తాజా ఎస్‌ఆర్‌ఎస్ బులెటిన్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో శిశు మరణాలు..
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తేలింది. 2017లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 32 మంది శిశువులు అశువులు బాశారు. తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్–బులెటిన్) ఈ నిజాలను వెల్లడించింది. 2017కు సంబంధించి దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తెలంగాణలో ప్రతి వెయ్యికి 29 మంది శిశువులు మృతి చెందగా ఈ సంఖ్య కర్ణాటకలో 25, తమిళనాడులో 16, కేరళలో 10గా ఉంది. జాతీయ సగటు 33 ఉండగా ఏపీ సగటు 32గా నమోదైంది.
ఎస్‌ఎన్‌సీయూలే పెద్దదిక్కు
ప్రస్తుతం రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లు (ఎస్‌ఎన్‌సీయూలు) ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ పొందిన నర్సులు, వైద్యులతోపాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేసి నవజాత శిశువులకు కేంద్ర నిధులతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ కేంద్రాలను మైదాన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే శిశుమరణాలను నియంత్రించొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కువ శిశు మరణాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలి
ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్‌ఎన్‌సీయూ వల్ల ఈ ప్రాంతంలో శిశు మరణాలు బాగా తగ్గాయి. ఏ ప్రాంతంలో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయో గుర్తించి అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు.
–డా.జీవన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎస్‌ఎన్‌సీయూ, అడ్డతీగల, తూర్పుగోదావరి
Comments
Please login to add a commentAdd a comment