Maternal deaths
-
దేశానికే దిక్సూచి ‘మిడ్వైఫరీ’
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ (ప్రసూతి సహాయకులు) వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అను బంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచి, దిక్సూచిగా మారిందని అభినందించింది. ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రి చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి యూనిసెఫ్ ట్వీట్ చేసింది. తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థపై యూనిసెఫ్ ప్రశంసల పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందనడానికి ఇది మరొక నిదర్శనం అని ట్వీట్ చేశారు. తగ్గిన మాతృ మరణాలు మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృత్వపు మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్య,ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్న మాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు తగ్గుదల నమోదైందని వెల్లడించింది. దీని ఫలితంగానే యూనిసెఫ్ మిడ్వైఫరీ వ్యవస్థను ప్రశంసించిందని పేర్కొంది. -
ఇది ముందడుగే కానీ...
మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్హెచ్పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్) అని నిర్వచనం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్సారెస్) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్ అడుగులేస్తోందన్న మాట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఎంఎంఆర్ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం. అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందనివారే నేటికీ అనేకం. అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్లే మనకు ఆదర్శం. -
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
తగ్గుతున్న మాతృ మరణాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మాతృ మరణాలు (ప్రసవ సమయంలో తల్లుల మృతి) గణనీయంగా తగ్గుతున్నాయి. సహస్రాబ్ధి లక్ష్యాల్లో భాగంగా జాతీయ స్థాయిలో లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్యను 70కి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజాగా ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) స్పెషల్ బులెటిన్‌లో జాతీయ సగటున ప్రతి లక్ష ప్రసవాలకు 113 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. అయితే జాతీయ సగటు కంటే చాలా రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ భారీగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. 2016–18కి గానూ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో లక్ష ప్రసవాలకు ఏపీలో 65 మాతృ మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడైంది. మాతృ మరణాలకు ప్రధాన కారణాలు ఇవే.. ► ప్రసవానంతరం అధిక రక్తస్రావంతో 38 శాతం మంది.. ► సెప్సిస్ (ప్రసవ సమయంలో విషపూరితం కావడం) కారణంగా ► శాతం మంది.. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) వల్ల 5 శాతం మంది.. ► అబార్షన్లు జరగడం వల్ల 8 శాతం మంది.. ► రకరకాల గర్భకోశ వ్యాధుల వల్ల 5గురు.. ► ఇతర కారణాల వల్ల 34 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏపీలో తల్లులకు భరోసా ఇలా.. ► ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైరిస్కు గర్భిణులను గుర్తించి, ప్రత్యేకంగా ఓ ఆశ కార్యకర్త లేదా ఒక ఏఎన్ఎంను నియమించడం ► ప్రతి పీహెచ్‌సీలోనూ సేఫ్ డెలివరీ కేలండర్ ఏర్పాటు చేయడం. ఆరు రోజుల ముందే వారిని ఆస్పత్రిలో చేర్పించడం ► 108 డ్రైవరు నంబరు ఆమెకు ఇవ్వడం..డ్రైవరుకు గర్భిణి నంబరు ఇచ్చి ఫోన్ చేసి మరీ తీసుకురావడం ► ఎంఎస్ఎస్ యాప్ ద్వారా ప్రతి పీహెచ్సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖప్రసవాలు అయ్యేలా చేయడం ► ప్రతి 15 రోజులకు ఒకసారి మాతృ మరణాలపై కలెక్టర్ల స్థాయి సమీక్ష నిర్వహించడం గణనీయంగా తగ్గించేందుకు కృషి ఆంధ్రప్రదేశ్‌లో మాతృ మరణాలను 74 నుంచి 65కు తగ్గించాం. ఈ సంఖ్య మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మాతృ మరణాలు తగ్గడం మంచి పరిణామం. – డా. గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
‘అమ్మ’కు హైబీపీ శాపం
సాక్షి, హైదరాబాద్: ప్రసవ సమయంలో బీపీ పెరగటం కారణంగానే మాతృత్వపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన మాతృత్వపు మరణాలను ఆ శాఖ విశ్లేషించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో 313 మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక వివరించింది. అందులో బోధనాసుపత్రుల్లో 120 మంది, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 28 మంది, ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోని ఆసుపత్రిలో ఒకరు, ఇంటి వద్ద జరిగిన ప్రసవాల్లో 31 మంది, ప్రయాణ సమయాల్లో 39, ఇతరత్రా కారణాలతో 12 మంది మరణించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 82 మంది మృతిచెందారు. పెద్దాసుపత్రుల్లో పరిశీలిస్తే అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 49 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 21 మంది, వరంగల్ ఎంజీఎంలో 12 మంది చనిపోయారు. మరణాల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 58 మంది చనిపోగా, ప్రసవ సమయంలో 63 మంది చనిపోయారు. ప్రసవమయ్యాక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 124 మంది చనిపోవడం గమనార్హం. ఇక 7 నుంచి 42 రోజుల వ్యవధిలో 68 మంది చనిపోయారు. బీపీ, రక్తస్రావం, షుగర్లతో.. మాతృత్వపు మరణాలకు గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ప్రసవ సమయంలో బీపీ పెరగడం, దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికంగా 81 మంది చనిపోవడం గమనార్హం. ఆ తర్వాత రక్తస్రావంతో 55 మంది చనిపోయారు. మధుమేహం తదితర కారణాలతో 45 మంది చనిపోయారు. ఇన్ఫెక్షన్లతో 44 మంది చనిపోయారు. గుండె సంబంధిత జబ్బుల కారణంగా 40 మంది మృతిచెందారు. తెలియని కారణాలతో 27 మంది, రక్తహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులపైన ప్రభావం చూపడం, సిజేరియన్ వికటించడం వంటి తదితర కారణాలతో మిగతా వారు మృతి చెందారు. హైదరాబాద్‌లో అత్యధిక మరణాలు... ఈ ఏడు నెలల కాలంలో జరిగిన మరణాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే సంభవించాయి. నగరంలోనే 32 మంది చనిపోయారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 18 మంది, రంగారెడ్డి జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 16 మంది చొప్పున మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ఈ మాతృత్వపు మరణాల్లో బోధనాసుపత్రుల పరిధిలోనే 38 శాతం సంభవించాయి. ఇక ఇటీవల కేంద్రం విడుదల చేసిన 2015–17 ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షకు 76 మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సంఖ్య 2001–03లో ఏకంగా 195 ఉండటం గమనార్హం. -
11 సెకన్లకో ప్రాణం బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అంతరాలు పెరుగుతున్నాయా? కొన్నిదేశాల్లో గర్భిణులు, నవజాతశిశు మరణాలు గణనీయంగా తగ్గుతుంటే, మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందా? అంటే ఐక్యరాజ్యసమితి(ఐరాస) అవుననే జవాబిస్తోంది. సరైన వైద్య సౌకర్యాలు, పరిశుభ్రతలేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఓ గర్భిణి–బాలింత లేదా నవజాతశిశువు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. అందుబాటులో మెరుగైన వైద్యం, మందులు, పరిశుభ్రత, పోషకాహారంతో ఈ మరణాలను నివారించవచ్చని వెల్లడించింది. అధికాదాయం ఉన్న ధనికదేశాల్లో స్త్రీ, శిశు మరణాలు తగ్గుతుంటే, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు. ► గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ► ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ► ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు. ► పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు. ► ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు. ► ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ. ► ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం. ► 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్‌లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే. ► ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు. ► అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు. -
ఎపుడో అపుడు... ఎవరో ఒకరు
మన్యానికి ఏమైంది. బిడ్డ, లేదంటే తల్లి. వీరెవరూ కాకుంటే ఆ ఇంట్లో ఇంకెవరో. మృత్యు కౌగిట్లోకి వెళ్లాల్సిందే. వైద్యం అందక కొందరు, వైద్యం అందినా పౌష్టికాహార లేమి...రక్త హీనతతో చావుకేక పెడుతున్నారు. ఆ చావు ఎందుకు వచ్చిందో తెలియదు ... వచ్చిన రోగానికి కారణమేమిటో తెలియదు...రోగ నిర్ధారణ కాకుండానే వందలాది మంది కన్నుమూస్తున్నారు. తల్లి మొహం చూడని పసిగుడ్డులు, తల్లి ప్రసవ వేదన తీరకముందే ప్రాణాలు పోతున్న పసికందులతో ఆ గూడేల్లో విషాదం అలుముకుంటోంది. ఎన్నాళ్లిలా...ఎన్నేళ్లిలా అంటూ ఆ గుండెలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఎటపాక, అడ్డతీగల మండలాల్లో ఓ బాలుడు, యువతి కన్నుమూశారు. నెల్లిపాక (తూర్పుగోదావరి) : ఎటపాక మండలంలో బుధవారం రెండు నెలల బాబు మృతి చెందాడు. విస్సాపురం గ్రామ పంచాయతీ గౌరిదేవి పేట పీహెచ్సీ పరిధిలోని వలస ఆదివాసీ గ్రామం జగ్గారంలో రవ్వా మంగయ్య, పొజ్జమ్మ దంపతుల నాలుగో సంతానంగా మగ బిడ్డ గౌరిదేవి పేట పీహెచ్సీలో జన్మించింది. తగిన పోషకాహారం లేకపోవడంతో ఆ శిశువు అనారోగ్యంతో బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలుస్తుంది. ఎటువంటి అనారోగ్యం లేకుండానే హఠాత్తుగా బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వలస ఆదివాసీలకు వ్యాధుల పట్ల అవగాహన లేకపోవటం, గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడంతో శిశువులు అనారోగ్యంతో పుడుతున్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల వైద్య శాఖ తగిన పర్యవేక్షణ లేకపోవటమేననే ఈ మృతులకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలాఉండగా, నందిగామ గ్రామానికి చెందిన మరో మహిళ తెలంగాణ లోని ఆస్పత్రిలో ఒకే కాన్పులో కవలలకు జన్మ ఇచ్చింది. వారు పురిటిలోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే పీహెచ్సీ పరిధిలోని నందిగామ గ్రామంలో మహ్మద్ హసీన, మున్నా దంపతులు నివాసం ఉంటున్నారు. హసీనా ఏడు నెలల గర్భవతిగా ఆమె ఆరోగ్య సమస్యతో జూలైలో పుట్టిల్లు తెలంగాణలోని పాల్వంచ వెళ్లింది. ఈ నెల 25న ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఖమ్మం ఏరియా వైద్యశాలకు ప్రసవం కోసం తీసుకెళ్లారు. ఉమ్మనీరు తాగటంతో పుట్టిన వెంటనే కవలల్లో అవయవాల లోపంతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని హసీనా తెలిపింది. అయితే వైద్య సేవలు పొందడంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో ఒకే పీహెచ్సీ పరిధిలో సంభవించాయి. గిరిజన యువతి మృతి అడ్డతీగల (రంపచోడవరం): జ్వరం, వాంతులు, విరేచనాలతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ చాపరాతిపాలేనికి చెందిన గిరిజన అవివాహిత మహిళ కురసం రాజేశ్వరి (19) బుధవారం మృతి చెందింది. ఆమె మేనమామ కురసం రాంబాబు కథనం ప్రకారం సోమవారం జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆమెను అడ్డతీగల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజులుగా చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారని, బుధవారం మధ్యాహ్నం మేనకోడలు హఠాత్తుగా మరణించిందని రాంబాబు వాపోయాడు. మెరుగైన వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెబితే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే వారమన్నాడు. మేనకోడలు మృతికి సరైన వైద్యం అందకపోవడమే కారణమని ఆరోపించాడు. వైద్యవర్గాలు మాత్రం పచ్చ కామెర్లు ముదిరిపోవడంతో అంతర్గతంగా అవయవాలు చెడిపోయి రాజేశ్వరి మృతి చెందినట్టు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని బంధువులు స్వగ్రామం చాపరాతిపాలేనికి తరలించారు. -
ఆ పేద తల్లిబిడ్డలను రక్షించేదెలా..?
లండన్: ఇంటివద్ద పురుడు పోసే విధానానికి స్వస్తి పలికి ఆస్పత్రుల్లో సురక్షితమైన పరిస్థితుల మధ్య డెలివరీకి అవకాశాలు కల్పించిన భారత్.. డెలివరీ సమయంలో మాతా, శిశుమరణాలు మాత్రం అరికట్టలేకపోతుందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు ఆ సర్వే తెలిపింది. స్వీడన్ లోని ఉమియా యూనివర్సిటికీ చెందిన అధ్యయన కారులు భారత్ లో చోటుచేసుకుంటున్న మాతా శిశు మరణాలకు సంబంధించి శోధించి వాటి వివరాలు తెలియజేశారు. జనని సరుక్ష యోజన(జేఎస్ వై) కార్యక్రమం ద్వారా ప్రసవాలు సురక్షిత పరిస్థితుల మధ్య జరిగే సౌకర్యాలు కల్పించినప్పటికీ.. బిడ్డకు జన్మనిచ్చే తల్లి, ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితుల కారణంగా అనూహ్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ అధ్యయనం వెల్లడించింది. పేద గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు వారికి నేరుగా నగదు బదిలీవంటివి చేసి, పౌష్టికాహారం వారే తీసుకునే సౌకర్యాలు కూడా అధ్యయనకారులు సూచించారు. ఈ అధ్యయనం కోసం భారత్ లోని తొమ్మిది పేద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకొని అక్కడ చోటుచేసుకుంటున్న మాతాశిశుమరణాలు, అందుకుగల కారణాలు శోధించి వాటిని వెల్లడించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పేద రాష్ట్రాల్లో ప్రతి లక్షమందిలో 135మంది అదనంగా చనిపోతున్నారని కూడా అధ్యయనకారులు వెల్లడించారు. -
‘మాతా శిశు మరణాలను నివారిద్దాం’
కాకినాడ క్రైం : మాతా శిశు మరణాలపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిరోధించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి. పద్మావతి ఆదేశించారు. ఆమె తన ఛాంబర్లో గురువారం వివిధ అంశాలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గర్భిణుల్లో పౌష్టికాహార లోపంవల్ల ప్రాణాపాయ పరిస్థితులు సంభవిస్తున్నందున వారిలో దానిపై అవగాహన కల్పించాలన్నారు.రెండు నెలల్లో 22 శిశు మరణాలు గత ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో 22 శిశు, ఆరు మాతృ మరణాలు సంభవించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి తెలిపారు. చిన్నారులు కూడా పలువురు మరణించారని, ఆ రిపోర్టును ఈ నెల 24వ తేదీన కలెక్టర్ నిర్వహించే సమీక్షా సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 54 యువ క్లినిక్‌లు బాలల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో 54 యువ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామన్నారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష (జేబార్) ప్రోగ్రాం ఆఫీసర్, ఎస్పీహెచ్ఓలు యువ క్లినిక్‌లను పర్యవేక్షించాలన్నారు. స్క్రీనింగ్ అంశాలు, ఓపీ, కౌన్సిలర్ల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్ జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల మరమ్మతుల కోసం జిల్లా స్థాయిలో వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలు తనకు అందజేయాలని ఎస్పీహెచ్ఓ, సీనియర్ అసిస్టెంట్లకు డీఎంహెచ్ఓ సూచించారు. 104 వాహనాల పనితీరు, మందుల స్టాకు, అందిస్తున్న సేవలు, వ్యాధులు తదితర అంశాలపై వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్, జేబార్ పీఓ డాక్టర్ అనిత, పీఓ డీటీటీ సత్యనారాయణ, ఎస్పీహెచ్ఓలు పాల్గొన్నారు.