నేను పెళ్లికి అర్హుడినేనా? | Men's questions To Answers | Sakshi
Sakshi News home page

నేను పెళ్లికి అర్హుడినేనా?

Published Tue, Dec 8 2015 10:58 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

నేను పెళ్లికి అర్హుడినేనా? - Sakshi

నేను పెళ్లికి అర్హుడినేనా?

ప్రైవేట్ కౌన్సెలింగ్
పురుషుల సందేహాలకు సమాధానాలు
 
నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది.
నాలుగో నెల  నుంచి ఆరో నెల వరకు సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు.
అయితే ఆ సమయంలో  అసాధారణ భంగిమల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు.

 
నా వయసు 30 ఏళ్లు. పెళ్లి కాలేదు. ఇంతకు మునుపు స్త్రీని చూడగానే విపరీతమైన కోరిక కలిగేది. ఎవరైనా ఆడవాళ్లు యాదృచ్ఛికంగా టచ్ అయినా...  మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. పైగా హస్తప్రయోగం చేసుకుందామన్నా అంగస్తంభన నిలవడం లేదు. ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను పెళ్లికి అర్హుడినేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఎస్.ఆర్.జి. మల్కాజ్‌గిరి

 
ఈమధ్య యుక్తవయసులో ఉన్నవారు 30 వరకు పెళ్లిచేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాతికేళ్లలోపు వారిలో సామాజిక బ్యాధతలు అంతగా తెలియకపోవడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ ఆలోచనలు, అంగస్తంభన ఇవన్నీ కాస్త ఉద్ధృతంగానే ఉంటాయి. ఆ తర్వాత సామాజికపరమైన ఒత్తిళ్ల వల్ల హస్తప్రయోగంలో తృప్తి పూర్తిగా పొందలేకపోవడం వల్ల అంగస్తంభన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం వారి ఫీలింగ్ మాత్రమే.

ఇలాంటి వాళ్లలో చాలామంది ఎలాంటి సమస్య లేకుండా సెక్స్ జీవితాన్ని సజావుగానే కొనసాగించగలరు. మీరు ఆర్జనపరులైతే వెంటనే పెళ్లి చేసుకోండి. ఇక నిద్రలోనూ అంగస్తంభనలు లేకపోవడం, సెక్స్ కోరికలు అసలేమీ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే మీకు యాండ్రాలజిస్ట్ సహాయం అవసరమవుతుంది. అలాంటి లక్షణాలు లేకపోతే మీరు నార్మల్‌గా ఉన్నట్లే. పెళ్లికి పూర్తిగా అర్హులే. నిర్భయంగా ఉండండి.
 
నా వయసు 20 ఏళ్లు. ఈమధ్యే నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మేము ఎప్పటి వరకు సెక్స్‌లో పాల్గొనవచ్చు. గర్భం వచ్చాక కూడా సెక్స్ చేస్తుంటే ఏమైనా ప్రమాదమా?
 - ఎస్.పి.ఆర్., తెనాలి

 
నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు (అంటే మొదటి ట్రైమిస్టర్‌లో)  సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. నాలుగో నెల  నుంచి ఆరో నెల వరకు (రెండో ట్రైమిస్టర్‌లో) సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ సమయంలో  అసాధారణ భంగిమ (అబ్‌నార్మల్ పొజీషన్స్)ల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. అలాగే బలమైన స్ట్రోక్స్ అవాయిడ్ చేయడమే మంచిది. చివరి మూడు నెలల్లోనూ సెక్స్‌ను కాస్త కొంతమేరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది.

అయితే పైపైనే సెక్స్ చేయడం, ఒకరినొకరు సెక్స్‌పరమైన ప్రేరేపణలు చేసుకుని ఆనందించడం వల్ల ప్రమాదం ఉండదు. మీ భార్య ప్రెగ్నెన్సీ సమయంలోనైనా లేదా మామూలు సమయాల్లోనైనా మీ ఇద్దరూ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం.
 
నా వయసు 69 ఏళ్లు. మూత్రం విసర్జనకు చాలా ఎక్కువ సమయం పడుతోంది.  చుక్కలు చుక్కలుగా పడుతోంది.  రాత్రి వేళల్లో చాలాసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య వల్ల సెక్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నాకు షుగర్, బీపీ వంటి జబ్బులు లేవు. నాకు సరైన సలహా ఇవ్వండి.
 - ఎమ్.డి.కే., అనంతపురం

 
సాధారణంగా అరవై ఏళ్ల వయస్సు పైబడ్డవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ గ్రంథి మూత్రాశయానికి, మూత్రనాళానికి మధ్య ఉంటుంది. ఇది పరిమాణం చాలా పెద్దగా పెరగడం వల్ల మూత్రనాళం బ్లాక్ అయిపోయి మీరు చెబుతున్న సమస్య వస్తుంది.

ఇది పెరగడానికి సెక్స్ చేయలేకపోవడానికి సంబంధం లేదు. కాకపోతే మీరు రాత్రిపూట చాలాసార్లు లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయి మీకు సెక్స్ సమస్య వచ్చి ఉండవచ్చు. ఈ ప్రోస్టేట్ సమస్యను మందులతో, టీయూఆర్‌పీ అనే కుట్టు లేని ఆపరేషన్‌తో గాని పరిష్కరించవచ్చు. ఆ తర్వాత మీకు రాత్రిపూట నిద్రబాగా పడుతుంటే మీ సెక్స్ సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ.
 
నా వయసు 29 ఏళ్లు. పురుషాంగం పైనా, వృషణాల మీద చిన్న చిన్న చెమటకాయల్లా వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. సబేషియస్ సిస్ట్స్ అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. శస్త్రచికిత్స తర్వాత ఇవి తగ్గుతాయా? డాక్టర్ నుంచి శస్త్రచికిత్స అన్న మాట విన్నప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. నేను పెళ్లి చేసుకోవచ్చా? భవిష్యత్తులో సంసార జీవితానికి పనికివస్తానా? పిల్లలు పుడతారా?  నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఎస్.కె.ఎస్., జగ్గయ్యపేట
 
సెబేషియస్ సిస్ట్స్ అనేవి వృషణాల మీద ఉన్న చర్మంపై తెల్లటి లేదా పచ్చటి రంగులో వస్తుంటాయి. ఇవి చర్మం పైపొరకు మాత్రమే పరిమితం. ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతూ పోతున్నప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఇలా చేసే చికిత్స ప్రక్రియలో కేవలం చర్మం పైభాగం నుంచి మాత్రమే వాటిని డాక్టర్లు తొలగిస్తారు. వృషణాలకు గానీ... ఇతరత్రా కీలకమైన నరాలకు గానీ ఎలాంటి గాటూ పెట్టడం జరగదు. డాక్టర్‌నుంచి సమాచారం విన్న వెంటనే మీకు అంగస్తంభనలు లేకపోవడం అన్నది కేవలం మీరు మానసికంగా కుంగిపోవడం వల్ల జరిగిందే.

అంతేగానీ వృషణాలకు గాని, అంగస్తంభనలకు గాని, వీర్యం తయారీకి గాని ఈ సర్జరీతో ఏమాత్రం సంబంధం ఉండదు. గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే... కొందరిలో ఇలాంటి సిస్ట్స్ మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అప్పుడు మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగిన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. మీ శస్త్రచికిత్స తర్వాత మీరు మామూలుగానే సెక్స్ చేయవచ్చు. ఈ సమస్యకూ పిల్లలు కలగకపోవడానికీ ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు.
 
నా వయసు 29 ఏళ్లు. నా భార్య వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నా భార్యకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తాయి. ఒక ఏడాది తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే నా భార్యలో ఏ లోపం లేదని చెప్పారు, నాలోనే వీర్యకణాలు తక్కువగా (కేవలం 25 శాతం) ఉన్నాయని మందులు ఇచ్చారు. నెలలో 50 శాతం పెరిగాయని మందులు కంటిన్యూ చేయమన్నారు. నేను ఇలా ఎన్నిరోజులు మందులు వాడాలి? సంతానం కోసం మేము ఏ టైమ్‌లో సెక్స్ చేయాలి?
 - జె.ఆర్.ఆర్., కొత్తగూడెం

 
పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉండే కండిషన్‌ను ఆలిగోస్పెర్మియా అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది వేరికోసిల్. దీన్ని డాప్లర్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ (వృషణాలకు స్కానింగ్)  పరీక్ష ద్వారా కనుగొంటారు. ఈ వేరికోసిల్ (అంటే రక్తనాళాల వాపు) ఉంటే, దానికి సర్జరీ అవసరమవుతుంది.

ఒక వేరికోసిల్ లేకపోతే ప్రధానంగా మందులు వాడితే సరిపోతుంది. ఈ మందుల వల్ల కనీసం స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్/ఎమ్‌ఎల్ దాటితే సాధారణంగా గర్భం (న్యాచురల్ ప్రెగ్నెన్సీ)కి అవకాశం ఉంటుంది. ఇలా 20 మిలియన్ కంటే స్పెర్మ్ కౌంట్ ఉన్నవాళ్లు మిడ్ సైకిల్ అంటే... రుతుస్రావం మొదలైన ఎనిమిదవ రోజు నుంచి 18వ రోజు వరకు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనాలి. అలా ఆర్నెల్లలో పిల్లలు కలగకపోతే ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ ద్వారా ప్రయత్నించవచ్చు.

ఒకవేళ స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్ లేకపోతే కొన్ని హార్మోన్ పరీక్షలు, యాంటీస్పెర్మ్ యాంటీబాడీ పరీక్ష చేసి కొన్నిసార్లు వాటికి మందులతో చికిత్స చేయవచ్చు. మీరు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స చేయించుకుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

- డాక్టర్ వి.చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్,
కెపిహెచ్బి,
హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement