Womens Health
-
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్‌లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్‌గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్‌లో బ్లాక్స్‌తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్‌తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్‌వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్‌ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్‌తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
ఆరోగ్యం ఆమె హక్కు!
ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్ అమెరికన్, కరీబియన్ ఉమెన్ హెల్త్ నెట్వర్క్ 1987లో గ్లోబల్ నెట్వర్క్ (డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్వర్క్ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్వర్క్ ఉద్దేశ్యం.మొదటిది ప్రసూతి ఆరోగ్యంమొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్‌తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. అవగాహనే కీలకంగా! ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది. .ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.మహిళా సాధికారత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. -
ఇది ముందడుగే కానీ...
మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్హెచ్పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్) అని నిర్వచనం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్సారెస్) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్ అడుగులేస్తోందన్న మాట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఎంఎంఆర్ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం. అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందనివారే నేటికీ అనేకం. అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్లే మనకు ఆదర్శం. -
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్‌గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: తోటి మహిళలు ఆరోగ్యం, పరిశుభ్రతపై తమకున్న ఆందోళనలను స్వేచ్ఛగా బయటకు వెళ్లడించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే తన ధ్యేయమని మిస్ యూనివర్స్–2021 కిరీటధారి హర్నాజ్ సంధు(21) చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు రుతుక్రమ సమయంతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తన తల్లి, గైనకాలజిస్ట్ రవీందర్ కౌర్ సంధుయే తనకు ఆదర్శమన్నారు. ‘మహిళలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పుకోగలగాలి. మా వర్గీయుల్లో చాలామంది మహిళలు ఇప్పటికీ తమ శరీరం, ఆరోగ్యం గురించి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి అంశాలపై వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కూడా నయం చేయవచ్చు’అని ఆమె చెప్పారు. పలు పంజాబీ సినిమాల్లో నటించిన హర్నాజ్ సంధు..బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్–2021గా తన ఎంపిక దేశానికే వేడుక వంటిదన్నారు. సాధ్యమైనంత త్వరలో స్వదేశం వచ్చి విజయోత్సవం జరుపుకునేందుకు, తన తల్లిని కౌగలించుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె ఇజ్రాయెల్‌లోని ఐలాత్ నుంచి ఫోన్ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్ యూనివర్స్‌ను సొంతం చేసుకున్న మూడో భారతీయ యువతిగా హర్నాజ్ సోమవారం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ నుంచి ఆమె నేరుగా న్యూయార్క్ వెళతారు. అక్కడ ఆమె మిస్ యూనివర్స్ సంస్థతోపాటు పలు సంస్థలకు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
మేమేం చేయాలి?
∙పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. – కె.వీణ, తిరుపతి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ప్రయత్నం చేయాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. దాని కోసం నడక, యోగా వంటివి పాటించాలి. మితమైన పోషకాహారం తీసుకోవాలి. థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, షుగర్, బీపీ వంటి పరీక్షలు చేసుకుని, సమస్యలు ఏవైనా ఉన్నాయేమో ముందే తెలుసుకోవాలి. సమస్యలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకుని, వాటిని అదుపులో ఉంచుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఫిట్స్, కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఇతరత్రా సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వాటికి డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మందులలో మార్పులు ఉంటే చేసుకుని గర్భం కోసం ప్రయత్నం చెయ్యడం మంచిది. రుబెల్లా పరీక్ష చేయించుకుని, రుబెల్లా యాంటీబాడీస్ నెగటివ్ వస్తే, రుబెల్లా వ్యాక్సిన్ తీసుకుని నెల తర్వాత గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడాలి. సిగరెట్, మద్యపానం అలవాటుంటే మానేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవాలి. కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకుని, అవసరమైతే దంపతులిద్దరూ రక్తపరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే దానికి మాత్రలు వేసుకుని, అదుపులోకి వచ్చిన తర్వాత గర్భం కోసం ప్లాన్ చెయ్యడం మంచిది. ∙నా వయసు 29 సంవత్సరాలు. మర్మాగంపై పుండు ఏర్పడింది. సిఫిలిస్ అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏమిటి? – యన్ఎన్, విజయనగరం సిఫిలిస్ అనేది ‘ట్రిపోనిమా ప్యాలిడమ్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే లైంగిక వ్యాధి. దీనిలో మొదటగా జననేంద్రియాల దగ్గర, నోట్లోను, మలద్వారం దగ్గర నొప్పిలేని చిన్నపుండులాగ ఏర్పడుతుంది. అవి వాటంతట అవే తగ్గిపోతాయి. కాని, తర్వాత ఈ పుండ్లు దశల వారీగా శరీరమంతా పాకుతాయి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది నరాలకు, గుండెకు, కాలేయానికి, కీళ్లకు, ఎముకలకు, రక్తనాళాలకు పాకి వాటిని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే ఈ బ్యాక్టీరియా జీవితకాలం శరీరంలోనే ఉండిపోతుంది. గర్భవతులలో తల్లి నుంచి బిడ్డకు పాకి అబార్షన్లు, కడుపులోనే శిశువు చనిపోవడం, పుట్టిన పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిర్ధారణ కోసం వీడీఆర్ఎల్, ఆర్పీఆర్ వంటి రక్తపరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ తర్వాత పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో బ్యాక్టీరియా నశించిపోతుంది. కాని,దాని వల్ల ముందుగా అవయవాలపై ఏర్పడిన దుష్ప్రభావాన్ని తిరిగి తగ్గించడం జరగదు. నివారణ మార్గాలలో అనేక లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. కండోమ్స్ వాడుకోవాలి. చికిత్స ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ∙నాకు కొత్తగా పెళ్లయింది. ‘వెజైనిస్మస్’ సమస్యతో బాధ పడుతున్నాను. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని ఒకరంటే, తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలనుంటున్నారు మరొకరు. ఏది నిజం? చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలరు. – ఆర్వి, హైదరాబాద్ యోని భాగంలోని కండరాలు కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోవడాన్ని వెజైనిస్మస్ అంటారు. ఇది కలయిక సమయంలో కావచ్చు. పెల్విక్ పరీక్ష చేసేటప్పుడు కావచ్చు. దాని వల్ల ఆ సమయంలో బాగా నొప్పిగా ఉండటం, కలయికకు, పరీక్షకు సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరిలో నొప్పి ఉంటుందనే భయంతో, గర్భం వస్తుందనే భయంతో ఆందోళన, మానసిక సమస్యలు, జననేంద్రియాల దగ్గర దెబ్బలు, ఆపరేషన్లు, ఏవైనా లైంగిక సమస్యలు, బాల్యంలో కొన్ని సంఘటనలు చూడటం, చదవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కారణం తెలుసుకోవడానికి వారితో విడిగా మాట్లాడటం, కౌన్సెలింగ్ చెయ్యడం, మెల్లగా యోని భాగం దగ్గర పరీక్ష చేయడం వంటివి అవసరం. తర్వాత సమస్యను విశ్లేషించి, కౌన్సెలింగ్ చెయ్యడం వల్ల చాలామందిలో సమస్య తగ్గుతుంది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే చికిత్స తీసుకోవడం, పెల్విక్ కండరాల వ్యాయామాలు, మానసిక ఒత్తిడి తగ్గడానికి నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం, యోని భాగంలో లూబ్రికేషన్ జెల్ వాడటం, లేదా డైలేటర్స్ వాడటం, భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ ఓపికగా కలయికకు ప్రయత్నం చేయడం వల్ల చాలామందిలో మార్పు ఉంటుంది. అరుదుగా కొద్ది మందిలో ఎలాంటి మార్పు లేనప్పుడు చిన్నగా కోసి కండరాలను వదులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బోటిలినమ్ టాక్సిన్ (బోటాక్స్) అనే ఇంజెక్షన్ నేరుగా యోని కండరాలకు ఇవ్వడం వల్ల యోని కండరాలు వదులయ్యి వెజైనిస్మస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
పొలం పనికి ఎండ దెబ్బ!
ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా. ► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ. ► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి. ► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది. ► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. ► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది. ► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది. ► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది. ► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. ► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. -
శ్రద్ధహీనత
ఐరనీ ఈ వార్త వింటే మన ముఖాలు పాలిపోతాయి. నిజమే... సమాజంలో స్త్రీ ఇంకా సెకండరీ సిటిజన్‌గానే ఉందా అని రక్తం ఇంకిపోయిన ముఖాలతో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది! మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరికీ అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతాయనేది వాస్తవం. ఒక్కరోజు ఆమె నిస్సత్తువగా మంచం మీద పడుకుంటే ఇక ఆ రోజుకి ఆ ఇంట్లో ఎవరికీ ఏదీ సమయానికి అందదు. కడుపు నిండా అన్నం ఉండదు. అలాంటి స్థితిలో కూడా మహిళ ఆరోగ్యం ఎవరికీ పట్టదా?! ఇంకా ముఖ్యంగా బిడ్డలను కనాల్సిన మహిళ మరింత ఆరోగ్యంగా ఉండాలి. ఎంతగా అంటే... తన దేహం తగినంత పోషకవిలువలతో ఉంటూ మరో ప్రాణికి జీవం పోయగలిగినంత ఆరోగ్యంగా ఉండాలి. సరిగ్గా ఇక్కడే కుటుంబాలలో విపరీతమైన అలసత్వం కరడుగట్టుకుని ఉంది. ఇక్కడే ముఖం పాలిపోయేటంతటి రక్తహీనత గూడుగట్టుకుని ఉంది. మనదేశంలో దాదాపుగా యాభై శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అది కూడా పిల్లల్ని కనాల్సిన వయసులో ఉన్న వారే. ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు మహిళ రక్తహీనతతో బాధపడుతుందంటే దేశం ఆరోగ్యంగా ఉందని ఎలా చెప్పగలం? ఇటీవలి ఓ అధ్యయనంలో భారతీయ మహిళల రక్తహీనత బయటపడింది. ముఖ్యంగా పిల్లల్ని కనే వయసులో ఉన్న మహిళలలో దాదాపుగా యాభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. నిజానికి ఇది రక్తహీనత కాదు. మన శ్రద్ధ హీనత. రోజుకో పండైనా తినమని ఆమెకు చెప్పడానికి ఇంట్లో ఒకరు ఉండాలి. ‘ఇల్లు... ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి’... ఈ నినాదాన్ని ఒంటబట్టించుకుంటే మహిళ ఒంటికి కొంచెం రక్తం పడుతుందేమో! -
చిన్న తప్పులతో పెద్ద తిప్పలు!
ఉమెన్స్ హెల్త్ ‘నొప్పి అనివార్యం. కానీ బాధపడుతూనే ఉండాలా అన్నది మన చేతుల్లో, చేతల్లో ఉంది!’ ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఆలోచింపజేసే మాట ఇది. నిజం చెప్పాలంటే, ఇవాళ మన దేశంలో చాలామంది మహిళలం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ, ఇంటి పని, కుటుంబం బాగోగులలో మునిగి తేలుతున్నాం. బాధను అనుభవిస్తూ ఉండిపోతున్నామే తప్ప, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే, చాలా చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం కూడా మన గృహలక్ష్ముల ఆరోగ్యానికి ఇబ్బందిగా మారుతోంది. తెలిసి తెలిసీ... మనమందరం తరచూ చేసే కొన్ని తప్పల్ని, నివారిస్తే రానున్న 2017 ఆనందంగానే కాదు... ఆరోగ్యంగానూ ఉంటుంది. నివారించాల్సిన ఆ తప్పులు ఏమిటంటే... తగినంత మంచినీళ్ళు తాగకపోవడం! ఏ ఇల్లాలినైనా కదిలించి చూడండి... రోజూ ఏడెనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలని తెలుసు. కానీ, చాలామంది మహిళలం ఆ నియమాన్ని పాటించం. చిన్న విషయంలా కనిపించినా, ఇది చాలా పెద్ద తప్పు. మంచి నీళ్ళు తక్కువగా తాగడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గి, బలహీనంగా అనిపిస్తుంది. అదే సమయంలో, దీని వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అలాగే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు.టి.ఐ) రావచ్చు. కాబట్టి, మహిళలందరం రోజు వారీ ఆహారంలో భాగంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే, వీలైనంత ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. భోజనం చేయకపోవడం! పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పనిలో మునిగితేలడంతో గృహిణుల్లో చాలామందిమి సరిగ్గా తిండి తినం. పొద్దున్న తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌కి మంగళం పాడేస్తుంటాం. అదేమంటే, కాస్తంత భారీగా మధ్యాహ్నం భోజనం లాగించవచ్చని అనుకుంటాం. కొన్నిసార్లు పనిలో లంచ్ మానేసి, కడుపు నిండా రాత్రి భోజనం చేయచ్చని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా కరెక్ట్ కాదు. భోజనం మానేయడం వల్ల బాడీ మెటబాలిజమ్ నెమ్మదిస్తుంది. దాని వల్ల అతిగా తింటాం. ఫలితంగా బరువు పెరుగుతుంది. తద్వారా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు సరేసరి. కాబట్టి, ఎంత పనిలో ఉన్నా సరే వేళకు తినడం మానకూడదు. వీలైనంత వరకు పండ్లు, కాయగూరలు, బీన్స్, మొలకెత్తిన విత్తనాలు కూడా తింటూ ఉంటే మెటబాలిజమ్ బాగుంటుంది. తగినంత నిద్ర పోకపోవడం! మన దేశంలోని గృహిణుల్లో చాలామందికి కనీసం సరైన నిద్ర కూడా కరవే! రకరకాల ఇంటి పనులు, బాధ్యతలతో కలత నిద్రతో సరిపుచ్చుకుంటున్నాం. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా, పెద్దగా వయసు లేకుండానే ముసలితనం లక్షణాలు వచ్చేస్తున్నాయి. తొందరగా మీద పడే ఈ వార్ధక్యాన్ని తప్పించుకోవాలంటే, ఆడవాళ్ళమే కాదు... మగవాళ్ళు కూడా రోజూ ఏడు గంటల పాటు సుఖంగా నిద్ర పోవాలి. క్యాల్షియమ్ తీసుకోకపోవడం! మనం రోజూ తినే ఆహారంలో తగినంత క్యాల్షియమ్ ఉండాలి. లేదంటే, చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారి, ఆస్టియో పోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో పిల్లలకు రోజూ పాలు, పండ్లు పెట్టే మహిళలం మనం కూడా తప్పనిసరిగా పాలు తాగాలి. క్యాల్షియమ్ ఉంటుంది కాబట్టి, పాల ఉత్పత్తులు తీసుకోవడం మానేయకూడదు. 35 ఏళ్ళు దాటాయంటే, గృహిణులందరూ క్యాల్షియమ్ తీసుకోవాల్సిందే! మనం చేసే ఈ చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే కదా... కుటుంబ ఆరోగ్యం బాగుండేది! కొత్త ఏడాది 2017 నుంచి అయినా ఇవన్నీ పాటిద్దాం. – ప్రణతి తగినన్ని ప్రొటీన్లు తీసుకోకపోవడం! ఇవాళ చాలా మంది ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువుండడం చూస్తుంటాం. దీనికి సర్వసాధారణమైన కారణం ఏమిటంటే – తీసుకోవాల్సినంతగా ప్రొటీన్లు తీసుకోకపోవడం! సన్నగా ఉండాలనో, బరువు తగ్గాలనో ఆదుర్దాలో ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవడం మానేస్తుంటాం. దీని వల్ల కండరాలు క్షీణించి, మరింత బరువెక్కుతాం. పైగా, ప్రొటీన్లు తినకపోతే, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బ్లడ్ షుగర్ ఉన్నట్టుండి పెరుగుతుంది. రోజంతా మరింత ఆకలి వేస్తుంది. కాబట్టి, తినే ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తపడాలి. -
స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!
వాషింగ్టన్: సాధారణంగా పొగతాగేవారు(స్మోకర్స్) ఊపిరితిత్తుల కేన్సర్ భారిన పడతారని వింటూనే ఉంటాం. తాజాగా స్మోకింగ్ సంబంధిత అంశాలపై జరిపిన ఓ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ పై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేపట్టిన సర్వేలో మహిళలకే అధికంగా ముప్పు పొంచి ఉంటుందని వెల్లడైంది. స్మోకింగ్ చేయని 50-60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల 129535 శాంపిల్స్ పై రీసెర్చ్ చేశారు. ఇందులో 8674 ఆఫ్రికన్ మహిళలు, 2708 ఆఫ్రికన్ పురుషుల శాంపిల్స్, 80 వేల మంది అమెరికా మహిళలు, 37 వేల మంది పరుషుల శాంపిల్స్ పై టొరంటో వర్సిటీకి చెందిన రేచల్ చిషోల్మ్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. స్మోకింగ్ చేయని ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో 5.2 శాతం మందికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వస్తుండగా, స్మోక్ చేయని మగవారిలో మాత్రం 2.9 శాతం మందికి ఈ వ్యాధి వస్తుందని రీసెర్చ్ లో తేలింది. ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేయని పురుషులు తమ పక్కన ఉన్న స్మోకర్స్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్లుగా ఉన్నా.. వారిలో మాత్రం ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం మహిళల కంటే చాలా తక్కువగా ఉందని రీసెర్చర్ చిషోల్మర్ వివరించారు. -
ఈ మహిళా మణులు... సేవామూర్తులు
వైద్య రంగంలో రాణిస్తూ.....మహిళల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవకాశాలను అందిపుచ్చుకోగల నైపుణ్యం, క్లిష్టపరిస్థితులను దాటుకుంటూ విజయాల వైపు సాగిపోగల ఆత్మస్థైర్యం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి కష్టాలనైనా తట్టుకోగల ఓర్పు, తన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న సేవాతత్పరత ఇవన్నీ కలగలిసిన రూపమే నేటి తరం మహిళా మణులు. ఒక గృహిణిగా తన ఇంటిని, ఇంట్లో వాళ్లను తీర్చిదిద్దడమే కాదు సమాజంలో ఓ వ్యక్తిగా, ఓ శక్తిగా అవసరాల్లో ఉన్న వాళ్లకు తన వంతు సాయాన్ని అందించడం కూడా ఇప్పటి మహిళ జీవన విధానంలో భాగమే. ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపుతున్నారు నగరానికి చెందిన కొందరు మహిళలు. వైద్య వృత్తిలో కొనసాగుతూ, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిలో కొందరిని పలకరించినప్పుడు తమ ఆశయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు. - సాక్షి, బెంగళూరు సమాజ సేవ ప్రవృత్తిగా...... ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో గంటకు లక్షల రుపాయల్లో ఫీజులు వసూలు చేసేవారూ ఉన్నారు. అయితే దేవికా గుణశీల ఇందుకు కొంత భిన్నమని చెప్పవచ్చు. గైనకాలజిస్టుగా మంచి పేరు గడించిన ఆమె ఁగుణశీల ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ కాన్సర్ అండ్ ఫర్టిలిటీ* స్వచ్ఛంద సంస్థను స్థాపించి సంతాన వైఫల్యంతో బాధపడుతున్న వారికి శాస్త్రీయ పద్దతుల్లో బిడ్డలు కలిగేలా చేస్తున్నారు. క్యాన్సర్‌కు గురైన మహిళలు, పురుషులు చికిత్స తీసుకునే సమయంలో పునరుత్పాధక శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో గర్భశ్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి సంబందించి అండాలు, పిండం, కోర్టికల్ టిష్యూస్ -196 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద నిల్వ చేసి చికిత్స తర్వాత తిరిగి గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా వారికి సంతానం కలిగించవచ్చు. అదేవిధంగా పురుషుల్లోని వీర్యకణాలను కూడా నిల్వ చేయవచ్చు. వైద్య పరిభాషల్లో ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్ మెథడ్‌గా పిలువబడే ఈ విధానానికి దాదాపు రూ.1.50 లక్షల రుపాయలు ఖర్చవుతుంది. అయితే గుణశీల ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ కాన్సర్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్ విధానాన్ని అందిస్తున్నారు. వివరాలకు 080-41312600,080-26673585లో సంప్రదించవచ్చు. గత రెండేళ్లలో 19 మందికి ఈ విధానం ద్వారా సంతానం కలిగింది. మహిళాదినోత్సవం సందర్భంగా దేవికా గుణశీల ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి నాలో ఉన్న సేవాగుణమే నేను స్వచ్ఛంద సంస్థ స్థాపించడానికి కారణమైంది. ఇప్పటి వరకూ నాకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది. అందులో కొంతైనా నేను తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలు సంబంధిత ధ్రువపత్రాలతో సంప్రదిస్తే వారికి ఉచితంగా ఓవరీన్ టిష్యూ ఫ్రీజింగ్‌ను అందిస్తాం’ అని అన్నారు. పీపుల్ ట్రీ ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు ప్రస్తుతం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది చిన్నారుల్లో పౌష్టికాహార లోపం. పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో తల్లిదండ్రులకు తెలియక పోవడంతో కొంతమంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే, తల్లిదండ్రుల పేదరికం కారణంగా మరికొందరు చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు ‘బలమైన’ రేపటి తరాన్ని దేశానికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నగరానికి చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ సుప్రజా చంద్రశేఖర్. బెంగళూరు నగరంలో పుట్టి పెరిగిన సుప్రజా చంద్రశేఖర్ ఇక్కడి బెంగళూరు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, యూకేలో పీడియాట్రిక్స్ పూర్తి చేశారు. అనంతరం నగరంలోని కొన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యురాలిగా విధులు నిర్వర్తించారు సుప్రజా. ఆ సమయంలోనే ఎంతో మంది చిన్నారులు పోషకాహార లోపం కారణంగా వృుత్యుఒడికి చేరడం ఆమె కళ్లారా చూశారు. అందుకే ‘చైల్డ్ సేఫ్టీ-చైల్డ్ న్యూట్రీషియన్’ అనే అంశాలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో పాటు పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందించేందుకు గాను ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ద్వారా నగరంలోని మురికి వాడల్లో ఇంటింటికీ తిరుగుతూ చిన్నారుల్లో పౌష్టికాహార ఆవశ్యకత పై అవగాహన కల్పిస్తున్నారు. ఇక భర్త డాక్టర్ చంద్రశేఖర్ చిక్కమునియప్ప సహకారంతో ఇటీవలే పీపుల్ ట్రీ పేరిట ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. పౌష్టికాహార లోపంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న పేద చిన్నారులకు ఈ ఆస్పత్రిలో ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఆరోగ్యప్రదమైన జీవనం కోసం మహిళా చైతన్యం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఎంతోమంది మారుమూల పల్లెటూళ్లలోని మహిళలు ఆరోగ్యప్రదమైన జీవనానికి కూడా నోచుకోవడం లేదు. అటువంటి వారందరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి శ్రమిస్తున్నారు డాక్టర్ గీతాంజలి. మంగళూరుకు చెందిన గీతాంజలి బెంగళూరు యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్ సర్జరీ(బీఏఎంఎస్) పూర్తిచేసి 20 ఏళ్లుగా వైద్యరంగంలో తన సేవలందిస్తున్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి నగరంలోని అనేక స్వచ్చంద సంస్ధలతో కలిసి ‘ఫ్రీ మెడికల్ క్యాంపైన్’కూడా నిర్వహించారు. ‘మారుమూల పల్లెల్లో నివసించే మహిళల్లో ఇప్పటికీ ఆరోగ్యకరమైన జీవనవిధానంపై అవగాహన లేదు. ఇంటిని చక్కదిద్దాల్సిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నపుడు మాత్రమే ఆ కుటుంబాలు వాటితో పాటు సమాజం ఆరోగ్యంగా ఎదగడానికి వీలవుతుంది. ఇక మెట్రోలోని మహిళల్లో ప్రస్తుత పరిస్ధితుల్లోని అనేక మానసిక ఒత్తిళ్లు, లేట్ప్రెగ్నెన్సీ, బబేసిటీ వంటివి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణమవుతున్నాయి. క్యాన్సర్‌ని మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయించినపుడు మాత్రమే వారిని కాపాడడానికి వీలవుతుంది. అందుకే నగరంలోని స్వచ్చంద సంస్ధలతో కలిసి బ్రెస్ట్‌క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ గీతాంజలి. -
జబ్బుల్లోనూ మహిళలే టాప్..
మధుమేహం, ఊబకాయంలో వారే ఎక్కువ తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్లే సమస్యలు సిటీబ్యూరో: మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వెరసి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పురుషుల్లో ఎక్కువగా కన్పించే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్, ఎండోక్రైనాలజీ అండ్ యాడిపాసిటీ (ఒబెసిటీ), ఆస్లర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హోటల్ తాజ్ డెక్కన్‌లో మధుమేహం, ఊబకాయం, ఎండోక్రైనాలజీపై సదస్సు నిర్వహించారు. దీనిని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 200 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొని ప్రసంగించారు. ప్రతి పది మందిలో ఒకరు మధుమేహం, అధిక బరువు, థైరాయిడ్, గుండె జబ్బుల్లో ఏదో ఒక దానితో బాధపడుతున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మధుమేహం దేశ మధుమేహ రాజధాని హైదరాబాద్‌గా చెప్పుకునే వాళ్లం. కానీ హైదరాబాద్ కన్నా అత్యధికంగా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో మధుమేహులు ఎక్కువ ఉన్నట్టు తేలింది. నగరంలో పదేళ్లలోపు ఏడువేల మంది చిన్నారులు మధుమేహంతో బాధపడుతుంటే, వీరిలో 3000 పైగా మంది నెలవారి ఇన్సులిన్ ఖర్చులకు నోచుకోలేని దుస్థితిలో ఉన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, ముడి బియ్యం వంటకాలు తినడం ఉత్తమం. - డాక్టర్ పీవీరావు, నిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం పొట్టపై కొవ్వు ప్రమాదం భారతీయుల్లో పొట్ట, మూత్రపిండాలు, కాలేయం, గుండె, కిడ్నీల చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు చాలా ప్రమాదం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. పరోక్షంగా ఇది గుండె, మోకాళ్లు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మిత ఆహారం, విధిగా వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. - డాక్టర్ శ్యామ్ కల్వలపల్లి, ఐడియా సెంటర్ ఆరోగ్య స్పృహ పెరగాలి యూకేలో 5 శాతం మంది మధుమేహంతో బాధపడుతుంటే, భారతదేశంలో మాత్రం 15 శాతం మంది మధుమేహులు ఉన్నారు. సెలైంట్ కిల్లర్‌గా చెప్పుకునే ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై ఎవరికి వారు నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - డాక్టర్ జెఫ్రీ స్టీఫెన్, లండన్ -
సెల్ఫ్ చెక్
ముప్ఫై ఏళ్లు దాటాయంటే మహిళ ఆరోగ్యంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. పెరుగుతున్న బాధ్యతల కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వయసు కూడా అదే కావడంతో శరీరం పట్టుతప్పడం మొదలవుతుంది. ముప్ఫై నుంచి నలభై ఏళ్ల వయసులో ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యాలను తెచ్చిపెట్టుకున్నవారవుతారు. ఇంతకీ మీరెలా ఉన్నారో తెలుసుకోండి. 1. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత బరువు పెరగడం గమనించి ఆ సమస్యను అధిగమించడానికి వాకింగ్, యోగవంటివి చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. అన్ని వయసుల్లోనూ ఆహారం ఒకేలా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి బీపీ, షుగర్లకు చెక్ పెట్టే ఆహారాన్ని మాత్రమే తింటున్నారు. అప్పుడప్పుడు మసాలాతో నిండిన ఆహారం తిన్నా వెంటనే దానికి విరుగుడుగా పళ్లు వంటివి తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3.చర్మంలో తేమ తగ్గకుండా ఉండడానికి సౌందర్య పోషకాలతో పాటు దానికి తగ్గట్లు ఆహారపుటలవాట్లను కూడా మార్చుకుంటారు. రసాయనిక ఉత్పత్తులను వాడకుండా వీలైనంతవరకూ ప్రకృతిసిద్ధమైనవాటినే ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 4. తల్లితండ్రులు బీపీ, షుగర్ రోగులైనప్ప టికీ, మీకు 30 ఏళ్లు దాటినా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోరు. ఒకవేళ అలాంటి జబ్బులొస్తే ‘వంశపారంపర్యంగా వచ్చినదానికి మనమేం చేస్తామని’ డిప్రెషన్లో మునిగిపోయి, ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తారు. ఎ. కాదు బి. అవును 5. కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా రోజులో కొంత సమయమైనా ప్రశాంతంగా గడపడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ జవాబుల్లో ‘ఎ’లు ఎక్కువగా వస్తే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు. లేకపోతే కొత్త జబ్బులు కొనితెచ్చుకుంటున్నట్లు.