ఇది ముందడుగే కానీ... | Maternal mortality rate has decreased compared to past in India | Sakshi
Sakshi News home page

ఇది ముందడుగే కానీ...

Published Wed, Dec 7 2022 2:39 AM | Last Updated on Wed, Dec 7 2022 2:39 AM

Maternal mortality rate has decreased compared to past in India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్‌ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్‌ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్‌ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. 

గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్‌) అని నిర్వచనం. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్సారెస్‌) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్‌ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్‌ అడుగులేస్తోందన్న మాట. 

ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్‌ (45), తమిళనాడు (54), జార్ఖండ్‌ (56), గుజరాత్‌ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి.

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. 

నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్‌ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్‌ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి.

ఎంఎంఆర్‌ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్‌ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. 

అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం.

అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్‌ఓఎస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. 

మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్‌’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ అందనివారే నేటికీ అనేకం. 

అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్‌ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్‌లే మనకు ఆదర్శం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement