ఆ ప్రభావం ఆడపిల్లల పైనే ఎక్కువ!
న్యూయార్క్: కౌమార దశలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో వారి ప్రేమాభిమానాలకు దూరమై చిన్నారులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఓ పరిశోధన వెల్లడించింది. అంతేకాక వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ముఖ్యంగా ఆడపిల్లలపై ప్రతికూల పరిణామాలు జీవితకాలం పాటు ఉంటాయంది. ఇలా విడిపోయిన కుటుంబాల్లో ఎక్కువ శాతం మగపిల్లల కన్నా ఆడపిల్లల్లోనే మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యంపై చెడు ప్రభావితం చూపిస్తున్నాయని చెబుతోంది. ఆడపిల్లల్లో కౌమారదశ వయస్సు 6 - 10 సంవత్సరాలు అతి ముఖ్యమైన జీవితకాలమని తెలిపింది.
ఆ వయస్సులో ఆడపిల్ల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకురాలు అండ్రియా బెల్లర్ పేర్కొన్నారు. సంప్రదాయ కుటుంబాల్లో కంటే సహజీవనం సాగించే కుటుంబాల్లో పెరిగిన పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని నివేదకలో రుజువైనట్టు బెల్లర్ తెలిపారు. 13 ఏళ్ల పాటు నాలుగు దశలుగా కౌమారదశలో ఉన్న 90 వేల చిన్నారులపై పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించినట్టు జాతీయ కౌమార ఆరోగ్య పరిశోధన సంస్థ (ఏడీడీ హెల్త్) వెల్లడించింది. విడిపోయిన కుటుంబాల్లో కౌమారదశలో ఉన్న ఆడిపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే కోణంలో తమ పరిశోధన ఉద్దేశమని తెలిపింది.