10 ఉంటే దాన్ని ఓ మోస్తరు అనీమియా అనీ, 7 కంటే తక్కువ ఉంటే దాన్ని తీవ్రమైన అనీమియా అనీ, ఒకవేళ ఆ విలువ నాలుగు కంటే తక్కువ ఉంటే అతితీవ్రమైన అనీమియా అని పేర్కొనవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మీరు చెప్పినట్లుగా తొందరగా అలసిపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కళ్లు, నాలుకను డాక్టర్లు పరీక్షిస్తారు. అవి పేలవంగా ఉండటాన్ని బట్టి రక్తహీనతగా అనుమానించి రక్తపరీక్షలు చేయిస్తారు. అయితే చాలామంది రక్తహీనత కోసం హిమోగ్లోబిన్ పాళ్లను మాత్రమే పరీక్షిస్తారు. నిజానికి పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) చేయించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈ పరీక్షల్లో ఎమ్‌సీవీ అనే అంశం గనక 80 కంటే తక్కువగా ఉంటే అది వంశపారంపర్యంగా వస్తున్న రక్తహీనత (థలసీమియా) కావచ్చా అన్నది తెలుస్తుంది. ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో ఒంటికి బాగా రక్తం పడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుని, దాన్నిబట్టి తగిన చికిత్స తీసుకోండి. గర్భవతులందరూ రక్తహీనతను నివారించుకోవడం కోసం బలవర్థకమైన ఆహారం అంటే... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల హిమోగ్లోబిన్‌ను సమకూర్చుకోగలుగుతారు. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్