Infant mortality
-
బోసి నవ్వులకు భరోసా
రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన మంగ, అప్పారావు దంపతులకు గత ఏడాది మేలో స్థానిక పీహెచ్సీలో పాప పుట్టింది. అయితే, 800 గ్రాములే బరువు ఉంది. అవయవాల ఎదుగుదల లేకపోవడంతో అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌లోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ 3 నెలల పాటు చికిత్స అందించారు. పాప 1.755 కేజీల బరువు పెరిగి పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇలా పుట్టుకతో బరువు తక్కువగా ఉండటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అండగా నిలుస్తున్నాయి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో శిశు మరణాల నివారణే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలు ఫలించాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే వరకూ అడుగడుగునా ప్రభుత్వం చేయిపట్టి నడిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాస్ప త్రుల్లోని పీడియాట్రిక్ (చిన్న పిల్లల) వైద్య విభాగాలను బలోపేతం చేస్తోంది. వార్డుల్లో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించింది. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ (ఎస్ఎన్సీయూ)లో శిశు మరణాల రేటు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 2018–19లో ఎస్ఎన్సీయూ ల్లో ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 12.3గా ఉండేది. కేంద్రం అభినందనలు.. ఇక 2019 నుంచి సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 6.6కు తగ్గింది. పూర్తిస్థాయిలో ఈ మరణాలను నియంత్రించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా అనతికాలంలో ఎస్ఎన్సీయూల్లో శిశు మరణాలను గణనీయంగా నియంత్రించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం సైతం అభినందించింది. 380 పడకలు పెంపు.. నవజాత శిశు మరణాల నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎస్ఎన్సీయూ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లలో పడకలను వైద్యశాఖ పెంపొందిస్తూ వస్తోంది. 2019కు ముందు.. రాష్ట్రంలో 62 ఎస్ఎన్సీయూల్లో 585 పడకలు అందుబాటులో ఉండేవి. వీటికి అదనంగా వార్డులను ఏర్పాటుచేస్తూ 755కు ప్రభుత్వం పడకలకు పెంపొందించింది. మరోవైపు.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో శిశు సంరక్షణ కేంద్రాల బలోపేతం చేపట్టింది. ఇందులో భాగంగా 11 ప్రభుత్వాస్పత్రుల్లో 20 పడకల చొప్పున, మరో 8 ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ఎస్ఎన్సీయూ, నాలుగు ఆస్పత్రుల్లో 20 పడకల చొప్పున ఎన్ఐసీయూ ఏర్పాటుచేసింది. వీటిల్లో వైద్యసేవలు అందించడానికి 250 మంది వరకూ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టారు. సీప్యాప్, ఫొటోథెరపీ యూనిట్, రేడియంట్ వార్మర్, ఇతర అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ఈ యూనిట్స్‌లో త్వరలో వైద్యసేవలు ప్రారంభించనున్నారు. సేవలు వినియోగించుకోవాలి సరైన వైద్యం అందక ఏ ఒక్క చిన్నారి ప్రాణం పోకూడదనేది సీఎం జగన్ సిద్ధాంతం. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నవజాత శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా సంరక్షణ కేంద్రాలన్నింటిలో సదుపాయాలు బలోపేతం చేపట్టాం. 380 ఎస్ఎన్సీయూ, 80 ఎన్ఐసీయూ పడకలను పెంచాం. ఈ యూనిట్స్ అన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్‌లో ఎంతో ఖరీదైన వైద్యసేవలు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో లభిస్తున్నాయి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం
అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి. వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం. అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్–19 ముందు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో– ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. కోవిడ్ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి 332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్‌లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది. అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?) – బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ -
అడవి 'బిడ్డ'లకు ఆయుష్షు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్)లు నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆస్పత్రి ఉండటమంటేనే కష్టం. పీహెచ్సీ ఉన్నా అక్కడ చిన్న పిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్ఎన్సీయూలు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. సీతంపేట, రంపచోడవరం, పాడేరు, శ్రీశైలం తదితర కొండ ప్రాంతాల్లోని చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. 24 గంటల వైద్యంతో ఇవి అండగా నిలుస్తున్నాయి. లక్ష మంది చిన్నారులకు ఔట్ పేషెంట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదేసి పడకలతో 23 ఎస్‌ఎన్‌సీయూలున్నాయి. ఇవి 2018, ఆగస్ట్‌లో ఏర్పాటుకాగా, బాగా నిర్వహణలోకి వచ్చింది మాత్రం 2019 జూన్ తర్వాతే. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో లక్ష మంది శిశువుల దాకా ఔట్ పేషెంట్ సేవలు పొందారు. శిక్షణ పొందిన నర్సులతో పాటు పీడియాట్రిక్ వైద్యులు, ఐసీయూ పడకలుండటంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. చింతూరు ఏజెన్సీలోని కూనవరం ఎస్‌ఎన్‌సీయూలో అత్యధికంగా 10,806 మంది శిశువులకు ఔట్ పేషెంట్ సేవలందగా, మంచంగిపుట్టు ఎస్‌ఎన్‌సీయూలో 8,619 మందికి వైద్య సేవలందాయి. త్వరలోనే మరో 10 కేంద్రాలను ఒక్కొక్కటి 10 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ఇప్పటికే టెండర్లనూ పిలిచారు. స్పెషాలిటీ సేవలు.. ఎస్‌ఎన్‌సీయూలో అత్యాధునిక రేడియంట్ వార్మర్‌లుంటాయి. వీటితో పాటు ఫొటోథెరపీ యూనిట్లూ ఉంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నియంత్రణకు సీ–పాప్ యంత్రం ఉంటుంది. ఐదుగురు శిక్షణ పొందిన నర్సులు షిఫ్ట్‌ల వారీగా ఉంటారు. డాక్టర్లు 9 గంటల పాటు కేంద్రంలో ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఎంత ఖరీదైన మందులైనా ఎస్ఎన్సీయూల్లో శిశువులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సెంటర్లో ఐదు పడకలుంటే వాటిలో ఒకటి ప్రత్యేక సెప్సిస్ (ఇన్ఫెక్షన్లు సోకని) బెడ్ ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణతో శిశు మరణాల నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ కృషిచేస్తోంది. శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ఎస్ఎన్సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్ వార్డులను కూడా కోవిడ్ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువునూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్ కుటుంబ సంక్షేమశాఖ -
మానవత్వం మరుస్తున్న కఠిన హృదయాలు
సాక్షి , ఒంగోలు : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను చిదిమేస్తున్నారు.. మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. భార్యపై అనుమానంతో ఆమెతో పాటు బిడ్డలను సైతం హతమార్చేందుకు వెనుకాడడం లేదు.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కసాయి కొడుకులు.. వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి రోడ్లపై పడేసి వెళ్తున్న దుర్మార్గపు బిడ్డలు.. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు, మనమరాళ్ళ వయస్సు ఉన్న చిన్నారులు, యువతులపై కన్నేస్తున్న మృగాళ్ళు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు మానవ సంబంధాలు, రక్తసంబంధాలను సైతం మరిచి కర్కశత్వంతో చిన్నారుల జీవితాలను కాలరాస్తున్న వైనాన్ని చూసి పరిస్థితి ఎటువైపు వెళుతోంది.. ఎక్కడకు దారితీస్తుందో అని జిల్లా వాసులు హడలిపోతున్నారు. జిల్లాలో మూడు నెలలుగా జరుగుతున్న వరుస ఘటనలు అందరి మనస్సులను కలిసి వేస్తున్నాయి. దర్శి పట్టణంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే వృద్ధ దంపతులు జులై 22వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపడంతో కొడుకే కన్న తల్లిదండ్రులను కర్కశంగా హతమార్చినట్లు తేలింది. వ్యసనాలకు బానిసై అప్పులు చేసి అవి తీర్చేందుకు పథకం ప్రకారం తల్లిదండ్రుల పేరుతో బీమా చేయించి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అర్ధరాత్రి వారిని దారుణంగా హతమార్చాడు. భార్యపై అనుమానం పెంచుకుని అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన ఆగస్టు 17వ తేదీన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జరిగింది. 11 ఏళ్లు కాపురం చేసిన భార్యపై అనుమానం పెనుభూతంలా మారి మద్యం మత్తులో ఆమె తలను గోడకేసి కొట్టి చంపాడు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మారి అమ్మమ్మ ఆసరాతో జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు క్షణికావేశంలో చేసిన తప్పులకు బిడ్డలు బలికావాల్సి వచ్చింది. తెలిసి చేసిన పాపమో.. తెలియక చేసిన పాపమో తెలియదుగానీ కొందరు యువతులు పెళ్లి కాకముందే తల్లులుగా మారి పుట్టిన వెంటనే బిడ్డలను విసిరి పారేసి తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జులై 30వ తేదీన ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అవివాహిత బిడ్డ పుట్టగానే అక్కడే వదిలేసి వెళ్లింది. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో ఆగస్టు 29వ తేదీ రాత్రి ఓ గర్భిణీ నడి రోడ్డుపై పురుడు పోసుకుంది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏం అయిందో ఏమో తెలీదుగానీ పసికందుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రోడ్డుపై ఏడుస్తూ కొంత సేపటికి ప్రాణాలు విడిచింది. తప్పు చేసిన వారి కడుపున పుట్టడమే ఆ పసికందులు చేసుకున్న పాపం. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలైన కన్న తల్లిని కొడుకులు ఆటోలో తీసుకొచ్చి నడి రోడ్డుపై పడేసి వెళ్ళారు. వర్షంలో తడిచి, చీమలు కుట్టి తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ తల్లి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కొడుకులు రాకపోవడంతో పోలీసులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా నవంబర్ 1వ తేదీన మరో తల్లిని కొడుకులు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 4వ లైన్లో నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. హాస్టల్ విద్యార్థినులు గమనించి ఆమెకు అల్పాహారం పెట్టి వృద్ధాశ్రమంలో చేర్చారు. వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పేగు తెంచుకు పుట్టిన మూడేళ్ళ పాపను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దుర్ఘటన గుడ్లూరు మండలం చేవూరులో అక్టోబర్ 20వ తేదీన జరిగింది. తాను చనిపోతే తన బిడ్డ అనాథగా మారుతుందనుకుందో ఏమోగానీ తల్లితనాన్నే మరిచి కంటిపాపనే చిదిమేసింది. ఈనెల 9వ తేదీన రాచర్ల బీసీ కాలనీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ తన పోలికలతో లేడని ఏడెనిమిది నెలల వయసున్న కుమారుడిని నేలకేసి కొట్టాడు ఆ కిరాతక తండ్రి. అంతటితో ఆ పసి బిడ్డ గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. ఆ ఘోరం చూసి కేకలు పెడుతున్న భార్యను రోకలిబండతో దాడి చేశాడు. ఇటీవల జరుగుతున్న ఈ ఘటనలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
అడవి ‘తల్లి’కి ఆలంబన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. గిరిజన స్త్రీలు గర్భందాల్చితే వారిని అత్యవసర వైద్యానికి ‘డోలీ’ కట్టి కొండలు, గుట్టల మీదుగా మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేది. జిల్లాలో గత మూడేళ్లలో 60 మంది తల్లులు, 673 మంది శిశువుల మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో గిరిశిఖర గర్భిణుల ప్రాణాలకు పూర్తి భరోసా లభిస్తోంది. పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పని చేసిన లక్ష్మీషా గతేడాది కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గిరిజన గర్భిణుల కోసం సాలూరులో ప్రత్యేక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులను ఈ కేంద్రానికి తరలించి, అవసరమైన వైద్యం, పౌష్టికాహారం అందించటంతో పాటు ప్రసవం కూడా ఇక్కడే జరిగేలా వసతులు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని మిగతా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం వసతి కేంద్రాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వసతి కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించడం గమనార్హం. అంకురార్పణ జరిగిందిలా.. సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలోని సిరివర గ్రామంలో కొండతామర గిందె అనే మహిళకు పుట్టిన బిడ్డ మరణించడం, ఆ బాలింతను డోలిలో గ్రామస్తులు తీసుకురావడంపై 2018 జూలై 31న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘జోరువానలో 12 కిలోమీటర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. దీన్ని సుమోటో ఫిర్యాదుగా స్వీకరించి, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ సూచనలతో అప్పటి పార్వతీపురం ఐటీ డీఏ పీఓ లక్ష్మీషా 2018 ఆగస్టు 2న కాలినడకన అటవీమార్గం గుండా సిరివర గ్రామానికి వెళ్లారు. మాతా, శిశుమరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. వసతి గృహంలో యోగా చేస్తున్న గర్భిణీలు ముఖ్యమంత్రి చొరవతో విస్తరిస్తున్న సేవలు ప్రసవ సమయానికి నెలన్నర, రెండు నెలలు ముందు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణులకు తగిన రక్షణ, వైద్యం కల్పించాలని లక్ష్మీషా భావించారు. 2018 సెప్టెంబరు 17న సాలూరులో ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 291 మంది చేరారు. వీరిలో 250 మందికి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం 41 మంది గర్భిణులు వసతి పొందుతున్నారు. సాలూరు వసతి కేంద్రం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భం అరకులో మరో వసతి కేంద్రాన్ని ప్రారంభించారు. పాడేరు, చింతపల్లికి కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు వసతి కేంద్రాన్ని సందర్శించనున్న గవర్నర్ విజయనగరం జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా సాలూరులోని గర్భిణుల వసతి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక్కడ గర్భిణులకు అందుతున్న సేవలను గవర్నర్ స్వయంగా పరిశీలించనున్నారు. గర్భిణులకు సకల వసతులు గర్భిణులకు పురిటి నొప్పులు ప్రారంభం కాగానే సాలూరు సీహెచ్‌సీకి నిమిషాల వ్యవధిలోనే తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికోసం అంబులెన్స్ ఉంది. వసతి కేంద్రంలో గర్భిణులకు సమయానికి పౌష్టికాహారం అందుతుంది. ఉదయం పాలు, గుడ్లు, కిచిడి, లెమన్ రైస్.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాగిజావ, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం (ఆదివారం, బుధవారం మాంసాహారం), సాయంత్రం వేరుశనగ చక్కిలు, నువ్వుల చక్కిలు, పండ్లు, రాత్రి భోజనం అందజేస్తున్నారు. పరీక్షల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. ఉదయం గర్భిణులతో యోగా చేయిస్తున్నారు. వినోదం కోసం టీవీ ఉంది. చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. గర్భిణులకు ఇంతకుముందే పిల్లలు ఉంటే, వారిని వసతి కేంద్రంలో తమతో పాటే ఉండనివ్వొచ్చు. వసతి కేంద్రం చాలా సౌకర్యంగా ఉంది ‘‘నేను 13 రోజులుగా సాలూరు వసతి కేంద్రంలో ఉంటున్నాను. ఇంటి వద్ద కంటే ఇక్కడే చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సమయానికి అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు’’ – సీదరపు నర్సమ్మ, గర్భిణి, బొడ్డపాడు, జిల్లేడువలస గ్రామం, సాలూరు మండలం ఇక్కడ ఉంటే భయం లేదు ‘‘మా గిరిజన గ్రామాల్లో పురుడు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరైన రోడ్డు లేకపోవడంతో, పురిటి నొప్పులు వస్తే సమయానికి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. వసతి కేంద్రంలో ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా పోయింది. తరచూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయానికి మంచి ఆహారం అందిస్తూ గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నారు’’ – పేటూరి కాంతమ్మ, గర్భిణి, ఊబిగుడ్డి, కేసలి పంచాయతీ, పాచిపెంట మండలం తల్లీబిడ్డల ప్రాణాలు పోకూడదనే... ‘‘గిరిజన గ్రామాల్లోని గర్భిణులు పురిటి సమయంలో తరుచూ ఇబ్బందులు పడడం, మాతా శిశుమరణాలు నమోదవుతుండడం చాలా భాద కలిగించేది. ప్రసవ సమమంలో తల్లీ బిడ్డల ప్రాణాలు పోకూడదన్న లక్ష్యంతో గర్భిణుల కోసం సాలూరులో వసతి కేంద్రం ఏర్పాటు చేశాం’’ – డా.జి.లక్ష్మీషా, గిరిశిఖర గర్భిణుల వసతి కేంద్రం రూపకర్త -
ఎపుడో అపుడు... ఎవరో ఒకరు
మన్యానికి ఏమైంది. బిడ్డ, లేదంటే తల్లి. వీరెవరూ కాకుంటే ఆ ఇంట్లో ఇంకెవరో. మృత్యు కౌగిట్లోకి వెళ్లాల్సిందే. వైద్యం అందక కొందరు, వైద్యం అందినా పౌష్టికాహార లేమి...రక్త హీనతతో చావుకేక పెడుతున్నారు. ఆ చావు ఎందుకు వచ్చిందో తెలియదు ... వచ్చిన రోగానికి కారణమేమిటో తెలియదు...రోగ నిర్ధారణ కాకుండానే వందలాది మంది కన్నుమూస్తున్నారు. తల్లి మొహం చూడని పసిగుడ్డులు, తల్లి ప్రసవ వేదన తీరకముందే ప్రాణాలు పోతున్న పసికందులతో ఆ గూడేల్లో విషాదం అలుముకుంటోంది. ఎన్నాళ్లిలా...ఎన్నేళ్లిలా అంటూ ఆ గుండెలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఎటపాక, అడ్డతీగల మండలాల్లో ఓ బాలుడు, యువతి కన్నుమూశారు. నెల్లిపాక (తూర్పుగోదావరి) : ఎటపాక మండలంలో బుధవారం రెండు నెలల బాబు మృతి చెందాడు. విస్సాపురం గ్రామ పంచాయతీ గౌరిదేవి పేట పీహెచ్సీ పరిధిలోని వలస ఆదివాసీ గ్రామం జగ్గారంలో రవ్వా మంగయ్య, పొజ్జమ్మ దంపతుల నాలుగో సంతానంగా మగ బిడ్డ గౌరిదేవి పేట పీహెచ్సీలో జన్మించింది. తగిన పోషకాహారం లేకపోవడంతో ఆ శిశువు అనారోగ్యంతో బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలుస్తుంది. ఎటువంటి అనారోగ్యం లేకుండానే హఠాత్తుగా బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వలస ఆదివాసీలకు వ్యాధుల పట్ల అవగాహన లేకపోవటం, గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడంతో శిశువులు అనారోగ్యంతో పుడుతున్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల వైద్య శాఖ తగిన పర్యవేక్షణ లేకపోవటమేననే ఈ మృతులకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలాఉండగా, నందిగామ గ్రామానికి చెందిన మరో మహిళ తెలంగాణ లోని ఆస్పత్రిలో ఒకే కాన్పులో కవలలకు జన్మ ఇచ్చింది. వారు పురిటిలోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే పీహెచ్సీ పరిధిలోని నందిగామ గ్రామంలో మహ్మద్ హసీన, మున్నా దంపతులు నివాసం ఉంటున్నారు. హసీనా ఏడు నెలల గర్భవతిగా ఆమె ఆరోగ్య సమస్యతో జూలైలో పుట్టిల్లు తెలంగాణలోని పాల్వంచ వెళ్లింది. ఈ నెల 25న ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఖమ్మం ఏరియా వైద్యశాలకు ప్రసవం కోసం తీసుకెళ్లారు. ఉమ్మనీరు తాగటంతో పుట్టిన వెంటనే కవలల్లో అవయవాల లోపంతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని హసీనా తెలిపింది. అయితే వైద్య సేవలు పొందడంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో ఒకే పీహెచ్సీ పరిధిలో సంభవించాయి. గిరిజన యువతి మృతి అడ్డతీగల (రంపచోడవరం): జ్వరం, వాంతులు, విరేచనాలతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ చాపరాతిపాలేనికి చెందిన గిరిజన అవివాహిత మహిళ కురసం రాజేశ్వరి (19) బుధవారం మృతి చెందింది. ఆమె మేనమామ కురసం రాంబాబు కథనం ప్రకారం సోమవారం జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆమెను అడ్డతీగల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజులుగా చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారని, బుధవారం మధ్యాహ్నం మేనకోడలు హఠాత్తుగా మరణించిందని రాంబాబు వాపోయాడు. మెరుగైన వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెబితే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే వారమన్నాడు. మేనకోడలు మృతికి సరైన వైద్యం అందకపోవడమే కారణమని ఆరోపించాడు. వైద్యవర్గాలు మాత్రం పచ్చ కామెర్లు ముదిరిపోవడంతో అంతర్గతంగా అవయవాలు చెడిపోయి రాజేశ్వరి మృతి చెందినట్టు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని బంధువులు స్వగ్రామం చాపరాతిపాలేనికి తరలించారు. -
ఆందోళనకరంగా శిశు మరణాలు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తేలింది. 2017లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 32 మంది శిశువులు అశువులు బాశారు. తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్–బులెటిన్) ఈ నిజాలను వెల్లడించింది. 2017కు సంబంధించి దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తెలంగాణలో ప్రతి వెయ్యికి 29 మంది శిశువులు మృతి చెందగా ఈ సంఖ్య కర్ణాటకలో 25, తమిళనాడులో 16, కేరళలో 10గా ఉంది. జాతీయ సగటు 33 ఉండగా ఏపీ సగటు 32గా నమోదైంది. ఎస్ఎన్సీయూలే పెద్దదిక్కు ప్రస్తుతం రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లు (ఎస్ఎన్సీయూలు) ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ పొందిన నర్సులు, వైద్యులతోపాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేసి నవజాత శిశువులకు కేంద్ర నిధులతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ కేంద్రాలను మైదాన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే శిశుమరణాలను నియంత్రించొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ శిశు మరణాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ వల్ల ఈ ప్రాంతంలో శిశు మరణాలు బాగా తగ్గాయి. ఏ ప్రాంతంలో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయో గుర్తించి అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. –డా.జీవన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎస్ఎన్సీయూ, అడ్డతీగల, తూర్పుగోదావరి -
తగ్గుతున్న శిశుమరణాలు
ఆడపిల్లలను గుండెలమీద కుంపటిగా భావించే రోజులకు ఇక తావులేదు. ఆడపిల్ల పుట్టుకనే శాసించే భ్రూణ హత్యలూ, బాలికల శిశు మరణాలు ఇక ఎంతోకాలం సాగవు అనడానికి ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంతో పోలిస్తే పుట్టగానే మరణిస్తున్న ఆడపిల్లల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శిశుమరణాల విషయంలో సైతం మన దేశంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గత యేడాది 2017లో మన దేశంలో 8.02,000 శిశు మరణాలు సంభవించాయి. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువ అని యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యుఎన్ఐజిఎంఇ)గుర్తించింది. 2017లో 6,05,000 మంది శిశువులు పుట్టిన వెంటనే మరణిస్తే 5నుంచి 14 ఏళ్ళలోపు వారు 1.52.000 మంది మరణించారు. చిన్నవయస్సులోనే మరణిస్తున్న శిశువుల సంఖ్య 2016లో 8.67 లక్షలు ఉంటే, 2017కి 8.02 లక్షలకి తగ్గింది. 2016లో ప్రతి 1000 మంది పిల్లల్లో పుట్టిన వెంటనే 44 మంది మరణించారు. 2017లో పుట్టిన ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 39 మంది ఐదేళ్ళలోపే మరణించారు. ఆడపిల్లలైతే పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 40 మంది చిన్నారులు ఐదేళ్ళలోపు మరణించారు. గత ఐదేళ్ళతో పోలిస్తే పుట్టిన వెంటనే మరణిస్తోన్న బాలబాలికల్లో లింగభేదం నాలుగు రెట్లు తగ్గింది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికను బట్టి ప్రపంచవ్యాప్తంగా 2017లో 63 లక్షల మంది 15 యేళ్ళలోపే మృత్యువాత పడ్డారు. దీన్ని బట్టి ప్రతి ఐదు సెకండ్లకూ నివారించదగిన కారణాలతో ఒక చిన్నారి మరణిస్తూనే ఉన్నపరిస్థితి. ఇందులో అత్యధికంగా 54 లక్షల మంది చిన్నారులు పుట్టిన తొలి ఐదేళ్ళలోపున మరణించారు. 2017లో అంతర్జాతీయంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సహారాఎడారి దిగువన ఉన్న ఆఫ్రికాలోనే 50 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో మరణిస్తున్న చిన్నారుల్లో 30 శాతం మంది దక్షిణాసియాకి చెందినవారే. యూరప్ కంటే సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశంలో 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 15 రెట్లు ఎక్కువ. శిశువుకి అత్యంత కీలక దశ అయిన పుట్టిన నెలలోపే ప్రపంచవ్యాప్తంగా 2017లో 25 లక్షల మంది శిశువులు మరణించారు. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలు 50 శాతం అధికం. 1990లో 1.2.6 కోట్ల మంది ఐదేళ్ళ లోపు చిన్నారుల మరణిస్తే, 2017లో 54 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించారు. ఐదు నుంచి 14 ఏళ్ళలోపు చిన్నారుల మరణాలు సైతం 17 లక్షల నుంచి పది లక్షల లోపుకి తగ్గడం పురోభివృద్ధిగా భావిస్తున్నారు. సాధారణ ఔషధాలూ, టీకాలూ, సురక్షిత నీరు, విద్యుత్ లాంటి చిన్న చిన్న సహకారం అందకనే చాలా మంది మరణిస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, దీనితో పాటు దేశ వ్యాప్తంగా పుట్టినవెంటనే పిల్లల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లు ప్రారంభించడం చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించినట్టు యూనిసెఫ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ క్యాంపెయిన్‌లో భాగంగా అందిస్తోన్న పౌష్టికాహారం, 2019కల్లా బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించే లక్ష్యంతో జరుగుతోన్న ప్రయత్నం కూడా చిన్నారులను మృత్యువుదరికి చేరకుండా ఆపుతోందని భావిస్తున్నారు. -
శిశువులు మరణిస్తుంటే ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శిశు గృహాల్లో చోటు చేసుకుంటున్న శిశు మరణాల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయిన విషయం వాస్తవమో కాదో తెలపాలని పేర్కొంది. ఒకవేళ నిజమే అయితే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరణాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోని శిశు గృహాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో మరణించారని పేర్కొన్నారు. ఇక్కడి శిశువులకు లాక్టోజన్ పాలను వాడాల్సి ఉండగా, సాధారణ గేదె పాలను వాడుతున్నారని, దీంతో సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నారని వివరించారు. ఒక్క నల్లగొండ జిల్లాల్లోనే ఏడాదిలో దాదాపు 32 మంది చిన్నారులు మృతి చెందారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది శిశువుల వరకు మరణించారని పేర్కొన్నారు. -
పొత్తిళ్లలోనే ప్రాణాలు పోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి సూచికలు నేల చూపులు చూస్తున్నాయి. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటివి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది ఆచరణలో సఫలం కావడం లేదని తాజాగా ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో శిశు మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే తొలి త్రైమాసికంలో శిశు మరణాల సంఖ్య కంటే ఆ తరువాత రెండు, మూడు త్రైమాసికాల్లో మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. నెలకు 782 మంది చొప్పున ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 7,037 మంది శిశువులు మృతిచెందారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,966 మంది పసిబిడ్డలు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే అంతకంటే ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండో త్రైమాసికంలో 164 శిశు మరణాలు సంభవించగా, మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 253కి పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో త్రైమాసికంలో 29 మంది, మూడో త్రైమాసికంలో 60 మంది శిశువులు మృతిచెందారు. పసిప్రాయం.. పౌష్టికాహారానికి దూరం కాన్పు సమయంలో తల్లుల మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మాతా మరణాల సంఖ్య 517 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లోనే 460 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల లోపం ఉన్న వారు గతంలో 27.7 శాతం కాగా, ప్రస్తుతం 31.4 శాతానికి పెరింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో బరువు తక్కువగా ఉన్న వారు గతంలో 27.3 శాతం కాగా, ఇప్పుడు 31.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 10 లక్షల మంది గర్భిణులు రక్తహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారని, వీరిలో కేవలం 3.1 లక్షల మందికే పౌష్టికాహారం అందుతోందని ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 19 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 15.58 లక్షల మందికే అందుతోందని వెల్లడించింది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న 24 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 8.31 లక్షల మందికే పేర్కొంది. -
మూడ్రోజుల్లో 20 మంది శిశువులు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో శనివారం ఒక్కరోజే 9 మంది శిశువులు మృతి చెందారు. దీంతో గత మూడు రోజుల్లో ఇక్కడ మృత్యువాత పడిన చిన్నారుల సంఖ్య 20కి పెరిగింది. శనివారం చనిపోయిన 9 మందిలో ఐదుగురిని వేరే ఆసుపత్రుల నుంచి వైద్యం కోసం ఇక్కడికి తరలించగా, మిగిలిన నలుగురు ఇదే ఆసుపత్రిలో జన్మించారు. వీరంతా ఐసీయూలో ఉండగానే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే శిశు మరణాలు సంభవించాయన్న వార్తలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎం ప్రభాకర్ కొట్టిపారేశారు. 24 గంటలూ వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. చనిపోయిన పిల్లల బంధువులు, కుటుంబీకులు దాడులకు పాల్పడొచ్చన్న అనుమానాలతో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శిశు మరణాలకు బాధ్యత వహిస్తూ గుజరాత్ సీఎం రూపానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరింది. -
మన చిన్నారులు హెల్దీయే
షరతులు వర్తిస్తాయి..! దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. కానీ ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ మనదేశం వెనుకబడే ఉందట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–2015–16 పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2005–06 తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం.. దేశంలో శిశు మరణాల రేటు గత దశాబ్ద కాలంలో 16 పాయింట్లు తగ్గింది. దశాబ్దం క్రితం ప్రతి వెయ్యి జననాల్లో ఏడాదిలోపు శిశు మరణాల సంఖ్య 57గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. 2005–06 మధ్య కాలంలో ప్రతి వెయ్యి జననాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు 74 మంది మరణించగా.. ప్రస్తుతం అది 24 పాయింట్లు తగ్గి 50కి దిగివచ్చింది. ఇంకా అనేక అంశాల్లో మనదేశ చిన్నారులు గతంతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అయితే శిశు మరణాల రేటు విషయంలో పొరుగునే ఉన్న పేద దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌తో పోలిస్తే మనం ఇంకా చాలా వెనుకబడే ఉన్నామని పేర్కొంది. మనదేశంలో ఏడాదిలోపు శిశు మరణాల రేటు 41 కాగా.. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌లో 31, నేపాల్‌లో 29, ఆఫ్రికా దేశాలైన రువాండా 31, బోత్సవానా 35 పాయింట్లతో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్(66) మాత్రం మనకంటే వెనుక ఉంది. ఇక ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు మన దేశంలో 50 అయితే నేపాల్(36), బంగ్లాదేశ్(38), భూటాన్(33) మనకంటే చాలా ముందున్నాయి. కాగా, 23 ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో శిశు మరణాల రేటు 48 శాతం తగ్గింది. 1992–93లో శిశు మరణాల రేటు 79 కాగా, 2015–16 నాటికి అది 41కి తగ్గింది. అయితే ఐక్య రాజ్యసమితి 2015లో శిశు మరణాల రేటుపై నిర్ధేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ 27 పాయింట్ల కంటే ఇది చాలా దూరంలో ఉండటం గమనార్హం. రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు శిశు మరణాల రేటులో రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్టు తేలింది. ఛత్తీస్‌గఢ్(54)లో అత్యధికంగా ఏడాదిలోపు శిశు మరణాల రేటు నమోదు కాగా.. మధ్యప్రదేశ్(65) ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటుతో ముందుంది. ఇదే సమయంలో ఏడాదిలోపు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కేరళలో తక్కువగా నమోదయ్యింది. మిజోరాంలో మాత్రం 2005–06లో ఏడాదిలోపు చిన్నారుల్లో వెయ్యి జననాలకు 34 మరణాలు నమోదు కాగా.. 2015–16 నాటికి అది 40గా రికార్డయ్యింది. -
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువ
వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి,హైదరాబాద్: బాలింతల మరణాలు ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నాయని, అలా ఎందుకు జరుగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి మంగళవారం సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాలింతలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయని, 50 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదన్నారు. అయినా మన రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, దాన్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, వైద్యులపై ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, వాకాటి కరుణ పాల్గొన్నారు. ‘నిలోఫర్‌లో మదర్ మిల్క్ బ్యాంకు’ తల్లి పాలు అందని పిల్లలకు ఆ పాలను అందించే బృహత్తర కార్యక్రమానికి ధాత్రి, డాక్టర్ ఫర్ సేవ సంస్థలు నడుం బిగిం చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మదర్ మిల్క్ బ్యాంకు పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లి పాలు అందక తల్లడిల్లుతున్న వారికి మేమున్నామం టూ ముందుకు వచ్చిన ఆ సంస్థలు.. నిలోఫర్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంకుని పెట్టాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తల్లుల నుం చి ఒక్కోసారి ఎక్కువగా ఉత్పత్తి అయిన పాలను సేకరించి వాటిని పిల్లలకు అందజేస్తారని చెప్పారు. ఈ నెల 30 నుంచి కార్యక్రమాన్ని నిలోఫర్‌లో ప్రారం భిస్తున్నారన్నారు. దేశంలో కేవలం 15 మిల్క్ బ్యాంకులే ఉన్నాయని, రాష్ట్రంలో మొదటిసారి మదర్ మిల్క్ బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. -
విధానాలు మారకపోతే అధోగతే
రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారుతుండటంపై సెస్ ఆందోళన ♦ ఇప్పటికీ వెనుకబాటులోనే పలు జిల్లాలు ♦ వేధిస్తున్న విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కొరత ♦ నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత లేదు ♦ ప్రభుత్వం ఇప్పటి విధానాలను మారిస్తేనే మెరుగైన ఫలితాలు ♦ ఏపీలో 2015లో ప్రజల స్థితిగతులపై ‘సెస్’ అధ్యయనం ♦ మానవాభివృద్ధి సూచిలో అట్టడుగు స్థానాల్లో విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం ♦ వైఎస్ హయాంలో చేపట్టిన చర్యలవల్ల ప్రమాణాలు మెరుగుపడ్డాయి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారుతుండటం పట్ల సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ(సెస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ఏమాత్రం మార్పు వచ్చే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది. పాత విధానాలను సమూలంగా మార్చుకొని, నూతన విధానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తేనే పరిస్థితులు మెరుగవు తాయని స్పష్టం చేసింది. విద్య, వైద్యంతోపాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని సూచించింది. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వారి జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో మెరుగు పడతాయని పేర్కొంది. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై ‘సెస్’ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ఫలితాలతో ఒక నివేదికను రూపొందించింది. జాతీయ మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో ఆంధ్రప్రదేశ్ స్థానం దిగజారిందని తేల్చింది. రాష్ట్రంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ‘సెస్’ నివేదిక తేల్చి చెప్పింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వాటిని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సెస్’ అధ్యయనం చేసింది. నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సూచించింది. మెరుగ్గా ఉన్న జిల్లాలకు కేటాయించిన నిధులను ప్రాధాన్యత రంగాల్లో ఖర్చు చేసి, దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలపాలని పేర్కొంది. నెల్లూరు.. ఐదు నుంచి మూడోస్థానానికి.. నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని మానవాభివృద్ధి సూచిని ‘సెస్’ లెక్కగట్టింది. విద్య, వైద్యం, తలసరి వ్యయం, కనీస మౌలిక సదుపాయాలు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరుగ్గా ఉన్నట్లు తేల్చింది. 2015లో మానవాభివృద్ధి సూచిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు వెల్లడించింది. గతంలో ఐదో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మెరుగుపడి, మూడో స్థానానికి చేరడం ఒక్కటే సానుకూలమైన అంశమని పేర్కొంది. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిస్థితులు మరింత దిగజారడం.. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారడం ప్రతికూలమని తేల్చిచెప్పింది. ‘సెస్’ సూచనలు మానవాభివృద్ధి సూచిలో కాస్త మెరుగ్గా ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జిల్లాలను దేశంలో అగ్రగామిగా నిలపడానికి చర్యలు తీసుకోవాలని ‘సెస్’ సూచించింది. సెస్ సూచనలు.. ► అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలి. ► తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు నిధుల కేటాయింపులో ప్రాధన్యం ఇచ్చి.. వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ► మానవాభివృద్ధి సూచిలో మెరుగ్గా ఉన్న కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలను దేశంలో అగ్రగామి జిల్లాల సరసన చేర్చడానికి ప్రణాళికలు రచించాలి. ► ఆర్థిక అసమానతలు తగ్గించేలా నిధులను ఖర్చు చేయాలి. ► ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే పథకాలను రూపొందించి, అమలు చేయాలి. ► పౌష్టికాహారం, మెరుగైన వైద్య సహాయం, కనీస మౌలిక సదుపాయాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ► విద్యా రంగాన్ని మెరుగుపర్చాలి. 15 ఏళ్లలోపు పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకునేలా చర్యలు తీసుకోవాలి. టాప్ 10 నుంచి ఏపీ గల్లంతు ఉమ్మడి రాష్ట్రంలో 1995 ఆగస్టు నుంచి నుంచి 2004 మే వరకూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పట్లో రాష్ట్రంలోని పరిస్థితులపై సెస్ అధ్యయనం చేసి 2005లో నివేదిక ఇచ్చింది. దేశంలో 2004–05లో మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానానికి పరిమితమైనట్లు పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన చర్యల వల్ల 2005–10 మధ్య కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దేశంలో 2011–12 మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానానికి చేరినట్లు ‘సెస్’ తన నివేదికలో పేర్కొంది. మానవాభివృద్ధి సూచిలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ చేరడం అదే ప్రథమం. 2015లో ‘సెస్’ అధ్యయనంలో దేశంలో మానవాభివృద్ధి సూచిలో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కానీ, ఏపీ స్థానం టాప్ 10 నుంచి గల్లంతైంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ఏ స్థానంలో నిలిచిందన్నది సెస్ నివేదికలో వెల్లడించకపోవడం గమనార్హం. పౌష్టికాహార లోపం తీవ్రం అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉన్నట్లు ‘సెస్’ తేల్చింది. ఎక్కువ శాతం మంది పిల్లలు ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నారని వెల్లడించింది. మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. పరిశుభ్రమైన తాగునీరు ప్రజలకు అందుబాటులో లేదని తెలిపింది. అవసరమైన మేరకు వైద్య సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు అధిక శాతం ఖర్చును వైద్యం కోసమే చేస్తున్నారని వివరించింది. విద్యారంగం తీసికట్టు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏమాత్రం మెరుగ్గా లేవని ‘సెస్’ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతూ విద్య కోసం అధికంగా సొమ్మును ఖర్చు చేస్తున్నారని తెలిపింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు వైఎస్సార్, ప్రకాశం, విశాఖ, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ విద్య కోసం నిధులను ఎక్కువగా ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని వెల్లడించింది. ఇప్పటికీ బాల్య వివాహాలు మానవాభివృద్ధి సూచిలో అగ్రభాగాన నిలిచిన కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని సెస్ గుర్తించింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ బాల్య వివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. తక్కువ తలసరి ఆదాయం, అక్షరాస్యత మెరుగుపడక పోవడమే బాల్య వివాహాలకు కారణమని తెలియజేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగతున్నాయని పేర్కొంది. -
నెలలు నిండకముందే..నూరేళ్లు నిండుతున్నాయి!
- రాష్ట్రంలో నెలలు నిండకుండా జన్మిస్తున్న శిశువుల మరణాలు 54 శాతం - దేశ సగటు 35 శాతం కంటే ఎంతో అధికం - యునిసెఫ్ సదస్సులో నిపుణుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నవజాత శిశు మరణాలు ఆందోళనకర స్థారుులో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల మరణాల శాతం 54. జాతీయ స్థారుులో ఈ సగటు 35 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 35 లక్షల మంది శిశువులు నెలలు నిండకుండా జన్మిస్తున్నారు. దీని ఫలితంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో వీరిలో 31 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 1.5 కోట్ల మంది శిశువులు పుడుతుంటే... వారిలో పది లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం... నెలలు నిండకుండానే పుట్టడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తంగా నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం అత్యావశ్యకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎన్ఎఫ్ సెక్రటరీ డాక్టర్ సురేందర్‌నాథ్ తెలిపారు. ‘ప్రపంచ ప్రి మెచ్యూరిటీ డే’సందర్భంగా నగరంలో గురువారం యునిసెఫ్ సదస్సు నిర్వహించింది. ఇందులో వైద్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అతిచిన్న వయస్సులోనే గర్భందాల్చడం, మలేరియా లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, పౌష్టికాహార లోపం, దాని కారణంగా వచ్చే రక్తహీనత, తీవ్రమైన మధుమేహం, బీపీ లాంటి కారణాలతో నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు. ఇందుకు కారణమైన ఇన్ఫెక్షన్సని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు నివారించగలిగినట్టు తమ పరిశోధనలో వెల్లడైందని యునిసెఫ్ హెల్త్ చీఫ్ డాక్టర్ యరోన్ వాల్మన్ తెలిపారు. నివారణ ఎలా? తెలంగాణలో 13 నుంచి 15 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నారుు. ఫలితంగా చిన్న వయస్సులోనే గర్భధారణ జరిగి, నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని, దానితో పాటు పౌష్టికాహార లోపం, రక్తహీనతలను నివారించే దిశగా చర్యలు తీసుకోవడం అత్యవసరంగా డాక్టర్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. సరైన మోతాదులోనే యాంటీనాటల్ స్టెరాయిడ్సని వాడటం కూడా నెలల నిండకుండా సంభవించే శిశుజననాలను అరికట్టవచ్చునని అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ఎంసీహెచ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమా సింఘ్ తెలిపారు. ఈ విషయమై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రంలో విస్తృతంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేష్‌కుమార్ చెప్పారు. అతి చిన్న ప్రయత్నాలతోనే నెలలు నిండకుండా సంభవించే శిశువుల జననాలను, అలాగే మరణాలను 75 నుంచి 80 శాతం తగ్గించే అవకాశాలున్నాయని యునిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజీవ్ ఉపాధ్యాయ అన్నారు. యునిసెఫ్ పర్యవేక్షకులు ప్రసూన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక జననం.. ఒక మరణం
శిశువుకు జన్మనిచ్చి కన్ను మూసిన తల్లి అమ్మ ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మన్యంలో ఆగని మరణాలు మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయించి విస్తృత చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ఏజెన్సీలో నిత్యం ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గిరిజనులకు అవగాహన లోపం.. వైద్యం సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ఏజెన్సీలో మరో బాలింత ప్రాణం తీసింది. జీకేవీధి: ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ మాతా, శిశు మరణాలకు అడ్డుకట్ట వేయడానికి అమలు చేస్తున్న పథకాలు గిరిజన ప్రాంతంలో అమలుకు నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం అమలుకు ఆటంకంగా మారింది. జీకేవీధి మండల కేంద్రానికి సమీపంలోని ఉన్న పనసలబంద గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఓ మాతృ మరణం ఆదివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పనసలబంద గ్రామానికి చెందిన గెమ్మెలి విజయ(24) అనే నిండు గర్భిణి శనివారం ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమె భర్త గెమ్మెలి అర్జున్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. అంబులెన్స్, వైద్య సిబ్బంది వచ్చేలోగానే ఆమె ుగ శిశువుకు జన్మనిచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి వైద్యసేవలు అందించి అంబులెన్స్‌లో ఎక్కించేలోగానే తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి రెండేళ్ల పాప ఉంది. ఇది ఆమెకు రెండో కాన్పు. ప్రసవించిన వెంటనే ఆమె మృతి చెందడంతో పుట్టిన పసికందుతోపాటు రెండేళ్ల చిన్నారి తల్లి ప్రేమకు దూరమయ్యారు. బంధువు సంరక్షణలో పసికందు పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన పసికందు సంరక్షణను మృతురాలి వదిన గెమ్మెలి లక్ష్మి స్వీకరించింది. ఆమె కూడా బాలింత కావడంతో ప్రస్తుతం తల్లిపాలకు దూరమైన పసికందును ఒడిలోకి తీసుకుని బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. సకాలంలో వైద్యం అందక.. మాతా, శిశు మరణాలను అరికట్టాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల కాలంలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం దగ్గర నుంచి అధికారుల వరకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఎన్ఎంలకు, వైద్యాధికారులకు ప్రత్యేక ట్యాబ్‌లను సమకూర్చి టాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో మహిళలకు వివాహమైనప్పటి నుంచి వారు గర్భం దాల్చి ప్రసవించేవరకు నెల నెల నిర్వహించాల్సిన పరీక్షలు, ప్రసవతేదీ వంటి వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తంచేస్తున్నారు. గర్భం దాల్చిన ప్రతి మహిళను ప్రసవానికి 3 రోజుల ముందే సమీప ఆస్పత్రిలో చేర్పించే విధంగా దశలవారీగా దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలన్నీ ఉచితంగా చేసే వెసులుబాటు కల్పించారు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డల సంరక్షణకు తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్ ను ఏర్పాటు చేశారు. అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా మన్యంలో అమలు అంతమాత్రమే. వైద్య సేవలూ అరకొరే.. దీంతో ఎక్కడో ఒక చోట మాతా శిశు మరణాలు చోటు చేసుకోవడం ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తోంది -
అమ్మతనానికి అడ్డు‘కోత’
నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రసన్న గత నెల 26వ తేదీన ప్రసవం కోసం స్థానిక ఏరియాస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళ్లగా.. అవసరం లేకున్నా ప్రసన్నకు సిజేరియన్ చేశారు. రూ.21 వేల బిల్లు చేతికిచ్చారు. * అవసరం లేకున్నా ఆపరేషన్లు * ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు * పెరుగుతున్న మాత,శిశు మరణాలు * ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం సూర్యాపేట : జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీహెల్త్ సెంటర్లలో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్యసేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడదలవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు. ధరలు ఏవీ..? ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారైంది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్దస్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కన్పించడం లేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తి పడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత,శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటున ఏడాదికి 3 వేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్తండాకు చెందిన బుజ్జికి నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్‌సీకి కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆటోలో వెళ్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. -
కామినేనీ.. ఇదేమి..!
శిశు మరణాల రేటును 28కి తగ్గించామన్న మంత్రి ఏపీలో శిశు మరణాల రేటు 35గా పేర్కొన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అవాస్తవాలు వల్లించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు టీడీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంద సంవత్సరాలు జీవించాల్సినవారు పుట్టిన వారానికే చనిపోతున్నారు.. గత ప్రభుత్వాల తప్పిదాలే ఇందుకు కారణమని విమర్శించారు. గతంలో ప్రతి 1,000 మంది శిశువుల్లో 41 మంది మృతి చెందేవారని (శిశు మరణాల రేటు), ఇప్పుడు ఆ రేటును 28కి తగ్గించామని చెప్పారు. అయితే నెల రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ బులెటిన్ ఏపీలో శిశు మరణాల రేటును ప్రతి వెయ్యికీ 35గా పేర్కొనడం గమనార్హం. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి గత పదేళ్లలో ఒక్క నియామకమూ జరగలేదని కామినేని చెప్పారు. కానీ ఉమ్మడి ఏపీలో అంటే 2007లో అప్పటి ముఖ్యమంత్రి 4 వైద్య కళాశాలలు (రిమ్స్‌లు) ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు 3 వేల మంది నియమితులు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను ప్రైవేటుకు లీజుకు ఇస్తున్నారు. రక్తపరీక్షల నిర్వహణను సైతం ప్రైవేటుకు అప్పగించారు. దీనికి సంబంధించిన రూ.120 కోట్ల కాంట్రాక్టును ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టారు. మెడాల్ సంస్థ అద్భుతంగా పనిచేస్తోందని కామినేని కితాబిచ్చారు. -
'మార్పు' లేదు
మూడేళ్లలో 1,114 మాతా శిశు మరణాలు నెలలో 30 నుంచి 35 మరణాలు నమోదు నివారణ చర్యల్లో సర్కారు వైఫల్యం పౌష్టికాహారంపై అవగాహన అంతంతమాత్రమే సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పౌష్టికాహారలోపం.. రక్తహీనతతో మాతా శిశు మరణాలు అధికమవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఈ మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పౌష్టికాహారలోపం.. సమయానికి వైద్యం అందకపోవటం కారణంగానే మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తోనూ మరణాలు పెరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మాతా శిశు మరణాలు అధికమవుతున్నాయని తెలిసినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాతా శిశుమరణాల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన 'మార్పు' కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో మాతా శిశుమరణాలపై ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఆ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలో నెలలో 30 నుంచి 35 మధ్య మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. 2015 జనవరి నుంచి జూన్ వరకు 224 మంది చిన్నారులు మరణించగా... 41 మంది గర్భిణులు మృతిచెందారు. అదే 2014లో 290 మంది చిన్నారులు, 36 మంది గర్భిణులు మరణించినట్లు తెలిసింది. 2013 సంవత్సరంలో చూస్తే 487 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు సర్వేలో తేలింది. గర్భిణులు విషయానికి వస్తే 36 మంది మరణించినట్లు చెబుతున్నారు. మొత్తంగా మూడేళ్లలో 1,114 మంది మరణించినట్లు సర్వే నిర్వహించిన బృందం వెళ్లడించింది. ఇదిలా ఉంటే మహిళ గర్భందాల్చిన తరువాత ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు ప్రతినెలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ పరీక్షల్లో పౌష్టికాహారలోపం ఉంటే వెంటనే గుర్తించి వారికి తగిన సూచనలు సలహాలు చేయాలి. అదేవిధంగా డెలివరీ ఆసుపత్రిలోనే జరగాల్సి ఉంది. పల్లెలో అందుకు విరుద్ధంగా ఉంది. నెలలో సుమారు 2వేల ప్రసవాలు జరిగితే ఆసుపత్రుల్లో 900లోపు మాత్రమే జరుగుతున్నట్లు తెలిసింది. సర్కారు వైఫల్యమే... మాతా శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపటం లేదని తెలుస్తోంది. మరణాల నివారణ కోసం గతంలో చేపట్టిన 'మార్పు' వల్ల ప్రయోజనం కనిపించటం లేదు. రాష్ట్రప్రభుత్వం గతంలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు 'మార్పు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా గతంలో ప్రాథమిక వైద్యకేంద్రం నుంచి హెల్త్ అసిస్తెంట్, డ్వాక్రా గ్రూపు నుంచి ఒకరికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో వారు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేయాలి. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశావర్కర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటుచేసి పౌష్టికాహారం, వైద్యసేవల గురించి అవగాహన కల్పించాలి. అందులోభాగంగా 20 సూత్రాల గురించి గ్రామస్తులకు వివరించాల్సి ఉంది. అయితే శిక్షణ అనంతరం గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించటం లేదు. కేవలం హెల్త్ అసిస్టెంట్ మాత్రమే గ్రామాల్లోకి వెళ్లినప్పుడు సందర్భం వస్తే 'మార్పు'కార్యక్రమంలోని అంశాలను వివరిస్తున్నారు. వారికి ఉండే పని ఒత్తిడితో అనేక మంది హెల్త్ అసిస్టెంట్లు 'మార్పు'ను గురించి చెప్పటం లేదని పీహెచ్‌లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. దీంతో జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, బరువు తక్కువ ఉన్న చిన్నారులే అధికంగా ఉన్నారని వెళ్లడించారు. దీంతో జిల్లాలో మాతా శిశు మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. -
మన్యంలో మాతృవేదన
మాతా, శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేదు కాన్పు కష్టమైతే అంతే సంగతి ఏజెన్సీలో కుంటుపడిన గైనిక్ సేవలు శై‘శవ’ గీతి మన్యంలో మార్మోగుతోంది. మాతాశిశు మరణాలకు అంతులేకుండా పోతోంది. పోషకాహార లోపాలకు రక్తహీనత తోడై మారుమూల గూడేల్లో చావుడప్పు ఆగకుండా మోగుతోంది. పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం ఐసీడీఎస్ ఉండీ ఉద్ధరించిందేమన్న వాదన వ్యక్తమవుతోంది. ఏటా మాతాశిశు మరణాలు వందల్లో ఉంటే అధికారులు మాత్రం వీటిని తగ్గించి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉందని బాకా ఊదేస్తున్నారు. ఇలా తక్కువ చేసి చూపించడంతో ఉన్నతస్థాయి వర్గాల్లో అంతా బాగానే ఉందనిపిస్తోంది. పరోక్షంగా గిరిజనుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. చింతపల్లి, పాడేరుల్లో ఉన్న న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లతో ఒరిగిందేమీ లేకుండాపోతోంది. పాడేరు : ఏజెన్సీలోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలు మృగ్యమయ్యాయి. కాన్పు కష్టమైతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు వీటిల్లో అందడం లేదు. ఇలాంటప్పుడే మాతా, శిశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏజెన్సీ ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి సమావేశంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు మాతా,శిశు మరణాలను నిరోధించాలని పేర్కొంటున్నారు. అది కంఠశోషగానే మిగులుతోంది. గతేడాది ఏజెన్సీలో ప్రవస సమయంలో 34 మంది తల్లులు, 472 మంది శిశువులు చనిపోయినట్టు అధికారుల రికార్డులే పేర్కొంటున్నాయి. ఈ ఏడాది 9 మంది తల్లులు, 104 మంది శిశువులు చనిపోయారు. పాడేరు, చింతపల్లి, అరకు ఏరియా ఆస్పత్రులకు మాత్రమే గైనకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఏళ్లతరబడి అవి భర్తీకావడం లేదు. ఎప్పుడైనా ప్రసూతి సమస్యలు తీవ్రమైనప్పుడు తాత్కాలికంగా గైనకాలజిస్ట్‌ను నియమిస్తున్నారు. వారి సేవలు కొన్ని రోజులకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పాడేర ఆస్పత్రిలో పీజీ గైనకాలజిస్ట్‌గా ఉన్నారు. సుఖ ప్రసవం అయితే ఫర్వాలేదు. లేదంటే అత్యవసర సమయాల్లో ఉన్నత వైద్యసేవల కోసం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాల్సిన దుస్థితి. ఆదివాసీలకు రోగాలతోపాటు తిండి కూడా ప్రధాన సమస్య. ఏజెన్సీలో ఇది ఎక్కువ. వ్యవసాయంలో ఎంతో కొంత ప్రవేశం ఉన్న తెగల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా..పూర్తిగా ఆహారం సేకరణపై ఆధారపడే భగత, కోందు, గదబ, కోయ జాతుల పరిస్థితి దయనీయం. చిన్న వయస్సుల్లో పెళ్లిల్ల వల్ల మన్యంలో మాతృమూర్తులు అంత్యంత బలహీనంగా ఉంటున్నారు. శారీరక ఎదుగుదల లేకుండానే యువతులు ప్రసవిస్తున్నారు. ఫలితంగా తల్లీబిడ్డల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పౌష్టికాహారం నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ 11 మండలాల్లోనూ గిరిజనులు వ్యాధుల బారినపడి అల్లాడిపోతున్నారన్నారు. దీనిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నదని ఆరోపించారు. ఎక్కడా పూర్తి స్థాయిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతోందన్నారు. మలేరియా విజృభింస్తున్నదని పేర్కొన్నారు. -
ప్రశవ వేదన
మన్యంలో ఆగని మాతా, శిశు మరణాలు 108లో మృతశిశువు జననం రక్తహీనతతో ఆస్పత్రిలో కన్నుమూసిన తల్లి పాడేరురూరల్/జి.మాడుగుల : ఏజెన్సీలో మాతా,శిశు మరణాలు ఆగడంలేదు. మన్యంలోని కొన్ని ఆస్పత్రుల్లో బర్త్‌వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేసి గర్భిణులను కాన్పుల కోసం ముందుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ఇందుకు మరణాలే సాక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి వెయ్యిమందిలో 40 మందికి పైగా పిల్లలు పుట్టిన తరువాత, ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 137 మందిప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. మాత్రా,శిశు మరణాల్లో 50 మంది రక్తహీనతతోనే చనిపోతున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. మన్యంలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. గురువారం మరో గర్భిణి ప్రసవ వేదనతో కన్నుమూసింది. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ కంఠవరానికి చెందిన కొండపల్లి నాగరాత్నం(28)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తహీనతకు గురైందని, పరిస్థితి విషమంగా ఉన్నందున పాడేరు లేదా విశాఖపట్నం తరలించాలని సూచించారు. కానీ పీహెచ్‌సీలోనే ప్రసవానికి సేవలు అందించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. వైద్యులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. చివరకు వైద్యులు కుటుంబసభ్యులను ఒప్పించి108లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా పాడేరు-జి.మాడుగుల రహదారిలోని లాడాపుట్టు సమీపంలో అంబులెన్స్‌లోనే మృతశిశువును ప్రసవించింది. తీవ్ర రక్తస్రావానికి గురైంది. పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా చనిపోయింది. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి, బిడ్డ మృతి చెందారు. నాగరత్నంకు ఇది ఐదో కాన్పు. కాగా గత నెల 24న స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒక బాలింత రక్తహీనతతో చనిపోయింది. అంతకు ముందు ఏప్రిల్ 21న హుకుంపేట మండలం జరకొండ పంచాయతీ బురదగుమ్మిలో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మృత్యువాత పడింది. రక్తహీనతతో కాన్పు కష్టమై గిరిజన మహిళలు చనిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. గర్భిణుల ఆరోగ్య సేవలపై పర్యవేక్షణ కుంటుపడుతున్నాయనడానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణుల వివరాలు నమోదు చేస్తున్నారు. వారికి పౌష్టికాహారం, వైద్యసేవలు మొక్కుబడిగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో మాతా, శిశు సంరక్షణ పథకాలు సవ్యంగా అమలు కావడం లేదు. -
ఏవీ నాటి కుయ్ కుయ్‌లు...
ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫోన్ చేయగానే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 కుయ్ కుయ్‌లు ఇపుడెక్కడా వినిపించడం లేదు...గ్రామాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ గర్భిణుల బాగోగులు చూసే 104 సేవలూ ఇపుడు మూలకు చేరాయి. కొన్ని వాహనాలు రిపేరుతో మూలకు చేరగా ఉన్న వాహనాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇక సిబ్బంది కూడా అవసరాలకు తగిన సంఖ్యలో లేకపోవడంతో మారు మూల గ్రామాలకు సేవలందడం లేదు. మాతా శిశు మరణాలు పెరిగాయి. ఇక సౌకర్యాల లేమి, పథకంలో స్పష్టత కొరవడడంతో ఎన్టీఆర్ వైద్యసేవ పేదలకు ఉపయోగపడడం లేదు. దీంతో మొత్తంగా ప్రజారోగ్యంపై చీకటి కమ్ముకుంది. - చతికిల పడ్డ 108, 104 - అక్కరకు రాని ఎన్టీఆర్ వైద్యసేవ - ఆరోగ్యశ్రీ వార్డుల్లో కనీస వసతులు కరువు - అందుబాటులో ఉండని వైద్యులు - ఆందోళనకరంగా మాతా శిశు మరణాలు ఒకప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్..కుయ్ అంటూ వచ్చే 108 వాహనాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ వారికి అవసరమైన మందులను అందజేస్తూ, ముఖ్యంగా గర్భిణుల బాగోగులు చూసుకునే 104 వాహనాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలును ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా పేరు మార్చినా నిరుపేదలకు అక్కరకు రావడం లేదు. మరోవైపు జిల్లాలో మాతా శిశుమరణాల సంఖ్య ఊహించని రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలకులు, అధికారులు సమీక్షలు..సమావేశాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ప్రజారోగ్యం పడకేసింది. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో 85 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 టీచింగ్ హాస్పటల్స్ ఉన్నాయి. కానీ 108 వాహనాలు మాత్రం కేవలం 41 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని ఎప్పుడూ రిపేరులోనే ఉంటాయి. 390 మంది సిబ్బంది ఏ మూలకూ సరిపోవడం లేదు. అనకాపల్లి, నర్శీపట్నం, పాడేరు, చోడవరం ప్రాంతాల్లో రిఫరల్ కేసులు ఎక్కువగా ఉంటాయి. వాటికి సరిపడా 108 వాహనాలు ఉండడం లేదు. నిర్ణీత సమయానికి ఎక్కడా వాహనాలు రావడం లేదు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. వాహనాలు పెంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి 108లో ఉండాల్సిన అత్యవసర వైద్య పరికరాలు కూడా లేవు. రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించే యంత్రం, విషాన్ని కక్కించే యంత్రాలు అందుబాటులో లేవని 108 జిల్లా కో ఆర్డినేటర్ కె.ఉమామహేశ్వరరెడ్డి ధ్రువీకరించారు. ఆరోగ్య ప్రదాయనికి ఎంత కష్టం వైద్య సదుపాయాలకు ఆమడ దూరంలో ఉండే ఏజెన్సీ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవర వైద్య సేవలు అందించేందుకు ప్రారంభించిన 104 సేవలు జిల్లాలో నామమాత్రంగా నడుస్తున్నాయి. మొత్తం 95 మంది సిబ్బందితో 20 వాహనాలు ఉంటే వాటిలో కోటవురట్ల, పాడేరు, ముంచింగ్‌పుట్టులో మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం 17 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా 2008 నుంచి సేవలు ఉండటంతో శిధిలావస్థకు చేరుకున్నాయని 104 జిల్లా కో ఆర్డినేటర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సూర్యనారాయణ చెబుతున్నారు. ఆందోళనకరంగా మాతా శిశుమరణాలు జిల్లాలో 108, 104 సేవలు పడకేయడంతో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 692 మంది శిశువులు, 60మంది తల్లులు ప్రాణాలు కోల్పోయారు. 2014-15లో ఇప్పటి వరకూ దాదాపు 1100 మంది శిశువులు, 130 మంది మాతృమూర్తులు చనిపోయారు. ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఏఎన్ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు జిల్లాలో పేదలకు అందని ద్రాక్షలా మారాయి. 1034 రకాల పెద్ద పెద్ద జబ్బులు సైతం పైసా ఖర్చు లేకుండా తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ పథకంలో స్పష్టత లేకపోవడంలో వైద్యం అందడం లేదు. జిల్లాలో 8 ప్రభుత్వ, 24 ప్రైవేట్ కలిపి మొత్తం 32 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులున్నాయి. ప్రతి హాస్పటల్లోనూ ఓ ఆరోగ్యమిత్రతో పాటు జిల్లాలో ఐదుగురు డివిజన్ టీంలీడర్లు, ఐదుగురు నెట్వర్క్ టీంలీడర్లు, ఓ మేనేజర్ ఆపైన కో ఆర్డినేటర్ ఉన్నారు. కానీ చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇటీవల తనిఖీలు చేసిన ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ పాత్రుని మనోజ్ ఈ విషయాన్ని గుర్తించారు. 21 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. తాను వెళ్లినపుడు ఆరోగ్యశ్రీ వైద్యులు కనిపించలేదని ఆయనే అంటున్నారు. అలాంటిది సామాన్యులకు అందుబాటులో ఎక్కడుంటారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు కూడా ఉండడం లేదు. సకాలంలో సర్జరీ చేయట్లేదు. అసలు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లండని కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని రోగులను గెంటేస్తున్నాయి. -
గర్భశోకం
పార్వతీపురం: పార్వతీపురం ఏజెన్సీలో శిశు మరణ ఘోష ఆగడం లేదు. రక్తహీనతకు గురై, అనారోగ్యం బారిన పడుతున్న తల్లుల వల్ల, పుట్టిన కొన్ని రోజుల్లోనే పురిటి రక్తపు మరకలు ఆరకుండానే తల్లి పొత్తిళ్లలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసుకు చెందిన మండంగి మీనాక్షి శుక్రవారం గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అనారోగ్యంతో ఉండడంతో పుట్టిన బాబుకూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం రాత్రి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆ శిశువు మృత్యువాత పడ్డాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు మీనాక్షి, పకీరు తదితర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అలాగే గరుగుబిల్లి మండలంలోని సంతోషపురానికి చెందిన మూడునెలల బాలుడు గంట అవినాష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ బాలుడు కూడా రక్త హీనతతో పాటు అనారోగ్యానికి గురికావడంతో మృత్యువాత పడినట్లు వైద్యులు చెబుతున్నారు. గత బుధవారం కూడా కురుపాం మండలం మొండెంఖల్‌కు చెందిన ఓ శిశువు అలాగే మృత్యువాత పడ్డాడు. తరచూ శిశువులు మృత్యువాత పడుతుండడంపట్ల తల్లులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం పౌష్టికాహారం అందక అవస్థలు పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వర్గాలు గర్భిణీ స్త్రీలకు చక్కని వైద్య సేవలతోపాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటే శిశుమరణాలు తగ్గే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు అంటున్నారు. పౌష్టికాహార లోపమే కారణం.. గర్భిణీ స్త్రీలు అధికంగా రక్తహీనతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టికాహారం గిరిజనులు తీసుకోకపోవడం వలన ప్రసవ సమయానికి రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లికి పాలు లేక, పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు పాటించక పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటి పట్ల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, తల్లీ, పిల్లల మరణాలు లేకుండా చర్యలు చేపట్టాం. - బి.ఉమా శంకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, పార్వతీపురం. ఆహారపు అలవాట్ల వల్ల.. స్త్రీలలో సాధారణంగా 80శాతం వరకు రక్తహీనతతో ఉంటున్నారు. వీరిని దానిని నుంచి గట్టెక్కించడానికి, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు కడుపులో ఉన్న బిడ్డ, ఎదగడానికి పౌష్టికాహారం కావాన్న ఉద్దేశ్యంతో అమృత హస్తంలో భాగంగా ఒకపూట సంపూర్ణ భోజనంలో గుడ్డు, పాలు, అన్నం, పప్పు, కూర తదితరవి అందిస్తున్నాం. అరోగ్య తనిఖీలు చేపడుతున్నాం. నెల నెలా బరువు తూచడం తదితరవి చూస్తున్నాం. ప్రమాదకరంగా గుర్తించి, రక్తహీనత, తక్కువ బరువు, తక్కువ వయస్సుంటే, వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తల్లీ బిడ్డలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నాం. ఆస్పత్రి డెలివరీలను పెంచాం. వారి ఆహారపు అలవాట్లు, ఆచారాల వల్ల కొంత ఇబ్బందులు తప్పడం లేదు. - కె.విజయ గౌరి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు. -
కడుపు కోత!
జిల్లాలో పెరుగుతున్న మాతా, శిశు మరణాలు పురిటిలోనే చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! తగినన్ని మౌలిక వసతులు.. దండిగా నిధులున్నా వైద్య, ఆరోగ్య శాఖ చిత్తశుద్ధిలోపం జిల్లా వాసులకు శాపంగా పరిణమించింది. జిల్లాలో మాతా, శిశు మరణాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 బోధనాసుపత్రులు... జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక వసతులు ఇవీ... సాక్షి, విశాఖపట్నం మాతా, శిశు మరణాలను తగ్గిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధికనిపించడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా మంజూరు చేసిన నిధులన్నీ వ్యయం చేశామని అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు రూ.1.17కోట్లు. కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ రూ.18,36,916 నిధులు విడుదల చేశారు. జననీ సురక్ష యోజనకు రూ.98,37,798 నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం గా విజయవంతంగా ప్రసవాలు చేయించాలి. గర్భిణికి ఉచితంగా పౌష్టికాహారం అందించడంతోపాటు రాను పోను దారి ఖర్చులు, మందులు, రక్తం వంటివి ఉచితంగా అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. కానీ ఈ ఏడాది సగం మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు. ఇన్ని నిధులు కేటాయిస్తున్నా మాతా శిశు మరణాలు పెరగడం ఆశ్చర్యం కలిగించే అంశం. కారణాలు ఇవీ.. నివారణ చర్యలేవీ? రక్త హీనత, అధిక రక్తస్రావం, సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం, అవగాహన లేమి తదితర కారణాలతోనే ఎక్కువుగా మాతా, శిశు మరణాలు సంభ విస్తున్నాయి. గిరిజన, గ్రామీణ ప్రాం తాల్లో ఈ మరణాలు రేటు ఎక్కువుగా ఉంటోంది. ఆ ప్రాంతాల్లో కొన్ని వ్యాధులు తీవ్రంగా ఉండటం, సమీపంలోని పీహెచ్‌సీలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.వీరి కోసం ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఎఎన్ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల మారుమూల ప్రాంతాల గర్భిణు లు ప్రసవ సమయంలో ఆయాలను, స్థానిక మహిళల సహకారం పొందాల్సి వస్తోంది. ఆ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినా, అధిక రక్తస్రావం జరిగినా ఆస్పత్రికి తరలించే అవకాశం లేక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అవగాహన కల్పించాల్సిన వైద్యాధి కారులు కనీసం పట్టించుకోకుండా వదిలేయడం అనర్థాలకు కారణమవు తోంది. అంబులెన్స్ అందుబాటులో లేక..పీహెచ్‌సీల అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కూ డా మరణాలు చోటుచేసు కుంటు న్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా పెదబయలు మండలంలో వెలుగుచూ సింది. పెదబయలు మండలం అరడ కోట పంచాయతీ బొంగదారి గ్రామా నికి చెందిన గర్భిణి (34) ఈ నెల 18న కాన్పు కష్టమై మృతి చెందింది. శిశువు కూడా కడుపులోనే చనిపోయింది. ఆమెకు ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి లేక పోవడంతో పాడేరు ఏరియ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి రక్తహీతన ఉందని, కాన్పు కష్టమని చెప్పి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. అయితే వారి చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఇంటికి తీసుకెళ్లడంతో మూడు రోజుల పాటు నరకయాతన అను భవించి మృతి చెందింది. వైద్య సిబ్బం దే చొరవ తీసుకొని ఆమెను ప్రభుత్వ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించి ఉంటే తల్లీ బిడ్డా ప్రాణాలు దక్కేవి. ఆందోళనకరంగా మరణాల రేటు మాతా, శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసినట్లుంది. జిల్లాలో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరణాలు పెరగడం అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. జిల్లాలో 2013-14లో 692 మంది శిశువులు, 60 మంది తల్లులు మృతి చెందారు. 2014-15లో ఇప్పటి వరకు 1006 మంది శిశువులు, 72 మంది మాతృమూర్తులు చనిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద వైద్యాలయమైన కేజీహెచ్‌తో సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ప్రసూతి విభాగాల్లో కనీస సౌకర్యాలు లేవు. గత ఆర్థిక సంవత్సరంలో 70,908 ప్రసవాలు జరిగితే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 55,636 ప్రసవాలు జరిగాయి.71 వేల ప్రసవాల్లో 696 మంది శివులు మరణిస్తే, ఈ ఏడాది 55వేల ప్రసవాల్లోనే 1006 మరణాలు జరిగాయి. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సగటున ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పద్దెనిమిది మంది పురిటిలోనే తుది శ్వాస వీడుతున్నారు. -
కడుపు పండితే వేదన.. కన్ను తెరిస్తే యాతన
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చతికిలపడింది. మాతా, శిశు మరణాల శాతం తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. ఎమ్మిగనూరు మండలంలో 11 నెలల్లో కాన్పు సమయంలో వంద మంది శిశువులు మృతి చెందగా.. 2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 25వేల కాన్పులు ఇళ్ల వద్ద జరగ్గా, కర్నూలు జిల్లాలోనే 11,599 నమోదవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడం కూడా మాతా శిశు మరణాల సంఖ్య రాష్ట్రంలోనే జిల్లాను రికార్డు స్థానంలో నిలుపుతోంది. కర్నూలు డివిజన్లో 31, నంద్యాల డివిజన్లో 27, ఆదోని డివిజన్లో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. తగినంత సిబ్బంది పని చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రచార, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మాతా శిశు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఏమి జరుగుతోంది.. జిల్లాలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే కాన్పు జరిగేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంది. ఇంటి వద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కలిగే లాభాలు, పారితోషికం వివరాలను తెలియజెప్పాలి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో గర్భిణిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. కౌతాళం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హొళగుంద హెల్త్ సూపర్వైజర్, పెద్దతుంబళం హెల్త్ ఆఫీసర్, అర్దగేరి హెల్త్ అసిస్టెంట్.. ఇలా అనేక మంది జిల్లా కేంద్రంలో పని చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటేషన్లకు అర్హత లేని కాంట్రాక్టు వైద్య సిబ్బంది జిల్లా పరిసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేయించుకున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా గాడితప్పింది. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన ‘డెమో’ విభాగం ఉన్నా లేనట్లుగా మారింది. ఆదోని డివిజన్‌లోనే అధికం జిల్లాలోని ఆదోని డివిజన్లో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఆదోని డివిజన్ పరిధిలో(రూరల్) నెలలోపు శిశువులు 112 మంది, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 24 మంది, గర్భిణిలు ముగ్గురు చొప్పున చనిపోయారు. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే శిశు మరణాల శాతం 26.88, సంవత్సరంలోపు పిల్లలు 1.03, మాతృ మరణాలు 72.01 శాతం చొప్పున ఇక్కడే నమోదయ్యాయి. ఆదోని అర్బన్ ప్రాంతంలో నెలలోపు శిశువులు 105 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 6 మంది, ఒక గర్భిణి మరణించారు. ఇక్కడ శిశు మరణాల శాతం అత్యధికంగా 42.97 శాతం, మాతృ మరణాల శాతం 40.93గా ఉంది. మండలం మృతి చెందిన మరణించిన నెలలోపు గర్భిణిలు శిశువులు ఆత్మకూరు 36 04 ఆళ్లగడ్డ 26 01 కోడుమూరు 53 03 ఎమ్మిగనూరు 100 04 ఆలూరు 25 02 కర్నూలు రూరల్ 60 02 కర్నూలు అర్బన్ 42 05 కోయిలకుంట్ల 37 04