
పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
చికిత్స పొందుతూ శుక్రవారం తల్లి మృతి
ఆదివారం చిన్నారులిద్దరూ కన్నుమూత
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి..
Comments
Please login to add a commentAdd a comment