Adolescent
-
నేను పెళ్లికి అర్హుడినేనా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ పురుషుల సందేహాలకు సమాధానాలు నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ సమయంలో అసాధారణ భంగిమల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. నా వయసు 30 ఏళ్లు. పెళ్లి కాలేదు. ఇంతకు మునుపు స్త్రీని చూడగానే విపరీతమైన కోరిక కలిగేది. ఎవరైనా ఆడవాళ్లు యాదృచ్ఛికంగా టచ్ అయినా... మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. పైగా హస్తప్రయోగం చేసుకుందామన్నా అంగస్తంభన నిలవడం లేదు. ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను పెళ్లికి అర్హుడినేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.జి. మల్కాజ్గిరి ఈమధ్య యుక్తవయసులో ఉన్నవారు 30 వరకు పెళ్లిచేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాతికేళ్లలోపు వారిలో సామాజిక బ్యాధతలు అంతగా తెలియకపోవడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ ఆలోచనలు, అంగస్తంభన ఇవన్నీ కాస్త ఉద్ధృతంగానే ఉంటాయి. ఆ తర్వాత సామాజికపరమైన ఒత్తిళ్ల వల్ల హస్తప్రయోగంలో తృప్తి పూర్తిగా పొందలేకపోవడం వల్ల అంగస్తంభన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం వారి ఫీలింగ్ మాత్రమే. ఇలాంటి వాళ్లలో చాలామంది ఎలాంటి సమస్య లేకుండా సెక్స్ జీవితాన్ని సజావుగానే కొనసాగించగలరు. మీరు ఆర్జనపరులైతే వెంటనే పెళ్లి చేసుకోండి. ఇక నిద్రలోనూ అంగస్తంభనలు లేకపోవడం, సెక్స్ కోరికలు అసలేమీ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే మీకు యాండ్రాలజిస్ట్ సహాయం అవసరమవుతుంది. అలాంటి లక్షణాలు లేకపోతే మీరు నార్మల్‌గా ఉన్నట్లే. పెళ్లికి పూర్తిగా అర్హులే. నిర్భయంగా ఉండండి. నా వయసు 20 ఏళ్లు. ఈమధ్యే నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మేము ఎప్పటి వరకు సెక్స్‌లో పాల్గొనవచ్చు. గర్భం వచ్చాక కూడా సెక్స్ చేస్తుంటే ఏమైనా ప్రమాదమా? - ఎస్.పి.ఆర్., తెనాలి నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు (అంటే మొదటి ట్రైమిస్టర్లో) సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు (రెండో ట్రైమిస్టర్లో) సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ సమయంలో అసాధారణ భంగిమ (అబ్నార్మల్ పొజీషన్స్)ల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. అలాగే బలమైన స్ట్రోక్స్ అవాయిడ్ చేయడమే మంచిది. చివరి మూడు నెలల్లోనూ సెక్స్‌ను కాస్త కొంతమేరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. అయితే పైపైనే సెక్స్ చేయడం, ఒకరినొకరు సెక్స్‌పరమైన ప్రేరేపణలు చేసుకుని ఆనందించడం వల్ల ప్రమాదం ఉండదు. మీ భార్య ప్రెగ్నెన్సీ సమయంలోనైనా లేదా మామూలు సమయాల్లోనైనా మీ ఇద్దరూ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం. నా వయసు 69 ఏళ్లు. మూత్రం విసర్జనకు చాలా ఎక్కువ సమయం పడుతోంది. చుక్కలు చుక్కలుగా పడుతోంది. రాత్రి వేళల్లో చాలాసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య వల్ల సెక్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నాకు షుగర్, బీపీ వంటి జబ్బులు లేవు. నాకు సరైన సలహా ఇవ్వండి. - ఎమ్.డి.కే., అనంతపురం సాధారణంగా అరవై ఏళ్ల వయస్సు పైబడ్డవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ గ్రంథి మూత్రాశయానికి, మూత్రనాళానికి మధ్య ఉంటుంది. ఇది పరిమాణం చాలా పెద్దగా పెరగడం వల్ల మూత్రనాళం బ్లాక్ అయిపోయి మీరు చెబుతున్న సమస్య వస్తుంది. ఇది పెరగడానికి సెక్స్ చేయలేకపోవడానికి సంబంధం లేదు. కాకపోతే మీరు రాత్రిపూట చాలాసార్లు లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయి మీకు సెక్స్ సమస్య వచ్చి ఉండవచ్చు. ఈ ప్రోస్టేట్ సమస్యను మందులతో, టీయూఆర్‌పీ అనే కుట్టు లేని ఆపరేషన్‌తో గాని పరిష్కరించవచ్చు. ఆ తర్వాత మీకు రాత్రిపూట నిద్రబాగా పడుతుంటే మీ సెక్స్ సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ. నా వయసు 29 ఏళ్లు. పురుషాంగం పైనా, వృషణాల మీద చిన్న చిన్న చెమటకాయల్లా వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. సబేషియస్ సిస్ట్స్ అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. శస్త్రచికిత్స తర్వాత ఇవి తగ్గుతాయా? డాక్టర్ నుంచి శస్త్రచికిత్స అన్న మాట విన్నప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. నేను పెళ్లి చేసుకోవచ్చా? భవిష్యత్తులో సంసార జీవితానికి పనికివస్తానా? పిల్లలు పుడతారా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్.కె.ఎస్., జగ్గయ్యపేట సెబేషియస్ సిస్ట్స్ అనేవి వృషణాల మీద ఉన్న చర్మంపై తెల్లటి లేదా పచ్చటి రంగులో వస్తుంటాయి. ఇవి చర్మం పైపొరకు మాత్రమే పరిమితం. ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతూ పోతున్నప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఇలా చేసే చికిత్స ప్రక్రియలో కేవలం చర్మం పైభాగం నుంచి మాత్రమే వాటిని డాక్టర్లు తొలగిస్తారు. వృషణాలకు గానీ... ఇతరత్రా కీలకమైన నరాలకు గానీ ఎలాంటి గాటూ పెట్టడం జరగదు. డాక్టర్‌నుంచి సమాచారం విన్న వెంటనే మీకు అంగస్తంభనలు లేకపోవడం అన్నది కేవలం మీరు మానసికంగా కుంగిపోవడం వల్ల జరిగిందే. అంతేగానీ వృషణాలకు గాని, అంగస్తంభనలకు గాని, వీర్యం తయారీకి గాని ఈ సర్జరీతో ఏమాత్రం సంబంధం ఉండదు. గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే... కొందరిలో ఇలాంటి సిస్ట్స్ మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అప్పుడు మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగిన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. మీ శస్త్రచికిత్స తర్వాత మీరు మామూలుగానే సెక్స్ చేయవచ్చు. ఈ సమస్యకూ పిల్లలు కలగకపోవడానికీ ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయసు 29 ఏళ్లు. నా భార్య వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నా భార్యకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తాయి. ఒక ఏడాది తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే నా భార్యలో ఏ లోపం లేదని చెప్పారు, నాలోనే వీర్యకణాలు తక్కువగా (కేవలం 25 శాతం) ఉన్నాయని మందులు ఇచ్చారు. నెలలో 50 శాతం పెరిగాయని మందులు కంటిన్యూ చేయమన్నారు. నేను ఇలా ఎన్నిరోజులు మందులు వాడాలి? సంతానం కోసం మేము ఏ టైమ్‌లో సెక్స్ చేయాలి? - జె.ఆర్.ఆర్., కొత్తగూడెం పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉండే కండిషన్‌ను ఆలిగోస్పెర్మియా అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది వేరికోసిల్. దీన్ని డాప్లర్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ (వృషణాలకు స్కానింగ్) పరీక్ష ద్వారా కనుగొంటారు. ఈ వేరికోసిల్ (అంటే రక్తనాళాల వాపు) ఉంటే, దానికి సర్జరీ అవసరమవుతుంది. ఒక వేరికోసిల్ లేకపోతే ప్రధానంగా మందులు వాడితే సరిపోతుంది. ఈ మందుల వల్ల కనీసం స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్/ఎమ్ఎల్ దాటితే సాధారణంగా గర్భం (న్యాచురల్ ప్రెగ్నెన్సీ)కి అవకాశం ఉంటుంది. ఇలా 20 మిలియన్ కంటే స్పెర్మ్ కౌంట్ ఉన్నవాళ్లు మిడ్ సైకిల్ అంటే... రుతుస్రావం మొదలైన ఎనిమిదవ రోజు నుంచి 18వ రోజు వరకు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనాలి. అలా ఆర్నెల్లలో పిల్లలు కలగకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ప్రయత్నించవచ్చు. ఒకవేళ స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్ లేకపోతే కొన్ని హార్మోన్ పరీక్షలు, యాంటీస్పెర్మ్ యాంటీబాడీ పరీక్ష చేసి కొన్నిసార్లు వాటికి మందులతో చికిత్స చేయవచ్చు. మీరు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స చేయించుకుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ వి.చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
విజయాన్ని చిత్రించుకోండి...
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పరీక్షల రోజులు దగ్గర పడుతున్నకొద్దీ పిల్లల్లో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఉండటం సహజమే. అది స్టూడెంట్‌కి ప్రేరణ కలిగించేలా ఉండాలి. కానీ అది ఎక్కువైతే మంచిది కాదు. If you think you can... yes you can, If you think you can not.. yes you are righ్ట అంటారు విజ్ఞులు. మీరు చేయగలరనుకుంటే అద్భుతాలు చేయగలరు. చేయలేననుకుంటే అక్షరాలా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మీ ఒత్తిడికి చెక్‌పెట్టండి. దీనికి పదే పదే సానుకూల సందేశాలు ఇచ్చుకోవాలి. లేదా వాటిని పేపరు మీద రాయాలి. ఉదాహరణకు ఇక్కడ కొన్ని సందేశాలు చదవండి... ‘నాలో ఎటువంటి ఒత్తిడి లేదు’, ‘నేను చదివిన పుస్తకాల్లోని ప్రశ్నలకే సమాధానాలు రాయబోతున్నాను’, ‘నాకు ఎలాంటి టెన్షన్ లేదు’, ‘నేను స్వేచ్ఛాజీవిని’, ‘ఎటువంటి భయభ్రాంతులకు లోను కాను’, ‘నాలో ధైర్యం ఎంతో ఉంది. నేను పరీక్షల్ని సమర్థవంతంగా రాయగలుగుతాను.’ ఇలా ఉండాలి ఆ సందేశాలు. విజువలైజేషన్: ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ముందు విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు మీరు ఎంతో ప్రశాంతమైన స్థితిని హాయిగా అనుభవిస్తున్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్. మీరు రాయబోయే పరీక్ష... వెళ్లబోయే ఇంటర్వ్యూ.. ఏదైనా సరే మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీరెంతో ప్రశాంతంగా ఉన్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్.. మీ పరీక్షలు దగ్గర పడ్డాయి. మీలో ఆనందం క్షణ క్షణానికి అధికమవుతుంది. పరీక్ష రోజు వచ్చింది. మీరెంతో ఆనందంగా లేచారు. ఇక మళ్ళీ చదవాల్సినదేమీ లేదు. ఆఖరి నిమిషంలో చదివేది ఏమీ లేదు. ఇవన్నీ 364 రోజుల పాటు చదివినవే. రిలాక్స్.. రిలాక్స్.. ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లారు. మీ ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంది. సంతోషంగా హాల్లో అడుగుపెట్టారు. మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. మిగతా విద్యార్థులు కూడా ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటున్నారు. చాలా మంది మొహంలో ఏదో టెన్షన్... అది చూస్తే మీకు నవ్వు వస్తుంది. మనం రాయబోయే పరీక్ష మనం చదివిన పుస్తకాల్లోదే కదా! మరెందెకు టెన్షన్! రాయబోయే పరీక్ష మనం చదువుకున్న భాషలోనే రాస్తాం కదా? ఇంకెందుకు భయం? అని మీకు అనిపిస్తుంది కదూ! రిలాక్స్.. రిలాక్స్.. ఇంతలో గంట మ్రోగింది. ప్రశ్నాపత్రాలు మీ అందరికీ పంచారు. మీరు నవ్వుతూ మీ ప్రశ్నాపత్రం తీసుకున్నారు. అది చూడగానే ఆనందంతో గట్టిగా అరవాలనిపించింది. ఎందుకంటే ప్రశ్నాపత్రం చాలా ఈజీగా ఉంది. అన్నీ చదివినవే. అన్నీ గుర్తున్నవే. ఇంకేం! ఆన్సరు పత్రం మీద, ముందుగా హాల్‌టికెట్ నంబరువేసి, సమాధానాలు రాయటం మొదలెట్టారు. రిలాక్స్.. రిలాక్స్.. ఆశ్చర్యం! సమాధానాలు చకచకా రాస్తున్నారు. రిలాక్స్... రిలాక్స్... మొత్తానికి పేపరంతా తృప్తికరంగా రాశారు. సమయం ఇంకా పదినిమిషాలు ఉంది. రాసిన పేపరునంతా ఒకసారి చూశారు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు, స్పెల్లింగులు ఉంటే దిద్దారు. ఇంతలో బెల్ మ్రోగింది. ఇన్విజిలేషన్ అధికారికి మీ పేపరు ఇచ్చేశారు. ఆనందంగా బయటకు వచ్చారు. ఇంటికి వచ్చాకా మీ సమాధానాలు సరి చూసుకున్నారు. ఆల్ కరక్టు.. ఆల్ కరక్టు. అదే విధంగా మిగతా పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేశారు. సెలవులిచ్చారు. హాయిగా కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఒకరోజు మీ ఇంటి కాలింగ్‌బెల్లు ఎవరో నొక్కారు. మీ వాళ్ళు వెళ్ళి తలుపుతీశారు. ఆయనొక కొత్త వ్యక్తి. ‘మీరెవరు?’ అని అడిగారు. ‘నేను ఫలానా టీవీ ఛానెల్ నుంచి వచ్చాను. మీ అబ్బాయి/ అమ్మాయికి స్టేట్ ర్యాంకు వచ్చిందని తెలిసింది, ఇంటర్వ్యూ కోసం వచ్చాను’ అన్నాడు. ఒక పక్క నాన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి, అమ్మ ఆనంద బాష్పాలు.. ఎంత అదృష్టవంతులు మీరు? ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? వాళ్లకి మనం ఇంతకన్నా ఇంకేమి ఇవ్వగలం? మీకు కూడా తెలియకుండానే కళ్ళవెంట ఆనందబాష్పాలు జల జల రాలుతున్నాయి. రిలాక్స్.. రిలాక్స్... (ఇలా ఒకటి రెండు నిమిషాల తరువాత తిరిగి మామూలు స్థితికి రావాలి) ఇప్పుడు మీరు నెమ్మది నెమ్మదిగా మామూలు స్థితికి రాబోతున్నారు. నేనిప్పుడు ఐదు నుండి ఒకటి వరకు అంకెలు లెక్కబెడుతున్నాను. ఒకటి అనేసరికి మీరు కళ్లు తెరవగలుగుతారు. సహజస్థితిలోకి రాగలుగుతారు. ఐదు.. నాలుగు.. మూడు.. రెండు.. ఒకటి.. కళ్ళు తెరవండి. వెరీగుడ్. కళ్లు తెరిచిన తరువాత, ఆ విద్యార్థిలో ఎంతో ఆత్మవిశ్వాసం మనం గమనించవచ్చు. జాకబ్సన్ రిలాక్సేషను ద్వారా, ఒక ప్రశాంతమైన స్థితికి పంపి, ఆ తరువాత విజువలైజేషన్ ద్వారా తామనుకుంటున్న స్థితిని ఊహించేలా చేయగలిగితే ఎవరికైనా ఎటువంటి భయాలనైనా పోగొట్టవచ్చునని కౌన్సెలింగ్‌లో రుజువైంది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్.ఎల్.పి) అనే ప్రక్రియలో మనసులో నాటుకుపోయి ఉన్న భయాలను, భ్రాంతులను ఇదే పద్ధతిలో తీసి వేయవచ్చునని శాస్త్ర పరిశోధకులైన రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండరులు రుజువు చేశారు. వారు చెప్పేవాటిలో ముఖ్యమైనది.. దేశపటం దేశం కాజాలదు...అంటే- దేశపటంలో చూపినట్లు ఆ వంపులు, వాగులు అక్షరాలా అలాగే ఉండవు. అదేవిధంగా మన మనసులోనున్న భయాలు భ్రాంతులన్నీ నిజం కావు. అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు. వాటిని మనం సవరించుకోవచ్చు’ అంటారు వారు. ఇది కేవలం స్టూడెంట్స్‌కే కాదు, టీచర్లు, కరస్పాండెంట్ల్లు, ఇతరులు కూడా సాధన చేయవచ్చు. తాము గొప్ప టీచరు అయినట్లు ప్రెసిడెంటు అవార్డు తీసుకుంటున్నట్లు తమ పిల్లలు విజయాలను సాధించినట్లు ఊహించుకోవచ్చు. ఈ సాధన వలన మనసులో ముద్రపడిన అనవసరమైన నె గెటివ్ భావాలు, పాజిటివ్‌గా మారటం ఖాయం. ప్రయత్నాలు కూడా అలాగే చేస్తారు. విజయాలు సాధిస్తారు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, bvpattabhiram@yahoo.com ఫోన్: 040-23233232, 23231123 -
స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ చుట్టూ ఉన్నదంతా మంచే అనుకుంటాను. ఎప్పుడూ సంతోషంలో మునిగితేలాలనుకుంటారు. మంచీ, చెడు తెలియని దశను సవ్యమైన మార్గంలో పెట్టడానికి నేటి కాలపు అమ్మనాన్నల ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. పదిహేనేళ్ల తన కుమారుడి గురించి ఓ తల్లి ఆందోళన చెందిన విధం ఇది... రెండు నెలల క్రితం... ‘‘మా అబ్బాయి అభినవ్ 9వ తరగతి చదువుతున్నాడు. పదిహేనేళ్లుంటాయి. నేనూ మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులమే. మాకు ఒక్కగానొక్క బిడ్డ అభినవ్. వాడి మీదే మా ఆశలన్నీ. వాడి భవిష్యత్తు బాగుండాలని, ఇద్దరం కష్టపడుతున్నాం. గత ఏడాది వరకు వాడి పెంపకం మాకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఈ మధ్యే వాడి ప్రవర్తనకు తీవ్రంగా భయపడుతున్నాం. ఏమైపోతాడో అని దిగులుగా ఉంటోంది. పదిహేనేళ్ల పిల్లవాడు డ్రగ్స్ వాడుతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రికైనా ఎంత షాక్!! అలా నివ్వెరపోయేలా మా అబ్బాయి చేశాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఎదురు తిరుగుతుంటే వయసు అలాంటిదిలే అని సరిపెట్టుకున్నాను. అబద్ధాలు చెబుతున్నాడు అని తెలిస్తే కోప్పడేదాన్ని. కానీ, మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా, ట్యాబ్ వచ్చినా అది కావాలనేవాడు. ఇవ్వకపోతే చచ్చిపోతాను అని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరింపులు. హెయిర్‌స్టైల్ మార్చాలంటాడు. డ్రెస్సులు ఫ్యాషన్‌గా లేవంటాడు. ఫ్రెండ్స్‌తో తిరుగుళ్లు ఎక్కువయ్యాయి.. తన కన్నా వయసులో పెద్దవారితో స్నేహాలు. కాస్త మందలించినా ఎదురుగా ఉన్న వస్తువులను టీవీ, ఫ్రిజ్.. ఏదుంటే అది పగలకొట్టేంతవరకు వెళ్లింది. నాకు తెలియకుండా మా వారి దగ్గర, ఆయనకు తెలియకుండా నా దగ్గర బుక్ పోయిందనో, పెన్ను కావాలనో, ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అనో.. డబ్బులు అడుగుతూనే ఉంటాడు. ఇవ్వకపోతే దొంగతనం కూడా చేసేవాడు. కోప్పడ్తే ‘నువ్వింతే, నా మీద నీకు నమ్మకం లేదు’ అనేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మార్కులు బాగా తగ్గిపోయాయి. చెప్పింది అస్సలు వినడు అని స్కూల్లో టీచర్ల కంప్లయింట్. ఒక్కగానొక్క కొడుకు. ఏమైనా అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటాడో... అని భయం. అలాగని వదిలేస్తే ఏమైపోతాడో అని దిగులు. ఎవరి సలహా అయినా తీసుకుందామంటే ఇంట్లో ఉండేది మేం ముగ్గరమే! పెద్దవాళ్లు ఊళ్లో ఉంటారు. పిల్లవాడు బాగయ్యేదెలా?! చేస్తున్న ఉద్యోగం మానేయనా?! ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. కుటుంబం గడిచేదెలా?! ఈ తరహా ఆందోళన నాలో ఎక్కువై ఆరోగ్యం కూడా దెబ్బతింది.’ - వసుధ (అభినవ్ తల్లి) నిజాలు ఇలా..! అభినవ్ని తీసుకొని తల్లీదండ్రి వచ్చినప్పుడు పిల్లవాడి స్థితి మామూలగానే ఉన్నట్టు అనిపించింది. తల్లితండ్రి చెబుతున్నట్టుగా ఏమీ లేడని, ఈ దశలో పిల్లల పట్ల ఉండే సహజమైన ఆందోళనే ఈ తల్లిదండ్రిలోనూ ఉందనుకున్నాను. అభినవ్‌తో ఒంటరిగా మాట్లాడి, క్రమం తప్పకుండా కొన్ని సేషన్స్కు అటెండ్ అయితే ఎన్నో విషయాలు తేటతెల్లమయ్యాయి. అభినవ్ కళ్లలో కొద్దిగా ఎరుపు జీర కనిపించింది. ఆకలి ఎక్కువగా ఉంటుందనీ చెప్పాడు. అప్పటికే కొన్ని మెడికల్ టెస్ట్‌లు కూడా చేయించడం వల్ల వాటిలో మందు, పొగ, మాదకద్రవ్యాలకు అప్పుడప్పుడే అలవాటుపడ్డాడని అర్థమైంది. అదే విషయం అడిగితే ‘ స్నేహితుల బలవంతమ్మీద వాటిని తీసుకుంటున్నా’నని చె ప్పాడు. ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే నిజంగానే అభినవ్ పూర్తిగా చదువుమానేసేవాడే! తల్లిదండ్రుల ఆందోళ మరింత పెరిగేదే! ఈ వయసులో... సాధారణంగా టీనేజ్ పిల్లల్లో బిహేవియరల్ సమస్యలను కనుక్కోవడం కష్టం. పేరెంట్స్ మధ్యలో గొడవలుంటే ఆ ప్రభావం పిల్లల మీధ అధికంగా పడుతుంది. వారి మనస్తత్వంలో తీవ్ర మార్పులు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగస్తులు అవడంతో తల్లిదండ్రులు తమ తీరికలేని పనులలో నిమగ్నమై ఉంటారు.. పిల్లలతో కొంత సమయం కూడా గడపకపోవడం వల్ల బయటి స్నేహితులను వెతుక్కుంటారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలు చెప్పింది వినకపోయినా, మానసిక సమస్యలున్నా, తెలివితేటల్లో పురోభివృద్ధి లేకపోయినా.. అవే పెరుగుతాయిలే అని పెద్దలు మిన్నకుండిపోతారు. దీంతో పట్టించుకునేవారు ఎవరూ లేరులే అనే నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది. ఇవి తప్పక పాటించాలి... ముఖ్య సమస్యలపైన ముందుగా దృష్టి పెట్టాలి.ఇంట్లో సమస్యలు పిల్లల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. స్కూల్లో ఏ తరహా సమస్యలున్నాయో కనుక్కోవాలి. కొన్నిసార్లు టీచర్లు ఇద్దరు ముగ్గురు పిల్లలనే ‘పాయింట్ ఔట్’ చేసి కించపర చడం, దండించడం వంటివి చేస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. స్నేహితులు కూడా ఇంటి నుంచి ఏమైనా తీసుకురమ్మని డిమాండ్ చేస్తుంటారు. అలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి. తల్లిదండ్రులు టీచర్లతో సమయానుసారం తమ పిల్లల పోగ్రెస్, వ్యక్తిత్వం ఎలా ఉందో సంభాషిస్తూ ఉండాలి. మార్పు రావడానికి మంచి - చెడు కారణాలు ఏమున్నాయో చూడాలి. ఎన్ని పనులున్నా... రోజులో కొంత సేపు పిల్లలతో సంభాషించాలి. డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకుండా వస్తువుల రూపేణా భర్తీ చేయాలి. పిల్లవాడి చుట్టూ ఉన్న స్నేహితుల ప్రవర్తననూ పరిశీలించాలి. చాలామంది ‘మా పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ’ ఇస్తాం అని గొప్పగా చెబుతుంటారు. అంత స్వేచ్ఛ కూడా ఈ వయసులో మంచిది కాదు. స్వేచ్ఛకు కొన్ని పరిధులు ఉంటాయని తెలుసుకునేలా పెద్దల ప్రవర్తన ఉండాలి. అలాగని క్రమశిక్షణ పేరుతో అతిగా నియమాలు పెట్టకూడదు. అతి క్రమశిక్షణ పిల్లలను ఎదురు తిరిగేలా చేస్తుంది. కొంతమంది తమ పిల్లలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటామని గొప్పగా చెబుతారు. స్నేహితులుగా అనేది కూడా కొంతవరకే అని తల్లిదండ్రి గ్రహించాలి.స్తబ్దుగా, మౌనంగా పిల్లలు ఉంటే అలాగే వదిలేయకుండా తగిన కారణం తెలుసుకొని వెంటనే పరిష్కరించాలి.తమ ఈడు పిల్లలతో ‘పోలిక’ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. తప్పు పట్టకుండా సాధ్యాసాధ్యాలను వివరించాలి. రెండు నెలలుగా... ఇవన్నీ పాటించి, అభినవ్‌లో వచ్చిన మార్పులు చూసి తల్లీదండ్రీ సంతోషించారు. ‘ఇవే జాగ్రత్తలను పాటిస్తూ ఉండండి’ అనే సూచన వారి ముగ్గురి జీవితాల్లోనూ మార్పును తీసుకువచ్చింది. - డా. చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్