
ప్రతి పదేళ్లకోమారు మహిళ తన ఆరోగ్యం కోసం ఆ దశాబ్దపు ప్రణాళిక ప్రకారం వెళ్లాలి.
ఇలా చేసుకుంటూ పోవడం వల్ల సుదీర్ఘకాలం పాటు ఆమె ఆరోగ్యం
పదిలంగా ఉంటుంది. మీరు ఏ పదుల పడిలో ఉన్నారో చూసుకోండి.
ఆ ప్రకారం హెల్త్ కోసం జాగ్రత్తలు తీసుకోండి.
ఆమె ఆరోగ్యమే ప్రపంచ భాగ్యం
మహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలపై అవగాహనపెరుగుతోంది. మహిళా దినోత్సవాలలో ‘మహిళల ఆరోగ్యం’ అనేది ప్రధాన అంశంగా మారింది.
ఇరవైలలో...
మున్ముందు ఆరోగ్యాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.
→ మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకేందుకు తగిన వ్యాయామాలు చేయాలి. పాల వంటి క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ మున్ముందు ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
→ శబ్దకాలుష్యం నుంచి మీ చెవులను కాపాడుకోండి. ఎక్కువ శబ్దంతో వినకుండా మీరు రేడియో, టీవీ, మొబైల్... ఏది వింటున్నా వాల్యూమ్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి
→ రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుని దాన్ని క్రమబద్ధం చేసుకోండి
→ ఆటల్లో, వ్యాయామాల్లో గాయాలు కాకుండా చూసుకోండి. ఇవ్వాళ్టి గాయాలు భవిష్యత్తులో గండాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడండి
→ మనం ఏమి తింటున్నామనే విషయంపై దృష్టి సారించండి. ఇవ్వాళ్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే... భవిష్యత్తులో మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులని గుర్తుంచుకోండి
→ వయసు పెరిగేకొద్దీ నిద్ర తగ్గే అవకాశముంది కాబట్టి వీలైనంత వరకు కనీసం తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపొండి.
ముప్ఫైలలో...
ఈ వయసులో కనిపించే కొద్దిపాటి మార్పులపై దృష్టిసారించండి.
→ మీ బరువును గమనించండి. మీరు బరువు పెరుగుతున్నారంటే జీవక్రియలు మందగించాయని అర్థం. మొదట్లో కొద్దిగానే పెరిగినట్లు కనిపిస్తున్నా జీవక్రియలు చురుగ్గా జరిగేలా చూస్తూ వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించండి.
→ చర్మాన్ని రక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. కనీసం 15 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండటం చాలా అవసరం. అది క్యాన్సర్‌తో సహా పలు చర్మ సమస్యలను కాపాడుతుంది
→ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండండి. ఒత్తిడి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు కలుగుతాయి
→ ఈ వయసులోనే క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలూ, మెడికల్ చెక్‌అప్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది
→ ప్రెగ్నెన్సీతో వచ్చే ముప్పులను గుర్తుంచుకోండి. ఎందుకంటే... 35 ఏళ్లు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీలతో బిడ్డకు ఎన్నో రకాలుగా ముప్పు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వయసులో గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే తప్పనిసరిగా ఆబ్‌స్టేట్రీషియన్‌ను సంప్రదించండి.
నలభైలలో...
వయసు తాలూకు సంధి దశ అయిన ఈ ఈడులో కనిపించే మార్పులకు సిద్ధంకండి.
→ మెనోపాజ్‌కు ముందుగా కనిపించే ‘పెరీ–మెనోపాజ్’ మార్పులను గమనిస్తూ ఉండండి. ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గడం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్ల మాదిరిగా వస్తున్నాయా, నిద్ర పట్టడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయా, త్వరగా చిరాకుపడటం వంటి మార్పులు కనిపిస్తుంటే పాప్ స్మియర్ పరీక్షతోపాటు పెల్విస్ పరీక్షలు చేయించుకోండి
→ రొమ్ముక్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్ష మామోగ్రామ్ కూడా చేయించుకోండి
→ తీసుకుంటున్న ఆహారంపై దృష్టి నిలపండి. మీ జీవక్రియల వేగానికి తగినట్లుగా ఆహారం అందేలా... కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటున్నారా అన్న విషయాన్ని గమనించుకోండి ∙కంటి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చాలారకాల కంటి సమస్యలు ఈ వయసులోనే బయటపడతాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ 40లలోనే కళ్లజోడు ధరించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించండి
→ మీ కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే కొలనోస్కోపీకి ΄్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబ ఆరోగ్య చరిత్రలో జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారి లో ఎంత త్వరగా సమస్యను కనుగొంటే అంత ఎక్కువ ప్రయోజనమని తెలుసుకోండి
→ రక్తంలో చక్కెర మోతాదులెలా ఉన్నాయో చూసుకోండి. చాలావరకు 40 ల లోనే టైప్–2 డయాబెటిస్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది చాలామందిలో ఎలాంటి లక్షణాలూ లేకుండానే వచ్చేందుకు అవకాశమున్నందున ఒకసారి మీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.
యాభైలలో...
మీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.
→ మెనోపాజ్ కోసం సిద్ధం కండి. 51 అన్నది చాలామందికి మెనోపాజ్ వచ్చే సగటు వయసు ∙చురుగ్గా ఉండండి. చురుకుదనం తగ్గిపోయే ఈ వయసులో చురుకుదనాన్ని పెంచుకోవడం వల్ల మున్ముందు చాలాకాలం పాటు మరింత ఆరోగ్యంగా ఉండగలరు
→ ఒకసారి మొత్తం దేహానికి సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకోండి. వీలైతే మీ యాభైలనుంచి ప్రతి రెండేళ్లకోమారు అన్ని బేసిక్ హెల్త్ పరీక్షలూ చేయించుకుంటూ ఉండటం మంచిది.
→ ఒకసారి ఈసీజీ తీయించుకోండి. సాధారణంగా గుండెజబ్బులు కనిపించేది ఈ వయసులోనే కాబట్టి ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని, మీకు ఎలాంటి గుండెజబ్బులూ లేవని నిర్ధారణ చేసుకుని ఆనందంగా ఉండండి.
అరవైలలో...
ఈ వయసు... ఆరోగ్యానికి సంబంధించిన మరో దశకు మొదటి మెట్టు.
→ ఆహారంలో మరింత పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వయసులో ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల పెద్దపేగుల్లో కండపెరగడం, ఇతరత్రా పెద్దపేగు సమస్యలను రాకుండా నివారించవచ్చు
→ నడక వంటి వ్యాయామాలు చేయండి. ఈ వయసులో చేసే వ్యాయామాలన్నీ దేహానికి మరింత ఎక్కువ శ్రమ కలిగించనివీ, మరీ తీవ్రమైనవి కాకుండా ఉండేవి అవసరం. వారంలో కనీసం 150 నిమిషాల పాటు దేహానికి మంచి కదలికలు ఉండే వ్యాయామం దొరికేలా చూసుకోండి. దీనివల్ల మీలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కనీసం 15 శాతం తగ్గుతాయి
→ ఈ వయసులో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ, మామోగ్రామ్ పరీక్షలూ చేయించుకోండి. బరువు పెరగకుండా చూసుకోండి. పెరుగుతున్న బరువు క్యాన్సర్‌తో సహా అనేక అనారోగ్యాలకు హేతువని గుర్తుంచుకోండి
→ పెద్ద వయసులో తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ, నిమోనియా వంటివి.
→ పెద్దవయసులో తీసుకోవల్సిన వ్యాక్సినేషన్ల గురించి తెలుసుకుని, వాటిని తీసుకోవడం వల్ల ఆ వయసులో అవి సోకకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు వాటిని తట్టుకునేంత సామర్థ్యం వయసు పైబడ్డాక ఉండకపోవచ్చు.
డెబ్భైలలో...
వయసు పెరగడాన్ని గమనించుకుంటూ... ఆ ఈడుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోండి.
→ ఈ వయసులో బాధలను దరిజేరనివ్వకండి. సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమివ్వండి. మోకాళ్లు అరగడం వంటివి ఈ వయసులో సాధారణంగా కనిపించే సమస్యలు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్స్ వంటివి ఈ వయసులోనే చేయించుకోండి. మరింత వయసు పెరిగితే అంతగా సాధ్యం కాకపోవచ్చు
→ ఈ వయసులో కళ్ల సమస్యలు మామూలే. సాధారణంగా క్యాటరాక్ట్ వంటివి ఈ వయసులో కళ్లకు వచ్చే సమస్యలు. వీలైనంత త్వరగా కాటారాక్ట్ సర్జరీ చేయించుకుని సుదీర్ఘకాలం పాటు మీ కళ్లతో ప్రపంచాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేయండి.
డాక్టర్ కె. ఉషారాణి
సీనియర్ ఫిజీషియన్
ఇలా ప్రతి పదేళ్ల కాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, పది పదుల ఏళ్ల పాటు పదిలంగా ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment