రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన మంగ, అప్పారావు దంపతులకు గత ఏడాది మేలో స్థానిక పీహెచ్‌సీలో పాప పుట్టింది. అయితే, 800 గ్రాములే బరువు ఉంది. అవయవాల ఎదుగుదల లేకపోవడంతో అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌లోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ 3 నెలల పాటు చికిత్స అందించారు. పాప 1.755 కేజీల బరువు పెరిగి పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇలా పుట్టుకతో బరువు తక్కువగా ఉండటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అండగా నిలుస్తున్నాయి.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో శిశు మరణాల నివారణే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలు ఫలించాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే వరకూ అడుగడుగునా ప్రభుత్వం చేయిపట్టి నడిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాస్ప త్రుల్లోని పీడియాట్రిక్ (చిన్న పిల్లల) వైద్య విభాగాలను బలోపేతం చేస్తోంది. వార్డుల్లో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించింది. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ (ఎస్‌ఎన్‌సీయూ)లో శిశు మరణాల రేటు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 2018–19లో ఎస్‌ఎన్‌సీయూ ల్లో ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 12.3గా ఉండేది.
కేంద్రం అభినందనలు..
ఇక 2019 నుంచి సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 6.6కు తగ్గింది. పూర్తిస్థాయిలో ఈ మరణాలను నియంత్రించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా అనతికాలంలో ఎస్‌ఎన్‌సీయూల్లో శిశు మరణాలను గణనీయంగా నియంత్రించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం సైతం అభినందించింది.
380 పడకలు పెంపు..
నవజాత శిశు మరణాల నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎస్‌ఎన్‌సీయూ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లలో పడకలను వైద్యశాఖ పెంపొందిస్తూ వస్తోంది. 2019కు ముందు.. రాష్ట్రంలో 62 ఎస్‌ఎన్‌సీయూల్లో 585 పడకలు అందుబాటులో ఉండేవి. వీటికి అదనంగా వార్డులను ఏర్పాటుచేస్తూ 755కు ప్రభుత్వం పడకలకు పెంపొందించింది. మరోవైపు.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో శిశు సంరక్షణ కేంద్రాల బలోపేతం చేపట్టింది. ఇందులో భాగంగా 11 ప్రభుత్వాస్పత్రుల్లో 20 పడకల చొప్పున, మరో 8 ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ఎస్‌ఎన్‌సీయూ, నాలుగు ఆస్పత్రుల్లో 20 పడకల చొప్పున ఎన్‌ఐసీయూ ఏర్పాటుచేసింది. వీటిల్లో వైద్యసేవలు అందించడానికి 250 మంది వరకూ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టారు. సీప్యాప్, ఫొటోథెరపీ యూనిట్, రేడియంట్ వార్మర్, ఇతర అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ఈ యూనిట్స్‌లో త్వరలో వైద్యసేవలు ప్రారంభించనున్నారు.
సేవలు వినియోగించుకోవాలి
సరైన వైద్యం అందక ఏ ఒక్క చిన్నారి ప్రాణం పోకూడదనేది సీఎం జగన్ సిద్ధాంతం. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నవజాత శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా సంరక్షణ కేంద్రాలన్నింటిలో సదుపాయాలు బలోపేతం చేపట్టాం. 380 ఎస్‌ఎన్‌సీయూ, 80 ఎన్‌ఐసీయూ పడకలను పెంచాం. ఈ యూనిట్స్ అన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్‌లో ఎంతో ఖరీదైన వైద్యసేవలు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో లభిస్తున్నాయి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి.
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment