ఎపుడో అపుడు... ఎవరో ఒకరు | Infant Deaths And Maternal Deaths Increased In East Godavari | Sakshi
Sakshi News home page

ఎపుడో అపుడు... ఎవరో ఒకరు

Aug 29 2019 9:43 AM | Updated on Aug 29 2019 9:43 AM

Infant Deaths And Maternal Deaths Increased In East Godavari - Sakshi

మరణించిన బిడ్డ మృతదేహం వద్ద రోదిస్తున్న ఆదివాసీ మహిళ   

మన్యానికి ఏమైంది. బిడ్డ, లేదంటే తల్లి. వీరెవరూ కాకుంటే ఆ ఇంట్లో ఇంకెవరో. మృత్యు కౌగిట్లోకి వెళ్లాల్సిందే. వైద్యం అందక కొందరు, వైద్యం అందినా  పౌష్టికాహార లేమి...రక్త హీనతతో చావుకేక  పెడుతున్నారు. ఆ చావు ఎందుకు వచ్చిందో తెలియదు ... వచ్చిన రోగానికి కారణమేమిటో తెలియదు...రోగ నిర్ధారణ కాకుండానే వందలాది మంది కన్నుమూస్తున్నారు. తల్లి మొహం చూడని పసిగుడ్డులు, తల్లి ప్రసవ వేదన తీరకముందే ప్రాణాలు పోతున్న పసికందులతో ఆ గూడేల్లో విషాదం అలుముకుంటోంది. ఎన్నాళ్లిలా...ఎన్నేళ్లిలా అంటూ ఆ గుండెలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఎటపాక, అడ్డతీగల మండలాల్లో ఓ బాలుడు, యువతి కన్నుమూశారు. 

నెల్లిపాక (తూర్పుగోదావరి) : ఎటపాక మండలంలో బుధవారం రెండు నెలల బాబు మృతి చెందాడు. విస్సాపురం గ్రామ పంచాయతీ గౌరిదేవి పేట పీహెచ్‌సీ పరిధిలోని వలస ఆదివాసీ గ్రామం జగ్గారంలో రవ్వా మంగయ్య, పొజ్జమ్మ దంపతుల నాలుగో సంతానంగా మగ బిడ్డ గౌరిదేవి పేట పీహెచ్‌సీలో జన్మించింది. తగిన పోషకాహారం లేకపోవడంతో ఆ శిశువు అనారోగ్యంతో బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలుస్తుంది. ఎటువంటి అనారోగ్యం లేకుండానే హఠాత్తుగా బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వలస ఆదివాసీలకు వ్యాధుల పట్ల అవగాహన లేకపోవటం, గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడంతో శిశువులు అనారోగ్యంతో పుడుతున్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల వైద్య శాఖ తగిన పర్యవేక్షణ లేకపోవటమేననే ఈ మృతులకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలాఉండగా, నందిగామ గ్రామానికి చెందిన మరో మహిళ తెలంగాణ లోని ఆస్పత్రిలో ఒకే కాన్పులో కవలలకు జన్మ ఇచ్చింది. వారు పురిటిలోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే పీహెచ్‌సీ పరిధిలోని నందిగామ గ్రామంలో మహ్మద్‌ హసీన, మున్నా దంపతులు నివాసం ఉంటున్నారు. హసీనా ఏడు నెలల గర్భవతిగా ఆమె ఆరోగ్య సమస్యతో జూలైలో పుట్టిల్లు తెలంగాణలోని పాల్వంచ వెళ్లింది. ఈ నెల 25న ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఖమ్మం ఏరియా వైద్యశాలకు ప్రసవం కోసం తీసుకెళ్లారు. ఉమ్మనీరు తాగటంతో పుట్టిన వెంటనే కవలల్లో అవయవాల లోపంతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని హసీనా తెలిపింది. అయితే వైద్య సేవలు పొందడంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో ఒకే పీహెచ్‌సీ పరిధిలో 
సంభవించాయి. 

గిరిజన యువతి మృతి 
అడ్డతీగల (రంపచోడవరం): జ్వరం, వాంతులు, విరేచనాలతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ చాపరాతిపాలేనికి చెందిన గిరిజన అవివాహిత మహిళ కురసం రాజేశ్వరి (19) బుధవారం మృతి చెందింది. ఆమె మేనమామ కురసం రాంబాబు కథనం ప్రకారం సోమవారం జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆమెను అడ్డతీగల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజులుగా చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారని, బుధవారం మధ్యాహ్నం మేనకోడలు హఠాత్తుగా మరణించిందని రాంబాబు వాపోయాడు. మెరుగైన వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెబితే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే వారమన్నాడు. మేనకోడలు మృతికి సరైన వైద్యం అందకపోవడమే కారణమని ఆరోపించాడు. వైద్యవర్గాలు మాత్రం పచ్చ కామెర్లు ముదిరిపోవడంతో అంతర్గతంగా అవయవాలు చెడిపోయి రాజేశ్వరి మృతి చెందినట్టు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని బంధువులు స్వగ్రామం చాపరాతిపాలేనికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement