భారతదేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కొన్నేళ్ల కిందట దాదాపు 85 శాతం మంది మహిళలు అనిమిక్‌గా ఉండేవారు. క్రమంగా మహిళల్లోనూ చైతన్యం పెరుగుతుండటంతో ఇటీవల అది 57 శాతానికి చేరింది. ఇంతగా చైతన్యం పెరిగాక కూడా దేశంలోని సగానికి పైగా మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ఇక ఇటీవలే పీరియడ్స్ మొదలైన టీనేజీ అమ్మాయిల్లో రక్తహీనతతో బాధపడుతుండేవారు ఇంకా ఎక్కువ.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019–21 ప్రకారం 15 నుంచి 19 ఏళ్ల వయసుండే కౌమార బాలికల్లో అనీమియాతో బాధపడేవారు 59.1 శాతం! రుతుస్రావంలో రక్తం కోల్పోతుండటం, అది భర్తీ అవుతుండగానే నెలసరితో రక్తం కోల్పోతుండటంతో యువతుల్లో రక్తహీనత కనిపిస్తోంది. కొత్తగా పీరియడ్స్ మొదలైన టీనేజ్ అమ్మాయిలు అనీమియాకు లోనుకాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అవేమిటో చూద్దాం.
ఆహారంలో ఎక్కువగా తీసుకోవాల్సినవి...
శాకాహారులు తమ ఆహారంలో తాజాగా ఉండే ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీడీలు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీలు తీసుకోవడం మేలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
ఒకవేళ మాంసాహారులైతే ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తోపాటు... మటన్, చికెన్ లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోవడం మంచిది.
మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉంటుంది. అయితే మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ అంటే... తిన్న వెంటనే అది ఒంటికి పట్టే రూపంలో ఉంటుంది. అదే శాకాహార పదార్థాల్లో ఉండే నాన్‌హీమ్ ఐరన్ ఒంటికి పట్టేలా చేయడానికి విటమిన్–సి కావాలి. కాబట్టి శాకాహారులు తమ ఆహారాల్లో ఐరన్ ఉండేవి తినేటప్పుడు వాటితోపాటు విటమిన్–సి ఉండే తాజా పండ్లైన జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి లేదా వంటకాల్లో విటమిన్–సీ ఎక్కువగా ఉండే ఉసిరి వంటివి తీసుకుంటూ ఉండాలి.
మాంసాహారులైనా, శాకాహారులైనా కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి. కోడిగుడ్డులో పచ్చసొన తీసుకోకూడదనే అభిపప్రాయాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే పచ్చసొనతో వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, అది తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ.
రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం సమృద్ధిగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే.
మరికొన్ని సూచనలు
రుతుస్రావం సమయంలో అమ్మాయిలు రక్తాన్ని ఎక్కువగా కోల్పోతుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వాలంటూ పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది వాస్తవం కాదు. ఈ టీనేజ్‌లోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుంటూ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలూ తీసుకోవాలి.
కొత్తగా రుతుస్రావం మొదలైన అమ్మాయిలకు కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలో, నువ్వుల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి వాటిని కాస్త పరిమితంగా తీసుకుంటూ ఉండాలి.
నెయ్యికి బదులు వెన్న వాడటం మేలు. ఎందుకంటే వెన్నకాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అయితే వెన్న తీసుకుంటే అందులోని కొవ్వులు... ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్‌ను బాగా ఒంటబట్టేలా చేస్తాయి.
అన్నిటికంటే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా రోజుకు 45 నిమిషాల చొప్పున కనీసం వారానికి ఐదు రోజుల పాటైనా వ్యాయామం చేస్తే హార్మోన్లు క్రమబద్ధంగా విడుదల కావడం జరుగుతోంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం పీరియడ్స్ సమయంలో వ్యాయామం కుదరక΄ోవచ్చు. వాళ్లు మినహా మిగతా యువతులంతా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
అస్సలు తీసుకోకూడనివి...
బేకరీ ఐటమ్స్, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి...
ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకోవాలి.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా తక్కువగా తీసుకోవాలి.
డా. పూజితాదేవి సూరనేని, సీనియర్ హైరిస్క్ ఆబ్‌స్టెట్రీషియన్ –రోబోటిక్ సర్జన్
(చదవండి: ఐవీఎఫ్ జర్నీ.. రోజుకు ఐదు ఇంజక్షన్స్.. అంత ఈజీ కాదు: కొరియోగ్రాఫర్)
Comments
Please login to add a commentAdd a comment