సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల్లో రక్తహీనత, కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పేదరికం, పోషకాహారలోపం, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. సమస్యను ప్రాథమిక స్థాయిలోనే నివారించేందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నామని బుధవారం శాసనమండలిలో వెల్లడించారు.
‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య పథకం’లో భాగంగా 300 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఓ ఏఎన్‌ఎం, ఫార్మసిస్టు ఉంటారని.. వీరు అన్ని గ్రామాల్లో 18 ఏళ్ల లోపు వయసు వారిని పరీక్షించి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో 60 లక్షల మందిని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 36 లక్షల మందిని పరీక్షించామని వెల్లడించారు. వీరిలో 1.83 లక్షల మందికి ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించగా.. ఎక్కువ మంది రక్తహీనత, నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిం దన్నారు. ఇప్పటికే 28 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామని వివరించారు.
రాష్ట్రంలో జికా లేదు : జికా, ఎబోలా లాంటి ప్రమాదకర వైరస్‌లు రాష్ట్రంలో లేవని మంత్రి వెల్లడించారు. సభ్యుడు సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. వైరస్‌ల ప్రభావం రాష్ట్రంలో లేకున్నా ముందు జాగ్రత్తగా విమానాశ్రయంలో పరీక్ష కేంద్రం, గాంధీ ఆస్పత్రిలో మరో కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment