పార్వతీపురం: పార్వతీపురం ఏజెన్సీలో శిశు మరణ ఘోష ఆగడం లేదు. రక్తహీనతకు గురై, అనారోగ్యం బారిన పడుతున్న తల్లుల వల్ల, పుట్టిన కొన్ని రోజుల్లోనే పురిటి రక్తపు మరకలు ఆరకుండానే తల్లి పొత్తిళ్లలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసుకు చెందిన మండంగి మీనాక్షి శుక్రవారం గుమ్మలక్ష్మీపురం పీహెచ్‌సీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అనారోగ్యంతో ఉండడంతో పుట్టిన బాబుకూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం రాత్రి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆ శిశువు మృత్యువాత పడ్డాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు మీనాక్షి, పకీరు తదితర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
అలాగే గరుగుబిల్లి మండలంలోని సంతోషపురానికి చెందిన మూడునెలల బాలుడు గంట అవినాష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ బాలుడు కూడా రక్త హీనతతో పాటు అనారోగ్యానికి గురికావడంతో మృత్యువాత పడినట్లు వైద్యులు చెబుతున్నారు. గత బుధవారం కూడా కురుపాం మండలం మొండెంఖల్‌కు చెందిన ఓ శిశువు అలాగే మృత్యువాత పడ్డాడు. తరచూ శిశువులు మృత్యువాత పడుతుండడంపట్ల తల్లులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం పౌష్టికాహారం అందక అవస్థలు పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వర్గాలు గర్భిణీ స్త్రీలకు చక్కని వైద్య సేవలతోపాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటే
శిశుమరణాలు తగ్గే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు అంటున్నారు.
పౌష్టికాహార లోపమే కారణం..
గర్భిణీ స్త్రీలు అధికంగా రక్తహీనతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టికాహారం గిరిజనులు తీసుకోకపోవడం వలన ప్రసవ సమయానికి రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లికి పాలు లేక, పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు పాటించక పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటి పట్ల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, తల్లీ, పిల్లల మరణాలు లేకుండా చర్యలు చేపట్టాం.
- బి.ఉమా శంకర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, పార్వతీపురం.
ఆహారపు అలవాట్ల వల్ల..
స్త్రీలలో సాధారణంగా 80శాతం వరకు రక్తహీనతతో ఉంటున్నారు. వీరిని దానిని నుంచి గట్టెక్కించడానికి, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు కడుపులో ఉన్న బిడ్డ, ఎదగడానికి పౌష్టికాహారం కావాన్న ఉద్దేశ్యంతో అమృత హస్తంలో భాగంగా ఒకపూట సంపూర్ణ భోజనంలో గుడ్డు, పాలు, అన్నం, పప్పు, కూర తదితరవి అందిస్తున్నాం. అరోగ్య తనిఖీలు చేపడుతున్నాం. నెల నెలా బరువు తూచడం తదితరవి చూస్తున్నాం. ప్రమాదకరంగా గుర్తించి, రక్తహీనత, తక్కువ బరువు, తక్కువ వయస్సుంటే, వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. తల్లీ బిడ్డలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నాం. ఆస్పత్రి డెలివరీలను పెంచాం. వారి ఆహారపు అలవాట్లు, ఆచారాల వల్ల కొంత ఇబ్బందులు తప్పడం లేదు.
- కె.విజయ గౌరి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు.
గర్భశోకం
Published Mon, Mar 16 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement