శ్రద్ధహీనత
ఐరనీ
ఈ వార్త వింటే మన ముఖాలు పాలిపోతాయి. నిజమే... సమాజంలో స్త్రీ ఇంకా సెకండరీ సిటిజన్‌గానే ఉందా అని రక్తం ఇంకిపోయిన ముఖాలతో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది! మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరికీ అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతాయనేది వాస్తవం. ఒక్కరోజు ఆమె నిస్సత్తువగా మంచం మీద పడుకుంటే ఇక ఆ రోజుకి ఆ ఇంట్లో ఎవరికీ ఏదీ సమయానికి అందదు. కడుపు నిండా అన్నం ఉండదు. అలాంటి స్థితిలో కూడా మహిళ ఆరోగ్యం ఎవరికీ పట్టదా?! ఇంకా ముఖ్యంగా బిడ్డలను కనాల్సిన మహిళ మరింత ఆరోగ్యంగా ఉండాలి. ఎంతగా అంటే... తన దేహం తగినంత పోషకవిలువలతో ఉంటూ మరో ప్రాణికి జీవం పోయగలిగినంత ఆరోగ్యంగా ఉండాలి. సరిగ్గా ఇక్కడే కుటుంబాలలో విపరీతమైన అలసత్వం కరడుగట్టుకుని ఉంది. ఇక్కడే ముఖం పాలిపోయేటంతటి రక్తహీనత గూడుగట్టుకుని ఉంది.
మనదేశంలో దాదాపుగా యాభై శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అది కూడా పిల్లల్ని కనాల్సిన వయసులో ఉన్న వారే. ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు మహిళ రక్తహీనతతో బాధపడుతుందంటే దేశం ఆరోగ్యంగా ఉందని ఎలా చెప్పగలం? ఇటీవలి ఓ అధ్యయనంలో భారతీయ మహిళల రక్తహీనత బయటపడింది. ముఖ్యంగా పిల్లల్ని కనే వయసులో ఉన్న మహిళలలో దాదాపుగా యాభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. నిజానికి ఇది రక్తహీనత కాదు. మన శ్రద్ధ హీనత. రోజుకో పండైనా తినమని ఆమెకు చెప్పడానికి ఇంట్లో ఒకరు ఉండాలి. ‘ఇల్లు... ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి’... ఈ నినాదాన్ని ఒంటబట్టించుకుంటే మహిళ ఒంటికి కొంచెం రక్తం పడుతుందేమో!